16, నవంబర్ 2018, శుక్రవారం

సత్యభామ

సత్యభామ కథ ముందుగా హిరణ్యాక్షుడితో మొదలవుతుంది. హిరణ్యం అంటే బంగారం. హిరణ్యాక్షుడు అంటే బంగారం/సంపద  మీద దృష్టి. అదే భూదేవిని జలంలో అంటే జడత్వంలో/అజ్ఞానంలో ముంచేసింది. ఆవిడను ఉద్ధరించడానికి విష్ణుమూర్తి స్వయంగా వరాహావతారంలో వచ్చారు. వరాహం మనం విసర్జించిన వాటిని తాను స్వీకరించి మన పరిసరాలను పరిశుభ్రంగా చేస్తుంది. అలాగే గురుదేవులు మనకు సాధనకు అడ్డువచ్చే మనలోని దుర్గుణాలను, మన ప్రారబ్ధ కర్మలను, వాసనలను అన్నింటినీ వారు స్వీకరించి మన మనసులను శుద్ధ మనసులుగా చేస్తారు. అయితే ఈ ప్రక్షాళన పూర్తి కాకముందే తొందరపడి ఫలితాన్ని పొందాలనుకుంటే అది దుఃఖానికే దారి తీస్తుంది. అందుకే భూదేవికి నరకాసురుడు జన్మించాడు. నరకమంటే దుఃఖమే కదా! మన దుఃఖం బయటనుంచి రాదు. అది మన మనసులోనే పుడుతుంది. అలాగే బయటి ఉపకరణాలేవీ ఆ దుఃఖాన్ని పోగొట్టలేవు. మన దుఃఖాన్ని మనమే విచారణ ద్వారా పోగొట్టుకోవాలి. అందుకే నరకాసురుడికి కేవలం భూదేవి చేతిలోనే మరణం నిశ్చయించబడటం. 

మన మనస్సు పరిశుద్ధమై ఆత్మజ్ఞానం పొందేదాకా ఎన్ని జన్మలైనా గురుదేవులు మనలను వదిలిపెట్టరు. అలాగే భూదేవి సత్యభామగా వచ్చినా మళ్ళీ విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా రావడం జరిగింది. అయితే మనం గురువులను ఆశ్రయించినంత మాత్రాన, లేదా జన్మ చాలించి మరో జన్మ ఎత్తినంత మాత్రాన మనలోని వాసనాబీజాలు నశించవు. పైగా వాసన పృథ్వీతత్త్వం. "తత్ర గంధవతీ పృథివీ" అని ఉపనిషద్వాక్యం. అలాగే బంగారం మీది దృష్టి ఆవిడను ఈ జన్మలో కూడా వెంటాడింది. తన తండ్రి సంపాదించిన శ్యమంతకమణి దానికి మరింత ఆజ్యం పోసింది. ఇక భూమికి ఉన్న మరో లక్షణం ఆకర్షణ. ఆ భూమ్యాకర్షణే లేకపోతే మనకెవ్వరికీ మనుగడ లేదు. ఈ సహజసిద్ధమైన ఆకర్షణ శక్తితోనే సత్యభామ ఊరిలో అందరినీ ఆకర్షించినట్లుగానే పరమాత్మను కూడా ఆకర్షించి తన కొంగుకు కట్టేసుకోవాలని భావించింది. 

అయితే కేవలం భక్తికి తప్ప పరమాత్మ ఇక దేనికీ ఆకర్షింపబడేవాడు కాదు, లొంగేవాడు కాదు. అయితే సత్యభామలో ఉన్న అతిపెద్ద సుగుణం ఏమిటంటే నిష్కల్మషమైన మనస్సు. పరమాత్ముని దగ్గర ఎప్పుడూ మనస్సు దాచదు. తన మనస్సులో ఉన్న భావాలన్నీ నిస్సంకోచంగా ఆయనముందు వ్యక్తపరుస్తుంది. కనుకనే ఆవిడ శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్ర అయింది. ఇక గురుదేవులు ముందుగా తన శిష్యురాలి మనసులోని దుఃఖాన్ని ఆమెద్వారానే హరింపచేసి ఆ తరువాత ఈ భౌతిక సంపదమీద దృష్టి, ఆకర్షణ అనే వాసనలను సమూలంగా నాశనంచేసి ఆవిడను ఉద్ధరించడానికి సంకల్పించారు. ఇందాక చెప్పినట్లు, గురుదేవులు మార్గం చూపిస్తారేకాని ఎవరి దుఃఖాన్ని వారే విచారణద్వారా తొలగించుకోవాలి. అలాగే కృష్ణుడు మార్గం చూపించగా సత్యభామ నరకాసురుని వధించింది. 

అయితే ఇంకా తన వాసనలు పోకపోవడంతో సాక్షాత్తూ ఆశ్రితపారిజాతమైన పరమాత్ముడు తనవద్దనే ఉన్నా సత్యభామ స్వర్గంనుంచి పారిజాతవృక్షాన్ని పోరాడి మరీ తెచ్చుకుంది. కానీ అది కూడా ఆయనను పూర్తిగా తనకే సొంతం చేయలేకపోయింది. చివరికి సత్యభామ కృష్ణుని  తనవాడిగా చేసుకోవటంకోసం ఆ పారిజాతాన్నీ, తనకున్న సమస్త సంపదలను, బంగారం నిల్వలనూ వదులుకోవడానికి సిద్ధపడింది. అయితే ఈ భౌతిక సంపదలను ఎంత త్యాగం చేసినా పరమాత్ముని పొందటం అసాధ్యం. ఎందుకంటే ఆ సంపదలేవీ మనతో వచ్చినవీ కావు, తీసుకుపోగలిగేవీ కావు. మనం నిజంగా త్యాగం చేయవలసింది జన్మజన్మాంతర వాసనలను. భగవంతుని ప్రేమను పొందటానికి భక్తి ఒక్కటే సాధనమనీ, తనకున్న సంపదలు, ఆకర్షణశక్తీ ఆయనను బంధించలేవని జ్ఞానోదయమైన సత్యభామ చివరికి సంపదమీద తన దృష్టిని, తన ఆకర్షణశక్తిని ఈ రెండు వాసనలను వదిలించుకొని పరమాత్మకు సంపూర్ణ శరణాగతి పొందటంద్వారా ఆయనను తనవాడిని చేసుకుంది. ఇప్పుడావిడకి ఆయన కేవలం తనకుమాత్రమే చెందాలనే స్వార్థం లేదు. ఎందుకంటే ఆయన అందరివాడని, ఆ అందరూ కూడా తనవారేననే జ్ఞానం కలిగింది. 

అయితే ఇలాంటి చరిత్రలు చదివేటప్పుడు "దేవుళ్ళకి కూడా ఇలాంటి బలహీనతలు, మనోమాలిన్యాలు ఉంటాయా? అలా ఉంటే వారు మనకన్నా ఎందులో గొప్ప?" అనే సందేహం కలుగుతుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇది కేవలం మనకు పాఠం నేర్పడంకోసం వారు నడిపించిన జగన్నాటకమే కానీ దైవత్వంలో క్షుద్రత్వానికి ఆస్కారం లేదు. ఉదాహరణకు మనం పూజ చేసుకునే ముందు ఒక పువ్వు నేలమీద పడినా, మలినమైనా అది పూజకు పనికిరాదని తీసి ప్రక్కన పెట్టేస్తాం. కానీ అదే పువ్వు ఒకసారి భగవంతుని శిరస్సుపై అలంకరించిన తరువాత ఆ పువ్వు క్రిందపడినా చటుక్కున తీసి మళ్ళీ దేవుని శిరస్సుపైనే పెట్టేస్తాం.  ఒకసారి దేవుని చేరిన పువ్వుకే మళ్ళీ మాలిన్యం లేదంటే ఇక దేవుళ్ళకు ఎందుకు ఉంటుంది?

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి