26, జనవరి 2023, గురువారం

ఆశ్రమ ప్రముఖులు

 శ్రీ కాళీగార్డెన్స్ ఆశ్రమ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న ఈ శుభ తరుణంలో విశేషంగా ఆశ్రమసేవ చేసుకొని తమ జీవితాలను ధన్యం ఒనర్చుకొని శ్రీగురుసాయుజ్యం పొందిన ప్రముఖ భక్తులను సంస్మరించుకోవటం మన కర్తవ్యం.


శ్రీ బచ్చు పాండురంగ శ్రీశైలరావు ప్రసాద్ - వీరినే మనందరం పాండుగారు అని ఆప్యాయంగా పిలుచుకుంటాం. ఇంతటి ఆశ్రమం స్థాపించాలన్నా, దానిని నిరాటంకంగా నడిపించాలన్నా దానికి తగిన అంగబలం, అర్థబలం కావాలి కదా. ఈ రెండూ ఉండటమే కాక, వాటిని గురుచరణారవిందముల సన్నిధిలో పూర్తిగా అర్పించగల అనన్య భక్తి ఉన్నవారు పాండుగారు. ఆశ్రమానికి కావలసిన స్థలాన్ని సేకరించడం దగ్గరనుండి, దాని నిర్మాణానికి కావలసిన సకల సామగ్రిని, సదుపాయాలను సమకూర్చడమే కాక, ఆశ్రమంలోని ప్రతి భక్తుని సేవ, గురుదేవుల సేవగా భావించి నిష్టతో చేసుకున్నారు వారు. ఆశ్రమవాసులు ఎవరైనా పనిమీద గుంటూరు వెళ్ళి, అక్కడ ఏ అవసరం వచ్చినా, ఇబ్బంది కలిగినా ముందుగా గుర్తు వచ్చేది, వెళ్ళి ఆశ్రయం పొందేది పాండుగారి ఇంటికే. అలాగే ఆశ్రమంలోని దాదాపు అన్ని పెద్ద పండుగల నిర్వహణా భారం వారి కుంటుంబానిదే. శ్రీ సద్గురు యువసేవాసమితి ప్రధమ అధ్యక్షులుగా కూడా వీరు సేవలందించారు.

శ్రీ లలితానంద సరస్వతీ స్వామిని - ఆశ్రమం నడవటానికి భౌతిక వసతులు పాండుగారు కల్పిస్తే, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వసతులన్నీ గురువుగారు కల్పించారు. ఆమెకు రాని శాస్త్రం కానీ, పురాణం కానీ లేదు. ఆశ్రమంలో ఏఏ కార్యక్రమాలు ఎలా జరుపుకోవాలో, ఏ పూజ ఎలా చేయాలో దానికి కావలసిన విధివిధానాలను ఏర్పరచటమే కాక, భక్తులందరికీ అందులో శిక్షణనిచ్చారు. ఆధ్యాత్మిక వాఙ్మయంలో ఏ విషయం గురించైనా, ఎంత సేపైనా అనర్గళంగానే కాక, సరళంగానూ జనరంజకంగానూ ప్రసంగించగల విద్వత్తు ఆమె స్వంతం. అయితే ఎక్కడా నేను పండితురాలననే అహం చూపక భక్తులందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, ఉత్సాహపరుస్తూ, శిక్షణనివ్వటమే కాకుండా, ఆశ్రమానికి క్రొత్తవారు ఎవరు ఏ సమయంలో వచ్చినా, వారికి రుచిగా వండి ప్రసాదాన్ని కూడా అందించిన అన్నపూర్ణ ఆ తల్లి. ఆశ్రమంలో ఆవిడ చేయని సేవ లేదంటే అతిశయోక్తి కాదు.

శ్రీ విజయేశ్వరానంద ప్రసాద్ - శ్రీ గూడూరి వెంకటరత్నంగారిగా సుపరిచితులైన వీరు ఆశ్రమ ప్రార్థనను రచించటమే కాక అనేక సంకీర్తనలను వ్రాసి పాడిన వాగ్గేయకారులు. అంతేకాక ప్రతి సంవత్సరం దసరా మహోత్సవాలలో శ్రీగురుదేవులు మెచ్చే విధంగా ఎన్నో భక్తుల మహాత్ముల చరిత్రలను నాటకలుగా రచించి, బాలబాలికలకు అందులో శిక్షణనిచ్చి ప్రదర్శింపజేసేవారు. సుదీర్ఘకాలం ఆశ్రమ గురుకుల నిర్వహణా బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. అంతేకాక శ్రీ రామలింగేశ్వరాలయంలో, శ్రీ కాళికాలయంలో నిత్యపూజల బాధ్యతను వీరు, వీరి ధర్మపత్ని కళ్యాణమ్మగారు జీవితాంతం నిర్వహించారు. శ్రీగురుదేవుల దివ్య బోధలను గురువాణి అనే గ్రంధరూపంలో లోకానికి అందించడమే కాకుండా శ్రీగురు చరిత్రను సమగ్రంగా సేకరించి రెండు భాగాలుగా అందించారు.

శ్రీ సుగుణ ప్రసాద - అందరూ సుగుణక్కగా పిలుచుకొనే ఈ తల్లి నిరంతరం శ్రీబాబూజీ, శ్రీమాతాజీల వెన్నంటి ఉండి మౌనంగానే ఆశ్రమ నిర్వహణకు సంబంధించిన ఎన్నో బాధ్యతలను నిర్వర్తించేవారు. వారు శ్రీగురుసాయుజ్యం పొందిన తరువాత వారి బాధ్యతలను అనేకమందికి పంచవలసి వచ్చిందంటే వారి సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు.

శ్రీ నడింపల్లి సత్య సూర్యనారాయణరాజు ప్రసాద్ - ఎండీగారుగా సుపరిచితులైన వీరు ఆశ్రమ నిర్మాణం ప్రారంభించిన నాటినుండి ఆశ్రమంలోనే ఉంటూ, వివిధ నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను సేవగా స్వీకరించి ఆశ్రమంలోని యువకులను సమీకరించి వారిచే సమర్థంగా నిర్వహింపజేసేవారు. శ్రీ సద్గురు యువసేవాసమితి ప్రధమ కార్యదర్శిగా కూడా వీరు సేవలందించారు.

శ్రీ ఇందుకూరి సత్యనారాయణరాజు ప్రసాద్ - సత్తిరాజుగారిగా అందరికీ తెలిసిన వీరు కూడా ఆశ్రమ స్థాపన నాటినుండి బాధ్యతలు స్వీకరించి ఆశ్రమంలోని ఫలవృక్షాలు, పంటపొలాల నిర్వహణను సమర్థవంతంగా నడిపారు.

శ్రీమతి చంద్రాభొట్ల కామేశ్వరి ప్రసాద - కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందిన కామేశ్వరమ్మగారు తమ సుశ్రావ్య స్వరంతో ఆశ్రమ ప్రార్థనా గీతాలను, సంకీర్తనలను ప్రతిరోజూ గానం చేయటమే కాక, శ్రీ లలితానంద సరస్వతీ స్వామిని వద్ద శిక్షణ పొంది ముకుందమాల, భాగవతం, మహర్షుల చరిత్రలు మొదలగు ప్రవచనాలను కూడా నిర్వహించారు. అంతేకాక కంటిచూపును కోల్పోయిన అనంతరం కూడా శ్రీ బృందావనంలో, శివాలయంలో నిత్యపూజలను, అభిషేకాలను నిర్వహించేవారు.

శ్రీ దుగ్గిరాల జగన్మోహన బాలకృష్ణ లాల్ ప్రసాద్ - లాల్ గారిగా సుపరిచితులైన వీరు గుంటూరులో లెక్చరర్ ఉద్యోగం చేస్తూకూడా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శ్రీగురుదేవుల దర్శనార్థమై ఆశ్రమానికి వచ్చి, వ్యాహ్యాళి సమయంలో, సత్సంగాల సమయంలో శ్రీగురుదేవుల దివ్య బోధనంతా శ్రద్ధగా విని, ఆకళింపు చేసుకొని, ఇంటికి వెళ్ళగానే మరల గ్రంధస్థం చేసేవారు. అలా శ్రీబాబూజీ దివ్య స్మృతులు అనే గ్రంథం అనేక భాగాలుగా మనకు అంది, ఇప్పటికీ జిజ్ఞాసువులకు ఆధ్యాత్మిక విజ్ఞానసర్వస్వంలాగా ఉపయోగపడుతోంది. అంతేకాక వీరు కూడా అనేక సంవత్సరాలు ఆశ్రమ పాఠశాల నిర్వహణా బాధ్యతలను, సమర్థ సద్గురు మాసపత్రిక సంపాదక బాధ్యతలను కూడా నిర్వర్తించారు.

శ్రీ చేబ్రోలు వెంకట నారాయణరావు ప్రసాద్ - భారతీయ రైల్వేలో ఉన్నత పదవులను నిర్వర్తించిన శ్రీ నారాయణ రావుగారు ఉద్యోగ విరమణానంతరం ఆశ్రమవాసులయి ట్రస్ట్ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేసి, శ్రీ బృందావన నిర్మాణం, శ్రీ రామాలయ పునర్నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. అంతేకాక శ్రీగురుబోధను ప్రతి సాయంత్రం ప్రార్థనానంతరం విస్పష్టంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో చదివి వినిపించేవారు.

శ్రీ సన్నిధానం రామతారక పరబ్రహ్మ శాస్త్రి ప్రసాద్ - భారతీయ రైల్వేలో ప్రధానాధ్యాపకునిగా పనిచేసిన శ్రీ తారకంగారు వేద, శాస్త్ర పురాణేతిహాసాలలో పండితులు. ఆశ్రమవాసులకు కలిగే అనేక సందేహాలను తీర్చడమేకాక, వారికి ఏ మంత్రం ఎలా ఉచ్ఛరించాలి ఏ పదానికి అర్థం ఏమిటి అనే విషయాలలో శిక్షణ ఇచ్చేవారు. వీరు ప్రతి సంవత్సరం దసరా మహోత్సవాలలో శ్రీ దేవీభాగవత పురాణ ప్రవచనం జనరంజకంగా చేసేవారు.

శ్రీ వేలమూరి వెంకటరమణ ప్రసాద్ - ప్రసాదరావు గారిగా సుపరిచితులైన వీరు వృత్తిరీత్యా ఆంగ్ల ఆచార్యులైనా సంస్కృతాంధ్ర భాషా కోవిదులు కూడా. వీరు ఎన్నో అష్టావధానాలను కూడా శ్రీగురుదేవుల సమక్షంలో నిర్వహించారు. అనేక సంవత్సరాలు ధనుర్మాసంలో పోతన భాగవతాన్ని కడు రమ్యంగా ప్రవచించి భక్తుల మనసులను చూరగొన్నారు. శ్రీ బాబూజీ చరిత్రలోని కొన్ని ఘట్టాలను హరికథగా రచించి స్వయంగా ప్రదర్శించారు. శ్రీగురుగీతకు చక్కని భాష్యం కూడా రచించారు.

శ్రీ గూడ శివరామ మూర్తి ప్రసాద్ - ఈసీఐఎల్‌లో ఉన్నత పదవిని నిర్వహించిన శ్రీ మూర్తిగారు ఆశ్రమవాసులందరికి పురాణం మూర్తిగారిగా పరిచితులు. ఎన్నో సంవత్సరాలు ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో శ్రీబృందావనంలో పురాణ ప్రవచనం నిర్వహించేవారు. శ్రీ భగవద్గీతకు సరళమైన భాష్యం రచించి, ఆశ్రమవాసులకు వినిపించారు. అంతేకాక శ్రీ రామలింగేశ్వరాలయంలో మహన్యాసం చెప్పే సేవ కూడా చేసుకున్నారు. దీర్ఘకాలం సమర్ధ సద్గురు మాసపత్రికకు సమర్థవంతమైన సంపాదకునిగా సేవలందించారు.

శ్రీ గరికపాటి శ్రీరామచంద్ర మూర్తి ప్రసాద్, కమలా ప్రసాద - అస్సాం మూర్తి దంపతులుగా ప్రసిద్ధులైన వీరిరువురు సుదీర్ఘ కాలం శ్రీ కోదండ రామాలయం, శ్రీ రాధాకృష్ణాలయములలో నిత్య పూజలను నిర్వహించారు.

శ్రీ వల్లభజోశ్యుల భగవాన్ దాస్ ప్రసాద్ - భగవద్దాసుగా శ్రీగురుదేవులు పిలుచుకొన్న వీరు శ్రీగురుదేవులకు అత్యంత ప్రియభక్తులు. సుదీర్ఘకాలం అమెరికాలో స్థిరనివాసం ఉన్నాకూడా ఎప్పుడూ శ్రీగురుదేవుల హృదయానికి దగ్గరగా ఉండేవారు. అక్కడ సమర్ధసద్గురు మాసపత్రికను వివిధ ప్రాంతాలలోని భక్తులకు చెరవేయటానికి విశేష కృషి చేశారు. జీవిత చరమాంకంలో ఆశ్రమవాసులయి శ్రీగురుదేవులయందే మనస్సును నిలిపి శ్రీగురుసాయుజ్యం పొందారు.

శ్రీ నూనె వెంకటస్వామి ప్రసాద్ - పాండుగారి బావగారైన శ్రీ వెంకటస్వామిగారు ఆశ్రమానికి పెద్దదిక్కు వంటివారు. శ్రీగురుదేవులు ఏ ఆలయాల నిర్మాణం, యజ్ఞయాగాదుల వంటి ఏ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినా ప్రధాన కర్తలుగా వీరి దంపతులే ఉండేవారు. అంతేకాక వారు హిందీలో శ్రీ రామచరితమానసను చదివి భక్తులందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులోకి అనువదించి ప్రవచించేవారు.

శ్రీ మద్ది నాగేశ్వరరావు ప్రసాద్ - శ్రీ నాగేశ్వర రావుగారు సమర్ధ సద్గురు మాసపత్రికకు ప్రధమ సంపాదకులు. మాసపత్రికకు ఒక రూపును అందించడంలో వీరు విశేష కృషి చేశారు. ఆ పత్రికను రాష్ట్రమంతటా విస్తరింపజేయటంలో వీరి అల్లుడుగారైన శ్రీ చరణదాసుగారు ప్రముఖ పాత్ర వహించారు. అంతేకాక సౌమ్యులు, నిరాడంబరులు, మృదుస్వభావి అయిన శ్రీ నాగేశ్వరరావుగారు వివేక విన్యాస్ మొదలైన అనేక ఆధ్యాత్మిక గ్రంధాలను రచించి, ప్రచురించి ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు విశేష సేవలను అందించారు. శ్రీగురుదేవుల దివ్య సందేశాలను ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలలో ప్రచురించడానికి, గురువాణి అనే తెలుగు సంగ్రహం సమర్థ సద్గురు అనే ఆంగ్ల సంగ్రహం ప్రచురించడానికి శ్రీ నాగేశ్వరరావుగారు, శ్రీ చిరంజీవిగారు విశేష కృషి సలిపారు. శ్రీ బాబూజీ మహరాజ్ వారిచే 'జనక మహారాజు వలె రాజయోగి' అని పిలువబడిన శ్రీ నాగేశ్వరరావుగారు ఆదర్శమూర్తులు.

శ్రీమతి వీర రాఘవమ్మ ప్రసాద - శ్రీ మాతాజీవారి మాతృమూర్తి అయిన శ్రీమతి రాఘవమ్మగారు శ్రీగురుదేవులకు ఎన్నో సంవత్సరాల కాలం నైవేద్యం తయారు చేసి, వారికే కాక వారి దర్శనార్థం వచ్చిన అనేకమంది భక్తులకు కూడా ప్రేమతో వడ్డించేవారు. అలాగే శ్రీ మాతాజీ అతిథులుగా ఆశ్రమ దర్శనార్థం వచ్చే ఎందరో సాధు మహాత్ములకు కన్నతల్లి వలె అప్యాయతను కురిపించి వారి భోజన వసతులను స్వయంగా చూసుకొనేవారు.

నిజానికి ఆశ్రమానికి సేవలందించిన ప్రముఖుల జాబితా అనంతమైనా కొద్దిమందినే ఇక్కడ ప్రస్తావించడం సాధ్యమైంది. వీరేకాక ఇంజనీర్లుగా శ్రీ వీరయ్య చౌదరిగారు, శ్రీ వక్కలగడ్డ వెంకట సత్యనారాయణ మూర్తి ప్రసాద్ వారు, శ్రీ కొండా శేషంరాజుగారు, శ్రీ ఉనికిలి సుబ్బరాజుగారు, ప్రధానోపాధ్యాయులుగా శ్రీ దత్తుమాష్టారు, శ్రీ శ్రీనివాస అయ్యంగార్ వారు, ఉపాధ్యాయులుగా శ్రీ గండికోట వెంకటేశ్వర్లు గారు, శ్రీమతి శ్యామల, శ్రీమతి హిమగిరి కుమారి, శ్రీ ఉమామహేశ్వరరావు, ప్రథమ వైద్యులుగా శ్రీ ఏలూరుపాడు డాక్టరుగారు, వారి సతీమణి పాపమ్మగారు, గాయకులుగా శ్రీమతి మావులేటి ఈశ్వరమ్మగారు, శ్రీమతి జమ్మి సుశీలాదేవి గారు, ప్రథమ కాంటీన్ నిర్వాహకులుగా శ్రీ శ్రీహరిరావు గారు, ఆశ్రమ ఉద్యానవన నిర్వాహకులుగా శ్రీ కూనపరాజు నారాయణరాజుగారు, పురోహితులుగా శ్రీ వారణాసి కాశీ విశ్వనాథ శర్మగారు, శ్రీ రామారావు గారు, శ్రీ శేఖరంగారు, బృందావన పరిరక్షకురాలిగా శ్రీ జయక్క ఇలా ఎందరెందరో మహానుభావులు గత యాభై సంవత్సరాలుగా ఈ ఆశ్రమసేవ చేసుకొని శ్రీగురుసాయుజ్య ముక్తిని పొందటమే కాక, మనందరికీ ఆదర్శమూర్తులుగా, మార్గదర్శులుగా, ప్రాతఃస్మరణీయులుగా నిలిచారు. వారు చూపిన బాటలో నిస్వార్థ సేవతో మన జీవితాలను సఫలం చేసుకోవటమే వారికి మనం అందించగలిగిన నివాళి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి