15, మే 2020, శుక్రవారం

జీర్ణవస్త్రం

వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోఽపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ

మానవుడు జీర్ణమైన వస్త్రాన్ని విడచి నూతన వస్త్రాన్ని ధరించినట్లే జీవుడు జీర్ణమైన దేహాన్ని విడచి నూతన దేహాన్ని ధరిస్తాడని గీతాచార్యుడు వివరించారు కదా. కానీ ఇక్కడ ఎంతో వయస్సు వచ్చి ముసలిదైపోయిన దేహం జీర్ణమైనది అంటే నమ్ముతాం కానీ చిన్న వయసులో ఉన్నవారి దేహంకూడా జీర్ణమైపోయిందంటే నమ్మబుద్ధి కాదు. ఇదే విషయాన్ని శ్రీగురుదేవుల ఆరాధనా మహోత్సవాలలో శ్రీదండి స్వామివారు విశ్లేషిస్తూ అది భౌతికంగా జీర్ణమవడం కాదని, ఆ శరీరంద్వారా అనుభవించవలసిన కర్మ ఎప్పుడు జీర్ణమైపోతుందో అప్పుడా జీవి శరీరాన్ని వదిలివేస్తాడని వివరించారు.

మనం వస్త్రాల ఉదాహరణే తీసుకుంటే ఒక నల్లచొక్కా నాలుగైదు రోజులు ధరించినా మాపు తెలియదు. అదే ఇతర రంగుల చొక్కాలు రోజంతా ధరించేసరికి మాసిపోతాయి. ఇక తళతళలాడే తెల్లని చొక్కా ఒక పూటకే మాసిపోతుంది. అలాగే పాపపు ఆలోచనలతో, నీచబుద్ధులతో కూడిన మానవుని కర్మ చిరకాలం జీర్ణమవకుండా ఉంటుంది. అందుకే 'పాపీ చిరాయుః' అంటారు. ఇక మంచిచెడుల మిశ్రమ బుద్ధితో ఉండే మానవులే మనలో ఎక్కువ శాతం ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా ఏ ఎనభై తొంభై ఏళ్ళో జీవించి శరీరం శిధిలమవగానే మరొక శరీరాన్ని ధరించడానికి తరలిపోతారు.

మరి తెల్లని వస్త్రంలా నిర్మలమైన బుద్ధి కలిగి సంచరించే సత్పురుషులు వారి కర్మ త్వరగానే జీర్ణమైపోవడంతో చిన్న వయసులోనే దేహాన్ని చాలించేస్తారు. మన దగ్గర ఉండే వస్త్రాలలో మరో రకం కూడా ఉంటాయి ఇవి అత్యంత విలువైనవి. వీటిని ఏవో కొన్ని ప్రత్యేక సందర్భాలకోసం కొనుక్కొని, ఆయా సందర్భాల్లో ధరించి, ఒకటి రెండు గంటలలోనే విప్పి మళ్ళీ భద్రపరచుకుంటాం. ఇలాంటి విలువైన వస్త్రాలలాంటి వారే కారణజన్ములు. వారిని భగవంతుడు ఏవో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే లోకోద్ధరణ నిమిత్తంగా ఉద్భవింపచేస్తూ ఉంటాడు. వారు తాము వచ్చిన కార్యం త్వరత్వరగా ముగించుకుని తిరిగి కనుమరుగైపోతారు.

అయితే అలా అని త్వరగా వెళ్ళిపోయిన వారందరూ మహాత్ములనీ దీర్ఘకాలం జీవించిన వారందరూ పాపాత్ములనీ అనుకోవడానికి లేదు. పాపీ చిరాయు అన్నప్పటికీ చిరంజీవులైన మహాత్ములెందరో మన పురాణాలలోనే కాక ఇప్పటి కాలంలో కూడా దర్శనమిస్తారు. మళ్ళీ మన వస్త్రం పోలికకే వెళితే కొన్ని దివ్య వస్త్రాలు ఉంటాయి. అవి ఎంతకాలం అయినా మాయకుండా ఉంటాయి. మన సీతమ్మ అటువంటి వస్త్రాన్నే లంకలో ఉన్నంతకాలం ధరించింది. అలా ఎందరో మహాత్ములు తమ స్వార్థంకోసమో, దేహంమీద మోహంతోనో కాక కేవలం దీనజనోద్ధరణ కోసం నిస్వార్థంగా కొన్ని వందల, వేల సంవత్సరాల కాలం జీవించి తమ సుదీర్ఘ జీవితాలనంతా లోకకళ్యాణం కోసం త్యాగం చేశారు.

కాబట్టి ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు. మన జీవితకాలంలో ఎంతభాగం సద్వినియోగం చేసుకున్నాం, ఎంత త్వరగా ఈ దేహంయొక్క అశాశ్వతత్వాన్ని గుర్తించి దీనిమీది మోహాన్ని వదిలించుకున్నాం అనేదానిపైనే మన జీవిత సార్థకత ఆధారపడుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి