10, అక్టోబర్ 2018, బుధవారం

త్యాగం

శ్రీగురుదేవులు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. గీతను అటునుంచి ఇటు చదివితే తాగీ అవుతుందని, బెంగాలీలో తాగీ అంటే త్యాగమని, గీతాసారం అంతా త్యాగమేనని. కేవలం త్యాగం ద్వారా మాత్రమే అమృతత్వం సిద్ధిస్తుందని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. పూర్వం ఒక ఊరిలో ఒక సాధువుగారు ప్రవచనం పూర్తికాగానే అందరూ లేచి వెళ్లిపోయారట కానీ ఒక వ్యక్తి మాత్రం ఇంకా కూర్చునే ఉన్నాడు. ఆ సాధువు అతనిని "ఏం నాయనా! ఏమైనా కావాలా?" అని అడిగారు. అప్పుడతడు "స్వామీ! ఇందాకటినుండి మీరు చెప్పినదంతా బాగానే అర్థం అయ్యింది కానీ అదేదో త్యాగం అని మాటిమాటికీ చెప్పారు. అంటే ఏమిటి స్వామీ?" అని అడిగాడు. అతని వాలకం చూస్తే పశువులుకాసే వాడిలాగా ఉన్నాడని, ఆ సాధువు అతనికి అర్ధమయ్యే ఉదాహరణలతోనే విషయాన్ని వివరించాలని "నీ దగ్గర రెండు ఆవులు ఉన్నాయనుకో, ఒక ఆవును ఎవరికైనా ఇచ్చేస్తావా?" అని అడిగారు. దానికతడు "ఓ! తప్పకుండా ఇస్తాను స్వామీ!" అన్నాడు. కానీ అతని ముఖం చూస్తే ఇంకా పూర్తిగా విషయం అర్థం అయినట్లు అనిపించకపోవడంతో మళ్ళీ "నీ దగ్గర రెండు గేదెలు ఉన్నాయనుకో, ఒక గేదెను ఎవరికైనా ఇచ్చేయగలవా?" అని అడిగారు. దానికి కూడా అతడు "ఓ! తప్పకుండా ఇచ్చేస్తాను స్వామీ!" అన్నాడు. ఇక ఆ సాధువు మరింత ఉత్సాహంతో "అలాగే నీ దగ్గర రెండు మేకలు ఉన్నాయనుకో, ఒక మేకను ఎవరికైనా ఇచ్చేస్తావా?" అని అడిగారు. వెంటనే అతడు కంగారుగా "అలా ఎలా కుదురుతుంది స్వామీ? నేను ఇవ్వను" అన్నాడు. ఊహించని ఈ సమాధానంతో ఖంగుతిన్న ఆ సాధువు "ఏం నాయనా! ఆవుని, గేదెని ఇవ్వడానికి ఆనందంగా ఒపుకున్నవాడివి చిన్న మేకను ఇమ్మంటే కుదరదంటావే?" అని అడిగారు. అందుకతడు "మరి నా దగ్గర నిజంగానే రెండు మేకలున్నాయి స్వామీ! అందులో ఒకటి ఇచ్చేస్తే నేనేమైపోవాలి?" అని అడిగాడు. 

మన త్యాగం కూడా ఇలాగే ఉంటుంది. మన దగ్గర లేనివి, ఉన్నా మనవి కానివి త్యాగం చెయ్యడానికి మనం బాగానే ఉత్సాహం చూపిస్తాం. కానీ మనదైన ఏ చిన్న విషయాన్ని కూడా మనం త్యాగం చేయలేం. త్యాగం అనగానే చాలామంది "నా తనుమనధనాలను సర్వస్వాన్నీ త్యాగం చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే" అంటూ ఉంటారు. అయితే ఇందులో తనువు మన సొంతం కాదు కదా! మన తల్లిదండ్రుల దగ్గరనుండి చెరో కణాన్ని తీసుకొని ముందుగా తల్లి అందించిన ఆహారము ద్వారా, ఆ తరువాత ఎందరో రైతులు పండించి అందించిన ఆహారము ద్వారా మన శరీరం ఇంతగా ఎదిగింది. ఇక మనస్సు కూడా తనువుతోపాటుగా వచ్చినదే. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇంకా సంఘంలో మనకు పరిచయమైన ప్రతివ్యక్తి నుండి కొంత కొంతగా జ్ఞానాన్ని, అనుభవాలను గ్రహిస్తూ ఇంతగా ఎదిగింది. ఇక మనకున్న సంపద అంతా ఈ మనవి కాని తనువును, మనస్సును ఉపయోగించి సంపాదించుకున్నదే కదా. అయినా మనం పుట్టకముందు మనవి కానివి, పోయేటప్పుడు మనతో తీసుకుపోలేనివి అయిన ఈ తనుమనధనాలను త్యాగం చేస్తే మనకు అమృతత్వం ఎలా సిద్ధిస్తుంది?

మరి జన్మజన్మలనుండి మనతో వచ్చేదవి, మనకు మాత్రమే సొంతమైనదవి ఏవి? అవే విషయ వాసనలు, కర్మలు. కేవలం వాటిని త్యాగం చేయడం ద్వారా మాత్రమే అమృతత్వాన్ని పొందగలం. "అదేమిటండీ? విషయ వాసనలు అంటే అవి విషయాలకు సంబంధిచినవి కదా? మన సొంతం ఎలా అవుతాయి?" అని మనకు సందేహం రావచ్చు. అయితే మనం "రంపపు పొట్టు" అంటాం కదా! ఇది ఎక్కడనుంచి వచ్చింది? దేనికి చెందినది? రంపానికి చెందినదైతే కాదు. చెక్క రంపానికి తనను తాను వశపరచుకోవడం ద్వారా ఆ చెక్కనుండి వచ్చిన పొట్టునే మనం రంపంపొట్టు అంటున్నాం. అలాగే విషయ వాసనలు కూడా విషయాలనుండి వచ్చినవి కావు. ఆ విషయాలకు మనను మనం వశపరచుకోవడం ద్వారా మనలో కలిగే వాసనలే విషయ వాసనలు. ఇవి మనలను జన్మజన్మలకు వెంటాడుతాయి, మళ్ళీ మళ్ళీ జన్మలకు కారణమవుతాయి. అందుకే వీటిని త్యాగం చేయటమంటే మనం విషయాలకు లొంగిపోకుండా ఉండగలగటమే. అలాగే కర్మలను త్యాగం చేయటమంటే ఏ పనీ చేయకుండా కూర్చోవటం కాదు. అలా కూర్చోవటం కూడా ఒక పనే కదా! అసలు కర్మ చేయకుండా ఉండటం ఏ ప్రాణికీ సాధ్యం కాదు. మరి మనం ఇందులో త్యాగం చేయగలిగినది ఏమిటి? అంటే, మనం కర్మ ఫలాన్ని త్యాగం చేయాలి. ముందుగా "కర్మ చేసేది నేను కాదు, ఇది నాతో భగవంతుడు చేయిస్తున్నాడు" అనే విశ్వాసంతో కర్తృత్వ అహంకారం తొలగిపోతుంది. అలాగే "ఈ కర్మద్వారా నేను పొందగోరేది ఏదీ లేదు. నాకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అది భగవంతుడే ప్రసాదిస్తాడు. నేను కేవలం ఆయన ఆజ్ణతోనే ఈ కర్మ చేస్తున్నాను" అనే సర్వసమర్పణ భావనతో భోక్తృత్వ అహంకారం తొలగిపోతుంది. ఈ రెండూ తొలగిపోతేనే కర్మఫలాన్ని, విషయవాసనలను త్యాగం చేయగలుగుతాం. అప్పుడే మనకు అమృతత్వం సిద్ధిస్తుంది. 

1 వ్యాఖ్య:

  1. త్యాగం గురించి చెప్పారు బాగుంది. కానీ గీతా తాగీ ఈ జిమ్మిక్స్ అవసరమా. మీరు చెప్పే అమృతత్వం వినటానికి బాగుంటుంది కానీ ఒక్కనాటికీ సిద్ధించే విషయం కాదు.

    ప్రత్యుత్తరంతొలగించు