26, జనవరి 2023, గురువారం

స్వర్ణోత్సవ కార్యక్రమ విశ్లేషణ

సమర్ధ సద్గురు శ్రీ శ్రీ శ్రీ హనుమత్ కాళీ వరప్రసాద బాబూజీ మహరాజ్ వారు అవ్యాజ కరుణతో మనందరికోసం స్థాపించిన శ్రీకాళీ గార్డెన్స్ ఆశ్రమ స్వర్ణోత్సవాలను ఎంతో వైభవంగా జరుపుకున్నాం. ఈ సందర్భంగా మనం జరుపుకున్న కార్యక్రమాలను ఒకసారి విశ్లేషించుకుందాం.


ఉదయం 3:30 కి సుప్రభాతంతో మన కార్యక్రమాలు ప్రారంభం అవుతున్నాయి. అయితే మనం "కాళీప్రసాద భగవన్ తవ సుప్రభాతం" అని పాడుకుంటున్నా ఇది నిత్యం నిజజాగ్రతలో ఉండే స్వామివారికి మేల్కొలుపు కాదు, మనకు మనం హెచ్చరిక చేసుకొని అజ్ఞాన నిద్రలోనుండి మేల్కొనే ప్రయత్నం.

అనంతరం మనం ఉదయకాల ప్రార్థన చేసుకొంటున్నాం. గాంధీ మహాత్ములు చెప్పినట్లు మన రోజును ఉదయాన్నే తెరచి, రాత్రికి మూసే తాళంచెవి ప్రార్థన. మనం ఆ రోజును ఎటువంటి భావనలతో, ఆచరణతో గడపాలో ఉదయాన్నే గుర్తుచేస్తుంది. అలాగే రాత్రి నిద్రలోకి జారుకునే ముందు మనం ఈ విషయాలను ఎంతవరకు పాటించామో బేరీజు వేసుకుని మరుసటి రోజు మరింత మెరుగ్గా గడపడానికి వేసుకొనే ప్రణాళిక సాయంకాల ప్రార్థన.

మన ఆశ్రమంలో అణువణువూ శ్రీగురుదేవుల పవిత్ర పాదస్పర్శతో పునీతమైనదే. అలాగే ఇక్కడి ప్రతి వృక్షము, గోవు, నెమలి ఇవన్నీ ఎన్నోసార్లు వారి ఆప్యాయమైన పలకరింపుకు నోచుకున్న ధన్యజీవులే. మళ్ళీ ఒకసారి మనందరం ఆ మధురానుభూతులను నెమరు వేసుకుంటూ శ్రీవారి పాదుకలతో ఆశ్రమ ప్రాంగణమంతా పాదుకా ప్రదక్షిణం జరుపుకుంటున్నాం. అనంతరం బ్రహ్మస్వరూపులైన బ్రాహ్మణులచే వేదఘోష ఆశ్రమ వాతావరణాన్ని మరింత పవిత్రమొనరుస్తూ ప్రతిధ్వనిస్తోంది.

నిర్గుణుడౌ ఆదియోగి తానె స్వయాన
సగుణుండై బాబుగా వచ్చె మనకై
సగుణ నిర్గుణ ఏకత్వమును చాట
తిరిగి లింగరూపుడాయె మహాలీలగా

నిర్గుణుడైన మహాదేవుడు మన భక్తిని సిద్ధింపజేయడానికై ఒక ఆకారాన్ని తీసుకొని బాబూజీ అనే నామంతో మనందరి మధ్యకు వచ్చి, మనలను మోక్ష మార్గంలో ముందుకు నడిపి, సగుణ నిర్గుణాల ఏకత్వాన్ని మనకు దృఢంగా నిరూపించడానికై ఆత్మలింగ స్వరూపంలో శ్రీరామలింగేశ్వర స్వామిగా మనకోసం సుప్రతిష్టితులయ్యారు. ఈ ఆలయ విశేషం ఏమిటంటే కులమతాలకు అతీతంగా, లింగభేదాలు లేకుండా శుచిర్భూతులైన ప్రతి ఒక్కరూ ఈ స్వామిని స్వయంగా తాకి అభిషేకం చేసుకోవచ్చు. అయితే ఇంతటి బృహత్కార్యక్రమంలో ఇన్ని వందలమందికి గర్భాలయంలో అభిషేక సేవ కల్పించడం అసాధ్యం కనుక మనందరం ఆ స్వామికి ప్రతిరూపమైన రుద్రాక్షకు అభిషేకం చేసుకొనే అవకాశం కల్పించారు. అయితే శ్రీగురుదశమి నాడు బ్రాహ్మీముహూర్తంలో మనందరం శ్రీ బృందావనంలో వేంచేసి ఉన్న స్వామికి స్వయంగా అభిషేకం చేసుకొనే మహద్భాగ్యం కల్పించబడింది.

రుద్రాక్ష అంటే ఈశ్వరుని వైభవానికి ప్రతీక. స్వయంగా స్వామి కంటినీటినుండి ఆవిర్భవించినది. ఒకసారి పార్వతీదేవి కుమారస్వామికి లక్ష్మీదేవి పుత్రిక అయిన వల్లీదేవిని ఇచ్చి వివాహం చేయమని ప్రస్తావన తీసుకొస్తే లక్ష్మీదేవి "ఇంత ఐశ్వర్యంలో పెరిగిన నా పుత్రికను చర్మాంబరాలు, రుద్రాక్ష మాలలు తప్ప మరేమీ లేని మీ ఇంటికి కోడలిగా ఎలా పంపను?" అని నిరాకరించింది. ఇది జరిగిన కొన్నాళ్ళకు శంకరుని ఆజ్ఞపై పార్వతీదేవి లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి "నేను ఒక వ్రతం చేయ సంకల్పించాను. ఈ రుద్రాక్షకు సరితూగే ధనాన్ని నాకు ఇవ్వవలసిం"దని కోరగా లక్ష్మీదేవి తన ఐశ్వర్యాన్నంతటినీ త్రాసులో ఉంచినా ఆ రుద్రాక్షను తూచలేక తన తప్పును తెలుసుకొని శ్రీవల్లీ కుమారస్వామిల వివాహాన్ని జరిపించింది.

'నా రుద్రో రుద్రమర్చయేత్' రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించడానికి అనర్హుడు. అందుకే ముందుగా మనం మహన్యాసంతో మనలోని సర్వాంగాలలో, అలాగే ప్రకృతిలోని సర్వదిక్కులలో నిండి ఉన్న ఈశ్వర తత్వాన్ని గుర్తించడం ద్వారా మన శరీరాన్ని పవిత్రమొనర్చుకొని పశుపతినాధుడు, మృత్యుంజయుడైన పరమేశ్వరుని ముక్తికాములమై పాశుపత, మృత్యుంజయ మహామంత్రాలతో సంపుటీకరించబడిన ఏకాదశ రుద్రపారాయణతో అభిషేకం జరుపుకుంటున్నాం.

అనంతరం గర్భాలయంలో స్వామి దర్శనం చేసుకుని ఉదయపు ప్రసాదం స్వీకరిస్తున్నాం. ఈ ప్రసాదం శరీరానికి కావలసిన శక్తినిస్తే తదనంతరం సత్సంగంలో లభించే శివపురాణ ప్రవచనం, సద్గురు బోధ మనకు చిత్తోపరతి సుఖాన్ని అందించి, సాధనకు తగిన శక్తిని ప్రసాదిస్తుంది. ఇది ఇక్కడ నిరంతరం జరిగే జ్ఞానయజ్ఞం.

అనంతరం మనం శ్రీగురుదేవులు కొలువై ఉన్న బృందావనంలో స్వామికి వివిధ రకాల పుష్పాలతో లక్షనామార్చన జరుపుకుంటున్నాం. నిజానికి ఈ సృష్టిలోని వివిధ రూపనామాలన్నీ శ్రీగురుదేవులవే. అలాగే వివిధ పుష్పాలతో పాటు పూజాద్రవ్యాలు, ఆ పూజ చేసుకొనే సంకల్పం, శక్తి కూడా వారి ప్రసాదమే. అయితే ఈ పూజా విధానంలో, లేదా ఇన్ని నామాలలో ఏదో ఒక చోట మన మనస్సు నిలిచిపోయి ఆ గురుపరమాత్మలో లీనమైతే అంతకంటే గురుపూజకు సార్ధకత లేదు.

పూజానంతరం మనం లోకసంరక్షణార్థం మళ్ళీ పాశుపత, మృత్యుంజయ సంపుటితమైన రుద్రాది మంత్రాలతో యజ్ఞం నిర్వహిస్తున్నాం. నిజానికి యజ్ఞంలో వ్రేల్చే సమిధలు, యజ్ఞకర్త, ఋత్విజులు, యజ్ఞకుండం‌, అగ్నిదేవుడు అంతా శివస్వరూపమే. అది గుర్తించి చేసిననాడు మనం నిజంగా మృత్యుంజయ స్థితిని పొందుతాం.

ఇక యజ్ఞం అనంతరం మనం ఆ విరాట్పురుషుని వైభవాన్ని స్తుతిస్తూ మహా మంత్రపుష్పం సమర్పించి స్వామికి వివిధ రకాల హారతులు సమర్పిస్తున్నాం. ఇందులో ముందుగా ఒక జ్యోతితో కూడిన కుంభహారతి - ఈ స్థూల శరీరమే కుంభం. దీనిని స్వామి సేవలో సమర్పిస్తూ, ఇందులో వెలుగుతున్న ఆత్మజ్యోతిని గుర్తిస్తూ హారతిస్తున్నాం. రెండవది కూడా ఒక జ్యోతితో కూడిన గజహారతి - ఏనుగు తమోగుణానికి ప్రతీక. మనలోని తమోగుణం పటాపంచలు అయితేకానీ లోపలి ఆత్మజ్యోతి కొద్దిగానైనా దర్శనం కాదని గుర్తిస్తూ ఆ తమోగుణాన్ని స్వామి పాదాలచెంత సమర్పించుకుంటున్నాం.

ఇక మూడవది రెండు జ్యోతులతో కూడిన ఉష్ట్రహారతి - ఒంటెను తమోగుణ సుఖానికి ప్రతీకగా శ్రీగురుదేవులు చెప్పేవారు. ఒంటె ముళ్ళకోరను నములుతూ ఉంటుంది. ఆ ముళ్ళు తన నోటిలో గ్రుచ్చుకొని తన రక్తమే కారుతూ ఉంటే, అదేదో ఆ ముళ్ళకోరనుండి వస్తున్న రసమని భ్రమపడుతూ ఆస్వాదిస్తూ ఉంటుంది. చివరికి నోరంతా గాయాలై కష్టపడుతుంది. తమోగుణంతో మనం ఈ లోకంలో అనుభవించే సుఖాలు ఇలాగే ఉంటాయి. వాటిలో ఎటువంటి సుఖమూ లేకపోగా, వాటివల్ల కలిగే కష్టాలనే సుఖాలుగా మనలను భ్రమింపజేస్తూ ఉంటాయి. అలాగే ఒక వ్యక్తి గుడారంలో కేవలం తల మాత్రం పెట్టుకోవడానికి చోటు అడిగిన ఒంటె చివరికి ఆ గుడారాన్ని పూర్తిగా ఆక్రమించి అతనిని బయటకు నెట్టివేసిన కథ మనందరం వినే ఉన్నాం కదా! అలాగే ఈ తమోగుణం మెల్లగా మన మనస్సులో చోటుకోసం ప్రయత్నిస్తుంది. ఏమాత్రం చోటు కల్పించినా, మనం మహాత్ముల చెంత ఉన్నామా, సత్సంగంలో ఉన్నామా అనే స్పృహ కూడా తెలియనీకుండా మెల్లగా నిద్రలోకి జార్చేస్తుంది. కాబట్టి మన తమోగుణం వదిలి ఏది సుఖమో, ఏది కష్టమో నిజంగా తెలియాలని, నిత్యానిత్య వస్తు వివేకం కలగాలని రెండు జ్యోతులతో కూడిన ఒంటెహారతిని శ్రీగురుదేవులకు సమర్పించుకుంటున్నాం.

నాల్గవది మూడు జ్యోతులతో కూడిన సింహ హారతి. సింహాన్ని రజోగుణానికి ప్రతీకగా చెప్తారు. తమోగుణాన్ని వదిలించుకున్న మనం రజోగుణాన్ని కూడా వదిలించుకుంటే ఇక సత్వగుణాన్ని వదిలించుకోవటం కాస్త తేలికగానే సాధ్యం అవుతుంది. ఆ విధంగా త్రిగుణాల మీద విజయాన్ని అనుగ్రహించమని శ్రీగురుదేవులను ప్రార్థిస్తూ ఈ హారతిని సమర్పించుకుంటున్నాం. ఇక అయిదవది అయిదు జ్యోతులున్న నాగహారతి. మనలో చుట్టలుగా చుట్టుకొని నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తిని పాముతో పోల్చారు. ఇది అధోముఖమై పంచేంద్రియాల వైపుగా పరుగులు తీస్తూ ఉన్నంతకాలం మనం అజ్ఞానంలో మునిగి ఉంటాం. ఎప్పుడైతే ఈ కుండలిని మేలుకొని పరమాత్మ వైపుకి ఊర్ధ్వముఖ ప్రయాణం ప్రారంభిస్తుందో అప్పుడు మనం మెల్లగా పంచకోశాలను దాటి మన స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం. అటువంటి స్థితిని కల్పించమని శ్రీగురుదేవులకు ఈ పంచజ్యోతి పూర్వక నాగహారతిని సమర్పించుకుంటున్నాం.

తరువాత అయిదు జ్యోతులతో కూడిన మయూరహారతి. ఎప్పుడైతే మనం త్రిగుణాలను జయించి, కుండలినీ శక్తిద్వారా పంచకోశాలను దాటి ఆత్మజ్యోతిని అనుభవంలోకి తెచ్చుకుంటామో అప్పుడు మన మనస్సు మేఘాలను చూసిన నెమలివలె పరవశత్వంతో ఆనందనృత్యం చేస్తుంది. జగన్మాత నామాలలో 'భక్త చిత్త కేకి ఘనాఘనా' - 'భక్తుల చిత్తములనే నెమళ్ళకు పరవశాన్ని కలిగించే మేఘం వంటిది' అనే నామం ఉంది. అలాగే శ్రీగురుదేవుల నామాలలో 'కాళికా మేఘ సందర్శనానంద నటన్మయూరాయ' - 'కాళీమాత అనే మేఘాన్ని దర్శించి పారవశ్యంతో ఆనంద నాట్యం చేసే నెమలి వంటివారు' అనే నామం ఉంది. మన పంచేంద్రియాలకు కూడా శ్రీగురుదేవుల దర్శనంతో అటువంటి పరవశం కలగాలని, మన మనస్సు ఆనందనృత్యం చేయాలని ప్రార్థిస్తూ ఈ మయూర హారతిని సమర్పించుకుంటున్నాం. అయితే కేవలం ఆ ఆత్మానందాన్ని మనం ఒక్కరమే అనుభవిస్తే అది నిజంగా ఆత్మానందం అనిపించుకోదు. అందుకే 27 నక్షత్రాలలో జన్మించిన ఈ చరాచర ప్రాణికోటి అంతటికీ అటువంటి ఆనందాన్ని ప్రసాదించమని శ్రీగురుదేవులను ప్రార్థిస్తూ 27 జ్యోతులతో కూడిన నక్షత్ర హారతితో అర్చించుకుంటున్నాం.

ఇక మన దినచర్యలో చివరిభాగంగా, రోజంతా మనం సలిపిన అర్చనలకు ఫలితంగా శ్రీగురు సుప్రసాదాన్ని కడుపార భుజించి మరుసటిరోజు కార్యక్రమానికి శరీరాన్ని సిద్ధపరుస్తూ విశ్రాంతి తీసుకుంటున్నాం. ఇక శ్రీగురుదేవుల డోలోత్సవం, సంతానం లేని ఎందరికో సంతానాన్ని ప్రసాదించి, భక్తులందరికీ బాలకృష్ణుని రూపంలో అపురూపమైన సేవను అందిస్తుంది. అలాగే దీపోత్సవం, రథోత్సవం చూసి అనుభవించవలసినవే కానీ, మాటలలో వర్ణించనలవికాదు. అసంఖ్యాక ఆత్మజ్యోతులు అన్ని కలిసి పరంజ్యోతి స్వరూపులైన శ్రీగురుదేవులను సేవించడం నిజంగా నేత్రోత్సవమే. అలాగే ఈ దేహమనే రథంలో సృష్టికర్త అయిన బ్రహ్మ సారథికాగా, ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత ముందుండి నడిపిస్తూ ఉండగా పరబ్రహ్మ స్వరూపులైన శ్రీగురుదేవులు ఆశ్రమం అంతా సంచరించడం నిజంగా ఒక దివ్యానుభూతి.

ఆశ్రమంలోని ప్రతి వృక్షమూ, ప్రతి మహాసర్పమూ ఒక సిద్ధపురుషుడని, ఎన్నో సంవత్సరాలుగా వారందరూ ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారని శ్రీగురుదేవులు ఎన్నోసార్లు శెలవిచ్చారు. నిజంగా మనోవికాసం కలిగి ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని అందుకున్న వారికి ఆశ్రమంలో ప్రతినిత్యం ఈ సిద్ధపురుషుల మధ్యలో సాధు సమ్మేళనమే, సత్సంగమే. కానీ ఇంకా ఆ స్థితిని చేరని వారికోసం ప్రత్యక్షంగా ఎందరో సాధు మహాత్ములు వారి దర్శనాన్ని, అనుగ్రహ భాషణాన్ని అనుగ్రహిస్తూ ఈ కార్యక్రమాలలో చివరి మూడురోజులు మనకు సాధు ధర్మ సమ్మేళనం ప్రసాదించారు.

ఈ కార్యక్రమలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకొని, మనలోని గుణాలను, సంకల్పాలను, జన్మజన్మాంతర వాసనలను జ్ఞానాగ్నిలో పూర్ణాహుతి చేసుకొంటే ఇక జరిగేది జీవాత్మ, పరమాత్మల అనుసంధానమైన శివ కళ్యాణమే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి