మనం అనుభవించే సుఖాలు మూడు రకాలని భగవద్గీతలో 18వ అధ్యాయం 37 నుంచి 39వ శ్లోకం దాకా చెప్పబడింది.
ముందుగా సాత్విక సుఖం:
ముందుగా సాత్విక సుఖం:
యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం |
తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మ బుద్ధి ప్రసాదజం ||
మన బుద్ధిని ఆత్మయందు నిలిపి ఉంచి ప్రసన్నమైన మనస్సుతో చేసే సత్కర్మలు ఆచరించబడేటప్పుడు కష్టంగా తోచినా వాటి ఫలం మాత్రం మనకు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ఇట్టి సుఖాన్ని సాత్విక సుఖం అన్నారు. ఉదాహరణకు మనకు తెల్లవారు ఝామున లేచి ధ్యానం చేసుకోవాలన్నా, ఉదయాన్నే స్నానం చేసి పూజ చేసుకోవాలన్నా, ప్రతి రోజూ దేవాలయానికి వెళ్ళాలన్నా, మనకున్న దాంట్లో కొంత దానం చెయ్యాలన్నా కష్టంగానే ఉంటుంది. కానీ కష్టపడి ఈ సత్కర్మలను చేయటం ద్వారా మనకు లభించే సుఖం మాత్రం శాశ్వతంగా నిలచిపోతుంది. మనకు అమృతత్త్వాన్ని ప్రసాదిస్తుంది.
మరి రాజస సుఖం:
విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం |
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం ||
మన ఇంద్రియాలను విషయాల వెంట పరుగులు పెట్టించి వాటి ద్వారా మనం పొందే సుఖం ముందు అమృతప్రాయంగానే కనిపిస్తుంది కానీ అది ఒక పరిమితికి మించి అనుభవిస్తే విషతుల్యం అవుతుంది. దీనికి మా గురుదేవులు చక్కని ఉదాహరణ చెప్పేవారు. నీకు గారెలు ఇష్టం అనుకో, ఒక పరిమితికి లోబడి తింటే ఆనందంగానే ఉంటుంది. అదే చాలా ఇష్టం కదా అని ఒక నక్షత్రమాల(27) లాగించావనుకో ముందు కడుపులో ఉరుములు, మెరుపులు మొదలవుతాయి. తరువాత కుండపోతగా వర్షం పడుతుంది. ఇంటివారు ఘొల్లుమంటారు, డాక్టరు సంచీ ఘల్లుమంటుంది.
ఇక మూడవది తామస సుఖం:
యదగ్రే చానుబంధేచ సుఖం మోహనమాత్మనః |
నిద్రాలస్య ప్రమాదోత్ధం తత్తామాసముదాహృతం ||
నిద్ర, సోమరితనము, ప్రమాదము (మనం చేసే పనులలో, ఆలోచనలలో జాగరూకత లేకుండా మనం ఏమి చేస్తున్నామో మనకే తెలియకుండా ఉండటాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ప్రమాదం అంటారు) వలన అనుభవించేటప్పుడు, ఆ తరువాత కూడా విషతుల్యం అయినప్పటికీ అమృతమయమని మనను భ్రమింపచేసే సుఖం తామస సుఖమని చెప్పబడింది. ఈ తామస సుఖానికి కూడా మా గురుదేవులు రెండు చక్కని ఉదాహరణలు చెప్పేవారు. ఒంటె ముళ్ళకంపను తింటుంది. అలాగే కుక్క ఎండిపోయిన ఎముకను కొరుకుతూ ఉంటుంది. ఈ రెండు ఉదాహరణలలో కూడా వాటికి తినే పదార్ధం నుండి వచ్చే సారం ఏదీ లేదు. కానీ ఆ ముళ్ళు/ఎముక వాటి నోటిలో గ్రుచ్చుకొని వాటి రక్తం కారుతూ ఉంటే ఆ రక్తం ఆ ముళ్ళకంప/ఎముక నుండే వస్తోందన్న భ్రమలో అవి వాటిని తింటూ ఉంటాయి. ఇక్కడ తినేటప్పుడు కానీ, ఆ తరువాత కానీ వాటికి ఏమాత్రం సుఖం లభించటం లేదు సరికదా అవి దుఃఖమునే పొందుతున్నాయి. కానీ ఏదో సుఖాన్ని పొందుతున్నామనే భ్రమలోనే ఉంటున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి