22, జనవరి 2015, గురువారం

సగుణం – నిర్గుణం

భగవంతుడు సాకారుడా? నిరాకారుడా? అని అనేకమంది చర్చించుకుంటూ ఉంటారు. ఆయనను సగుణంగా విగ్రహ రూపంలో పుజించాలా? లేక నిర్గుణంగా ఆరాధించాలా అని కూడా ఈ మధ్యన తరచూ చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల వస్తున్న కొన్ని సినిమాలు కూడా ఈ చర్చకు కారణమనుకోండి.

అయితే ఇలా చర్చించే వారు, ఈ విషయంపై వాదించి, వీలైతే బలవంతంగానైనా/హింసతోనైనా అవతలవారిని తమ మార్గంలోకి తెచ్చుకోవాలని అనుకునేవారు కొన్ని విషయాలు మరచిపోతున్నారు.

ముందుగా – భగవంతుడు సర్వ శక్తిమంతుడు అని అన్ని మతాలు బోధిస్తున్నాయి, ఆస్తికులందరూ ఒప్పుకుంటున్నారు. మరి సర్వ శక్తిమంతుడు అయినవాడికి సాకారంగానో, నిరాకారంగానో ఉండే శక్తి లేదంటారా? ఆయనకు ఆ మాత్రం స్వతంత్రం కూడా ఈ భక్తులు ఇవ్వరా? నిజానికి సగుణానికి, నిర్గుణానికి భేదం లేదు. ఘనీభవించిన మంచుగడ్డ, ప్రవహించే నీరు, గాలిలో తేలిపోయే ఆవిరి అన్నీ ఒకే పదార్థంయొక్క భిన్న రూపాలు కదా?

ఇక అర్చనా విధానాల దగ్గరకు వద్దాం. భగవంతుడే ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించాడని అన్ని మతాల వారు ఒప్పుకుంటారు. అంటే మనందరం ఆయన సంతానమే కదా. ఒక తండ్రికి పదిమంది పిల్లలు ఉన్నారనుకోండి, వారందరికీ తమ తండ్రిని సేవించుకోవాలనే సద్బుద్ధి పుట్టింది. ఇప్పుడు వారందరూ తలో రకమైన సేవ చేసుకుంటే ఆ తండ్రి ఎక్కువ సంతోషిస్తాడా? లేక అందరూ ఒకే విధంగా సేవించుకుంటాం అంటే ఎక్కువ సంతోషిస్తాడా? ఒకరు వంట చేసి, ఇంకొకరు ప్రేమగా తినిపించి, ఒకరు కాళ్ళు పట్టి, ఇంకొకరు కొత్త బట్టలు కొని ఇచ్చి, ఇలా అందరూ కలిసి ఆయనకు అవసరమైన సేవలన్నీ చేసుకుంటేనే ఆయన ఎక్కువ సంతోషిస్తాడు కదా?

గట్టిగా 70 – 80 ఏళ్ళు జీవించని మనమే పూటకో రకమైన తిండి, బట్ట, వినోదం, వ్యాపకం కావాలనుకుంటున్నామే? ఒకే రకమైనవి లభిస్తే బోరు కొట్టిందని విసుక్కుంటున్నామే? మరి ఎన్నో కోట్ల సంవత్సరాలనుంచీ ఉంటూ ఇక ఎప్పటికీ అలాగే ఉండే భగవంతుడు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటూ, ఒకే విధమైన పూజలు అందుకోవాలని శాసించే వారిని ఏమనాలి?


అందుకే మన భారతీయ సనాతన ధర్మం భగవంతుని వివిధ రూపాలలో(ఇందులో అరూపం కూడా భాగమే), వివిధ నామాలతో, వివిధమైన అర్చనా విధానాలతో సేవించుకొనే అవకాశం కల్పించింది. తన పేరు చెప్పి కొట్టుకునే కొడుకులకన్నా, కనీసం తనకోసమైనా కలసి ఉండే కొడుకులను చూసే ఏ తండ్రైనా సంతోషిస్తాడు. మనందరికీ తండ్రి అయిన భగవంతుడికి ఈ పాటి చిన్న సంతోషాన్ని కలిగిద్దాం. 

1 కామెంట్‌: