నిరాకార పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాతను మనం ఈ నవరాత్రి ఉత్సవాలలో సాకారంగా వివిధ ఆకృతులలో పూజించుకుంటూ ఉంటాం కదా! అందులో ముఖ్యమైన మూడు ఆకృతులు ముగురమ్మలుగా పిలువబడే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఇందులో మహాకాళి రూపిణి అయిన పార్వతీ/దుర్గాదేవి గురించి మనం అనేక కథలు దేవీభాగవత రూపంలో ఈ పదిరోజులూ వింటూనే ఉన్నాం. అలాగే సరస్వతీదేవి గురించి కూడా మూలా నక్షత్రం రోజున మనం విశేషంగా చెప్పుకుంటాం. అయితే లక్ష్మీదేవి గురించి మాత్రం మనం అంతగా చెప్పుకోం. ఆధ్యాత్మిక సాధనలో ఉన్న మనకు ఐశ్వర్యంతో పెద్దగా పనిలేదని ఒక ఆలోచన కావచ్చు.
అయితే లక్ష్మీ కటాక్షం కేవలం సంపదకు మాత్రమే కాదు. మనం కడుపునిండా అన్నం తినగలుగుతున్నాం అంటే అది ధాన్యలక్ష్మి కటాక్షం. ఆ అన్నం సంపాదించుకోవడానికి కావలసిన చదువు అబ్బిందంటే అది విద్యాలక్ష్మి కటాక్షం. అలాగే ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి ఇలా ఈ సృష్టిలో మనకున్నవన్నీ ఆ తల్లి దయవలన కలిగినవే. వీటన్నిటికన్నా ఉత్కృష్టమైనది, మనం కాంక్షించవలసినది మోక్షలక్ష్మి అనుగ్రహం.
ఈశానాం జగతోస్య వేంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్ క్షాంతి సంవర్ధినీం
పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వన్దే జగన్మాతరం||
ఈశానాం జగతోస్య వేంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం - ఈ జగత్తు అంతటికీ ఈశ్వరుడు, వేంకటపతి అయిన విష్ణువుకు అత్యంత ఇష్టురాలు ఆ తల్లి. ఎంతటి ప్రేయసి అంటే - వేదరూపంలో ఉన్న విద్యాలక్ష్మిని సోమకాసురుడు అపహరిస్తే స్వామి మత్స్యావతారం ఎత్తాడు. దూర్వాసుని శాపంతో ఇంద్రుని వద్దనున్న ధనలక్ష్మి అంతా సముద్రం పాలైపోతే తిరిగి ఆ తల్లిని పొందటం కోసం కూర్మావతారం ఎత్తాడు. భూమాత రూపంలో ఉన్న ధాన్యలక్ష్మిని హిరణ్యాక్షుడు బాధిస్తుంటే వరాహావతారం ఎత్తాడు. చెంచులక్ష్మి రూపంలో ఉన్న అమ్మను పొందటానికి నరసింహావతరం ఎత్తాడు. ముల్లోకాల సంపద రూపంలో ఉన్న ఐశ్వర్యలక్ష్మిని బలి చక్రవర్తి నుండి విడిపించటానికి వామనావతారం, త్రివిక్రమావతారం ఎత్తాడు. అందరికీ సమంగా చెందవలసిన లక్ష్మి అనుగ్రహాన్ని రాజులు తమవద్దనే బంధించి అహంకారులై ప్రవర్తిస్తుంటే పరశురామావతారం ఎత్తాడు. ఇక రామావతరంలో అయితే అమ్మతో కలిసే వచ్చి, ఆ అమ్మ దూరమైనందుకు ఎంత వేదన అనుభవించాడో చెప్పలేం. ఆ అమ్మను తిరిగి పొందటానికి ఎన్నో అసాధ్యమైన పనులు చేశాడు. కృష్ణావతారంలో ఎంతో మంది రాజులతో, చివరికి బావమరిదితో కూడా యుద్ధం చేసి మరీ అమ్మను దక్కించుకున్నాడు. మోక్షలక్ష్మి అనుగ్రహం పొందే ఆలోచన లేక ఇతర లక్ష్ముల కోసం ప్రాకులాడుతూ చివరికి కష్టాలతో మట్టిపాలైపోయే మనుష్యులకు మోక్షమార్గాన్ని అందించటానికై బుద్ధావతారం ఎత్తాడు. అధర్మం అతిగా ప్రబలిన చోట లక్ష్మి నిలువలేదని ఆ అధర్మాన్ని సమూలంగా రూపుమాపటానికి కల్కి అవతారం ఎత్తాడు. అమ్మకు దూరమై క్షణమైనా నిలువలేనని వైకుంఠాన్ని కూడా విడిచిపెట్టి వేంకటపతి అయ్యాడు.
స్వామికి అమ్మ అంటే ఎంత ప్రేమో, అమ్మకు స్వామి మీద అంతకంటే ఎక్కువ ప్రేమ. తద్వక్షస్థల నిత్యవాస రసికాం - ఎప్పుడూ ఆ స్వామి వక్షస్థలంలోనే నివసించడమే అమ్మకు అత్యంత ప్రీతికరం. తనను అడవులపాలు చేసినా, పదహారు వేలమంది సవతులను తెచ్చినా ఏనాడూ కోపించని అమ్మ తన స్వామికి అవమానం జరిగితే మాత్రం తట్టుకోలేకపోయింది. అది కూడా తన శాశ్వత నివాస స్థానమైన వక్షస్థలం మీద ఒక ఋషి తంతే భరించలేకపోయింది. అలిగి కొల్హాపురానికి వెళ్లిపోతే అంతటి స్వామి కూడా భూమిపైకి దిగివచ్చి ఎంతో తపస్సు చేసి మళ్ళీ ఆవిడను దక్కించుకోవలసి వచ్చింది.
తత్ క్షాంతి సంవర్ధినీం - స్వామిలో ఓర్పును వృద్ధి పొందించేది అమ్మ. ఇప్పుడైతే రోజులు మారిపోయాయి కానీ తరతరాలుగా, మన చిన్నప్పుడు కూడా అందరికీ నాన్న అంటే హడల్. ఒక తప్పు చేసినా, లేదా నాన్నను ఏదైనా అడగలన్నా అమ్మ కొంగు చాటున నిలుచోటమే తెలుసు. నాన్న కోపాన్ని చల్లబరిచి ఆయనలో ఓర్పును కలిగించి మనకు అనుకూలంగా మార్చేది అమ్మే కదా! అసలు 'స్త్రీ బుద్ధిః ప్రళయాంతకః' అని ఆడవాళ్ళ మాట వింటే ప్రళయాలు సృష్టిస్తారని తప్పుగా అర్థం చెబుతారు కానీ అక్కడ 'ప్రళయ కారకః' అనలేదు కదా, 'ప్రళయాంతకః' అన్నారు కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. భర్తో, కొడుకో అప్పో తప్పో చేస్తే కోపంగా ఇంటిమీదకు వచ్చిన వాడిని కూడా 'అన్నయ్యగారూ! ఈ గొడవలన్నీ ఎప్పుడూ ఉండేవే! ఇదిగో ఈ కాఫీ తీసుకోండి. వదినగారు, పిల్లలు బాగున్నారా?' అని ఆ ఇంటి గృహలక్ష్మి నాలుగు అనునయ మాటలు మాట్లాడేసరికి అంతటి ప్రళయం కూడా అంతం అయిపోతుంది.
పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం - అమ్మ తన రెండు నునులేత చేతులలో పద్మాలను పట్టుకొని ఉంటుంది. అలాగే ఆవిడ ఆసనం కూడా పద్మమే. అసలు దేవతలందరూ పద్మంలో కూర్చోవటమో, లేదా వారి ముఖాలను, నేత్రాలను, చేతులను, పాదాలను ఇలా ప్రతి అవయవాన్ని పద్మంతో పోల్చటం ఎందుకంటే అందులో ఏదో ఒక ముద్రమీద మన మనస్సు తుమ్మెదలా అతుక్కుపోవాలని.
శ్రియం - సరే, ఇక శ్రీ అంటే లక్ష్మీదేవే కదా!
వాత్సల్యాది గుణోజ్వలాం - అమ్మకు ఈ సృష్టిలోని ప్రతి జీవిపైన ఎంతటి వాత్సల్యమో! శక్తిస్వరూపిణియైన పార్వతీదేవి అనేక రూపాలలో ఎందరో రాక్షసులను సంహరించిన కథనాలు మనం ఎన్నో వింటూ ఉంటాం, కానీ లక్ష్మీదేవి ఎవరిమీదా ఆగ్రహం చూపించిన సందర్భం మనకు కనబడదు. లక్ష్మీ అష్టకంలో చాలామంది 'డోలాసుర భయంకరి' అని చదువుతారు కానీ నిజానికి డోలాసురుడు అనే రాక్షసుడు ఎవరూ లేరు. అది 'కోలాసుర భయంకరి'. కోల అంటే వరాహం. అడవిపంది రూపంలో ఉన్న ఆ రాక్షసుడు లోకాలను పీడిస్తుంటే, స్త్రీ చేతిలోనే సంహరింపబడాలని వాడికి ఉన్న వరం కారణంగా తప్పనిసరి పరిస్థితులలో మహాలక్ష్మి అమ్మ వాడి అశాశ్వతమైన దేహాన్ని సంహరించినా మళ్ళీ తన వాత్సల్యంతో ఆ బిడ్డ పేరును శాశ్వతం చేస్తూ ఆ ప్రదేశాన్ని కొల్హాపురంగా మార్చి తాను శాశ్వతంగా అక్కడ కొలువై ఉండిపోయింది.
భగవతీం - అమ్మ స్వయంప్రకాశ స్వరూపిణి. మనం త్రిమూర్తుల గురించి గొప్పగా చెప్పుకొని ముగ్గురమ్మలు ఏదో వారి భార్యలు అని తేలిగ్గా అనుకుంటాం కానీ ఆ త్రిమూర్తులకు శక్తినిచ్చేది, వారి వారి విధులను నిర్వర్తింపజేసేది ఆ తల్లులే. అటువంటి జగన్మాతయైన మహాలక్ష్మి తల్లికి నమస్కారం - వన్దే జగన్మాతరం.
సాధారణంగా ఎవరైనా స్త్రీ సంప్రదాయకమైన వేషభాషలలో కనిపిస్తే ఆవిడ ముఖంలో లక్ష్మీకళ ఉట్టిపడుతోంది అంటాం. ఉట్టిపడటం అంటే పొయ్యిమీద పెట్టిన పాలు పాత్రలోనుంచి కొద్దిగా బయటకు పొంగటంలాంటిది. అలాగే మానవుడు కూడా తనకున్న సంపదనంతా పంచిపెట్టేయడు. తన పాత్ర నిండిన తరువాత, లోపల ఇంకేదో చేయాలనే వేడిపుడితే, ఆ సంపదలో కొంత దానధర్మాల రూపంలో బయటకు పొంగుతుంది అంతే. కానీ జగన్మాత అలా కాదు. ఆవిడ 'వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచన' - అమ్మ ముఖంలో లక్ష్మీ ప్రవహిస్తూ ఉంటుంది. అంటే అక్కడ వచ్చినది వచ్చినట్లుగా ఇచ్చివెయ్యటమే కానీ దాచుకోవటం ఉండదు. అమ్మ వదనంలోని ఆ లక్ష్మీ ప్రవాహంలో రెండు చేపలు అటూ ఇటూ కదులుతూ ఉంటాయిట. ఆ చేపలే అమ్మ కళ్ళు. ఎప్పుడు ఏ బిడ్డకు ఈ సంపద అవసరమౌతుందో, ఆ క్షణంలోనే ఆదుకుందామని అమ్మ ఎప్పుడూ అటూ ఇటూ చూస్తూనే ఉంటుంది. మామూలుగా ఏదైనా ఆలయానికి ఒక గోపురం ఉంటుంది. గోపురం అంటే ఆలయానికి ప్రవేశద్వారం కదా. బయట అహంకారంతో విర్రవీగే జీవులందరూ ఈ ఎత్తైన గోపురం క్రిందకు వచ్చేసరికి తాము ఎంతటి అల్పులో అర్ధమైపోయి శిరస్సు దానంతటదే భగవంతుని ముందు వంగిపోతుంది. అయితే మధురైలోని మీనాక్షీ అమ్మ ఆలయానికి ఒకటి, రెండు కాదు, ఏకంగా పధ్నాలుగు గోపురాలు ఉన్నాయి. అంటే తన చేపలవంటి కళ్ళతో ఎప్పుడు ఏ బిడ్డ తన దగ్గరకు వస్తాడో అని ఆ అమ్మ నిరంతరం అటూ ఇటూ చూస్తూ ఏకంగా తనను చేరుకోవటానికి అన్నివైపులా పధ్నాలుగు ద్వారాలు పెట్టుకుంది.
ఇక ముగ్గురమ్మల దగ్గరకు వస్తే విద్యకు, జ్ఞానానికి అధినేత్రి అయిన సరస్వతీదేవి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి సేవ చేస్తున్నట్లు ఎక్కడా మనం చూడం. అంటే ఈ సృష్టికి పూర్వం నుంచి, సృష్టి ఉన్నా, లేకపోయినా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది జ్ఞానమే కానీ, అది సృష్టికి లోబడి వచ్చిపోయేది కాదు. అలాగే శక్తిస్వరూపిణి అయిన పార్వతీదేవి కూడా లయకారకుడైన పరమేశ్వరుని ప్రక్కన కూర్చున్నట్లుగానో, లేక ఆయనతో కలిసి నృత్యం చేస్తున్నట్లుగానో కనిపిస్తుంది కానీ, ఆయనను పూజిస్తున్నట్లు చాలా అరుదుగా కనిపిస్తుంది. అంటే సృష్టి అంతా లయించిపోయినా కానీ శక్తికి నాశనం లేదు. అంతెందుకు మన కళ్ళముందే ఎందరో కవులు, రచయితలు, గాయకులు, శాస్త్రవేత్తలు ఇలా ఎంతో ప్రతిభ కలవారు కాలగర్భంలో కలిసిపోతున్నారు కానీ, అంతటితో ఆయా కళలు కానీ, శాస్త్రాలు కానీ నశించిపోతున్నాయా? ఆ ప్రతిభ, లేక శక్తిని పుణికిపుచ్చుకొని దానిని ముందుకు తీసుకెళ్ళడానికి మరొక వ్యక్తి తయారవుతాడు. కానీ సంపదకు అధినేత్రి అయిన లక్ష్మీదేవి మాత్రం ఎప్పుడు సృష్టిని నడిపించే నారాయణమూర్తితో కలిసి కనిపించినా ఆయనకు పాదసేవ చేస్తూనే కనిపిస్తుంది. అంటే సృష్టి, లేదా ఒకవ్యక్తి జీవితం నడవటానికి సంపద కావాలి కానీ, సంపద కోసమే జీవితం కాకూడదు అనే సందేశాన్ని అమ్మ మనకు అందిస్తోంది.
మనందరం ఎంతగా నారాయణ స్మరణ చేసుకుంటే అంతగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి