శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామాలలో ఒక నామం - ఓం సంచలద్వాల సన్నద్ధ లంబమాన శిఖోజ్వలాయై నమః. సంచలత్ - బాగా కదులుతూ ఉన్న, వాల - తోకతో, సన్నద్ధ - సిద్ధంగా ఉన్న, లంబమాన - (ఆ తోకను) ఆశ్రయించి ఉన్న, ఉజ్వల - ప్రకాశిస్తున్న, శిఖ - అగ్నిశిఖను కలిగినవాడు అని అర్థం. తోక చివరన మండుతూ ఉన్న అగ్నితో లంకను కాల్చడానికి సిద్ధంగా ఉన్న అంజనేయిని రూపాన్ని ఈ నామం గుర్తుకు తెస్తుంది.
అయితే ఇది మనకు కూడా అన్వయిస్తుంది. ఆంజనేయుని తోకలాగే మన మనస్సు కూడా ఎప్పుడూ చలిస్తూ ఉంటుంది. వానరాలు ఈ కొమ్మ మీదనుంచి ఆ కొమ్మకు, ఆ కొమ్మ మీదనుంచి ఈ కొమ్మ మీదకు నిరంతరం దూకుతూ ఉన్నట్లు మన మనస్సు కూడా ఒక విషయం నుంచి ఇంకొక విషయం మీదకు అలాగే దూకుతూ ఉంటుంది. అలాగే మనం ఏ చిన్న విషయాన్ని నేర్చుకున్నా, లేదా క్రొత్తగా ఒక పని చేసినా ఆంజనేయిని తోక చివరన ఎగసిపడుతున్న మంటలాగే మన ప్రతిభను పదిమందికీ చూపించాలని, అది చూసి అందరూ మనను మెచ్చుకోవాలని మన మనస్సు ఎగసిపడుతూ ఉంటుంది.
అయితే ఆంజనేయుని గమనిస్తే ఆయన ఎంతటి ప్రతిభావంతుడయినా, నవ వ్యాకరణ పండితుడైనా, అష్ట సిద్ధులు కలిగి ఉన్నా, ఎప్పుడూ శ్రీరామచంద్రుని పాదాల చెంత దాసుడై ఒదిగి ఉంటాడు. ఆ ప్రభువు ఆజ్ఞ లేనిదే ఏ పనీ చెయ్యడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని ఆయన మీద లోకం అపవాదు వేస్తుంది కానీ కాల్చడం కూడా ఆయన స్వామి ఆజ్ఞగానే స్వీకరించాడు. ముందు సీతాదేవి ఎక్కడ ఉందో చూసి రమ్మనే పంపించినా ఒకసారి అమ్మను చూసిన వెంటనే తరువాతి కర్తవ్యం ఏమిటో ఆయనకు త్రిజట స్వప్నం ద్వారా బోధ పడింది. ఒక వానరుడు లంకకు వచ్చి, అశోకవనాన్ని ధ్వంసం చేసి, వేలాది రాక్షసులను సంహరించి, లంకను కాల్చి తిరిగి వెళ్ళడం అనేది ముందుగానే భగవంతుడైన తన ప్రభువు నిర్ణయించి ఉంచాడని ఆ స్వప్న వృత్తాంతాన్ని వినడం ద్వారా ఆయనకు అర్థం అయ్యింది.
అందుకనే అప్పటి దాకా ఒక చిన్న పిల్లి పరిమాణంలో సూక్ష్మరూపంలో ఆకుల మధ్యలో ఒదిగి ఉన్న ఆయన వికటరూపాన్ని ధరించి లంకను కాల్చాడు. నిజానికి గమనిస్తే ఆయన ఆ స్వప్నంలో చెప్పినంతవరకు మాత్రమే చేశాడు. ముందుగా అశోకవనాన్ని ధ్వంసం చేసి, అక్కడి రాక్షసులని సంహరించాడు. ఆ తరువాత ఇంద్రజిత్తు తనను బంధించినా, రావణుని సభలో అందరూ తనను అవమానించినా ఆయన ఏ ప్రతిచర్య చేయలేదు. ఎందుకంటే అదేదీ ఆ స్వప్నంలో చెప్పబడలేదు. ఒకసారి తన తోకకు నిప్పు అంటగానే మళ్ళీ భగవదాజ్ఞను అమలు పరుస్తూ లంకను కాల్చివేశాడు.
ఆంజనేయుని చూసి మనందరము నేర్చుకోవలసిన ముఖ్య విషయం ఇదే. ఎంతటి ప్రతిభావంతులమైనా, ఆ ప్రతిభను ప్రదర్శించాలని మనస్సు ఎంతగా ఉవ్విళ్ళూరుతున్నా, ఈ ప్రతిభకు కారణమైన మన ప్రభువు పాదాల వద్ద ఒదిగి ఉండి వారి ఆజ్ఞకు బద్ధులై ప్రవర్తించడం నేర్చుకోవాలి. శ్రీ మాతాజీ వారు ఎప్పుడూ శ్రీ బాబూజీ మహారాజ్ వారి మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటారు - అన్నీ తెలిసి, నేర్చుకొని ఉండాలి, కానీ ఏమీ తెలియని వాడిలా ఒక ప్రక్కన ఒదిగి ఉండాలి. అవసరమైనప్పుడు నీ ప్రతిభను సేవకు ఉపయోగించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కారుకు స్టెఫనీ టైరులాగా ఉండాలి - అని.
ఇక్కడ ఆంజనేయుని నుంచి నేర్చుకోవలసింది ఇంకొకటి ఉంది. మనలో చాలామంది ప్రతి చిన్న విషయానికి అవతలివారు తమను అవమానించారని బాధపడిపోతూ ఉంటారు. వారు ఒక మాట అన్నా, ఒక చూపు చూసినా అది తనకు అవమానంగానే భావిస్తూ ఉంటారు. అయితే ముందు నిన్ను నువ్వు గౌరవించుకోవటం నేర్చుకోవాలి. నీమీద నీకు గౌరవం ఉన్నప్పుడు నిన్ను ఎవరూ అవమానించలేరు. రావణుని సభలో ఆంజనేయుని అవమానించినా, ఆసనం ఇవ్వకున్నా ఆయనేమీ బాధపడలేదు. తన ఆసనం తానే తయారుచేసుకొని వారందరి కంటే ఎత్తుగా కూర్చున్నాడు. నిన్ను నీవు గౌరవించుకోవటం అంటే ఇదే. ఇది అలవరచుకున్న నాడు నిన్నెవరూ అవమానించలేరు.
ఇక ప్రతిభను నియంత్రణలో పెట్టుకోవడం గురించి మరింత లోతుగా విచారిద్దాం. "ఒక కారు వేగంగా వెళ్ళాలంటే ఏం కావాలి?" అని అడిగామనుకోండి ఎవరైనా ఠక్కున "మంచి ఇంజను ఉండాలి, పెట్రోలు నిండుగా ఉండాలి, టైర్లు బాగుండాలి" ఇలాంటివి చెబుతారు. ఇవన్నీ బాగున్నా ఆ బండికి బ్రేకులు సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి ఆ డ్రైవరు వేగంగా వెళ్ళగలుగుతాడా? బిక్కుబిక్కుమంటూ అత్యంత నిదానంగా బండి తోలుతాడు. ఎందుకంటే బండి వేగంగా వెళ్తూ క్షేమంగా గమ్యాన్ని చేరాలంటే బ్రేకులు చాలా అవసరం. ఎంత నియంత్రణ ఉంటే అంత వేగంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన జీవితం కూడా అంతే. ఎంత నియంత్రణ ఉంటే అంత ఉన్నతికి చేరగలుగుతాం. నేలమీద నడిచేవాడు చాలా తేలికగా నడిచేస్తాడు. కానీ కొండను ఎక్కేవాడు ప్రతి అడుగూ పట్టి పట్టి జాగ్రత్తగా వెయ్యాలి. అప్పుడే పైకి చేరగలుగుతాడు. ఏమాత్రం పట్టు తప్పినా అధోగతే.
ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆంజనేయ అష్టోత్తర శతనామ స్తోత్రం కాళికా రహస్యం అనే గ్రంథంలోనిది. ఆంజనేయుడు ఎలాగైతే అనంతశక్తి సంపన్నుడైనా ఎప్పుడూ శ్రీరామచంద్రుని ఆజ్ఞకు లోబడి ఉంటాడో అలాగే అనంతశక్తి స్వరూపిణి అయిన కాళీమాత కూడా తన ప్రభువైన పరమేశ్వరుని వద్ద ఒదిగి ఉంటుంది. రాక్షస సంహారం చేసి అంతులేని కోపంతో లోకాలనన్నింటినీ భీతావహులను చేస్తున్న ఆ తల్లి తన పతిదేవుని దేహం కాలికి తగలగానే ఒక్కసారిగా శాంతించి భవతారిణీ స్వరూపాన్ని పొంది లోకాలకు అనుగ్రహదాయిని అయ్యింది.
అనంత శక్తి సంపన్నులయినా ఏమీ తెలియని పసిపాపలా ఒదిగి ఉండే తత్త్వం కలిగిన అటువంటి హనుమంతుడు, కాళీమాతల మేలు కలయిక అయిన స్వరూపం మన గురుదేవులు శ్రీ హనుమత్ కాళీ వర ప్రసాద బాబూజీ మహరాజ్ వారు. వారినుంచి మనం మొదటగా నేర్చుకోవలసినది ఈ వినయాన్నే. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రతి రంగంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో ప్రతిభావంతులైన వారు వారి సమయం వచ్చినప్పుడు ఈ జగన్నాటక రంగం నుంచి నిష్క్రమిస్తే ఆయా రంగాలేమి అక్కడితో ఆగిపోవట్లేదు కదా! వారి స్థానంలో మరొకరు ఆ ప్రతిభను అందిపుచ్చుకుంటున్నారు. అందరిలో ప్రతిభారూపంలో భాసించే ఆ పరబ్రహ్మ తత్త్వాన్ని గుర్తించిననాడు మనం కూడా అహంకారంతో ఎగరకుండా వినయం మన సహజ భూషణమై ప్రకాశిస్తాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి