17, జనవరి 2015, శనివారం

వాడల వాడల వెంట

అన్నమయ్య కీర్తనలలో "వాడల వాడల వెంట వాడవో నీడనుండి చీరలమ్మే నేత బేహారి" అనే కీర్తన చాలా బాగుంటుంది.

ఇందులో అన్నమయ్య పరమాత్ముని ఒక చీరలు నేసే నేతవానిగా, ఇంకా వాటిని అమ్మే వ్యాపారిగా కీర్తిస్తారు.

పంచభూతములనే నూలుతో మన దేహలనే చీరలు తయారవుతాయి. ఈ నూలు దారాలు స్థిరంగా నిలబడటానికి మాయ అనే గంజి కలిపి ఈ చీరలను నేస్తారు. ఇంకా ఆ చీరాల మీద ఉండే పలు రకాల రంగు రంగుల డిజైన్ల కోసం స్వామి గుణములనే నూలును వాడుతారట.

అయితే సంతలో ఈ చీరలను కొనుక్కునే జీవులకి ఒకేసారి అనేక చీరలు కొనుక్కుని బీరువాలో దాచుకొనే సౌలభ్యం లేదు. తన దగ్గరున్న చీరను (దేహాన్ని) స్వామికి ఇచ్చేసి, ఇంకా తన కర్మ అనే ధనాన్ని వెచ్చించి దానికి అనుగుణమైన కొత్త చీరను (దేహాన్ని) స్వామి నుండి కొనుక్కోవాలి. అందుకే స్వామిని అన్నమయ్య మారు బేహారి అంటారు.

అయితే మరి స్వామి వ్యాపారం ఎప్పుడు బాగా గిట్టుబాటు అయినట్టు? ఆ ఊరిలోని జీవులందరికీ ఇక చీరలు కొనే అవసరం ఎప్పుడు కలుగకుండా పోతుందో (అంటే మళ్ళీ జన్మించవలసిన అవసరం లేకుండా పోతుందో) అప్పుడు. అందుకే అన్నమయ్య స్వామిని నీడపట్టున (వైకుంఠంలో) కూర్చోకుండా వాడల వాడల వెంట తిరుగుతూ (గురువుల, మహాత్ముల రూపంలో మాటిమాటికీ అవతరిస్తూ) వ్యాపారం చేసుకోమని (జీవులందరినీ ఇక శరీరం ధరించే అవసరం లేని మోక్ష స్థితికి చేర్చుకోమని) సూచిస్తున్నారు.

1 కామెంట్‌:

  1. చాలా చక్కటి వ్యాఖ్యానం. ఇలాంటి వివరణ కోసం నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఇంకో పాట ఒకటుంది "గడ్డపార మింగితే ఆకలి తీరీనా". మీకు వీలుంటే దీన్ని గురించి కూడా రాయగలరు.

    రిప్లయితొలగించండి