గురుదేవులు అంటే భవరోగ వైద్యులు అని మనందరికీ తెలిసిందే కదా! భవం అంటే పుట్టుక. అంటే ఈ సంసారచక్రంలో మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఉండటమే భవరోగం. ఈ రోగానికి మూలకారణం అజ్ఞానం. అలాగే కామక్రోధాది ఆరు దుర్గుణాలు, అహంకార మమకారాలు ఈ రోగ లక్షణాలు. శారీరక రోగం వచ్చినవాడు తాను మాత్రమే బాధపడితే, ఈ భవరోగం వలన దుర్గుణాలు ప్రేరేపించినవాడు తన చుట్టూ ఉన్నవారందరినీ బాధపెడతాడు.
సాధారణంగా రోగం వచ్చినవాడు తనకు తెలిసిన మందులు వాడటమో, లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పినవో, ఎక్కడైనా చదివినవో మందులు వాడటమో చేస్తాడు. అప్పటికీ రోగం తగ్గకపోతే వైద్యుని దగ్గరకు వెళతాడు. ఆ రోగం తీవ్రత తక్కువగా ఉండి, రోగి తాను చెప్పిన పథ్యాన్ని పాటిస్తూ మందులు సరిగా వేసుకుంటాడని నమ్మకం కలిగితే వైద్యుడు అతనికి మందులిచ్చి, తగిన జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపేస్తాడు. అదే రోగం కొంచెం ఎక్కువగా ఉండో, లేక రోగి సరిగ్గా సూచనలు పాటించడనే అనుమానం కలిగితేనో అతనిని వైద్యశాలలోనే ఒక గదిలో ఉంచి తామే పర్యవేక్షిస్తూ రోగం తగ్గేంతవరకు వైద్యం చేస్తారు. ఇంకా రోగం బాగా ముదిరిపోయి నిరంతర పర్యవేక్షణ అవసరమైన రోగినయితే ఐసియూలో పెట్టి వైద్యం చెయ్యవలసి వస్తుంది. ఇలా రోగ తీవ్రతను బట్టి, రోగి మానసిక పరిపక్వతను బట్టి వైద్యం చేసే విధానం మారుతుంది కానీ ఆ వైద్యునికి ఏ ఒక్క రోగి పట్ల ప్రత్యేక అభిమానం కానీ, మరొక రోగి పట్ల ద్వేషం కానీ ఉండవు.
అలాగే మరి భవరోగ వైద్యులయిన గురుదేవులను ఆశ్రయించిన శిష్యులలో కుడా రోగ తీవ్రత, మానసిక పరిపక్వత, రోగం తగ్గించుకోవాలనే పట్టుదల వివిధ స్థాయిలలో ఉంటుంది. అసలు చాలామందికి తమకు ఒక రోగం ఉన్నదనే తెలియకపోవచ్చు. కానీ గురువుకు శిష్యునికి ఉండే సంబంధం ఎన్నో జన్మలనుంచి పెనవేసుకొని ఉంటుంది. శిష్యునికి తెలిసినా, తెలియకపోయినా, సాధన సరిగా చేసినా, చేయకపోయినా గురువు మాత్రం శిష్యుని విడిచిపెట్టడు. అయితే తన భవరోగాన్ని గుర్తించి, గురు ముఖస్తుగా వచ్చిన ఏ చిన్న వాక్యాన్ని అయినా గురు ఆజ్ఞగా భావించి, శిరసావహించి చక్కగా సాధన చేసుకొనే ఉత్తమ శిష్యుడు గురువుకు భౌతికంగా ఎంతో దూరంలో ఉన్నా తరిస్తాడు.
కానీ కామక్రోధాది గుణాలు తరచుగా విజృంభిస్తూ, గురుసన్నిధి ఒక్క క్షణం దూరమైనా మళ్ళీ మాయలో పడిపోయి తాను దిగజారిపోతూ, ఇతరులకు కూడా కష్టాన్ని కలిగించే స్థితిలో ఉన్న శిష్యుని మరి గురువు నిరంతరం తన సన్నిధిలో ఉంచుకొని పర్యవేక్షించవలసిందే కదా. అయితే మానసిక పరిపక్వత లేని ఆ శిష్యుడు తనను గురువు నిరంతరం సన్నిధిలో ఉంచుకోవడాన్ని తన గొప్పగా భావించి, అహంకారాన్ని పెంచుకొని, ఇతర శిష్యుల మీద పెత్తనం చలాయించాలని చూసే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే గురుదేవులు మాత్రం ఆ శిష్యుని ఎలాగైనా ఉద్ధరించి తరింపజేయాలనే చూస్తారు. 'తనకు అత్యంత సమీపంలో ఉంటేనే ఇంతగా మాయకు వశుడైపోతున్నాడే, ఇక తనకు దూరమైతే ఇంకెంత దిగజారుతాడో' అని బాధ పడతారు.
అయితే ఈ విషయాన్ని గుర్తించని ఇతర శిష్యులు గురువును అపార్థం చేసుకుంటారు. ఆ శిష్యుడు ఎన్ని దుష్కార్యాలు చేస్తున్నా గురువు అతనిని దండించడం లేదని అలుకబూనుతారు. భవరోగ వైద్యులయిన గురుదేవుల వద్ద శిక్షణే కానీ శిక్ష ఉండదు. పద్మం వికసించినప్పుడు తుమ్మెద ఎంతో దూరంనుంచి వచ్చి ఆ మకరందాన్ని గ్రోలి ఆ మాధుర్యాన్ని చక్కగా ఆస్వాదించి ఎగిరిపోతుంది. అదే పద్మం మొదలులో నివశించే కప్పకి ఆ మకరందంలోని మాధుర్యం తెలియకపోగా, తాను బురదలో పొర్లుతూ ఆ బురదనే పద్మానికి పూయాలని చూస్తుంది. అయితే అది పద్మానికి అంటుకోదు కదా! కానీ ఈ తుమ్మెద ఆ కప్పమీద కోపం తెచ్చుకొని దానికి ఆశ్రయం ఇచ్చినందుకు పద్మం వద్దకు రాకుండా దూరమైపోతే ఎవరికి నష్టం?
అలాగే గురుదేవులు ఎందుకు ఒక శిష్యుని తమకు దగ్గరగా ఉంచుకుంటున్నారో తెలుసుకోకుండా, ఆ శిష్యుని వలన తనకు ఏదో బాధ కలిగిందని, ఆ శిష్యుని గురువులు తప్పక దండించి తీరాలని బలంగా విశ్వసించి, అది జరగనందుకు తాను గురువుకు దూరమైపోతే నష్టం ఎవరికి? అలా కాక, తనకు కలిగిన కష్టాన్ని గురుదేవుల సమక్షంలో విన్నవించుకొని, ఆ శిష్యునిపై తీసుకోవలసిన చర్యను గురుదేవులకే వదిలిపెట్టి, నిర్వికారంగా తన వంతు సేవ తాను చేసుకుంటే తనకే మంచిది. ఏ శిష్యులకు ఎలా శిక్షణ ఇవ్వాలో గురుదేవులకు మించి ఎవరికి తెలుస్తుంది?
ఒకసారి శ్రీ బాబూజీ మహరాజ్ వారు శిష్యులందరికీ ప్రసాదం పెట్టిన తరువాత వారందరూ అక్కడే ఉన్న వాష్‌బేసిన్‌లో చేతులు కడుక్కుంటున్నారు. శ్రీ లలితానంద సరస్వతీ స్వామిని వారి వంతు వచ్చేసరికి శ్రీ బాబూజీ మహరాజ్ వారు తీవ్ర స్వరంలో "ఈ వాష్‌బేసిన్ నాకోసం కానీ అందరూ ఉపయోగించడానికి కాదు. బయటకు వెళ్ళి అక్కడ ఉన్న వాష్‌బేసిన్‌లో చేతులు కడుక్కో" అని హెచ్చరించారు. అక్కడున్న శిష్యులు అందరూ విస్తుపోయారు. ఆమె బయటకు వెళ్ళగానే శ్రీ గురుదేవులు "చూశారా? ఆమె ముఖంలో కానీ, మనస్సులో కానీ ఇంతమంది ముందు నన్ను అవమానిస్తున్నారు అని గానీ, లేదా వారందరికీ లేని అభ్యంతరం నా విషయంలోనే ఎందుకు అనే భావం కానీ ఏ మాత్రం కలుగలేదు. ఆమె అంతటి స్థితప్రజ్ఞ స్థితిని సాధించారు. కనుకనే నేను అలా అనగలిగాను. అదే మీలో ఎవరినైనా నేను అలా అంటే మీరు మళ్ళీ రెండవరోజు నా దగ్గరికి వస్తారా? శిష్యుని మానసిక పరిపక్వతను బట్టే గురుదేవుల ప్రవర్తన ఉంటుంది" అని వివరించారు.
కాబట్టి ఏ శిష్యునికి ఎలాంటి శిక్షణను ఇవ్వాలో, ఎవరి తప్పులను ఎలా సరిదిద్దాలో గురుదేవులకే వదిలిపెట్టి సర్వ సమర్పణ భావంతో వారిని సేవించుకొనడమే శిష్యుని కర్తవ్యం. ఏ రోగికి ఎలాంటి వైద్యం చేయాలో వైద్యునికి ఇంకొక రోగి చెప్పలేడు కదా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి