20, సెప్టెంబర్ 2011, మంగళవారం

రాక్షస క్రీడ

ప్రస్తుతం నా బ్లాగును చదువుతున్న నా సహాధ్యాయులు MCA లో ఉండగా నేను ఇంతగా మాట్లాడలేదని, నా ఈ భావాలూ వ్యక్తం చెయ్యలేదని దానికి కారణాలు అడుగుతున్నారు. నాకు తెలిసి దానికి కారణం ఒక్కటే - ర్యాగింగ్ అని పిలువబడే రాక్షస క్రీడ.

దీనిని రాక్షస క్రీడ అని ఎందుకు అంటున్నానంటే మనుష్యులు నాలుగు రకాలు. తమకు కష్ట నష్టాలు కలిగినా ఎదుటివారికి సంతోషం కలిగించే వారు మహాత్ములు. తమకు నష్టం లేనంతవరకు ఎదుటివారికి మేలు చేసేవారు మంచివారు. తమ లాభం కోసం ఎదుటివారికి అపకారం చేసేవారు దుష్టులు. తమకు ఎట్టి లాభం లేకపోయినా, చివరికి తమకి నష్టం జరిగిన సరే, ఎదుటివారిని కష్టపెట్టి పైశాచిక ఆనందం పొందేవారు రాక్షసులు.

అసలే బెరుకు బెరుగ్గా కళాశాలలో అడుగు పెట్టిన నేను, సీనియర్లు అని పిలువబడే మా కన్నా ఒక సంవత్సరం ముందు చేరిన వారి చర్యలను చూసి భయపడటం మొదలుపెట్టాను. రెండో రోజునుంచి వంచిన తల ఎత్తే పరిస్థితి లేదు. ఇలా కొన్ని నెలలపాటు అనుభవించాల్సి వచ్చింది. ఠాగూర్ చెప్పినట్లు ఎక్కడ మనస్సు భయం లేకుండా ఉంటుందో, ఎక్కడ మనిషి తల ఎత్తుకుని నిర్భయంగా జీవించగలడో అక్కడ మాత్రమే అతడి మనో వికాసానికి అవకాశం ఉంటుంది.

కేవలం ఒక సంవత్సరం ముందు చేరినంత మాత్రాన వేరొకరి మనోభావాలను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదు. అంతే కాదు. సున్నిత మనస్కులపై ఈ ప్రభావం ఎంతో కాలం ఉంటుంది. ఇప్పటికీ హ్యాపీడేస్ లాంటి చిత్రాలలో ర్యాగింగ్ దృశ్యాలు చూసినప్పుడు నా రక్తం మరిగిపోతుంటుంది.

నిజానికి నా సహాధ్యాయులకి ఈ విషయాలు చాలా చిన్నవిగా అనిపించవచ్చు. ఇతర వృత్తివిద్యా కళాశాలలతో పోలిస్తే, యాజమాన్యం పుణ్యమా అని, మా కళాశాలలో ర్యాగింగ్ స్థాయి చాలా తక్కువే. కానీ ఆ మాత్రం దానికే నాపై ఇంత ప్రభావం పడిందంటే, ఇక పూర్తి స్థాయి ర్యాగింగ్ కు గురయ్యే వారిపై ఇంకెంత ప్రభావం ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇది చదివిన ఒక్కరైనా కనీసం ఒకరిని ఈ వికృత క్రీడకు గురి కాకుండా రక్షించగలిగితే నా ఈ శ్రమ సార్థకమైనట్లే.

22, ఆగస్టు 2011, సోమవారం

కృష్ణం వందే జగద్గురుం

అవతరిస్తూనే తల్లి తండ్రుల భవ బంధాలను త్రెంచివేశాడు. తనను ప్రేమించిన గోపికా గోపాలురకు, ద్వేషించిన రాక్షసులకు కూడా ముక్తిని ప్రసాదించాడు. గోపికల అజ్ఞాన వస్త్రాలను అపహరించి వారికి జ్ఞాన వస్త్రాలను ప్రసాదించాడు. జీవాత్మకు పరమాత్మకు మధ్య అనునిత్యం జరుగుతూ ఉండే అద్భుత క్రీడను రాసలీల రూపంలో మనకు వివరించాడు. ప్రేమకు అందంతో సంబంధం లేదని కుబ్జ ద్వారా నిరూపించాడు. స్నేహానికి అంతస్తులతో పని లేదని కుచేలుని ద్వారా నిరూపించాడు. తనను ఆశ్రయించిన పాండవులను అడుగడుగునా రక్షించాడు. తనను వ్యతిరేకించిన కౌరవులను కూడా మంచి మార్గంలో పెట్టటానికి చివరి వరకు ప్రయత్నించాడు. అన్నా అని అర్థించిన ద్రౌపది మానాన్ని అక్షయ వలువలిచ్చి కాపాడాడు. ఆహవరంగంలో కర్తవ్యతా విమూఢుడై దిశా నిర్దేశానికి ప్రార్థించిన అర్జునుని నెపంగా పెట్టుకుని మానవులందరికీ తరతరాలకీ ఆచారణీయమైన భగవద్గీతను ప్రసాదించాడు. అట్టి జగద్గురుదేవుడైన గీతచార్యునికి జన్మాష్టమి సందర్భంగా నా శత సహస్ర వందనాలు.

20, ఆగస్టు 2011, శనివారం

సహాయం

మొన్న శీతాకాలంలో నేను నా మిత్రుడు మంచులో జాగ్రత్తగా నడుస్తుండగా అతని పక్కనే ఒక స్త్రీ జారి క్రింద పడింది. మా స్నేహితుడు ఆమెను "మీరు బాగానే ఉన్నారా? నేను మిమ్మల్ని పైకి లేపవచ్చా?" అని ఒకటికి నాలుగు సార్లు అడిగి మరీ పైకి లేపాడు. నాకు ఆశ్చర్యం వేసి ఎందుకు అన్ని సార్లు అడిగావు అని అడిగితే అతను ఒక ఆసక్తికరమైన వార్తను చెప్పాడు.

ఆ మధ్యన ఇద్దరు స్నేహితురాళ్ళు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. అందులో ఒక స్త్రీ బాగానే బయటపడింది కానీ రెండవ స్త్రీ కాళ్ళు వాహనంలో ఇరుక్కుపోయాయి. సహాయక బృందం వచ్చేలోగా ఆ వాహనం మండిపోతుందేమో అని భయపడిన మొదటి స్త్రీ తన స్నేహితురాలిని బలవంతంగా బయటకు లాగేసింది. తరువాత వైద్యులు ఆమెకు రెండు కాళ్ళు చచ్చుబడిపోయాయని తేల్చారు. అదే మన దేశంలో అయితే "పోనిలే, సమయానికి ప్రాణాలైనా కాపాడింది" అని కృతజ్ఞత చూపి ఉండేది. కానీ ఇక్కడ ఆ గాయపడిన స్త్రీ తన స్నేహితురాలిపై కొన్ని లక్షల డాలర్లకై దావా వేసింది.

అందుకే ఈ దేశంలో ఎవరికైనా సహాయం చేయాలన్నా ఒకటికి రెండు సార్లు అలోచించి, వారి అనుమతి తీసుకుని మరీ చెయ్యాలి.