26, జనవరి 2023, గురువారం

లక్ష్మక్క

ఆశ్రమ భక్తులందరూ 'లక్ష్మక్క' అని ఆత్మీయంగా పిలుచుకొనే శ్రీ రామలక్ష్మీ ప్రసాద మాతాజీవారు శ్రీ గురుసాయుజ్యం చెందారు. విధివశాత్తు పిన్న వయసులోనే తమకు కలిగిన వైధవ్యాన్ని శాపంగా భావించక రామభక్తిలో లీనమై తద్వారా నిరంతర గురురామ సేవాభాగ్యమనే మహత్తర వరాన్ని పొందిన ధన్యజీవి లక్ష్మక్క. శ్రీగురుదేవులను ఆశ్రయించి తమ భక్తిప్రపత్తులతో వినయవిధేయతలతో వారిని మెప్పించి వారికి అంతేవాసిగా పరిచర్యలు చేసే అర్హతను, శ్రీవారి నిత్య అర్చామూర్తులను పూజించుకొనే భాగ్యాన్ని పొందారు. అంతేకాక భౌతిక బంధాలపై వైరాగ్యాన్ని సాధించి, తమ మాతృమూర్తి అంత్యకాలంలో తాము ఆమె చెంత ఉండి ఆమెకు భ్రాంతిని కలిగించడం కంటే గురుదేవుల సేవలో ఉండి తద్వారా తమకు, తల్లిగారికి కూడా జన్మరాహిత్యాన్ని సాధించడం ఉత్తమమనే వివేకాన్ని కూడా సాధించిన గొప్ప ఆధ్యాత్మిక సాధకురాలు లక్ష్మక్క.

నిజానికి తాము కోటీశ్వరురాలైనా ఆశ్రమ ప్రారంభోత్సవానికి కేవలం మూడు చీరలతో వచ్చిన లక్ష్మక్క శ్రీగురుదేవులు తనకు శ్రీ బాబూ విజ్ఞానమందిర సంరక్షణ భారాన్ని, ‘అమ్మగది’లో పూజాభాగ్యాన్ని ప్రసాదించడంతో అప్పటినుండి పూర్తి నిరాడంబర జీవితాన్ని అవలంబించి గత యాభై సంవత్సరాలుగా తమ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. విజ్ఞానమందిరం, ఆలయాల పరిధి దాటి ఎన్నడూ బయటకు రాకపోయినా, ప్రతిరోజూ ఏ అర్చామూర్తికి ఏ పూల మాలలు సిద్ధం చేయాలి, ఎటువంటి వస్త్రాలు, ఆభరణాలు అలంకరించాలి వంటి నిర్ణయాలతో పాటు పూజకు, అభిషేకాలకు కావలసిన సామగ్రి సమస్తం సిద్ధం చేయడం, ఏ సమయానికి అది అందించడం లక్ష్మక్కకే చెల్లు.

శ్రీ బాబూజీ మహరాజ్ వారు ఎప్పుడూ ‘ఆశ్రమ సేవయే గురుసేవ’ అని చెప్పేవారు. వారు ఎక్కడికైనా సత్సంగాలకు బయలుదేరినప్పుడు అవసరానికి మించిన భక్తులు వారితో ప్రయాణమైతే ‘సత్సంగానికి మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉండి ఆశ్రమాన్ని చూసుకుంటాను’ అనేవారు. ‘అందరూ బయటకు వెళ్ళిపోతే ఆశ్రమ సంరక్షణ ఎవరు చూసుకుంటారు?’ అని మందలించేవారు. శ్రీగురుదేవుల ఈ వాక్కులనే మహామంత్రంగా స్వీకరించిన లక్ష్మక్క ఎన్నడూ ఆశ్రమాన్ని విడిచి వెళ్ళలేదు. అలాగే తమను కలిసిన భక్తులను కూడా ఎక్కువగా ఆశ్రమంలోనే ఉండమని ప్రోత్సహించేవారు.

భక్తుల సేవయే భగవంతుని సేవ అని బలంగా నమ్మిన లక్ష్మక్క ఆశ్రమానికి బయటనుంచి వచ్చిన భక్తులకు పూజాదికాలకు సామగ్రిని సమకూర్చడం, తీర్థ ప్రసాదాలను, మంత్రపూతమైన కుంకుమ అక్షతలను అందించడం వంటి సేవలను ఎంతో ఉత్సాహంగా చేసేవారు. అలాగే ఏ చెట్టుకు కానీ, గోవుకు కానీ వ్యాధి సోకి క్షీణిస్తే వాటికి పెద్దమొత్తంలో జగన్మాత తీర్థం పోయించి వాటిని మళ్ళీ పూర్వస్థితికి తీసుకొచ్చేవరకు విడిచిపెట్టేవారు కాదు. అయితే ఏ సేవ చేస్తున్నా కర్తృత్వభావన లేక, సేవ చేసేది, చేయించేది, ఆ సేవను అందుకొనేది శ్రీగురుదేవులే అన్న దృఢవిశ్వాసాన్ని కలిగి ఉండటం విశేషం.

మా చిన్నప్పుడు దసరా వంటి ఉత్సవాలకు ముందు శ్రీ బాబూ విజ్ఞాన మందిరాన్ని శుభ్రపరచడానికి వెళితే అక్కడ అన్ని పనులూ లక్ష్మక్కే దగ్గరుండి చేయించేవారు. ఫ్యానుల్ని, లైట్లను సబ్బునీటితో శుభ్రపరచడం, బూజులు దులపడం ఇలా ఏ పని చేసినా మేము అంతా శుభ్రం అయిపోయింది అని తృప్తి పడిన తరువాత ఆవిడ ఏ మూలో బూజు చూపించడం, ఏ ఫ్యాను రెక్కమీదో ఇంకా దుమ్ము చూపించడం వంటివి చేసేవారు. పైగా ‘శ్రీ బాబూజీ మాతో ఇలాగే చేయించేవారు. మేము అంతా శుభ్రపరచిన తరువాత వారు ఎక్కడో ఒకచోట దుమ్మూ, బూజో చూపించేవారు’ అని చెప్పేవారు. అలాగే దసరా ఉత్సవాలు ముగిసిన తరువాత అంతవరకు ఉపయోగించిన షామియానాలు, కార్పెట్లు వంటివి దగ్గరుండి ఏ మడతలోనూ ఒక్క అంగుళం కూడా తేడా రాకుండా జాగ్రత్త పరచేవారు. ఇలా రోజు మొత్తంలో తాము ఏ పని చేస్తున్నా ‘ఇది ఇలా చేస్తేనే బాబూజీకి ఇష్టం, ఈ పని బాబూజీ ఇలా చేయించేవారు’ అనుకుంటూ నిరంతరం బాబు నామస్మరణలోనే గడిపేవారు. ఇంతకంటే భక్తియోగం, కర్మయోగం ఇంకొకటి లేదు కదా!

ఆశ్రమ సేవ విషయంలో అవతలివారు ఎంతటి ప్రముఖులైనా ఏమాత్రం భయపడకుండా సూటిగా, నిష్కర్షగా మాట్లాడటం లక్ష్మక్క ప్రత్యేకత. ‘ఈరోజు పొగిడి రేపు తిట్టే లోకుల మెప్పు పొందటానికి ప్రయత్నిస్తావా? లేక నిరంతరంగా, నిర్హేతుకంగా తన కృపారసాన్ని వర్షించే భగవంతుని మెప్పు పొందటానికి ప్రయత్నిస్తావా? ఇందులో ఏది ఉత్తమం?’ అని శ్రీగురుదేవులు తరచుగా చేసే హెచ్చరికను నరనరాల జీర్ణించుకోవడమే లక్ష్మక్కలోని ఈ నిర్భీతికి కారణం. లోకులు తమను తిట్టుకున్నా, తాము చేసే పని గురుదేవులు మెచ్చే విధంగా ఉంటే చాలనేది ఆమె సిద్ధాంతం. తమవద్ద పనిచేసే వారికి కూడా ఆమె ఇదే నూరి పోసేవారు. ‘ఈ మాట ఇలా చెబితే అవతలివారు ఏమైనా అనుకుంటారేమో, లేక తనను తిడతారేమో’ అని ఎవరైనా సంకోచించినప్పుడు లక్ష్మక్క వారిని అనునయిస్తూ, ‘ఈ పని నువ్వు నీకోసం చేయడం లేదు కదా. గురుదేవుల సేవగా భావించి చేసుకుంటున్నావు. మరి ఆ సేవలో ఎవరైనా నిన్ను నిందించినా గురుదేవుల సేవ కోసం ఒక చిన్న మాట పడితే నీకొచ్చిన నష్టమేమిటి?’ అని ప్రశ్నించి వారిలో కూడా ఈ వివేకాన్ని రగిలించేవారు.

ఆశ్రమ స్థాపన జరిగిన క్రొత్తలో అంతగా వసతులు ఉండేవి కావు. శ్రీగురుదేవుల సేవకై ఒక్కటే టేబల్ ఫ్యాన్ ఉండేది. శ్రీ బాబూజీ మహరాజ్ వారు క్రింద అమ్మగదిలో పూజ చేసుకొనేటప్పుడు లక్ష్మక్క ఆ ఫ్యాన్ క్రిందికి తెచ్చి, మళ్ళీ శ్రీవారు పూజ ముగించి పై అంతస్తుకు చేరుకునేలోగా మూడేసి మెట్లు ఒక్క అంగలో ఎక్కుతూ ఆ ఫ్యానును పైకి చేర్చేవారు. ఇలా దేహాన్ని మరచి నిరంతర తత్పరతతో గురుసేవ చేసుకొన్న శ్రీ లక్ష్మక్క సరిగ్గా వైకుంఠద్వారం తెరచి శ్రీగురునారాయణులు లోకాలకన్నింటికీ దర్శనభాగ్యాన్ని ప్రసాదించే సమయానికి కొద్ది ముందుగానే అందుకు తగిన ఏర్పాట్లు చేయడానికా అన్నట్లు ముక్కోటి ఏకాదశికి కొద్ది ఘడియలు ముందుగా తమ పాంచభౌతిక దేహాన్ని విడిచి సద్గురు సాయుజ్యాన్ని పొందారు.
ఇటువంటి మహాత్ములు చూపిన మార్గంలో నడిచి గురుసేవలో, ఆశ్రమసేవలో, భక్తులసేవలో మన జీవితాలను ధన్యం చేసుకోవటమే మనం వారికి అర్పించగలిగిన ఘన నివాళి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి