మనందరికీ పుట్టగానే తెలిసేది ఏడవటం, ఆ తరువాత తల్లి పాలు త్రాగడం. క్షీరద జాతులలో ఏ ప్రాణి అయినా పుట్టిన మొదటి కొన్ని రోజులూ జీవించేది, పోషించబడేది తల్లిపాలతోనే. అయితే ఇన్నాళ్ళూ మనం కేవలం ఒక తల్లి తన బిడ్డల ఆకలి తీర్చడం కోసం పాలిస్తుందని మాత్రమే అనుకునేవాళ్ళం. కానీ ఈ మధ్య శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలలో అనేక ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. ఇది కేవలం వన్వే ట్రాఫిక్ కాదు. తల్లి ఇచ్చేది కేవలం పాలు కాదు. బిడ్డ తల్లి దగ్గర పాలు త్రాగేటప్పుడు ఆ బిడ్డ లాలాజలం తల్లి శరీరంలోకి ప్రవేశించి పరీక్షించబడుతుంది. తద్వారా ఆ బిడ్డ శరీరంలో ఉన్న ఏమైనా పోషణ లోపాలు, రుగ్మతలు గుర్తించబడి తరువాత వచ్చే పాలలో వాటికి విరుగుడు అయిన పదార్థాలు, కావలసిన పోషక పదార్థాలు ఆ పాలకి జోడించబడతాయి.
శాస్త్రజ్ఞులు ఇలా ఇప్పటికి తల్లి పాలలో వంద రకాల వివిధ పోషకాలు గుర్తించారు. అయితే ఇది కేవలం లవలేశం మాత్రమేనని, ఇంకా కొన్ని వేల పదార్థాలు గుర్తించబడాలని వారు చెబుతున్నారు. ఈ మధ్య ఒక తల్లి తన బిడ్డ మామూలుగా ఉన్నప్పుడు, జ్వరంగా ఉన్నప్పుడు, అలాగే తాను ఉద్యోగరీత్యా కొన్ని గంటలు బిడ్డకు దూరంగా ఉండి బిడ్డ శరీరంలో ద్రవపదార్థాలు తగ్గిపోయినప్పుడు ఇలా రకరకాల పరిస్థితులలో తన స్తన్యాన్ని సేకరించి ఆ స్తన్యంలో వచ్చిన మార్పులు స్పష్టంగా వీడియో తీసి నిరూపణగా సామాజిక మాధ్యమాలలో చూపించింది. పోతపాలలో మహా అయితే రెండు మూడు రకాల పోషకాలను కలపగలరేమో కానీ ఎప్పటికప్పుడు తన బిడ్డ పరిస్థితికి అనుగుణంగా ఇలా మారే పాలను ఎవరు తయారు చేయగలరు? శ్రీగురుదేవులు కూడా సరైన సమయం వచ్చినప్పుడు తనకు తానుగా వచ్చి గురువును ఆశ్రయించిన శిష్యులకు లభించే అనుభూతిని తల్లి పాలతోనూ, ఆ సమయం రాకుండానే ఎవరి ప్రోద్బలంతోనో, మొహమాటానికో వచ్చే వారు పొందే అనుభూతిని పోతపాలతోనూ పోల్చేవారు.
మిగిలిన జంతువులన్నీ పుట్టగానే లేచి పరిగెడతాయి. లేదా కొన్ని రోజులో, వారాలో మాత్రమే తల్లిపాల మీద ఆధారపడతాయి. కానీ మానవులు మాత్రం దాదాపు సంవత్సరం వరకు పూర్తిగా తల్లి సంరక్షణలోనే పెరగాలని భగవంతుని నిర్ణయం. ఈ సంవత్సర కాలంలో ఆ బిడ్డ బుద్ధి వికసించడానికి తల్లి పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మిగిలిన ప్రాణులకు లేనిది, మానవునికి మాత్రమే భగవంతుడు ప్రసాదించినది బుద్ధి ఇంద్రియమే కదా! అయితే ఈ బుద్ధి వికాసం కేవలం ప్రాపంచిక విషయాలలోనే జరుగుతుంది. అసలైన ఆధ్యాత్మిక వికాసం కలగాలంటే గురుదేవుల వద్ద జ్ఞానక్షీరాన్ని గ్రోలవలసిందే. మామూలు తల్లికి తన శరీరంలో జరిగే ఇంతటి ప్రక్రియ తెలియదు. బిడ్డ ఆరోగ్యాన్ని పరీక్షించడం, అందుకు తగిన విధంగా తన పాలను మార్చుకోవడం ఈ ప్రక్రియ అంతా ఆ తల్లికి ఏమాత్రం తెలియకుండానే జరిగిపోతుంది. అయితే గురుదేవుల విషయంలో మాత్రం ఇదంతా వారికి తెలిసే జరుగుతుంది.
ఏ శిష్యుడి మనస్సులో ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు చెలరేగుతున్నాయో, ఎప్పటికప్పుడు గ్రహించి దానికి తగిన బోధని అందించడమే కాకుండా భవిష్యత్తులో రాబోయే ఆలోచనలు, త్రొక్కబోయే చెడు దారులను కూడా ముందే గ్రహించి అందుకు తగ్గ నివారణోపాయాలను తమ బోధలో నిక్షిప్తం చేస్తారు. అంతే కాదు, ఒక సభలో గురుదేవుల బోధలో వినిపించే ఒక్క వాక్యం అక్కడ ఆశీనులై ఉన్న వందల మంది శిష్యులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమై వారి వారి జీవన విధానంలో పెనుమార్పులు తీసుకువచ్చే సాధనం అవుతుంది. ఇది మనందరికీ అనుభవంలోనిదే కదా! శ్రీగురుదేవులు అన్నట్లుగా వారిది తెలిసిన బాధ, మనది తెలియని బాధ. అందుకే వారికి సర్వసమర్పణ చేసుకొని వారు సూచించిన మార్గంలో తు.చ. తప్పక నడవటమే మనకు శ్రేయోదయకం.
శిశువు తల్లి పాలు త్రాగినంత కాలం ఎటువంటి భయాలు, బంధనాలు, పరిమితులు లేకుండా స్వేచ్ఛగా ఉంటాడు. బోర్లపడటం దగ్గరినుంచి నడవటం వరకు అన్నీ ఎంతో కష్టపడి నేర్చుకుంటాడు. ఎందులోనూ 'ఇది నేను చేయగలనా?' అనే సందేహం ఉండదు. కానీ మెల్లిగా బయటి ఆహారం అలవాటైన కొద్దీ భయాలు, పరిమితులు పెరుగుతాయి. నలుగురిలో మాట్లాడాలంటే భయం, క్రొత్త విషయాలు నేర్చుకోవాలంటే భయం. క్రొత్త రంగంలోకి అడుగు పెట్టాలంటే ఎన్నెన్నో పరిమితులు. అలాగే శిష్యుడు ఎప్పుడైతే కేవలం తన గురుదేవులు అందించే జ్ఞానక్షీరాన్ని మాత్రమే నిరంతరం గ్రోలుతూ ఉంటాడో ఆ శిష్యుడికి ఎటువంటి భయాలు, పరిమితులు ఉండవు. అట్టి శిష్యుడు సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. కానీ గురుబోధా శ్రవణం చేస్తూ కూడా తన మనస్సును ప్రాపంచిక విషయాల పైకి పరుగులెత్తించే శిష్యునికి అన్నీ భయాలే, పరిమితులే.
బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లి బిడ్డలు ఇద్దరూ ఎంతో ఏకాగ్రతగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో ఎటువంటి విఘ్నాలను ఆ తల్లి సహించదు. ఇంకా జంతువులలో అయితే తన బిడ్డలకు పాలిచ్చే సమయంలో మరే ప్రాణి అటువైపు వచ్చినా ఆ తల్లి భీకరంగా వాటిపై విరుచుకుపడుతుంది. గురుదేవులు కూడా తమ శిష్యులకు కీలకమైన జ్ఞానబోధ చేసే సమయంలో అంతే గంభీరంగా ఉంటారు. శిష్యుడిగా మనం కూడా అటువంటి ఏకాగ్రతను సాధిస్తేనే గురుబోధలోని జ్ఞానం మనకు వంటపడుతుంది. అయితే గోమాత సాధు జంతువు అని ఆ తల్లీబిడ్డలు ఆహారం తింటున్నా, లేదా తల్లి తన బిడ్డకు పాలిస్తున్నా కూడా పట్టించుకోకుండా మనవాళ్ళు పుణ్యం కోసం ఆ తల్లి పృష్టభాగాన్ని తాకి మరీ నమస్కారాలు పెట్టేస్తూ ఉంటారు. ఇలా ఒక తల్లిని ఎంతో కీలకమైన క్షణాలలో ఏకాగ్రతను భంగపరిచేలా ప్రవర్తిస్తే వచ్చేది పుణ్యమో మరి పాపమో ఎవరికి వారే విచారించుకోవాలి. అలాగే శివాలయంలో నందీశ్వరుడు. ఆయన తన స్వామిని వీడలేక నిరంతరం ఏకాగ్రతతో ఆ స్వామినే చూస్తూ ఉంటాడు. మనం గట్టిగా అయిదు నిముషాలు అలా స్వామిని చూడలేం కానీ అలాంటి నందీశ్వరుని కదిలించి, పృష్టభాగాన్ని నిమిరి, కొమ్ములమీద వ్రేళ్ళు పెట్టి, చెవిలో నానా కోర్కెలు చెబుతూ ఉంటే ఆయనకు ఎలా ఉంటుంది? ఏ, ఆయనకు కొద్ది అడుగుల దూరంలో నుంచుని చూస్తే ఆ కొమ్ముల మధ్యనుండి శివదర్శనం అవదా?
ఏ శిష్యుడైతే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పూర్తిగా మరచి కేవలం తన గురుదేవులు తప్ప అన్యమైనదేదీ తన మనస్సులోకి చొరబడనీయకుండా అటువంటి ఏకాగ్రతతో గురుదేవులు ప్రసాదించే జ్ఞానక్షీరాలను నిరంతరం గ్రోలుతూ, వాటిమీదనే ఆధారపడి బ్రతుకుతూ, అంటే ఆ బోధను తన నిత్యజీవితంలో అనుక్షణం ఆచరణలో పెట్టుకుంటూ బ్రతుకుతాడో అట్టి శిష్యుడు అమ్మ ఒడిలో ఉన్న శిశువులాగా ఏ బాదరబందీ లేకుండా సుఖంగా, నిర్భయంగా తన జీవితాన్ని గడుపుకుంటాడు. ఇక్కడ అమ్మ అంటే కేవలం స్త్రీ రూపంలో ఉన్న దేవతామూర్తి మాత్రమే అనుకోవక్కర్లేదు. నిజానికి దైవానికి రూపభేదం, లింగభేదం లేదు. గీతలో స్వామి తన మాతృత్వాన్ని ప్రకటిస్తూ గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా| పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః|| (15-13) నేను భూదేవినై నా శక్తితో సమస్త ప్రాణులను నా ఒడిలో ధరిస్తున్నాను. అలాగే రసస్వరూపుడైన చంద్రుడినై ఆ ప్రాణులకు ఆహారమైన ఓషధులలో పుష్టిని నింపుతున్నాను అని తెలియజేశాడు.
విశ్వమాత(విశ్వానికి అంతటికీ తల్లి), ఆబ్రహ్మ కీట జనని(అందరినీ సృష్టించే బ్రహ్మ మొదలుకొని చిన్న కీటకం వరకు అందరికీ కన్నతల్లి), జగద్ధాత్రి(జగత్తునంతటినీ తన ఒడిలో ధరించేది), ప్రసవిత్రీ(నిరంతరం ప్రసవిస్తూ ఉండేది), వియదాది జగత్ప్రసూః(ఆకాశం, పాతాళం మొదలుకొని అన్నీ జగత్తులను ప్రసవించేది) ఇటువంటి నామాలతో అలరారే ఆ జగజ్జననియే ప్రత్యక్షంగా తన వాత్సల్యంతో మనలను అనుగ్రహించడానికి గురుమూర్తిగా, గురుమండలరూపిణిగా అవతరించి, తన జ్ఞానక్షీరాలను అనుగ్రహించి, మళ్ళీ ఇంకో తల్లి పాలు త్రాగవలసిన అవసరం లేని కైవల్య స్థితిని(జ్ఞానాదేవతు కైవల్యం) మనకు ప్రసాదిస్తోంది.
ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లికి ఏమైనా వ్యాధులు సంక్రమిస్తే బిడ్డ తన మూలకణాలను తల్లి రక్తంలోనికి పంపి ఆ వ్యాధిని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అలాగే బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా తల్లి వివిధ రకాల కేన్సర్లు, మధుమేహం, హృద్రోగం వంటి వ్యాధులనుండి చాలావరకు రక్షణ పొందుతుంది. అలాగే గురుదేవులు నిజానికి ఈ శరీరానికి అతీతులైనా తమనాశ్రయించిన వారి కర్మను తమపై ఆపాదించుకొని శారీరక బాధలు పడుతున్నట్లుగా కనిపిస్తారు. అయితే ఎన్ని మందులు వాడినా, ఎన్ని వైద్యాలు చేసినా ఉపశమించని ఆ బాధలు, ఒక సచ్చిష్యుడు నిజమైన జ్ఞానాన్ని పొందాలనే తపనతో తమ సన్నిధికి చేరి, పరిప్రశ్నలతో ఇంకా ఇంకా గురుబోధను రాబట్టే ప్రయత్నం చేసినప్పుడు ఆశ్చర్యకరంగా ఉపశమిస్తాయి. ఇది శ్రీ బాబూజీ మహరాజ్ వారి విషయంలోనూ, శ్రీ మాతాజీ వారి విషయంలోనూ మనందరికీ ప్రత్యక్ష అనుభవమే. నిజానికి ఒక శిష్యుడు తన గురుదేవునికి చేయగలిగిన అత్యుత్తమ సేవ ఇదే. అలా గురుదేవులనుండి ప్రవహించే జ్ఞానక్షీరాలను నిరంతరం గ్రోలుతూ మన జన్మలను చరితార్థం చేసుకుందాం.
