18, జనవరి 2015, ఆదివారం

గడ్డపార మింగితే

ముందుగా ఇంత చక్కని అన్నమయ్య కీర్తనను పరిచయం చేసిన శ్రీ ఎనగంటి రవి చంద్ర గారికి నా కృతజ్ఞతలు.

ఈ పాట యొక్క పూర్తి సాహిత్యం కోసం ఇక్కడ చుడండి.

ఈ పాట యొక్క అర్థాన్ని నాకు అవగాహన అయినంతవరకు వివరిస్తాను.

గడ్డపార (గునపం) యొక్క ముఖ్య ఉపయోగం దానితో నేలను త్రవ్వి మొక్కలు నాటుకోగలగటం. ఆ మొక్కలకు కాసిన పండ్లుగాని, కూరగాయలుగాని మన ఆకలిని తీరుస్తాయి. అంతేకాని ఆ గునపాన్ని మింగేస్తే మన ఆకలి తీరదు కదా. అలాగే మన సంసార బంధానికి కారణమైన మనస్సును, ఇంద్రియాలను పరమాత్మవైపుకు మరల్చుకోవాలి కానీ సంసారాన్ని వదలివేస్తానంటే అది మనను మళ్ళీ అంతకంటే తీవ్రంగా కమ్ముకుంటుంది.

స్వేచ్ఛగా ఆకాశంలో తిరిగే చిలకలను తెచ్చి బండికి కట్టి లాగమంటే అవి లొంగకపోగా బండిని కూడా ఆకాశంలోకి ఎగరేసుకు పోవటానికి ప్రయత్నిస్తాయి. అలాగే ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించుకుంటే అవి సమయం కోసం పొంచి ఉండి మనను ఘోరంగా దెబ్బ తీస్తాయి.

మండే అగ్నిని తెచ్చి మసి గుడ్డలో మూటకట్టి ఇంట్లో పెట్టుకుందామంటే అది దాగి ఉండకపోగా ఇల్లంతా తగలబెట్టేస్తుంది. అలాగే మమకారాన్ని బలవంతంగా దాచి ఉంచుదామంటే అది మనలనే బానిసగా చేసుకుని ఆశలలో పడవేస్తుంది.

అలాగే విష సర్పాన్ని తెచ్చి దిండుకింద పెట్టుకొని అణగి ఉండమంటే అది మననే కాటు వేస్తుంది. అందువల్ల ఈ సంసారాన్ని నిగ్రహించాలంటే మనవల్ల కాదు. అది కేవలం శ్రీవేంకటేశ్వరునియందు భక్తితోనే సాధ్యం.

ఇదే విషయాన్ని మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారు ఇలా చెప్పేవారు - ఇంద్రియాలు, మనస్సు స్ప్రింగ్ వంటివి. బలవంతంగా అణచి పెట్టాలని చుస్తే అదను చూసి అంతకంటే బలంగా ఎదురు తిరుగుతాయి. ఈ మనస్సు, శరీరము మనకు శత్రువులు కావు. పరమార్థ సాధనకు ఎంతో ఉపయోగపడే సాధనాలు(శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం). అశాశ్వతమైన క్షణిక సుఖాల కోసం పరుగులు పెట్టే వీటికి శాశ్వతమైన పరమాత్మ వస్తువునందు మెల్లమెల్లగా ఆసక్తిని కలిగించాలి. ఒకసారి రుచి మరిగిన తరువాత వాటంతట అవే సంసారాన్ని వదిలివేస్తాయి.

ఇదే విషయాన్ని భగవద్గీతలో గీతాచార్యుడు అనేక పర్యాయాలు చెప్పటం జరిగింది(ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి......., మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి....., ఇలా). ఇంకా త్యాగరాజ స్వామివారు కూడా "మనసా ఎటులోర్తునే? నా మనవిని చేకొనవే" అని తన మనస్సును బ్రతిమాలుకున్నారు. అలా కాదని పట్టుదలకు పోయి తపస్సు చేసిన విశ్వామిత్ర మహర్షి అనేక పర్యాయాలు తన మనస్సుకు, ఇంద్రియాలకు లొంగిపోయిన చరిత్ర మనకు తెలుసు. అలాగే ఎంతో పట్టుదలతో తపస్సులు చేసిన రాక్షసులందరూ తమ తపస్సులు ఫలించగానే మళ్ళీ మనస్సుకు, ఇంద్రియాలకు లొంగిపోయారు.

కనుక మనం ప్రహ్లాదుడు(కంజాక్షునకుగాని కాయంబు కాయమే........, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు... మొదలైన పద్యాల ద్వారా), కులశేఖరాళ్వార్(జిహ్వే కీర్తయ కేశవం... మొదలైన శ్లోకాల ద్వారా) మొదలైన మహా భక్తులు చూపిన బాటలో మెల్లమెల్లగా మన మనస్సును, ఇంద్రియాలను పరమాత్మ వైపుకు త్రిప్పుకోవాలి.

1 కామెంట్‌: