6, సెప్టెంబర్ 2025, శనివారం

యోగక్షేమం


అనన్యాశ్చిన్తయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || - భగవద్గీత 9-22

    "ఎవరైతే అన్య చింతన లేకుండా నన్నే లెస్సగా ఉపాసిస్తూ నాయందే నిత్యం మనస్సును లగ్నం చేసి ఉంచుతారో వారి యోగక్షేమాన్ని నేను నా బాధ్యతగా వహిస్తాను" అని గీతాచార్యుడు అభయం ఇస్తున్నాడు. అయితే మనం సాధారణంగా తెలుగులో యోగక్షేమాలు అంటాం. యోగం అంటే కలయిక. మన దగ్గర లేనిదేదో కొత్తగా మనకు లభిస్తే దానిని యోగం అంటాం. ఉదాహరణకి ఒకడికి ధనయోగం ఉందనో రాజయోగం ఉందనో అంటే వాడి దగ్గర అప్పటివరకు లేని సంపదో, అధికారమో వాడికి అందుతుందని అర్థం. అలాగే మనకి దక్కుతుందని ఎంతగానో ఆశించినది చివరి నిముషంలో దక్కకపోతే మనకా యోగం లేదులే అని సరిపెట్టుకుంటాం.

    అలాగే క్షేమం అంటే మన దగ్గర ఉన్నది మనకు దూరమైపోకుండా, ఎవరూ దోచుకోకుండా భద్రంగా మన దగ్గరే ఉండటం. ఎవరైనా దూర ప్రయాణానికి బయలుదేరుతుంటే "క్షేమంగా వెళ్ళి లాభంగా రండి" అంటాం. అంటే నీ దగ్గర ఉన్న ధనాన్ని కానీ, ఆభరణాలను కానీ, లేదా నీ కాళ్ళు చేతులు లాంటి అవయవాలను కానీ ఏమీ పోగొట్టుకోకుండా(క్షేమంగా) వెళ్ళి వీలైతే అనుకున్న పని పూర్తిచేసుకునో, లేదా ఉన్నదానికంటే మరింత సంపాదించో(లాభంగా) తిరిగి రమ్మని కోరుకుంటాం. ఇలా ఈ యోగక్షేమాలు రెండూ వేరువేరు అర్థాలు కల పదాలు.

      అయితే మొన్న శ్రీ కాళీ వనాశ్రమ భాగ్యనగర శాఖలో జరిగిన సత్సంగాలలో శ్రీ మాతాజీ వారు పై గీతా శ్లోకాన్ని ప్రస్తావిస్తూ యోగక్షేమాలు రెండు కదా! మరి భగవానుడు ద్వివచన పదమైన యోగక్షేమౌ అనకుండా ఏకవచన పదమైన యోగక్షేమం అని ఎందుకు అన్నాడు? అని ప్రశ్నిస్తూ దానికి సమాధానంగా ఆయన ప్రసాదించేది క్షేమంతో కూడిన యోగం. అది ఒకటే కానీ రెండు కాదు అన్నారు. దీనిమీద కొంచెం లోతుగా విచారిస్తే మనకు విషయం అర్థం అవుతుంది.

    అంతవరకు మనది కానిది కొత్తగా మనకు లభించడం యోగం అని చెప్పుకున్నాం కదా. అయితే లోకంలో కొత్తగా వచ్చేవన్నీ ఎప్పుడో ఒకప్పటికి పోతాయి అని మనం చూస్తూనే ఉంటాం. మన కళ్ళముందే ఎందరో ఉన్నట్టుండి ధనవంతులుగా మారడం, మరికొంత కాలానికి ఆ వచ్చిన ధనాన్ని నిలబెట్టుకోలేక మళ్ళీ బికారులుగా మారడం మనకు తెలుసు. అలాగే మనం చిన్నప్పుడు చదువుకున్న చదువులో ఎంతవరకు మనకు గుర్తుంది? ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకోకపోతే అది మన స్మృతిపథంనుండి దూరమైపోతుంది.

    అంతెందుకు ఒకప్పుడు లేకుండా ఫలానా తేదీన పుట్టిన మనందరం మరో తేదీన లేకుండా పోతాం కదా! కాబట్టి కొత్తగా మనకు వచ్చేదేదీ శాశ్వతంగా మనతో ఉండదని అర్థం అవుతోంది. అందుకే ఈ ప్రాపంచిక విషయాలన్నింటిలో యోగక్షేమాలు రెండూ వేరు వేరే. యోగంతో వచ్చినది క్షేమంగా ఉంటుందని నమ్మకం లేదు. మరి క్షేమంతో కూడిన యోగం అంటే ఏమిటి? ఎప్పటికీ మననుంచి దూరమైపోకుండా ఉండేది ఏది? అంటే అది సనాతనంగా మనదై ఉన్న మన నిజస్థితి మాత్రమే. అది ఈ శరీరానికో మనస్సుకో పరిమితమైనది కాదు. అది సర్వవ్యాపకమైన ఆత్మతత్త్వం. అదే మన నిజతత్త్వం. 

న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః ।
యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ ॥ భ. గీ. 15-6

    "ఎక్కడైతే సూర్యచంద్రుల ప్రకాశం, అగ్నిదేవుని ప్రకాశం కూడా వెలవెలబోతుందో, ఏ పదాన్ని పొందిన తరువాత ఇక తిరిగి రావడం ఉండదో అదే నాయొక్క పరమపదం" అని పరమాత్మ చెబుతున్నాడు. అదే మన నిజస్థితి. మనం మన ఇల్లు దాటి బయట ఎక్కడికైనా వెళ్ళాము అంటే తిరిగి వచ్చేస్తామనే అర్థం కదా. అలాగే ఒక చోట ఏ సత్సంగానికో, పూజకో, లేక సినిమాకో ఒక వందమంది వచ్చారంటే అది అయిపోగానే అందరూ తిరిగి వాళ్ళ వాళ్ళ స్వస్థలానికి వెళ్ళిపోతారు కదా! అసలు మన సొంతం అనుకున్న ఇల్లే ఎన్నాళ్ళు మనతో ఉంటుందో తెలియదు. ఒకవేళ అది ఉన్నా అందులో మనం ఉండటానికి ఎన్నాళ్ళు ఈ దేహంలో ప్రాణం ఉంటుందో తెలియదు.

    ఒక్కసారి ప్రాణం పోగానే ముందు మన దేహాన్ని ఇంటి బయట పెట్టేస్తారు. కాబట్టి సృష్టిలో మనకు కనిపించే ప్రతీదీ వచ్చిపోయేదే. మరి ఒకసారి వస్తే మళ్ళీ పోని ఆ యోగక్షేమం ఏమిటి? అదే జ్ఞానం. మనం జ్ఞాన స్వరూపులమే అయి ఉన్నాం. అయితే నిప్పుని పొగ క్రమ్మినట్లు మన జ్ఞానాన్ని అజ్ఞానమనే పొర కప్పివేస్తోంది. వయసు పెరుగుతున్నకొద్దీ మన కళ్ళకు పొరలు క్రమ్మి క్రమంగా మన చూపు మందగిస్తుంది కదా. ఒకసారి నేత్రవైద్యుడు ఆ పొరను తొలగిస్తే ఇక అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే జన్మజన్మల నుండి మన జ్ఞాననేత్రాన్ని కప్పి ఉంచిన అజ్ఞాన పొరను గురుదేవులు తొలగిస్తే ఇక మళ్ళీ ఆ పొర క్రమ్ముకోదు. ఒకసారి జ్ఞానాన్ని పొందినవాడు మళ్ళీ అజ్ఞాని కాలేడు. ఇదే నిజమైన యోగక్షేమం.

    ఈ విషయాన్నే వివరిస్తూ శ్రీగురుదేవులు కొన్ని ఉదాహరణలు చెప్పేవారు. ఒకసారి తెల్లబడిన జుట్టు మళ్ళీ నల్లబడదు కదా! జుట్టులోని అసలు రంగు తెలుపే. దానిపైన నలుపు ఆవరించింది. ఒకసారి ఆ నలుపు పొర తొలగిపోతే మళ్ళీ రాదు. అలాగే ఒకసారి పండిన పండు మళ్ళీ పచ్చిగా మారలేదు. విత్తనం పచ్చిగా ఉన్నంతవరకూ దానిలో మొలకెత్తే లక్షణం ఉంటుంది. అది మళ్ళీ మళ్ళీ అనేక వృక్షాలుగా విస్తరిస్తుంది. అదే విత్తనం ఒకసారి కాలిపోతే ఇక మళ్ళీ మొలకెత్తే అవకాశమే లేదు. అలా జ్ఞానాగ్నిలో మన కర్మబీజాలు, వాసనాబీజాలు అన్నీ కాలిపోతే ఇక మళ్ళీ మనం అజ్ఞానంలో పడి తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు.

    అజ్ఞానంలో ఉన్నవాడి జన్మలు వాడి ఇష్టానుసారం రావు. వాడి కర్మలను అనుభవించడానికి వీలైన శరీరమే వాడికి లభిస్తుంది. వాడు ఆ జన్మకు బద్ధుడై ఉంటాడు. అదే జ్ఞాని అయినవానికి ఈ బంధనం లేదు. జన్మ ఎత్తవలసిన అవసరం లేకపోయినా భగవదాజ్ఞను అనుసరించి లోకోపకృతికి ఒకవేళ అతను జన్మించినా అది బంధనం కాదు. పైగా ఇతరులకు కూడా మోక్షదాయకం అవుతుంది. గోతిలో పడ్డ వాడికి, వాడిని పైకి లాగటం కోసం ఆ గోతిలోనే దిగిన వానికి ఎంత తేడా ఉందో వీరిద్దరి జన్మలకు అంత తేడా ఉంది. ఒకరిది జన్మ, మరొకరిది అవతారం. అవతారం అంటే క్రిందకు దిగడం. ఇది జారి పడిపోవడం కాదు. ఇతరులను పైకి లాగడానికి తనంత తానుగా క్రిందకు దిగడం. శరీరం క్రింద ఉన్నా తాను మాత్రం ఎప్పుడూ అత్యున్నతమైన తన నిజస్థితిలోనే ఉంటాడు.

    అటువంటి నిజమైన యోగక్షేమాన్ని పొందాలంటే భగవానుడు చెప్పినట్లుగా ఇతర చింతనలు మాని నిత్య భగవన్నామ స్మరణలో, ఉపాసనలో, ధ్యానంలో, విచారణలో మన మనస్సుని ఊరబెట్టాలి. ఒక్కసారి అటువంటి బ్రాహ్మీస్థితిని పొందామంటే ఇక మన మనస్సు ఎటువంటి ప్రాపంచిక వ్యామోహలకు లోనుకాదు. 

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వా స్యామంతకాలేஉపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి || భ. గీ. 2-72

12, మే 2025, సోమవారం

వైశాఖ పూర్ణిమ

        

    పూర్ణిమ నాడు చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉంటే దానిని వైశాఖమాసం అంటారు. శాఖలు అంటే చెట్టు కొమ్మలు అని మనకు తెలుసు కదా. మరి విశాఖ అంటే కొమ్మలు లేని చెట్టు. అసలు ఏమిటీ చెట్టు అంటే భగవద్గీతలో స్వామి చెప్పాడు.

 
ఊర్ధ్వమూలమధః శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ।।



    సంసారమనే అశ్వత్థ వృక్షానికి మూలం పైన ఉంటుందిట కొమ్మలు క్రిందకి విస్తరించి ఉంటాయిట. దీని గురించి కొంచెం ఆలోచిస్తే అసలు సంసారానికి మూలం నువ్వే. 'నేను' అంటూ ఉన్నప్పుడే 'నాది' అనే ఈ సంసారం అంతా ఉంటోంది. నేనే లేకపోతే సంసారం ఎక్కడిది? అయితే అసలు 'నేను' అయిన ఆత్మను వదిలివేసి మనం ఈ శరీరమే నేను అనుకుంటున్నాం. ఇక ఈ శరీరానికి సంబంధించిన వస్తువులు, వ్యక్తుల మీదకి మన ఆలోచనలు శాఖోపశాఖలుగా విస్తరించి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే సంసారం మనని బంధిస్తోంది.


    మనం ఎప్పుడైతే క్రిందికి (ప్రపంచం వైపుకి) చూడడం మానేసి పైన ఉన్న మూలాన్ని పట్టుకుంటామో అప్పుడు ఈ శాఖలన్నీ వాటంతట అవే రాలిపోతాయి. అయితే దీనికి ఏకాగ్ర బుద్ధి అవసరం. అదే భగవద్గీతలో స్వామి చెబుతూ


వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురునందన |
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోஉ వ్యవసాయినామ్ ||



    నీ కృషి ద్వారా ఆధ్యాత్మిక సాధన ద్వారా బుద్ధిని ఆత్మయందు ఏకాగ్రం చెయ్యి అర్జునా! సాధన లేని బుద్ధి అనేక శాఖలుగా విస్తరించి అనంతంగా ప్రపంచంలో వ్యాపిస్తుంది అని చెబుతున్నాడు. మనకు నిరంతరం మనస్సులో అనేక సంకల్పాలు వస్తూనే ఉంటాయి కదా! అయితే ఆ సంకల్పించిన పని మంచిదా, కాదా? ఇది చేయవచ్చా, చేయకూడదా? అని విచారించి నిర్ణయించేది బుద్ధి. ఎప్పుడైతే ఈ బుద్ధిని మూలపదార్థమైన ఆత్మయందు నిలుపుతామో అప్పుడది ఈ అనిత్యమైన ప్రాపంచిక విషయాలను దానంతటదే వదిలివేస్తుంది. జీవితంలో ప్రతి అడుగులోనూ సరైన నిర్ణయాలు తీసుకొని మనను ఆధ్యాత్మిక పథంలో నడిపిస్తుంది. నిజమైన వైరాగ్యం అంటే ఇదే కదా. అందుకే స్వామి ఈ సంసార వృక్షాన్ని 'అసంగ శస్త్రేణ దృఢేన ఛిత్వా' దృఢమైన వైరాగ్యమనే ఆయుధంతో నరకాలని సూచిస్తున్నారు.


    పరమేశ్వరుని నామాలలో 'ఓం స్థాణవే నమః' అనే నామం ఒకటి. స్థాణువు అంటే ఏ కొమ్మలూ లేని చెట్టు మొదలు. బుద్ధి ప్రపంచంలోకి శాఖోపశాఖలుగా విస్తరించకుండా నిరంతరం తనలో తాను రమిస్తూ సమాధి స్థితిలో ఉంటాడు కాబట్టి ఆయన స్థాణువు. ఈ వృక్షానికి కొమ్మలు లేకపోవడం అనే గుణమే 'విశాఖ'. అది కుమారస్వామి నామం. కొమ్మలే లేకపోతే ఇక ఆకులు ఎక్కడినుంచి వస్తాయి. అలా ఆకులు లేకపోవడం అనే గుణమే 'అపర్ణ'. ఇది పార్వతీదేవి నామం కదా! ఇలా బుద్ధి ప్రపంచంలోకి విస్తరించకుండా ఆత్మయందు లగ్నమయినప్పుడు ఆ ఆత్మ సర్వవ్యాపకమయినది కనుక 'నీవు చూచునదెల్ల నీవే' అనే విశ్వవ్యాపక అనుభూతి కలుగుతుంది. అదే 'విష్ణు'. ఇది గణేశుని నామం. ఇలా సంసారంలోనే ఉంటూ దేనికీ అంటకుండా నిరంతర ఆత్మానందాన్ని ఎలా అనుభవించవచ్చో ఆది కుటుంబమైన పరమేశ్వరుని కుటుంబం మనకు సూచిస్తోంది.


    అలాగే మనోసంసారాన్ని విడిచిపెట్టి ఏకాగ్రబుద్ధితో సాధన చేస్తే ఈ సంసార వృక్షమే బోధివృక్షమై నీలో జ్ఞాన ప్రబోధం కలుగుతుందని నిరూపించిన బుద్ధభగవానుని జయంతి కూడా ఈ వైశాఖ పూర్ణిమ రోజనే. శత్రువు జాడ పొడసూపగానే తాబేలు తన ఇంద్రియాలను లోపలికి లాక్కొని ఎలా రాయిలా మారిపోతుందో ప్రజ్ఞావంతుడయిన మానవుడు తన ఇంద్రియాలను అలా విషయాలనుండి లోపలికి లాక్కొని తనను తాను రక్షించుకోవాలని గీతలో స్వామి చెబుతాడు. అటువంటి కూర్మావతారం వచ్చినది కూడా ఈరోజే. అలాగే సంసారంలో ఉన్న మానవుడు ఎలా భక్తి జ్ఞాన వైరాగ్యములను పెంపొందించుకొని ఆత్మానంద ఫలాన్ని అందుకోవాలో మనందరికీ ప్రత్యక్షంగా నిరూపిస్తూ శృంగార, భక్తి, జ్ఞాన, వైరాగ్య పూరితమైన 32 వేల సంకీర్తనలు తెలుగువారి ఇలవేలుపైన ఆ వేంకటేశ్వరునిపై రచించిన అన్నమాచార్యుల వారి జయంతి కూడా ఈరోజే.


    కాబట్టి ఈ వైశాఖ పూర్ణిమ మనందరికీ అటువంటి వైరాగ్యాన్ని, ఏకాగ్ర బుద్ధిని ప్రసాదించి మన సాధనను పురోగమింపజేయాలని శ్రీ సద్గురుమూర్తిని ప్రార్థిద్దాం.


4, మే 2025, ఆదివారం

విమర్శ



    అశేష జీవరాశులలో భగవంతుడు మానవునికి మాత్రమే ఇచ్చిన వరం బుద్ధి. ఏది మంచి, ఏది చెడు అని విచారణ చేసి మంచిని ఎంచుకొనే శక్తి ఈ బుద్ధికి మాత్రమే ఉంది. ఈ విచారణనే విమర్శ అని కూడా అంటారు. శ్రీ బాబూజీ మహరాజ్ వారు 'మీరు ప్రతిరోజూ రాత్రి పడుకొనే ముందు ఆ రోజు మీరు చేసిన పనులను, ఆలోచనలను ఒకసారి పునరావలోకనం చేసుకొని ఆయా పనులు, లేక ఆలోచనలు ఎంతవరకు మీ సాధనకు ఉపయోగ పడుతున్నాయి? అందులో ఏవేవి మిమ్మల్ని అధోగతి పాలు చేస్తున్నాయి? అని ఆత్మవిమర్శ చేసుకోవటం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి' అని చెప్పేవారు.  ఇటువంటి ఆత్మవిమర్శ వలన ఎప్పటికప్పుడు మనం ప్రయాణించే మార్గం సరియైనదో కాదో మనకు అంచనా వస్తుంది. చెడు మార్గంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసేలోగానే మార్గాన్ని మరల్చుకొని తిరిగి మంచి మార్గానికి రావడానికి అవకాశం ఏర్పడుతుంది.

    అయితే మనలో ఎంతమంది ఇలా ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం? మన జీవితంలో ఎక్కువ భాగం ఇతరులు చేసే పనులలో మంచిచెడులను ఎంచి వారిని విమర్శించడానికే సరిపోతోంది. ఒకవేళ మన తప్పులను అంతరాత్మ ఎత్తి చూపినా, ఆ తప్పు చేయడానికి ఏదో బలవత్తర కారణం ఉందని మనకు మనం సర్ది చెప్పుకొని మన తప్పులని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా మనం చేసే చిన్న చిన్న మంచి పనులను కూడా భూతద్దంలో చూపిస్తూ అందరూ గుర్తించాలని తాపత్రయ పడతాం. ఆత్మస్తుతి, పరనింద ఈ రెండూ మహాపాపాలని మన ఆర్ష ధర్మం బోధిస్తోంది.

    అయితే గురుదేవుల బోధలతో మనం మంచి మార్గంలోకి మారినా, మన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోదు కదా! మనం ఏమి చేసినా అందులో ఏదో ఒక లోపాన్ని పసిగట్టి మనలను విమర్శించేవారు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అలా మనకు విమర్శ ఎదురైనప్పుడు మన మనస్సు తోక త్రొక్కిన త్రాచు లాగా సర్రున లేస్తుంది. అయితే ఇక్కడే మన వివేకాన్ని ఉపయోగించుకొని కొద్దిగా నిదానించాలి. 'వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింప దగున్, కని కల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ'

    ఎవరైనా ఒక మాట అనగానే వెంటనే ఆవేశపడిపోకుండా ఒక్క క్షణం ఆగి వారి మాటలలో నిజానిజాలు తరచి చూసుకోవాలి. ఎందుకంటే ఎంతటి అనుభవజ్ఞుడయినా, తాను చేసే పనిలో ఎంతటి కౌశల్యం సంపాదించినా ఎక్కడో ఒకచోట ఏదో ఒక లోపం ఉండకపోదు. 'సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్ని రివావృతాః' - అగ్ని చుట్టూ ఎప్పుడూ పొగ ఆవరించుకొని ఉన్నట్లే మనం చేసే అన్ని పనులూ ఏదో ఒక దోషంతో ఆవరించుకొని ఉంటాయని సాక్షాత్తూ గీతాచార్యుడే సెలవిచ్చాడు కదా! కాబట్టి మనం ఒక్క క్షణం ఆగి ఎదుటివారి విమర్శలో ఎంతవరకు నిజం ఉన్నదని మనం చేసిన పనినో, మన వ్యక్తిత్వాన్నో ఆత్మవిమర్శ చేసుకొని నిజంగానే అందులో దోషం ఉంటే దానిని సరిచేసుకొనే ప్రయత్నం చేయాలి.

    'అపరాధముల నెంచువారు మాకు ఉపకారులై ఉన్నారు' అన్నారు శ్రీరామదాసు వారు. ఎందుకంటే విమర్శ అనేది మనకు రెండు రకాలుగానూ ఉపకారమే చేస్తుంది. ఒకవేళ వారి విమర్శలో నిజం ఉంటే అది మన తప్పులను మనం తెలుసుకొని సరిదిద్దుకోవడానికి, తద్వారా  ఉన్నత స్థితికి చేరడానికి ఉపయోగపడుతుంది. అదే ఆ విమర్శలో నిజం లేకుండా కేవలం మనను నొప్పించడానికో, కించపరచడానికో చేసినట్లయితే కూడా మనం దానిని సద్బుద్ధితో స్వీకరిస్తే అది మన దుష్కర్మలను కొంతవరకు రహితం చేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ కష్టాన్ని అనుభవిస్తున్నామంటే ఆ విధంగా మన పాపకర్మల భారాన్ని తగ్గించుకుంటున్నామని గుర్తు పెట్టుకోవాలి. అలాగే మనం అనుభవించే సుఖలన్నీ మన సత్కర్మల పుణ్యాన్ని హరించివేస్తుంటాయి.

        ఇలా రెండు రకాలుగా మనకు మంచే చేస్తుంది కాబట్టే విమర్శ మనకు ఎంతో అవసరం. అందుకే జగన్మాత 'విమర్శరూపిణీ'. కాబట్టి విమర్శ చేసేవారిని వ్యక్తిగా చూడకుండా ఈ రూపంలో జగన్మాత మనను మంచిదారిలో పెడుతోందనో, లేక మన దుష్కర్మలను హరిస్తోందనో భావించి విమర్శను ఆనందంగా స్వీకరించడం నేర్చుకోవాలి. అలా స్వీకరించాలంటే ముందు మనం చేసే పనులు, మనమూ ఒకటి కాదని బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎవరైనా మన పనిని విమర్శించారంటే అది మనను కాదని గ్రహించి ఆ పనిలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకుంటే ఇంకా ఉన్నతంగా పని చేయగలుగుతాం. అసలు ముందు మనం ఆ పని ఎందుకు చేస్తున్నామో అన్న విషయాన్ని సదా గుర్తు పెట్టుకొని ఈ విమర్శ ఆ ప్రయోజనంలో ఒక మెట్టు అని గ్రహించాలి. మనమీద వేసే రాళ్ళతోనే మనం మెట్లు కట్టుకొని ఇంకా ఇంకా పైకెదగాలి. 

        అలా కాకుండా ఎప్పుడైతే మనం అవతలి వారిని మన మిత్రులుగానో, శత్రువులుగానో, మనకంటే పెద్దవారిగానో, చిన్నవారిగానో చూస్తున్నామో అప్పుడే మనం వారి విమర్శను గ్రహించే విధానంలో లోపం వస్తుంది. అసలు ముందు మనలో ఏదో తప్పు చేశామన్న అపరాధ భావం ఉంటే ఇక ఎవరు మనవైపు చూసినా, వారిలో వారు మాట్లాడుకుంటున్నా వారు మననే విమర్శిస్తున్నారని, మన గురించే చెడుగా మాట్లాడుకుంటున్నారని మనలో స్థిరమైన అభిప్రాయం ఏర్పడిపోతుంది. అందుకని ముందు ఆత్మవిమర్శ చేసుకొని, మన అపరాధాలను సరిదిద్దుకొని, ప్రతి విమర్శలోనూ వ్యక్తిని చూడటం మానేసి జగన్మాతను చూడటం నేర్చుకొంటే ఇక ఆ మనసుకు సదా శాంతే కదా!