31, జనవరి 2021, ఆదివారం

ఈశ్వరుడు

ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః

    ఈశ్వరుడికి, గురువుకు, ఆత్మకు రూపంలో భేదం తప్ప అసలు వస్తువులో భేదం లేదని, ఆకాశం ఎలాగైతే సర్వవ్యాపకమై ఉన్నదో అలాగే ఈశ్వరుడు కూడా సర్వవ్యాపకుడని ఈ దక్షిణామూర్తి స్తోత్ర శ్లోకం వివరిస్తోంది. ఇలా మూడు రూపాలలో ఉంటూ మనకి బాగా తెలిసిన వస్తువు నీరు. నీటి ఆవిరి, లేదా తేమ రూపంలో మన చుట్టూ ఉన్న గాలి అంతటా వ్యాపించి ఉంటుంది నీరు. దీనికి ఒక రూపం లేదు. అలాగే ద్రవ రూపంలో మనం నిత్యం ఉపయోగించుకునే నీరు ఒక రూపంలో కనిపిస్తుంది కానీ ఒక నిర్దుష్టమైన ఆకారం లేకుండా అది ఏ పాత్రలో ప్రవేశిస్తే ఆ పాత్ర ఆకారాన్ని తాను పొందుతూ ఉంటుంది. అదే నీరు ఘనీభవించి మంచుగడ్డగా మారినప్పుడు తనకంటూ ఒక ఆకారాన్ని సంతరించుకుంటుంది. 

    ఈశ్వరుడు కూడా ఆ నీటి ఆవిరిలాగే సర్వవ్యాపకుడైనప్పటికీ మన కంటికి కనిపించకుండా ఉంటాడు. అదే ఈశ్వరుడు ఆత్మ రూపాన్ని పొందినపుడు ఏ ప్రాణి శరీరంలో ప్రవేశిస్తే ఆ ప్రాణి ఆకారాన్ని పొంది, దానిలో చైతన్యాన్ని నింపి నడిపిస్తూ ఉంటాడు. అయితే ఈ రెండు రూపాలూ కూడా ఇంద్రియాలకు అగోచరమైనవే. మరి ఆ ఈశ్వరుని, లేదా ఆత్మను తెలుసుకోవడం ఎలా? నిజంగా అలా తెలుసుకోవాలన్న ఆవేదన తీవ్రతరమైనపుడు ఆ భక్తుని భక్తిని సిద్ధింపచేయటానికై అదే ఈశ్వరుడు ఘనీభవించిన రూపంలో ఒక గురువుగా మనముందు ప్రత్యక్షమవుతాడు. "అప్రత్యక్షో మహాదేవః సర్వేషాం ఆత్మమాయయా ప్రత్యక్షో గురురూపేణ వర్తతే భక్తిసిద్ధయే". 

    నీరు వాతావరణంలోని మార్పులకు చాలా త్వరగా వేడెక్కిపోతూ ఉంటుంది. అలాగే మనందరిలో ఉన్న ఆత్మ సంసార తాపత్రయ స్పర్శ చేత ఆవేదనకు గురవుతూ ఉంటుంది. మన చిన్నప్పుడు వేసవికాలంలో ఏవైనా పెద్ద కార్యక్రమాలు చేసేటప్పుడు మంచినీళ్ళ పాత్రలలో మంచుగడ్డలు వేసేవారు. ఆ మంచుగడ్డ తాను ఎప్పుడూ చల్లగా ఉండటమే కాకుండా తన సాన్నిహిత్యంతో ఆ నీటిని కూడా చల్లగా చేస్తుంది. అలాగే ఆ మంచుగడ్డ త్వరగా కరిగిపోయినా కూడా నీటిలో ఆ చల్లదనం చాలాకాలం నిలిచి ఉంటుంది. అలాగే ఒక మహత్తరమైన ప్రయోజనం కొరకు ఆకారాన్ని ధరించి వచ్చిన గురువులు ఈ సంసార తాపత్రయంలో ఉంటూ కూడా తాము నిశ్చలమైన ప్రశాంతతను అనుభవించడమే కాకుండా తమనాశ్రయించిన వారందరి మనసులనూ అటువంటి ప్రశాంతతతో నింపివేస్తారు. తమ అవతార ప్రయోజనం నెరవేరగానే ఆ గురువుల రూపం కనుమరుగయినా వారి బోధలనుండి ప్రసరించిన ప్రశాంతత చిరకాలం అనేక జీవాత్మలకు శాంతిని ప్రసాదిస్తూనే ఉంటుంది.

    "ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి" - "అర్జునా! ఈశ్వరుడు సర్వభూతాల హృదయంలో స్థిర నివాసియై ఉంటాడు" అని గీతాచార్యుడు ప్రవచించాడు. అయితే మనం ఈ హృదయంలోకి చూడటం అలవాటు చేసుకోవాలి. మన మనస్సు నిరంతరం బయటి విషయాల వెంటే పరుగులు పెడుతూ ఉంటుంది. తాను అనుకున్నది పొందటం కోసం పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తూ ఉంటుంది. అది జరిగితే ఆనందిస్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా కృంగిపోతుంది. దీనికి కారణం కూడా అదే శ్లోకంలో పరమాత్మ చెబుతున్నాడు. "భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా" - "ఆ ఈశ్వరుడు ఊరికే హృదయంలో కూర్చోకుండా ఆయా జీవులను తన మాయ అనే యంత్రంలో వేసి గిరగిరా త్రిప్పుతూ ఉంటాడు". 

    సాక్షాత్తు ఈశ్వరాంశ అయిన ఆంజనేయ స్వామి కుడా సీతాన్వేషణలో ఇలాగే లంకంతా గాలించినా అమ్మ కనబడక "ఇప్పుడు నేను అమ్మను చూడకుండా తిరిగి వెళితే రాముడు మరణిస్తాడు, లక్ష్మణుడు మరణిస్తాడు, సుగ్రీవుడు మరణిస్తాడు, అయోధ్యలో ఇంకా కిష్కింధలో ఉన్న వారందరూ మరణిస్తారు" ఇలా చాలా చాలా దూరాలోచన లోకి వెళ్ళిపోతాడు. మనసు ప్రవర్తన ఇలాగే ఉంటుంది. అయితే ఆయన స్థితప్రజ్ఞుడు కాబట్టి ఒక్కసారి తన మనస్సును కట్టడి చేసి తన హృదయంలోకి చూసుకుంటాడు. అక్కడ ప్రకాశిస్తున్న సీతారాముల దర్శనం కాగానే వారిని ప్రార్థించడం, వెంటనే ఆయనకు అశోకవనం, అందులో సీతాదేవి ప్రత్యక్ష దర్శనం కలగడం జరిగిపోతాయి. 

    గురుదేవులు శ్రీబాబూజీ మహారాజ్ వారు కూడా "నేను మీ హృదయ బాబును" అనేవారు. మనం సమస్యలలో చిక్కుకుని, ఎటూ నిర్ణయించుకోలేని ద్వైదీభావంలో మనస్సు అశాంతిని పొందినప్పుడు నిరాకారంగా ఉండే ఈశ్వరుడిని దర్శించలేకపోయినా, సాకారంగా వచ్చిన గురుదేవుల రూపం కనుమరుగయినా, మనసును పక్కనబెట్టి మన హృదయ క్షేత్రంలో నిరంతరం ప్రకాశించే ఈశ్వరుని మాట వినగలిగితే అంతులేని ప్రశాంతత మన సొంతమవుతుంది.

4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

కరోనా బోధించే పాఠం

    ఈ రోజుల్లో కరోనా ప్రతివారినీ భయపెడుతోంది. అయితే మనకు నేర్చుకోవాలనే కోరిక ఉండాలి కానీ ఈ కరోనా మనకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను కూడా నేర్పుతుంది. ఈ కరోనా అన్నది కంటితో చూడలేని చాలా సూక్ష్మ కణం. దానంతట దానికి స్వయంసత్తా లేదు. అయితే అది మన శరీరంలోని జీవకణాలతో కలిసిందంటే ఎన్నో లక్షల కోట్ల రెట్లుగా వృద్ధి చెంది మన జీవవ్యవస్థనే నిర్వీర్యం చేసేంత శక్తిని పొందుతుంది. మన మనస్సులో జనించే సంకల్పాలు, బయటి ప్రపంచం నుండి మనం పోగుచేసుకొనే విషయాదుల వాసనలు కూడా ఇలాంటివే. వాటికి విడిగా ఉనికి లేదు. కానీ ఒక్కసారి మన మనసులో చోటిచ్చామంటే ఇక అవి తామరతంపరగా వృద్ధిచెంది చివరికి మనలను మానసికంగా నిర్వీర్యం చేసేంత శక్తిని కూడా పొందుతాయి.

          మరి ఈ కరోనా బారినుంచి తప్పించుకోవాలంటే మూడు ముఖ్యమైన నియమాలు పాటించవలసి ఉంటుంది. అందులో మొదటిది భౌతిక దూరం. అంటే సమాజంలోని ఇతర వ్యక్తులనుంచి వీలైనంత దూరంగా ఉండటం. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ‘అరతిర్జన సంసది’ – జన సమూహంలో ఉండాలనే ఆసక్తి లేకపోవడం, ఇంకా లోతుగా వెళితే ప్రాపంచిక విషయాలయందు ఆసక్తి లేకపోవటం - జ్ఞానం యొక్క లక్షణాలలో ఒకటిగా నిర్వచించారు. ఊరికే పదిమందితో కలవాలనుకోవటం, పోసుకోలు కబుర్లు చెప్పటం, ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ చేరవేయటం – ఇవి అజ్ఞానుల లక్షణాలు. జ్ఞాని ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు కానీ ఈ బయటి విషయాలేవీ ఆయనకు ఆసక్తిని కలిగించవు. ‘బాహ్య స్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యస్సుఖం’ – యోగి బాహ్య స్పర్శలయందు నిరాసక్తుడై తనలో తాను నిత్యం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడని భగవద్గీత మనకు బోధిస్తోంది. ఇదే విషయాన్ని ఇప్పుడు మనకు కరోనా ఆచరణ పూర్వకంగా చూపిస్తోంది.

               ఇక రెండవ నియమం జనసంపర్కం తప్పనప్పుడు మాస్కు ధరించడం. అంటే ఆ జనులనుండి వెలువడిన వైరస్ మనలోకి ప్రవేశించకుండా ప్రధాన ద్వారాలైన ముక్కు, మూతి మూసుకుని ఉండటం అన్నమాట. అలాగే ఆధ్యాత్మికంలో కూడా బయటి విషయాదులు మనలోకి ప్రవేశించే మార్గాలైన మన అయిదు జ్ఞానేంద్రియాలను ఆయా విషయాలకు వ్యతిరేక దిశలో లోపలికి ముడుచుకోవటం చాలా ముఖ్య కర్తవ్యం. ‘యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీమ్ద్రియార్థేషు తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా’ – తాబేలు ఎలా అయితే శత్రువు అలికిడి వినపడగానే తన ఇంద్రియాలన్నింటినీ తనలోనికి లాక్కుంటుందో అలా తన జ్ఞానేంద్రియాలను వాటి వాటి ఇంద్రియార్థాలైన విషయాదులనుండి వెనుకకు ఉపసంహరిచుకో గలిగినవాడే స్థితప్రజ్ఞుడు అని గీతావాక్యం.

               ఇక ఈ రెండు నియమాలను ఎంత జాగ్రత్తగా పాటించినా ఏదో ఒక సందర్భంలో ఆ వైరస్ మన చేతులకు అంటుకునే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది కనుకనే మూడవ నియమంగా తరచూ చేతులను శుభ్రం చేసుకోమన్నారు. అలాగే ఈ ప్రపంచంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రూపంలో ఆయా విషయాదులు మన కంటపడక మానవు. ఇక్కడ కన్ను అంటే కన్ను ఒక్కటే కాదు, ఇది అయిదు జ్ఞానేంద్రియాలకూ వర్తిస్తుంది. అయితే ఆ విషయాలు మన మనసులో వాసనలలాగా అంటుకు పోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మన బుద్ధిని ఉపయోగించి విచారణ ద్వారా వాటిని కడిగివేస్తూ ఉండాలి. కరోనాలాగే విషయాదులు కూడా చాలా జిడ్డువి. ఒకసారి పట్టుకున్నాయంటే అంత తేలికగా వదిలిపెట్టవు. అందుకే మాటిమాటికి ఎక్కువసేపు వాటిని విచారణ అనే సబ్బుతోనూ, ధ్యానాగ్ని అనే తీక్షణమైన సానిటైజర్ తోనూ క్షాళన చేసుకుంటూ ఉండవలసిందే.

          కరోనా వచ్చిన క్రొత్తలో దాని గురించి జనాలలో అవగాహన పెంచటానికి, దాని నుండి రక్షణ కొరకు వారు సామగ్రిని సమకూర్చుకోవటానికి తగిన సమయం పొందటం కొరకు lockdown కొంతవరకు ఉపయోగపడింది. అయితే అది శాశ్వత పరిష్కారం కాదు. మానవుడు సంఘజీవి. సమాజానికి దూరంగా ఒంటరిగా బ్రతకటం ఎక్కువకాలం సాధ్యం కాదు. అందుకే ఒక అవగాహన, సాధన సామగ్రి ఏర్పడిన తరువాత ఇప్పుడు ఆ lockdown ఎత్తివేసి ఎవరి జాగ్రత్తలు వారు పాటిస్తూ సాధారణ జీవితం గడపమంటున్నారు. శ్రీ కాళీ వనాశ్రమం ఏర్పడిన క్రొత్తలో ఇలాగే ఇంచుమించు lockdown పరిస్థితే ఉండేది. ఒకసారి ఆశ్రమంలో నివాసం ఏర్పరచుకున్న తరువాత ఎవరు ఏ పనిమీద బయటకు వెళ్ళాలన్నా శ్రీ గురుదేవుల అనుమతి తీసుకోవటం తప్పనిసరి. తీరా వారి వద్దకు వెళితే ‘ఇప్పుడు నువ్వు వెళ్ళడం అవసరమా? నువ్వు వెళ్ళకపోతే అక్కడ పనులు ఆగిపోతాయా? నువ్వు వెళ్ళి నీ బంధువులనూ, బిడ్డలనూ ఆపదలనుండి, రోగాలనుండి రక్షించగలవా? అదే నువ్వు ఇక్కడ ఉండి చక్కగా సాధన చేసుకుంటే వారి రక్షణ భారం భగవంతుడు తప్పక వహిస్తాడు’ అంటూ శ్రీ గురుబోధ వారిలో సరియైన విచారణను మేల్కొలిపేది. అలా కొంతకాలం ఆశ్రమవాసులందరికీ శిక్షణ ఇచ్చిన తరువాత ఇక నిర్ణయాన్ని వారి వారి విచక్షణకే వదిలివేశారు. వరి పంట కోసిన తరువాత ఆ ధాన్యాన్ని రైతు తూర్పారబడతాడు. అందులో గట్టి గింజలు రైతు పాదాల దగ్గరే పడి ఉంటాయి. తాలు గింజలు గాలికి కొట్టుకుపోతాయి. అలాగే సాధనలో గట్టి గింజలైనవారు ఎన్ని అవాంతరాలు, ఆకర్షణలు వచ్చినా లొంగక ఆశ్రమాన్నే ఆశ్రయించుకొని గురుపాద సన్నిధిలో తమ జన్మలను చరితార్థం చేసుకున్నారు.

               కరోనా ఇతరులనుండి మనకు అంటుకోకుండా చూసుకోవటం ఎంత ముఖ్యమో మననుండి ఇతరులకు వ్యాపించకుండా చూసుకోవటమూ అంతే ముఖ్యం. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో ఈ వైరస్ వచ్చినా అది వారిపై ఎటువంటి ప్రభావమూ చూపదు. కానీ అది వారినుండి ఇతరులకు వ్యాపించే అవకాశాలు తప్పక ఉంటాయి. ఇది వారికి తెలియకుండానే జరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉన్నవారిపై ప్రాపంచిక విషయాలు ప్రభావం చూపకపోవచ్చు. కానీ వారు కూడా తాము మాట్లాడే ప్రతి మాటను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అవి ఇతరులపై దుష్ప్రభావం చూపకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు మార్కెట్లో క్రొత్త ఐఫోన్ వచ్చిందనే విషయం మీరు విని దానిని చాలా తేలికగా తీసుకుని ఉండవచ్చు, కానీ అదే వార్తను మీరు నలుగురితో పంచుకున్నప్పుడు అందులో ఒకరికి ఆ వార్త ఆ ఫోనును పొందాలనే తీవ్రమైన వాంఛను కలిగించి మానసిక అశాంతతకు దారి తీయవచ్చు. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట ఎంతవరకు అవసరమో, అది అవతలివారికి ఎంతవరకు ఉపయోగపడుతుందో గమనించుకుంటూ ఉండాలి. రోగం వచ్చినా రాకున్నా ప్రతివారూ మాస్కులు ధరించాలనే నియమంతో కరోనా మనకు బోధించే పాఠం ఇదే.

21, జూన్ 2020, ఆదివారం

బ్రాహ్మణుడు

వారి వారి గుణాలకు, కర్మలకు అనుగుణంగా నాలుగు వర్ణాలను నేనే సృష్టించానని భగవానుడు స్వయంగా సెలవిచ్చాడు. "జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ భవేత్ ద్విజః" అని పెద్దలు చెబుతారు. అంటే జన్మతః అందరూ శూద్రులే. ఆ తరువాత వారి వారి కర్మలు, సంస్కారాలను బట్టి వివిధ వర్ణాలుగా పరిణామం చెందుతారు. సత్వగుణాన్ని అవలంబించి ఇంద్రియ నిగ్రహము, శౌచము, ఓర్పు, నిజాయితీలను కలిగి ఉండి, జ్ఞాన విజ్ఞానాలను సముపార్జించి, తాను చేసే ప్రతి కర్మలో 'భగవంతుడున్నాడు, అన్నీ చూస్తున్నాడు' అనే విశ్వాసాన్ని ప్రదర్శించే వారు బ్రాహ్మణులు అనబడతారు. అలాగే రాజస గుణాన్ని అవలంబించి శౌర్యం, తేజస్సు, ధైర్యం, పరిపాలనా దక్షత కలిగి ఉండి, యుద్ధంలో పలాయనం చిత్తగించకుండా ఉండటం, దానగుణం కలిగి ఉండటం, తాను ప్రభువుననే భావం కలిగి ఉన్నవారు క్షత్రియులనబడతారు. అలాగే వ్యవసాయం, పాడి పరిశ్రమ, వర్తక వాణిజ్యాది వృత్తులు చేసేవారు వైశ్యులని, మిగిలిన సమాజానికంతటికి పరిచర్యలు, సేవలు చేసేవారు శూద్రులని పిలువబడతారు.

ఇలా వారి వారి వృత్తులు, ప్రవృత్తులను బట్టి ఆయా వర్ణాలు నిర్ణయించబడ్డాయి. శరీరం పనిచేయడానికి ఇంద్రియాలన్నీ ఎలా అవసరమో సమాజం పనిచేయడానికి ఈ వర్ణాల వారందరూ అలాగే అవసరం. ఇందులో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే ప్రశ్నే లేదు. అయితే ఈ సత్యాన్ని గుర్తించకుండా కేవలం ఒక వంశంలో పుట్టినంత మాత్రం చేతనే తామేదో అధికులమని, అగ్రవర్ణం వారమని, మిగిలిన వారు అంటరాని వారని తమ చుట్టూ గిరి గీసుకొని కొందరు తమను తామే మోసం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రక్రియలో నిమ్న వర్ణాలని పిలువబడేవారు అవమానాల పాలవుతూ ఉంటారు. అంతెందుకు, శ్రీ గురుదేవుల బాల్యంలో ఒక ప్రక్క వారి మహిమను గుర్తిస్తూనే మరొక ప్రక్క వారి తల్లిదండ్రులెవరో వారిదే కులమో తెలియదనే వంకతో వారిని దూరం పెట్టి, వారు భుజించిన విస్తరిని వారితోనే తీయించి శుద్ధి చేయించినవారు కొందరున్నారు. 

అయితే నిజమైన బ్రాహ్మణుడు ఎవరో యోగి వేమనవారు ఇలా వివరిస్తున్నారు - 

బమ్మ గుడ్డు యనెడు పట్నంబు లోపల
బమ్మనెరుగలేని బాపడేల?
తన మనంబు దెలియ దానే పో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినుర వేమ!

బ్రహ్మాండం అని పిలువబడే ఈ ప్రపంచంలో బ్రహ్మవస్తువును తెలుసుకోలేనివాడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు? నిజంగా వెదికి చూస్తే, తనలోనూ, సర్వసృష్టిలోనూ నిండియున్నది ఆ బ్రహ్మమే. అట్టి బ్రహ్మవస్తువును తెలుసుకున్నవాడు తానే బ్రహ్మమవుతాడు - "బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి". నిజంగా అలా సకల చరాచర విశ్వమంతా నిండి ఉండి అన్నింటినీ ప్రకాశింపచేస్తున్న పరబ్రహ్మ వస్తువును గుర్తించిననాడు ఇక ఈ కులమత భేదాలు ఎక్కడనుంచి వస్తాయి?

అచల సిద్ధాంతంలో నిష్ణాతురాలైన మా మామ్మగారు శ్రీమతి శేషమ్మగారు ఇలాంటిదే ఒక పద్యం చదివేవారు -

ఆకారము శూన్యంబై రాకడ
పోకడలు లేక రంజిలుచుండే
లోకాతీతుని గానక చీకాకు పడేటి
వారు బ్రాహ్మలే చెప్పుమా!

బ్రహ్మ పదార్థమంటే అది కంటికి కనిపించేది కాదు. "యదృశ్యం తన్నశ్యం" అన్నారు. కంటికి కనిపించేవన్నీ ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేవే. ఈ ఆకారాలన్నీ ఒకప్పటికి వికారాలుగా మారిపోవలసిందే. మరి దేనిని చూసుకొని మనకింత అహంభావం? నేను అగ్రవర్ణం వాడినని విర్రవీగే నీ శరీరమైనా, నీవు అంటరానివాడని చీదరించుకొనే వాని శరీరమైనా చివరికి ఒక చోటికే చేరవలసిందే కదా? ఇక "నేను వేదవేదాంగాలూ చదువుకొని చాలా జ్ఞానం సంపాదించాను, వాడు వట్టి అజ్ఞాని" అంటావా? పిపీలికాది బ్రహ్మపర్యంతం నిండివున్న అసలు తత్వాన్ని తెలిపే వేదాంత సారాన్ని వంటబట్టించుకోకుండా కేవలం శ్లోకాలు, మంత్రాలు వల్లెవేయగలగటం జ్ఞానం ఎలా అవుతుంది? అది కేవలం పాండిత్యమే అవుతుంది.

మనం ఎటువంటి వారమైనా, ఎంతటి అజ్ఞానంలో ఉన్నా, భగవంతుడు ప్రతివారికి వారి వారి జీవితాలలో తమ తప్పును గుర్తించి సరిదిద్దుకునే అవకాశాన్ని తప్పక ప్రసాదిస్తాడు. అందివచ్చిన ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగ పరచుకోకుండా జారవిడుచుకుంటే ఇంక నీవు సంపాదించిన పాండిత్యానికి సార్థకత ఏమున్నది? అయితే అట్టి అవకాశాన్ని ఎవరు ఎలా వినియోగించుకుంటారు అన్నది వారి వారి సంస్కారాన్ని బట్టి, వాసనా పరంపరను బట్టి ఉంటుంది.

శ్రీగురుదేవుల దివ్య చరిత్రలో ఇలా ఒకే పరిస్థితులలో ఒకే రకమైన అవకాశాన్ని పొందిన ఇద్దరిలో ఒకరు దానిని చక్కగా అందిపుచ్చుకొని తమ జన్మను చరితార్థం చేసుకొంటే, ఇంకొకరు దానిని వ్యర్థం చేసుకొని భంగపడ్డారు. అదేమిటో కొంచెం చూద్దాం. కులమతాల పేరుతో తోటి మానవులను నీచంగా చూడడాన్ని శ్రీగురుదేవులు ఎన్నడూ హర్షించేవారు కాదు. వారి సన్నిధిలో అందరూ సమానులే. శ్రీగురుదేవుల భక్తకోటి అంతా అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి ఒకే కుటుంబం. కేవలం తోటి భక్తులనే కాక సృష్టిలోని సకల జీవరాశులను సోదరభావంతో చూడటం వారు నేర్పిన సంస్కారం. ఇక మన రెండు ఉదాహరణలకు వస్తే, ముందుగా శ్రీ లలితానంద సరస్వతీ స్వామినివారు మొదటిసారి శ్రీగురుదేవుల దర్శనార్థం రాజమహేంద్రవరం వచ్చినపుడు అక్కడ భక్తులంతా జాతినీతి కులగోత్రాలకతీతంగా సహపంక్తి భోజనం చేయటం చూడగానే వారికి ఎబ్బెట్టుగా అనిపించింది. కానీ వెంటనే తమలోని వివేకాన్ని మేల్కొలిపి, ఇదే అసలైన వేదాంత విజ్ఞాన సారానికి ఆచరణాత్మక రూపమని గ్రహించి సర్వభూతాత్మకుడైన పరబ్రహ్మను దర్శించే సాధన చేసి, ఆ తరువాత కాలంలో కూడా తమ విజ్ఞాన సర్వస్వాన్నీ స్త్రీపురుష, వర్ణాశ్రమ భేదాలకతీతంగా సర్వులకు సమానంగా పంచిపెట్టి చరితార్థ జన్ములైనారు.

ఇక రెండవవారు కోనసీమకు చెందిన పెద్ద పండితుడు. శ్రీకాళీ వనాశ్రమం స్థాపించిన తొలినాళ్ళలో ఒకసారి ఆయన శ్రీగురుదేవుల దర్శనార్ధమై వచ్చారు. వారికి ఆశ్రమంలో వాతావరణం, భక్తులు చేసే సాధన అన్నీ నచ్చాయి కానీ అందరూ వర్ణాశ్రమాలకతీతంగా సహపంక్తి భోజనం చేయడం మాత్రం ఆయన తట్టుకోలేకపోయారు. ఆనాటి సత్సంగ సభలో శ్రీగురుదేవులు తమ దివ్య బోధామృతాన్ని ముగిస్తూ ఆ పండితునితో "అయ్యా! ఈ నాడు తమవంటి గొప్ప పండితులు మా ఆశ్రమానికి విచ్చేయటం మా అదృష్టం. మీరిక్కడి వ్యవస్థనంతా క్షుణ్ణంగా పరిశీలించారు కదా! మేము ఆచరించే పద్ధతులలో ఏవైనా లోపాలుంటే తమరు దయతో సెలవిస్తే దిద్దుకునే ప్రయత్నం చేస్తాం" అన్నారు. ఆ పండితుడు మంచి అవకాశం దొరికిందనే ఉత్సాహంతో "స్వామీ! ఇక్కడ ఆచరించే సాధనా పద్ధతులన్నీ నాకెంతగానో నచ్చాయి. అయితే ఒక్కటే లోపం. ఇలా నానా వర్ణాల వారందరూ సహపంక్తి భోజనం చేయటం శాస్త్రసమ్మతం కాదు. కాబట్టి తమరు బ్రాహ్మణులకు విడిగా భోజనం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది" అన్నారు.

శ్రీగురుదేవులు తమలో తాము నవ్వుకుని "అయ్యా! తమరు మా మీద దయతో అనుగ్రహించిన ఈ సూచన తప్పక ఆచరించవలసిందే. అయితే మా అమ్మ అయిన జగజ్జనని నాకు కలిగిన సందేహాన్ని తమతో విన్నవించుకోమని సూచిస్తోంది. తమరు రోజూ చీకటి పడ్డాక తమ ఇంటికి ఎడమవైపు సందు చివర్లో ఉన్న ఇంటికి వెడతారు కదూ? ఆ ఇంటిలో ఉన్నామెతో తమరు సరస సల్లాపాలు ఆడటం, మీరిద్దరూ ఒకే గ్లాసులోని పాలు త్రాగటం, ఒకే తాంబూలాన్ని కలిసి సేవించటం ఇంకా ఎన్నెన్నో లీలలు తమరి ముఖారవిందంలో నాకు దర్శనమిస్తున్నాయి. 'ఒరేయ్! ఆ ధన్యురాలి కులమేమిటో, గోత్రమేమిటో ఈ మహాత్ములను అడిగి తెలుసుకోరా!' అంటున్నది మా జగన్మాత. దయచేసి ఆ వివరాలు తెలియజేస్తారా?" అన్నారు.

శ్రీగురుదేవులు మరిన్ని వివరాలు బయట పెడుతుండగానే ఆ పండితుడు క్షమించమని వేడుకుంటూ వారి పాదాలపై పడిపోయాడు. ఇప్పుడు చెప్పండి, వీరిద్దరిలో అసలైన బ్రాహ్మణులెవరు? నిత్యం వేదమాతను సేవిస్తూ కూడా కేవలం శబ్దజ్ఞానంతోనే సరిపెట్టుకొని ఆ వేద సారాన్ని గ్రహించక తాము ఆరాధించే పరమాత్మకు ప్రతిరూపాలైన తోటి జీవరాశిని కించపరుస్తూ 'సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగఛ్చతి' అని తెలుసుకోలేక ఆ పరమాత్మనుండి దూరమైపోయే వారిని చూసి జాలిపడటం తప్ప మనమేమి చేయగలం? శ్రీమద్భాగవతంలో కూడా ఇటువంటి సంఘటనలు మనకు గోచరిస్తాయి. ఒకనాడు శ్రీకృష్ణుని సఖులందరూ ఎంతో ఆకలిగా ఉన్నదంటే ఆయన వారిని ఆ దగ్గరలో యజ్ఞం చేస్తున్న బ్రాహ్మణుల వద్దకు పంపుతాడు. అయితే వారు వీరిని గొల్లపిల్లలని అవమానించి తరిమివేస్తారు. ఈ సారి పరమాత్మ వారిని వెనుకగా వంట ఇంటివైపు వెళ్ళి ఆ బ్రాహ్మణ స్త్రీలను అర్థించమని పంపుతాడు. వారందరూ తమ మహద్భాగ్యానికి ఎంతో సంతోషించి వండిన వంటలన్నీ తెచ్చి పరమాత్మను, ఆయన సఖులను చక్కగా సేవించుకుంటారు. అసలు విషయం ఆలస్యంగా గ్రహించిన ఆ పండితులు తాము కోల్పోయిన భాగ్యానికి తలలు పట్టుకుంటారు. వారి పాండిత్యం దేనికి అక్కరకు వచ్చినట్లు?

శ్రీగురుదేవులు మరొక తమాషా అయిన ఘటన చెప్పేవారు. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు మానవావతారంలో యశోదమ్మ ఇంట అవతరించాడని విన్న ఒక పండితుడు ఆయనను దర్శించుకోవాలనే కోరికతో వ్రేపల్లెకు వస్తాడు. తీరా అక్కడకు వచ్చాక వారు యాదవులనే సంకోచంతో యశోదమ్మ ఇచ్చిన సంభారాలతో స్వయంపాకం మొదలుపెడతాడు. ఆయన అన్నీ వండుకొని, వడ్డించుకొని 'ఓం కేశవాయ స్వాహా' అనగానే కృష్ణయ్య ఎదురుగా ప్రత్యక్షమౌతాడు. 'అయ్యయ్యో! యశోదమ్మా! ఈ గోపబాలుడెవరో వచ్చి నన్ను మైలపరిచేసాడు' అని ఆక్రోశిస్తాడు. ఆ తల్లి వచ్చి పిల్లవానిని మందలించి మళ్ళీ సంభారాలు సమకూరుస్తుంది. ఈసారి 'ఓం నారాయణాయ స్వాహా' అనేసరికి మళ్ళీ చిన్నారి కన్నయ్య ప్రత్యక్షం. ఇంక లాభంలేదని ఈసారి యశోదమ్మ కృష్ణుని ఒక గదిలో బంధించింది. ఆ పండితుడు కూడా తన గది తలుపుకు తాళంమీద తాళం వేసుకుని భోజనానికి కూర్చున్నాడు.

'ఓం మాధవాయ స్వాహా' అనగానే మళ్ళీ స్వామి ప్రత్యక్షం. ఆ పండితుడు నెత్తీనోరూ బాదుకుని మొత్తుకుంటుంటే యశోదమ్మ వచ్చి కృష్ణుని మందలిస్తుంది. అప్పుడాయన "అయ్యో! అమ్మా! ఈ పండితుని వద్దకు రావటం వలన నేను మైలపడిపోయానా? ఇంతకీ మైల అంటే ఏమిటమ్మా? అసలు ఆయన వద్దకు రావలసిన అవసరం నాకేముంది? ఆయనే కేశవా, నారాయణా, మాధవా అని మాటిమాటికీ నన్ను పిలుస్తున్నాడు" అంటాడు. తన కళ్ళను కప్పిన జాత్యహంకారమనే పొర తొలగిన ఆ పండితుడు "అయ్యో! నేను వచ్చినదే తమరి దర్శనార్థం స్వామీ! తీరా తమను చూసేసరికి అసలు విషయం మరచిపోయి, కేవలం కులగోత్రాలనే పట్టించుకొని అహంకారంతో ప్రవర్తించాను. నన్ను క్షమించండి" అని ఆ చిన్నారి కన్నయ్య పాదాలపై వ్రాలిపోతాడు.