5, జనవరి 2019, శనివారం

సూక్ష్మంలో మోక్షం

మనం సాధారణంగా మోక్షమంటే అదేదో చాలా పెద్దది, దానిని సాధించాలంటే మనం ఎంతో ఎదగాలి అనుకుంటాం. కానీ ఈ సృష్టిలో చూస్తే పెద్ద పెద్ద ప్రాణులే త్వరగా బంధింపబడతాయి. ఒక పులినో, జింకనో బంధించినంత తేలికగా ఒక ఎలుకనో, చీమనో బంధించగలమా? అలాగే పెద్ద చేపలు తేలికగా వలలో పడతాయి కానీ ఎంత చిన్న చేప అయితే వలలోనుండి అంత తేలికగా తప్పించుకోగలుగుతుంది. అసలు "నేను చాలా పెద్దవాణ్ణి, లేదా గొప్పవాణ్ణి" అనుకోవడమే పెనుమాయ. అంతకు మించిన బంధనం ఏముంటుంది? నేను చాలా చిన్నవాడిని, భగవద్భక్తుల దాసానుదాసుడిని అనుకోవడమే మోక్షానికి దగ్గరి దారి. 

సురస పెద్ద నోటిలో చిక్కినపుడుగానీ, లంకలో రాక్షసులు త్రాళ్ళతో తనను బంధించినపుడుగానీ హనుమంతుడు సూక్ష్మరూపాన్ని ధరించే కదా ఆ బంధనములనుండి విడివడగలిగింది? "సర్వహీన స్వరూపోహం" అని పరమాత్మ తత్వాన్ని తేజోబిందూపనిషత్ నిర్వచిస్తోంది. "అణోరణీయాం" అయినవాడే "మహతోమహీయాం" కాగలడు. అయితే మానవుడు ఈ సత్యాన్ని గుర్తించలేక లేనిపోని అహంకారాన్ని తెచ్చిపెట్టుకొని "నా అంతటివాడు లేడు" అని విర్రవీగి చివరికి ఆ మాయకు బద్ధుడై అనేక జన్మలను ఎత్తుతున్నాడు. తన నిజస్థితియైన ఆత్మతత్వాన్ని గుర్తించిననాడు అదే ఆత్మతత్వం సర్వేసర్వత్రా వ్యాప్తమై ఉన్నదనే జ్ఞానం కూడా కలుగుతుంది. అప్పుడింక ఒకరు గొప్ప ఇంకొకరు తక్కువ అనే భావనే కలుగదు. 

ఈ చరాచర సృష్టి అంతా పంచభూతాలతోనే నిర్మించబడినప్పటికీ వివిధ నిష్పత్తులలో వాటి వాటి కలయికవల్ల మనకు స్థూలంలో ఇన్నిన్ని వస్తుభేదాలతో కనిపిస్తోంది. ఈ స్థూల దృష్టి ఉన్నంతకాలం ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే భేదభావన తొలగదు. అదే మనం సూక్ష్మదృష్టితో చూస్తే సృష్టిలోని ప్రతి వస్తువూ, ప్రాణీ అణువులతోనూ, పరమాణువులతోనూ నిర్మితమైనవే కదా. మరి ఈ పరమాణువులన్నీ ఒకే విధమైన ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లతో ఏర్పడినవే కదా! ఇలా సైన్సు ప్రకారం చూసుకున్నా సర్వసమానత్వం మనకు గోచరిస్తుంది. ఇక భక్తుడవై చూస్తే ఈ సమస్త సృష్టి పరమాత్మనుంచే వచ్చింది కదా? మరి అలాంటప్పుడు ఇక హెచ్చుతగ్గులకు తావెక్కడ? మరి జ్ఞాని దృష్టితో చూస్తే ఈ సర్వమూ తన(పరమాత్మ) స్వరూపమే. ఇలా ఏవిధంగా చూసినా సరైన పరిశీలన చేసినవాడికి హెచ్చుతగ్గులు లేవని అర్థమౌతుంది. 

మానవుడు ఈ సూక్ష్మదృష్టిని అలవరచుకోలేక కేవలం స్థూల దృష్టితో మాత్రమే చూసి అహంకార మమకారాలకు లోనై బంధనాలను కొనితెచ్చుకుంటున్నాడు. సూక్ష్మదృష్టి, లేదా సూక్ష్మ భావన అంటే దేనికి అంటకపోవటం. "యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే! సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే" అని భగవద్గీత చెబుతోంది. ఆకాశం సర్వవ్యాపమై ఉన్నా దాని సూక్ష్మత్వం చేత దేనికీ అంటకుండా ఉంటోంది. నిజానికి ఆకాశంకన్నా పెద్దది విశాలమైనది ఈ సృష్టిలో ఏదీ లేదు కదా. అంత పెద్దదైనా దాని గుణం సూక్ష్మత్వం. అందుకే అది దేనిచేతా బంధింపబడదు. అలాగే దేహమంతా వ్యాపించియున్నా తన సూక్ష్మత్వం చేత ఆత్మ కూడా దేనికీ అంటదు, దేనిచేతా బంధింపబడదు. 

ఇదే సూక్ష్మంలో మోక్షమంటే. బంధన లేకపోవడమే మోక్షం కదా! నిజానికి మన నిజస్థితి సదా మోక్షస్థితే. అయితే అట్టి సదాముక్తయైన ఆత్మను నేననే సూక్ష్మాన్ని గుర్తించలేక ఈ స్థూలదేహం నేననే భ్రమలోపడి మనం బంధితులం అయ్యామని తలపోస్తున్నాం, ముక్తిని కోరుకుంటున్నాం. శ్రీగురుదేవులు బోధించినట్లుగా "ముక్తి అనేది పొందేది కాదు. అది నీ స్వరూపమై/స్వభావమై  ఉన్నది. నువ్వు చేయవలసిందల్లా దానిని గుర్తించడమే." దానికోసం మనం ఈ సూక్ష్మదృష్టిని అలవరచుకోవాలి. ఆథ్యాత్మికంగా ఎదగడం అంటే సమానత్వ దృష్టి సాధించడమే. సమదృష్టి కలవాడే పండితుడని, జ్ఞానియని భగవద్గీతలో అనేకమార్లు చెప్పబడింది. 

నేలమీద ఉన్నవాడికి కొన్ని ఎత్తుగానూ, కొన్ని పల్లంగానూ కనిపిస్తాయి కానీ విమానంలో ఎంతో ఎత్తులో ఎగురుతున్నవాడికి ఈ భేదాలు తెలుస్తాయా? వాడికి క్రింద అంతా సమతలంగానే గోచరిస్తుంది. అలాగే ఆథ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవాడే ఇంకా "నేను గొప్ప, నువ్వు తక్కువ" అని మాట్లాడుతాడు కానీ ఉన్నతిని సాధించినవాడు ఎన్నడూ ఈ తరతమ భేదాలు చూడడు.

16, నవంబర్ 2018, శుక్రవారం

సత్యభామ

సత్యభామ కథ ముందుగా హిరణ్యాక్షుడితో మొదలవుతుంది. హిరణ్యం అంటే బంగారం. హిరణ్యాక్షుడు అంటే బంగారం/సంపద  మీద దృష్టి. అదే భూదేవిని జలంలో అంటే జడత్వంలో/అజ్ఞానంలో ముంచేసింది. ఆవిడను ఉద్ధరించడానికి విష్ణుమూర్తి స్వయంగా వరాహావతారంలో వచ్చారు. వరాహం మనం విసర్జించిన వాటిని తాను స్వీకరించి మన పరిసరాలను పరిశుభ్రంగా చేస్తుంది. అలాగే గురుదేవులు మనకు సాధనకు అడ్డువచ్చే మనలోని దుర్గుణాలను, మన ప్రారబ్ధ కర్మలను, వాసనలను అన్నింటినీ వారు స్వీకరించి మన మనసులను శుద్ధ మనసులుగా చేస్తారు. అయితే ఈ ప్రక్షాళన పూర్తి కాకముందే తొందరపడి ఫలితాన్ని పొందాలనుకుంటే అది దుఃఖానికే దారి తీస్తుంది. అందుకే భూదేవికి నరకాసురుడు జన్మించాడు. నరకమంటే దుఃఖమే కదా! మన దుఃఖం బయటనుంచి రాదు. అది మన మనసులోనే పుడుతుంది. అలాగే బయటి ఉపకరణాలేవీ ఆ దుఃఖాన్ని పోగొట్టలేవు. మన దుఃఖాన్ని మనమే విచారణ ద్వారా పోగొట్టుకోవాలి. అందుకే నరకాసురుడికి కేవలం భూదేవి చేతిలోనే మరణం నిశ్చయించబడటం. 

మన మనస్సు పరిశుద్ధమై ఆత్మజ్ఞానం పొందేదాకా ఎన్ని జన్మలైనా గురుదేవులు మనలను వదిలిపెట్టరు. అలాగే భూదేవి సత్యభామగా వచ్చినా మళ్ళీ విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా రావడం జరిగింది. అయితే మనం గురువులను ఆశ్రయించినంత మాత్రాన, లేదా జన్మ చాలించి మరో జన్మ ఎత్తినంత మాత్రాన మనలోని వాసనాబీజాలు నశించవు. పైగా వాసన పృథ్వీతత్త్వం. "తత్ర గంధవతీ పృథివీ" అని ఉపనిషద్వాక్యం. అలాగే బంగారం మీది దృష్టి ఆవిడను ఈ జన్మలో కూడా వెంటాడింది. తన తండ్రి సంపాదించిన శ్యమంతకమణి దానికి మరింత ఆజ్యం పోసింది. ఇక భూమికి ఉన్న మరో లక్షణం ఆకర్షణ. ఆ భూమ్యాకర్షణే లేకపోతే మనకెవ్వరికీ మనుగడ లేదు. ఈ సహజసిద్ధమైన ఆకర్షణ శక్తితోనే సత్యభామ ఊరిలో అందరినీ ఆకర్షించినట్లుగానే పరమాత్మను కూడా ఆకర్షించి తన కొంగుకు కట్టేసుకోవాలని భావించింది. 

అయితే కేవలం భక్తికి తప్ప పరమాత్మ ఇక దేనికీ ఆకర్షింపబడేవాడు కాదు, లొంగేవాడు కాదు. అయితే సత్యభామలో ఉన్న అతిపెద్ద సుగుణం ఏమిటంటే నిష్కల్మషమైన మనస్సు. పరమాత్ముని దగ్గర ఎప్పుడూ మనస్సు దాచదు. తన మనస్సులో ఉన్న భావాలన్నీ నిస్సంకోచంగా ఆయనముందు వ్యక్తపరుస్తుంది. కనుకనే ఆవిడ శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్ర అయింది. ఇక గురుదేవులు ముందుగా తన శిష్యురాలి మనసులోని దుఃఖాన్ని ఆమెద్వారానే హరింపచేసి ఆ తరువాత ఈ భౌతిక సంపదమీద దృష్టి, ఆకర్షణ అనే వాసనలను సమూలంగా నాశనంచేసి ఆవిడను ఉద్ధరించడానికి సంకల్పించారు. ఇందాక చెప్పినట్లు, గురుదేవులు మార్గం చూపిస్తారేకాని ఎవరి దుఃఖాన్ని వారే విచారణద్వారా తొలగించుకోవాలి. అలాగే కృష్ణుడు మార్గం చూపించగా సత్యభామ నరకాసురుని వధించింది. 

అయితే ఇంకా తన వాసనలు పోకపోవడంతో సాక్షాత్తూ ఆశ్రితపారిజాతమైన పరమాత్ముడు తనవద్దనే ఉన్నా సత్యభామ స్వర్గంనుంచి పారిజాతవృక్షాన్ని పోరాడి మరీ తెచ్చుకుంది. కానీ అది కూడా ఆయనను పూర్తిగా తనకే సొంతం చేయలేకపోయింది. చివరికి సత్యభామ కృష్ణుని  తనవాడిగా చేసుకోవటంకోసం ఆ పారిజాతాన్నీ, తనకున్న సమస్త సంపదలను, బంగారం నిల్వలనూ వదులుకోవడానికి సిద్ధపడింది. అయితే ఈ భౌతిక సంపదలను ఎంత త్యాగం చేసినా పరమాత్ముని పొందటం అసాధ్యం. ఎందుకంటే ఆ సంపదలేవీ మనతో వచ్చినవీ కావు, తీసుకుపోగలిగేవీ కావు. మనం నిజంగా త్యాగం చేయవలసింది జన్మజన్మాంతర వాసనలను. భగవంతుని ప్రేమను పొందటానికి భక్తి ఒక్కటే సాధనమనీ, తనకున్న సంపదలు, ఆకర్షణశక్తీ ఆయనను బంధించలేవని జ్ఞానోదయమైన సత్యభామ చివరికి సంపదమీద తన దృష్టిని, తన ఆకర్షణశక్తిని ఈ రెండు వాసనలను వదిలించుకొని పరమాత్మకు సంపూర్ణ శరణాగతి పొందటంద్వారా ఆయనను తనవాడిని చేసుకుంది. ఇప్పుడావిడకి ఆయన కేవలం తనకుమాత్రమే చెందాలనే స్వార్థం లేదు. ఎందుకంటే ఆయన అందరివాడని, ఆ అందరూ కూడా తనవారేననే జ్ఞానం కలిగింది. 

అయితే ఇలాంటి చరిత్రలు చదివేటప్పుడు "దేవుళ్ళకి కూడా ఇలాంటి బలహీనతలు, మనోమాలిన్యాలు ఉంటాయా? అలా ఉంటే వారు మనకన్నా ఎందులో గొప్ప?" అనే సందేహం కలుగుతుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇది కేవలం మనకు పాఠం నేర్పడంకోసం వారు నడిపించిన జగన్నాటకమే కానీ దైవత్వంలో క్షుద్రత్వానికి ఆస్కారం లేదు. ఉదాహరణకు మనం పూజ చేసుకునే ముందు ఒక పువ్వు నేలమీద పడినా, మలినమైనా అది పూజకు పనికిరాదని తీసి ప్రక్కన పెట్టేస్తాం. కానీ అదే పువ్వు ఒకసారి భగవంతుని శిరస్సుపై అలంకరించిన తరువాత ఆ పువ్వు క్రిందపడినా చటుక్కున తీసి మళ్ళీ దేవుని శిరస్సుపైనే పెట్టేస్తాం.  ఒకసారి దేవుని చేరిన పువ్వుకే మళ్ళీ మాలిన్యం లేదంటే ఇక దేవుళ్ళకు ఎందుకు ఉంటుంది?

10, అక్టోబర్ 2018, బుధవారం

త్యాగం

శ్రీగురుదేవులు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. గీతను అటునుంచి ఇటు చదివితే తాగీ అవుతుందని, బెంగాలీలో తాగీ అంటే త్యాగమని, గీతాసారం అంతా త్యాగమేనని. కేవలం త్యాగం ద్వారా మాత్రమే అమృతత్వం సిద్ధిస్తుందని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. పూర్వం ఒక ఊరిలో ఒక సాధువుగారు ప్రవచనం పూర్తికాగానే అందరూ లేచి వెళ్లిపోయారట కానీ ఒక వ్యక్తి మాత్రం ఇంకా కూర్చునే ఉన్నాడు. ఆ సాధువు అతనిని "ఏం నాయనా! ఏమైనా కావాలా?" అని అడిగారు. అప్పుడతడు "స్వామీ! ఇందాకటినుండి మీరు చెప్పినదంతా బాగానే అర్థం అయ్యింది కానీ అదేదో త్యాగం అని మాటిమాటికీ చెప్పారు. అంటే ఏమిటి స్వామీ?" అని అడిగాడు. అతని వాలకం చూస్తే పశువులుకాసే వాడిలాగా ఉన్నాడని, ఆ సాధువు అతనికి అర్ధమయ్యే ఉదాహరణలతోనే విషయాన్ని వివరించాలని "నీ దగ్గర రెండు ఆవులు ఉన్నాయనుకో, ఒక ఆవును ఎవరికైనా ఇచ్చేస్తావా?" అని అడిగారు. దానికతడు "ఓ! తప్పకుండా ఇస్తాను స్వామీ!" అన్నాడు. కానీ అతని ముఖం చూస్తే ఇంకా పూర్తిగా విషయం అర్థం అయినట్లు అనిపించకపోవడంతో మళ్ళీ "నీ దగ్గర రెండు గేదెలు ఉన్నాయనుకో, ఒక గేదెను ఎవరికైనా ఇచ్చేయగలవా?" అని అడిగారు. దానికి కూడా అతడు "ఓ! తప్పకుండా ఇచ్చేస్తాను స్వామీ!" అన్నాడు. ఇక ఆ సాధువు మరింత ఉత్సాహంతో "అలాగే నీ దగ్గర రెండు మేకలు ఉన్నాయనుకో, ఒక మేకను ఎవరికైనా ఇచ్చేస్తావా?" అని అడిగారు. వెంటనే అతడు కంగారుగా "అలా ఎలా కుదురుతుంది స్వామీ? నేను ఇవ్వను" అన్నాడు. ఊహించని ఈ సమాధానంతో ఖంగుతిన్న ఆ సాధువు "ఏం నాయనా! ఆవుని, గేదెని ఇవ్వడానికి ఆనందంగా ఒపుకున్నవాడివి చిన్న మేకను ఇమ్మంటే కుదరదంటావే?" అని అడిగారు. అందుకతడు "మరి నా దగ్గర నిజంగానే రెండు మేకలున్నాయి స్వామీ! అందులో ఒకటి ఇచ్చేస్తే నేనేమైపోవాలి?" అని అడిగాడు. 

మన త్యాగం కూడా ఇలాగే ఉంటుంది. మన దగ్గర లేనివి, ఉన్నా మనవి కానివి త్యాగం చెయ్యడానికి మనం బాగానే ఉత్సాహం చూపిస్తాం. కానీ మనదైన ఏ చిన్న విషయాన్ని కూడా మనం త్యాగం చేయలేం. త్యాగం అనగానే చాలామంది "నా తనుమనధనాలను సర్వస్వాన్నీ త్యాగం చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే" అంటూ ఉంటారు. అయితే ఇందులో తనువు మన సొంతం కాదు కదా! మన తల్లిదండ్రుల దగ్గరనుండి చెరో కణాన్ని తీసుకొని ముందుగా తల్లి అందించిన ఆహారము ద్వారా, ఆ తరువాత ఎందరో రైతులు పండించి అందించిన ఆహారము ద్వారా మన శరీరం ఇంతగా ఎదిగింది. ఇక మనస్సు కూడా తనువుతోపాటుగా వచ్చినదే. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇంకా సంఘంలో మనకు పరిచయమైన ప్రతివ్యక్తి నుండి కొంత కొంతగా జ్ఞానాన్ని, అనుభవాలను గ్రహిస్తూ ఇంతగా ఎదిగింది. ఇక మనకున్న సంపద అంతా ఈ మనవి కాని తనువును, మనస్సును ఉపయోగించి సంపాదించుకున్నదే కదా. అయినా మనం పుట్టకముందు మనవి కానివి, పోయేటప్పుడు మనతో తీసుకుపోలేనివి అయిన ఈ తనుమనధనాలను త్యాగం చేస్తే మనకు అమృతత్వం ఎలా సిద్ధిస్తుంది?

మరి జన్మజన్మలనుండి మనతో వచ్చేదవి, మనకు మాత్రమే సొంతమైనదవి ఏవి? అవే విషయ వాసనలు, కర్మలు. కేవలం వాటిని త్యాగం చేయడం ద్వారా మాత్రమే అమృతత్వాన్ని పొందగలం. "అదేమిటండీ? విషయ వాసనలు అంటే అవి విషయాలకు సంబంధిచినవి కదా? మన సొంతం ఎలా అవుతాయి?" అని మనకు సందేహం రావచ్చు. అయితే మనం "రంపపు పొట్టు" అంటాం కదా! ఇది ఎక్కడనుంచి వచ్చింది? దేనికి చెందినది? రంపానికి చెందినదైతే కాదు. చెక్క రంపానికి తనను తాను వశపరచుకోవడం ద్వారా ఆ చెక్కనుండి వచ్చిన పొట్టునే మనం రంపంపొట్టు అంటున్నాం. అలాగే విషయ వాసనలు కూడా విషయాలనుండి వచ్చినవి కావు. ఆ విషయాలకు మనను మనం వశపరచుకోవడం ద్వారా మనలో కలిగే వాసనలే విషయ వాసనలు. ఇవి మనలను జన్మజన్మలకు వెంటాడుతాయి, మళ్ళీ మళ్ళీ జన్మలకు కారణమవుతాయి. అందుకే వీటిని త్యాగం చేయటమంటే మనం విషయాలకు లొంగిపోకుండా ఉండగలగటమే. అలాగే కర్మలను త్యాగం చేయటమంటే ఏ పనీ చేయకుండా కూర్చోవటం కాదు. అలా కూర్చోవటం కూడా ఒక పనే కదా! అసలు కర్మ చేయకుండా ఉండటం ఏ ప్రాణికీ సాధ్యం కాదు. మరి మనం ఇందులో త్యాగం చేయగలిగినది ఏమిటి? అంటే, మనం కర్మ ఫలాన్ని త్యాగం చేయాలి. ముందుగా "కర్మ చేసేది నేను కాదు, ఇది నాతో భగవంతుడు చేయిస్తున్నాడు" అనే విశ్వాసంతో కర్తృత్వ అహంకారం తొలగిపోతుంది. అలాగే "ఈ కర్మద్వారా నేను పొందగోరేది ఏదీ లేదు. నాకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అది భగవంతుడే ప్రసాదిస్తాడు. నేను కేవలం ఆయన ఆజ్ణతోనే ఈ కర్మ చేస్తున్నాను" అనే సర్వసమర్పణ భావనతో భోక్తృత్వ అహంకారం తొలగిపోతుంది. ఈ రెండూ తొలగిపోతేనే కర్మఫలాన్ని, విషయవాసనలను త్యాగం చేయగలుగుతాం. అప్పుడే మనకు అమృతత్వం సిద్ధిస్తుంది.