18, మే 2020, సోమవారం

శార్వరి

శార్వరి అంటే రాత్రి. అది మాములు రాత్రి కాదు. మృత్యుఘోష ప్రతిధ్వనించే కాళరాత్రి. ఆ కాళరాత్రి ప్రభావం ఎలా ఉంటుందో గత రెండు నెలలుగా చూస్తూనే ఉన్నాం కదా! రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతోందో మనకు ముందుగా వికారిలోనే చూపించేసింది. రాత్రికి ముందు వచ్చేది సాయంత్రం కదా. మరి ఆ సాయంత్రానికి పేరు శర్వరి. శర్వరి తరువాత శార్వరి వస్తుందన్నమాట. ఈ శర్వరియే మనకు వికారిగా కనిపించింది. ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తే దానిని ఆకారం అంటారు. ఉన్నది దానిలా కాక మరొకదానిలాగానో, లేక లేనిది ఉన్నట్లుగానో కనిపిస్తే దానినే వికారం అన్నారు. ఉదాహరణకు ఒక త్రాడు ఉన్నదనుకోండి. అది మనకు త్రాడులాగానే కనిపిస్తే అది ఆకారం. కానీ అదే త్రాడు మనకు పాములాగా కనిపించి మనలను భయపెడితే అది వికారమయ్యింది. 

అయితే ఈ వికారం పూర్తి వెలుగులోనూ కలుగదు, పూర్తి చీకటిలోనూ కలుగదు. అది కేవలం సాయంత్రం పూట వచ్చే చీకటివెలుగుల దోబూచులాటలో, అంటే సంజెచీకటిలో కలుగుతుంది. ఏదైతే లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుందో దానినే 'మాయ' అన్నారు. ఈ మాయ ఎవరిది? 'మమ మాయా' - ఇది నా మాయ అని గీతాచార్యుడు స్పష్టంగా చెప్పాడు. అంటే ఇది విష్ణుమాయ. శర్వరీ కాలంలో కలిగే మాయ. అందుకే విష్ణు సహస్రనామాలలో 'శర్వరీకరః' అని ఒక నామం ఉంది.  అయితే మనని తన మాయతో భయపెట్టేదీ ఆయనే, గీతామృత బోధతో ఆ భయాన్ని పోగొట్టేదీ ఆయనే. 'భయకృత్ భయనాశనః'  - ఇవి కూడా ఆయన నామాలే. 

మాములుగా లోకంలో పగలూ రాత్రీ ఎక్కువ కాలం ఉంటాయి. ఈ సంధ్యాసమయం రోజులో అతి కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా చూసుకుంటే మనం జ్ఞానం అనే వెలుగులో ఎంతసేపు గడిపామో తెలియదు కానీ అనేక జన్మలనుండి ఈ సాయంసంధ్యలోనే గడుపుతున్నాం. దానిని మాయ అనండి, లేదా అజ్ఞానం అనండి. అందులోనే నిరంతరంగా ఉండి, లేని ప్రపంచాన్ని ఉన్నట్లుగా భావిస్తూ అనేకమైన భావోద్వేగాలకు, సుఖదుఃఖాలకు గురవుతూ, పుడుతూ చస్తూ బ్రతుకుతున్నాం. 

రోజంతా జీవనపోరాటంలో అలసిపోయిన  మానవుడికి విశ్రాంతిని కలిగించేది రాత్రి. అలాగే జననమరణ చక్రభ్రమణంలో అలసిపోయిన ఆత్మకు విశ్రాంతి ప్రసాదించేది జగన్మాత. 'జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినీ' అని లలితా సహస్రనామం చెబుతోంది. అందుకే ఈ రాత్రికి ప్రతిరూపమైన శార్వరి కూడా ఆ అమ్మ స్వరూపమే. శార్వరి అనేది లక్ష్మీదేవి సహస్రనామాలలో ఒక నామం. రోజంతా పనిచేసి అలసిపోయిన వాడు రాత్రి చక్కగా నిద్రపోతే మర్నాడు మళ్ళీ ఉరకలేసే ఉత్సాహంతో లేస్తాడు. అదే రాత్రి సరిగా నిద్ర పట్టనివాడు లేచాక కూడా నీరసంగానే ఉంటాడు. మనో వికారాలతో, మహమ్మారి రోగాలతో అలసిపోయిన జనులు ఈ శార్వరిలో కాస్త విశ్రాంతిని పొందితే ఆ తరువాత ఒక్క గెంతుతో లేస్తారు. అందుకే తరువాత వచ్చేది 'ప్లవ' నామ సంవత్సరం. ప్లవ అంటే గెంతడం. హనుమంతుని ప్లవగోత్తముడు, ప్లవగాధిపతి అనే నామాలతో సంబోధన మనకు సుందరకాండలో చాలాసార్లు కనిపిస్తుంది. మనం గెంతబోయేది 'శుభకృత్, శోభకృత్' అనే వినసొంపైన సంవత్సరాలలోకే.

గ్రహాల కూటమి వలనో, నక్షత్రాల గతులు సరిగా లేకనో ఇప్పుడు మనం చూస్తున్నలాంటి గడ్డు పరిస్థితులు వస్తాయని కొందరు చెబుతుంటారు. అయితే ఈ గ్రహాలు, నక్షత్రాలు, దిక్పాలకులు, దేవతలు వీరంతా ఎవరి అధీనంలో ఉన్నారు? ఎవరి ఆజ్ఞమేరకు పని చేస్తున్నారు? 'నమ్ర దిక్పాల సీమన్తినీ కుంతల స్నిగ్ధ నీలప్రభా పుంజ సంజాత దూర్వాంకురా శంక సారంగ సంయోగ రింఖన్నఖేందూజ్వలే' అంటుంది శ్యామలా దండకం. దిక్పాలుర భార్యలందరూ ఎంతో వినయ విధేయతలతో ఆ జగన్మాత పాదాలపై తమ శిరస్సులనుంచి నమస్కరిస్తూ ఉంటే సహజ ప్రకాశవంతులైన ఆ దేవతల శిరోజాలు నల్లగా మెరుస్తూ అప్పుడే చిగురించిన గడ్డి పరకలలాగా కనిపిస్తూ ఉంటే ఆ అమ్మ కాలిగోళ్లు తెల్లటి వెన్నెల కాంతులను వెదజల్లుతూ ఆ పచ్చికను మేయడానికి వచ్చిన లేళ్ళలాగా కనిపిస్తున్నాయట. 

తల్లి వద్ద పిల్లలలాగా వారందరూ శిరోజాలు కనిపించేలా ఉత్త శిరస్సులతో ముందుగా నమస్కరించిన  తరువాత వారి భర్తలు తమ తమ అధిపత్యాలను, అధికారాలను ఆ తల్లి పాదాలవద్ద అర్పిస్తున్నారా అన్నట్లుగా ఈ సారి కిరీటాలతో సహా ఎలా నమస్కరిస్తున్నారో చూడండి. 'దేవదేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయ్వగ్ని కోటీర మాణిక్య సంఘ్రుష్ట బాలా తపోద్దామ లాక్షా రసారుణ్య లక్ష్మీ గృహీతాంఘ్రి పద్మద్వయే' - దేవతలు, దేవేంద్రుడు, రాక్షస ముఖ్యులు, యక్ష భూత గణాధిపతులు, బ్రహ్మదేవుడు, దిక్పాలురు, వాయువు, అగ్ని మొదలైన దేవతలందరూ తమతమ కిరీటాలను ఆ తల్లి పాదాలకు తాకించి నమస్కరిస్తూ ఉంటే ఆ కిరీటాలలో ఉన్న దివ్య మణిమాణిక్యాల కాంతులతో అరుణిమను సంతరించుకున్న జగన్మాత పాదాలు ఎఱ్ఱటి పద్మద్వయం లాగా ప్రకాశిస్తున్నాయట.

మరి అంతటి తల్లిని ఆశ్రయించుకున్న మనకి ఈ ప్రాపంచిక విషయాలవల్ల భయమేముంది? కాదు, మాకు ప్రాపంచిక సౌఖ్యాలే కావాలి అంటారా? అవి అందివ్వటానికి ఆ బోళా శంకరుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. భగవంతుని ఆరాధించే వారు నాలుగు రకాలని 'చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ' అని గీతాచార్యుడు చెప్పాడు. ఇందులో మొదటి రెండు రకాల వారికి ప్రతి పదానికి 'నమో నమో' అంటూ సాగే 'రుద్ర నమకం' సరిపోతుంది. తన కష్టాలను తొలగించమని ఆర్తితో దరిచేరిన వానికి ఆ ప్రభువు మహాత్మ్యం ఎంతటిదో, ఆయన తన ఆర్తిని ఎంత తేలికగా పోగొట్టగల శక్తివంతుడో ఈ నమకం చూపెడుతుంది. అలాగే భగవంతుని దివ్య వైభవాన్ని తెలుసుకోవాలని వచ్చిన జిజ్ఞాసువుకు కూడా ఈ నమకం సమాధానాన్ని ప్రసాదిస్తుంది.

ఇక ప్రతి పదానికి 'చ మే' అంటూ సాగే 'చమకం' మిగిలిన రెండు రకాల వారికి సరిపోతుంది. ఈ లోకంలోని రకరకాల సంపదలన్నీ నాకే కావాలని కోరుకునే అర్థార్థికి ఆయా సంపదలన్నీ స్వామిని ఆశ్రయిస్తే తప్పక లభిస్తాయని ఈ చమకం చూపెడుతుంది. అయితే 'మే' అనే షష్టీ విభక్తిలో 'కిన్ కున్'లే కాకుండా 'యొక్క లోన్ లోపలన్' కూడా ఉన్నాయి. అంటే 'నాకున్న సంపద యావత్తూ నీ ప్రసాదమే తప్ప నాదేమీ లేదు ప్రభూ!' అని భావించే భక్తునికీ, 'అసలీ దృశ్య ప్రపంచమంతా నేను కల్పించుకున్నది, నాలోనుంచే వచ్చింది. ఇది నా భ్రమ తప్ప దీనికి ఉనికే లేదు' అని తెలుసుకున్న జ్ఞానికీ కూడా ఈ చమకం చక్కగా సరిపోతుంది. మరి ఆ నమక చమకాలతో పంచామృతాలు, నవరసాలతో ఆ సదాశివునికి అభిషేకం చేస్తే మన పంచేంద్రియాలు విషయ విషాలనుండి భగవన్నామామృతం వైపుకు తిరిగి, నవ రంధ్రాలతో కూడిన ఈ శరీరం ఆనంద రసమయం అవుతుందనటంలో సందేహం ఏముంది?

వికారి, శార్వరిల సంధికాలంలో ప్రపంచాన్ని కబళించడానికి వస్తున్న కరోనా మహమ్మారి నుండి జనులంతా రక్షింపబడి ప్రపంచమంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలనే మహదాశయంతో శ్రీ మాతాజీవారు శ్రీ కాళీ వనాశ్రమంలో 'శ్రీ సద్గురు విశ్వశాంతి మహాయాగాన్ని' అత్యంత నియమనిష్ఠలతో పదకొండు రోజులు నిర్వహించారు. అందులో భాగంగా ప్రతిరోజూ పైన చెప్పుకున్న విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ అష్టోత్తర పారాయణ, చండీ యాగము, శ్యామలా దండకం, 121 రుద్ర నమక చమకాలతో శ్రీ రామలింగేశ్వర స్వామివారికి పంచామృతాలతో, నవరసాలతో అభిషేకము, గోపూజలు, పర్యావరణాన్ని పవిత్రమొనర్చటానికై శ్రీ గురుదేవుల పాదుకా ప్రదక్షిణలు, అంతఃకరణ శుద్ధికై ధ్యాన శిబిరము, శివ, నారాయణ కవచాలు, వివిధ ఉపనిషత్తులు, ఆదిత్య హృదయం, సుందరకాండ మొదలైన అనేక పారాయణలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహింపబడ్డాయి. 

కాళరాత్రిలా మొదలైన ఈ శార్వరి నిరంతరం విశ్వశాంత్యర్థం, లోక కళ్యాణార్థం శ్రమించే మహాత్ములందరి ఆశీస్సులతో మనందరికీ విశ్రాంతినిచ్చి నూతనోత్సాహాన్ని కలిగించే ప్రశాంత రాత్రిలా ముగుస్తుందని ఆశిద్దాం. 

సర్వేజనాః సుఖినో భవన్తు!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి