8, జులై 2019, సోమవారం

అహంకారం

సామాన్య పరిభాషలో అహంకారం అంటే గర్వం, దర్పం అనుకుంటాం. కానీ వేదాంత పరిభాషలో అహంకారం అనే మాట రెండు వేరువేరు అర్థాలలో ఉపయోగించబడుతుంది. మొదటిది అహంకార మమకారాలలో ఉండే అహంకారం. 'నేను' అనే భావనే ఈ అహంకారం. ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. అవే కర్తృత్వాహంకారం, భోక్తృత్వాహంకారం. ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు ఆ కర్తవ్యాన్ని తనమీద వేసుకోవటం కర్తృత్వాహంకారం. అంటే 'ఈ పని నేను చేస్తున్నాను' అనుకోవటం అన్నమాట. అయితే కేవలం 'నేను చేస్తున్నాను, లేదా చెయ్యగలను' అనుకోవటమే అహంకారం కాదు. 'ఈ పని నేను చేయలేను, లేదా నాకు చేతకాదు' అనుకోవటం కూడా కర్తృత్వాహంకారమే. అంటే బాధ్యతను భగవంతుని మీద వదిలిపెట్టకుండా తనమీద వేసుకోవటం అన్నమాట. నిజానికి మనమందరమూ ఆ భగవంతుని చేతిలో పనిముట్లమే. మనం కాకపోతే ఆ పని ఇంకొకరు చేస్తారు. ప్రపంచంలో ఏదీ ఎవరికోసమూ ఆగదు. మనం ఉన్నా లేకున్నా ఈ ప్రపంచం యథావిధిగా నడిచిపోతూనే ఉంటుంది. లేనిపోని కర్తృత్వాన్ని మీద వేసుకొని సతమతమయ్యేకంటే హాయిగా భారాన్ని భగవంతునిపై వేసి మన ధర్మాన్ని మనం ఆచరించడమే ఉత్తమం. అప్పుడు దాని ఫలితం మనకు కర్మ రూపంలో అంటదు. 

ఇక ఈ పనికి ఫలితం నేనే అనుభవించాలి అనుకోవటం భోక్తృత్వాహంకారం. చాలామందిని చూస్తుంటాం - 'ఈ పనిలో పుణ్యమంతా నాకే వచ్చెయ్యాలి, ఇంకెవరికీ ఇందులో భాగస్వామ్యం దక్కనివ్వను' అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే మన అంతిమ లక్ష్యం మోక్షం అయినప్పుడు మనం మధ్యలో వచ్చే ఈ పాపపుణ్యాలను పట్టించుకోకూడదు. మన కర్మ అకౌంటులో పాపం బ్యాలన్స్ ఉన్నా పుణ్యం బ్యాలన్స్ ఉన్నా మళ్ళీ జన్మకు రాక తప్పదు. కేవలం పాపపుణ్యాలే కాదు, మనం చేసే పనియొక్క ఫలితంపై ఏమాత్రం దృష్టి పెట్టినా అది భోక్తృత్వాహంకారమే. క్షణికానందం కోసం పాపకర్మల చేసి దీర్ఘకాలంలో దానివలన వచ్చే కష్టాలు, బాధలు మాత్రం తనకు వద్దు అనుకుంటూ ఉంటాడు మానవుడు. ఇది కూడా భోక్తృత్వాహంకారమే. మనం చేసే కర్మలన్నింటినీ భగవదాదేశంగా భావిస్తూ వాటి బాధ్యతను, ఫలాన్ని కూడా ఆయనకే వదలిపెట్టి శ్రద్ధతో చేస్తే అదే కర్మయోగం అవుతుంది. మోక్షానికి దారితీస్తుంది. 

ఇక పైన చెప్పుకున్నట్లు రెండవ అర్థంలో అహంకారం అనే మాట అంతఃకరణ చతుష్టయంలో భాగంగా వస్తుంది. అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్నమాట. వీటిలో మనస్సు సంకల్పిస్తే, చిత్తం రికార్డు చేస్తుంది. బుద్ధి నిర్ణయిస్తే అహంకారం ఆ నిర్ణయాన్ని అమలులో పెడుతుంది. దీనినే పురుషకారం లేదా పురుషప్రయత్నం అని కూడా అంటారు. మనస్సు, బుద్ధి, చిత్తము కంటికి కనపడవు కానీ వాటి నిర్ణయాలు అహంకారము ద్వారా వ్యక్తమై కర్మేంద్రియాల ద్వారా ఆ పని అమలులో పెట్టబడుతుంది. ఈ అహంకారమే లేకపోతే సృష్టిలో ఏ ప్రాణీ ఏ పనీ చేయలేదు. పైన చెప్పుకున్న మొదటిరకం అహంకారం మనకు మోక్షానికి అడ్డంకే కానీ ఈ రెండవ రకం అహంకారం మనకు ప్రతిబంధకం కాదు. మసస్సును బుద్ధికి ఆధీనం చేసి, ఆ బుద్ధిని పరమాత్మయందు నిలిపితే, అప్పుడు ఈ అహంకారం ద్వారా చేయబడే క్రియలన్నీ కూడా లోకహితార్థమే అవుతాయి.

గురుదేవులు శ్రీ బాబూజీ మహారాజ్ వారు ఈ రెండు రకాల అహంకారాలకు రెండు వేరువేరు చికిత్సలు చెప్పేవారు. మొదటిదైన అహంకార మమకారములను వడ్లగింజపై ఉన్న రెండు పొరలతో పోల్చేవారు. ఆ రెండు పొరలు ఉన్నంతకాలం ఆ వడ్లగింజ మొలకెత్తి మళ్ళీ మళ్ళీ అనేక జన్మ పరంపరకు కారణం అవుతుంది. అందుకే ఈ రెండు పొరలను, అంటే అహంకార మమకారములను పూర్తిగా తొలగించుకుంటే కానీ జన్మరాహిత్యం సాధ్యం కాదని చెప్పేవారు. పొరలు తీసివేస్తే వడ్లగింజ బియ్యపుగింజగా మారిపోతుంది కదా? ఎంత నానబెట్టినా బియ్యపుగింజ మళ్ళీ మొలకెత్తుతుందా?

ఇక రెండవ రకం అహంకారం భాగమైన అంతఃకరణ చతుష్టయం అంత చెడ్డదేమీ కాదు. దానిని పూర్తిగా తొలగించుకోవలసిన అవసరం లేదు. శరీరంతో ఉన్నంతకాలం అలా తొలగించుకోవటం సాధ్యం కాదు కూడా. అయితే ప్రపంచం వైపు తిరిగి ఉన్న ఈ నాలుగింటినీ పరమాత్మకు అభిముఖం చేస్తే అప్పుడు మనస్సు సత్యంగాను, దానికి సెక్రటరీ అయిన చిత్తం శాంతిగాను, బుద్ధి దయాస్వరూపంగాను, దానికి సెక్రెటరీ అయిన అహంకారం కళంకరహితమైన ప్రేమ స్వరూపంగాను మారిపోతాయని శ్రీగురుదేవులు వివరించేవారు. 

ఇలా మొదటి రకం అహంకారాన్ని నిర్ములించుకోవటానికి, రెండవ రకం అహంకారాన్ని పరివర్తన చెందించుకోవటానికి మనవంతు కృషిని మనం చేస్తూ ఫలితాన్ని భగవంతునికి వదిలిపెడదాం. ఎప్పుడు ఎవరితో ఏమి చేయించుకోవాలో, ఎప్పుడు ఎవరికి ఏమివ్వాలో ఆయనకే బాగా తెలుసు కదా. అయితే అహంకారాన్ని విడిచిపెట్టడమంటే సోమరితనం కాదు. అలాగే చెడ్డపనులు చేస్తూ 'ఇది నేను చెయ్యట్లేదు, భగవంతుడే నాతో ఇలా చేయిస్తున్నాడు. నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి' అని వంకలు చెప్పడం కాదు. 'నిజంగా భగవంతుడే నాతో అన్నీ చేయిస్తున్నాడు అనే భావన నిశ్చయంగా కలిగినవాడు ఎవ్వడూ చెడ్డపనులు చేయలేడు' అని శ్రీగురుదేవుల ఉవాచ.

26, మే 2019, ఆదివారం

చిత్తకుసుమం


గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః ।
సమర్ప్యైకం చేతస్సరసిజం ఉమానాథ భవతే
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో||

మనం ఈ మధ్యనే శ్రీ శంకర జయంతి జరుపుకున్నాం కదా. శ్రీ మాతాజీవారు తరచుగా శ్రీ శంకరాచార్య విరచితమైన శివానంద లహరిలోని ఈ శ్లోకాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. శంకరులవారు జనుల అవివేకాన్ని ప్రశ్నిస్తూ ఉమానాథుడైన పరమేశ్వరునితో ఇలా అంటున్నారు, "ఓ ఉమానాథా! జడమతులైన ఈ జనులు తమ చిత్తమనే కమలాన్ని నీకు సమర్పించి సుఖంగా కూర్చోవచ్చునని తెలియక బయటి పుష్పాలకోసం లోతైన తటాకాలలో, నిర్జనమైన ఘోరారణ్యాలలో, విశాలమైన పర్వతాలపైన వాటిని వెతుక్కుంటూ ఎంతో కష్టపడుతున్నారు. ఎంత ఆశ్చర్యం!"

అంతఃకరణ చతుష్టయంలో మనస్సు సంకల్పిస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది, అహంకారం ఆ నిర్ణయాన్ని అమలులో పెడుతుంది. అయితే చిత్తం ఈ ప్రక్రియనంతటినీ రికార్డు చేస్తుంది. ఈ రికార్డులే తరువాత జన్మజన్మలకూ వాసనలై మనవెంట పడుతున్నాయి. మన చిత్తంలోని ఈ వాసనలనుండి పుట్టేవే కామక్రోధాది గుణాలు. ఈ వాసనలు కలిగివుండటం వలననే ఇక్కడ స్వామి మనఃపుష్పం అనకుండా చిత్తాన్ని కమలంతో పోల్చారేమో. ఈ వాసనలు మూడు రకాలు - శాస్త్రవాసన, లోకవాసన, దేహవాసన. శాస్త్రాలను ఎంత లోతుగా అధ్యయనం చేసినా ఈ శాస్త్రవాసన ఇంకా పెరుగుతుందే తప్ప తరగదు. అందుకే లోతైన తటాకాలలో వెదికి ఉపయోగం లేదు. అలాగే జనసంద్రాన్ని వదలివేసి ఎంత నిర్జనారణ్యంలో ముక్కు మూసుకొని కూర్చున్నా లోకవాసన వదలటం కష్టం. అందుకే నిర్జనారణ్యాలలో వెదకి ఉపయోగం లేదని స్వామి ఇక్కడ హెచ్చరిస్తున్నారు. ఇక దేహాన్ని పోషించుకొనే క్రమంలో తన వృత్తి ధర్మాచరణలో ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించినా దేహవాసన ఇంకా పెరుగుతుందేకాని తరగదు. అందుకే విశాల శైలాలపై కూడా వెదకి ఉపయోగం లేదు అని స్వామి చెప్తున్నారు. 

ఇక ఇక్కడ పరమేశ్వరుని ఉమానాథ అని సంబోధించడంలో కూడా మనకొక సూచన ఉన్నదనిపిస్తోంది. పార్వతీదేవి పరమేశ్వరుని పతిగా పొందాలనే సంకల్పంతో తన చెలికత్తెలతో కలసి స్వామి తపస్సు చేసుకొనే ప్రదేశానికి చేరి, పైన చెప్పినట్లుగానే రోజూ అనేక పుష్పాలను సేకరించి స్వామిని పూజిస్తూ సపర్యలు చేస్తూ ఎంతోకాలం గడిపింది. అయినా స్వామి మనస్సును మెప్పించలేకపోయింది. చివరికి అమ్మను స్వామితో కలిపే ప్రయత్నంలో మన్మథుడు కూడా దహనం అయిపోయిన తరువాత ఆ తల్లి ఇక బయటి ప్రయత్నాలు వదలివేసి తనలోకి తాను వెళ్ళి ఆ తపస్సుద్వారా స్వామిని పొందాలని నిర్ణయించుకుంది. అయితే ఈ తపస్సును తల్లియైన మైనాదేవి, ఇతర చెలికత్తెలు వారించటంలో భాగంగా "ఆ పని వద్దు, వద్దు" అని చెప్పడంవల్ల ఆమెకు "ఉమ" అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. అయితే ఈ వాసనాత్రయాన్ని జయించిన అమ్మ తనలో తాను లీనమై తపస్సు చేస్తూ ఉండగా ఆ స్వామి తానే స్వయంగా వచ్చి, అమ్మను పరీక్షించి మరీ తనదానిని చేసుకున్నారు.

ఇలాగే మనం కూడా మన ధర్మాన్ని ఆచరిస్తూనే, ఈ సంఘంలో ఉంటూనే చిత్తాన్ని భగవదాయత్తం చేసి మనలోపలి అసలు సత్యాన్ని కూర్చున్న చోటునే ఉండి హాయిగా గుర్తించి, అనుభవించి, ఆ శివానంద లహరిలో ఓలలాడమని జగద్గురువులైన శ్రీ శంకరాచార్య స్వామివారు మనకు ఈ రూపంగా బోధిస్తున్నారు. ఇక్కడ కమలం, వాసనలకు సంబంధించి ఇంకొక చరిత్ర కూడా ఉంది. ఇటీవలే మనం బుద్ధపూర్ణిమ కూడా జరుపుకున్నాం కదా. ఆ బుద్ధ భగవానుడు సిద్ధార్థుడిగా అవతరించే ముందు బోధిసత్వుడిగా అనేక జన్మలు ఎత్తాడనీ, ఆయా జన్మలలో సాధనకు అవసరమైన ఒక్కొక్క గొప్ప విషయాన్ని నేర్చుకున్నాడని జాతక కథలలో చెబుతారు. అటువంటి జన్మలలో ఒకసారి బోధిసత్వుడు ఒక సన్న్యాసిగా జన్మించాడు. ఆయన ఒక అడవిలో నడచి వెళుతూ ఉండగా ఒక ఆటవికుడు అక్కడి తటాకంలో దిగి హాయిగా ఈతకొడుతూ, అందులోని కమలాలని విచ్చలవిడిగా తుంపివేస్తూ ఆడుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఇది గమనించిన బోధిసత్వుడు ఆ తటాకంలోని ఒక కమలానికి ఆకర్షితుడై వంగి దాని సువాసనను ఆఘ్రాణించాడు.

ఇంతలో ఆ తటాకానికి రక్షకుడైన యక్షుడు భీకర స్వరంతో హెచ్చరించాడు, "ఓ సన్న్యాసీ! ఈ పుష్పముయొక్క సువాసనను దొంగిలించే అధికారం నీకు ఎవరిచ్చారు? ఎందుకు ఇంతటి అపరాధానికి ఒడిగట్టావు?" అని. అందుకు బోధిసత్వుడు ఆశ్చర్యంతో, "ఓ యక్షరాజా! నా కళ్ళముందే ఆ ఆటవికుడు అంతటి విధ్వంసం సృష్టించినా మాట్లాడని నీవు కేవలం పుష్పం వాసన చూసినందుకే నేనేదో పెద్ద నేరం చేసినట్లు మాట్లాడుతున్నావే? ఇదేం న్యాయం?" అని ప్రశ్నించాడు. దానికా యక్షుడు సమాధానమిస్తూ, "ఆ ఆటవికుడు అజ్ఞాని. అలా ప్రవర్తించడం అతని స్వభావం. కానీ సర్వసంగ పరిత్యాగం చేసి సన్న్యాసివైన నీవు మళ్ళీ ఒక పువ్వు వాసనకు లోబడిపోవడం ఎంతవరకు సమంజసం? అప్పటికే మురికిపట్టిన వస్త్రంమీద క్రొత్తగా ఎంత పెద్ద మరక అయినా కనిపించదు కదా? అదే స్వచ్ఛమైన తెల్లటి వస్త్రంపై ఏ చిన్న మరక పడినా స్పష్టంగా కనిపిస్తుంది. అలా ఏ చిన్న మరక లేకుండా ఉండగలిగిన నిర్మలాంతఃకరణను సాధించు" అని బోధించాడు.

30, ఏప్రిల్ 2019, మంగళవారం

అనుభవ జ్ఞానం

మనం సాధారణంగా పాఠశాలల్లో చూస్తూ ఉంటాం - సరిగ్గా చదువు రాని వాళ్ళని, చెప్పిన పాఠం అర్థంచేసుకోలేని వాళ్ళని, గుర్తు ఉంచుకోలేని వాళ్ళని, "శుద్ధ మొద్దు అవతారం! నువ్వు జీవితంలో ఎందుకు పనికి వస్తావు?" అంటూ తోటి విద్యార్థులు, ఒక్కొక్కసారి ఉపాధ్యాయులు కూడా అవమానిస్తూ, ఎత్తిపొడుస్తూ ఉంటారు. ఫస్ట్ ర్యాంకులు, స్టేట్ ఫస్టులు వచ్చిన వాళ్ళ ఫోటోలు పేపర్లో చూసి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని తిడుతూ ఉంటారు. అయితే చదువు జీవితంలో ఒక భాగమే కానీ అదే జీవితం కాదని మనందరికీ తెలిసిందే కదా! కేవలం పుస్తకంలో ఉన్నది బట్టీపట్టో, అర్థం చేసుకొనే అడగగానే సమాధానాలు చెప్పగలిగేవాడికంటే సమాజాన్ని చదివి, ఎలా జీవించాలో, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలో, అవి లేనప్పుడు ఎలా వాటిని కల్పించుకోవాలో అనుభవం ద్వారా తెలుసుకున్నవాడే జీవితంలో ఎక్కువగా రాణించగలుగుతాడు. కేవలం పుస్తకాలే జీవితంగా బ్రతికినవాడి ఫోటో ఒకసారి పేపర్లో పడినా, ఆ తరువాత ఎలా జీవించాలో తెలియకపోతే వాడు చాలా అతి సామాన్యమైన జీవితాన్నే జీవించవచ్చు. చదువు వంటపట్టక పరీక్షలు తప్పినవాడు కూడా ఎలా జీవించాలో తెలిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. మనకు తెలిసిన ఎందరో కోటీశ్వరులు సరైన చదువు లేనివారే, కానీ జీవితాన్ని చదివినవారు.

ఇదే సూత్రం ఆథ్యాత్మికంలో కూడా వర్తిస్తుంది. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శక్తిని ఇస్తాడు. మనందరమూ ఆయన చేతిలో పనిముట్లమే. ఏ పనిముట్టు ఎందుకు పనికివస్తుందో, దానిని ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఒకరు చక్కగా పాడగలుగుతారు. మరొకరు చక్కగా వ్రాయటమో వేదికలెక్కి ఉపన్యాసాలు చెప్పడమో చేయగలుగుతారు. మరొకరు ఎంతటి లోతైన వేదాంత విషయాలనైనా సులభంగా అర్థం చేసుకొని, గుర్తు పెట్టుకొని, మళ్ళీ చెప్పగలుగుతారు. అంతమాత్రంచేత వారంతా ఏదో సాధించేశారనో, ఇవేవి చేతకానివారు ఎందుకూ పనికిరాని వారనో అర్థం కాదు. అనుభవ జ్ఞానం ముందు పుస్తక జ్ఞానం, పాండిత్యం ఎప్పటికీ దిగదుడుపే. పంచభూతాలు, దశేన్ద్రియాలు, పంచ తన్మాత్రలు, షట్చక్రాలు, గుణత్రయం, వాసనాత్రయం, ఈషణత్రయం, సాధన చతుష్టయం ఇలా టకాటకా అన్నీ అప్పచెప్పే వ్యక్తి తనలో ఏదైనా గుణం ప్రేరేపించినప్పుడు ఎంతవరకు తట్టుకుని నిలబడగలుగుతాడు? ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? అదే ఇవేమీ తెలియకపోయినా నిరంతరం భగవన్నామం చేసుకుంటూ తనకు జీవితంలో వచ్చే కష్టసుఖాలన్నింటినీ సమదృష్టితో భగవంతుని ప్రసాదంగా స్వీకరించే భక్తుడు తప్పక నిలబడగలుగుతాడు. ఇక్కడ శాస్త్రజ్ఞానం కన్నా అనుభవ జ్ఞానమే మిన్న కదా!

పుస్తక జ్ఞానం, లేదా శాస్త్రజ్ఞానం ఒక జన్మకే పరిమితమైనది. మరి మన ఆథ్యాత్మిక సాధన జన్మజన్మాంతరాల నుంచీ జరుగుతూనే ఉంది. "సాధనామార్గంలో ఉన్న మానవుడు కర్మవశం చేత మధ్యలోనే జన్మ చాలించవలసి వస్తే అతని సాధన అంతా వృథాయేనా?" అని భగవద్గీతలో అర్జునుడు వెలిబుచ్చిన సందేహానికి గీతాచార్యుడు "అటువంటి భయమేమీ అక్కర్లేదు. ఒక జన్మలో సాధన పూర్తికాక యోగభ్రష్టుడైన సాధకుడు ఎక్కడైతే తన సాధన ఆపాడో తరువాత జన్మలో అక్కడనుండి తన సాధనను కొనసాగించి చివరికి కృతకృత్యుడౌతాడు" అని భరోసా ఇచ్చాడు కదా! మరి ఇదే సూత్రం పుస్తక జ్ఞానానికి వర్తిస్తుందా? ఈ జన్మలో డిగ్రీ చదువుకున్న మానవుడు వచ్చే జన్మలో నేరుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానంటే కుదురుతుందా? మళ్ళీ అతను ఆ జన్మలో నర్సరీనుంచి మొదలు పెట్టవలసిందే కదా! ఇంక ఈ పుస్తక జ్ఞానంతో ఉపయోగం ఏమిటి? "సింహం అడవికి రాజు. అది గర్జించును. దాని పంజా దెబ్బ చాలా గట్టిగా ఉండును" అని ఎన్నిసార్లు వల్లెవేసినా వీడు సింహం కాలేడు కదా! అదే ఇవేమీ చదవకపోయినా, అసలు తనని సింహం అంటారని తెలియకపోయినా ఒక సింహం ఇవన్నీ సహజంగానే చేస్తుంది కదా. అదే పుస్తక జ్ఞానికి, నిజమైన భక్తుడు, లేదా అనుభవ జ్ఞానికి ఉన్న తేడా.

మనం శాస్త్రాలను ఎంతగా వల్లెవేసినా ఆ విద్యతో భగవంతుని మెప్పించలేం. ఎవరైనా మనకు తెలియని విద్యని ప్రదర్శిస్తే 'అబ్బో!' అని ఆశ్యర్యపోతాం, మెచ్చుకుంటాం. అదే మనకు బాగా తెలిసిన విద్యనే ప్రదర్శిస్తే "ఆ! చేశాడులే" అని చప్పరించేస్తాం. మరి ఈ లోకంలోని పుస్తక జ్ఞానమంతా భగవంతుని నుంచి వచ్చిందే కదా. ఇందులో ఆయనకు తెలియనిది, ఆయనను అబ్బురపరిచేది ఏముంటుంది? మరి ఆయనను ఇంప్రెస్ చెయ్యడం ఎలా? అంటే ఆయనకు తెలియనిది, అనుభవంలో లేనిది ఒకటి ఉంది. అదే భక్తి. దానితోనే మనం అయన హృదయాన్ని గెలుచుకోగలం. "ఎందరో భక్తులు నామీద ఇంతటి ప్రేమను చూపిస్తున్నారు. నన్ను చూడకుండా, సేవించకుండా ఉండలేకపోతున్నారు. అసలు ఈ భక్తి, ప్రేమ ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం" అనే ఉత్సుకతతోనే శ్రీకృష్ణుడు తానే రాధ రూపాన్ని ధరించి భక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడని మనకు పెద్దలు చెబుతారు. అలాగే "అందరూ నా పాదాలను విడిచిపెట్టకుండా సేవిస్తూ ఉంటారు. అసలు ఈ పాదాలలో ఉన్న మాధుర్యం ఏమిటో చూద్దాం" అని ఆయన సృష్టి అంతా లయమైపోయిన తరువాత వటపత్రశాయియై తన కాలి బొటనవ్రేలుని తనే నోట్లో పెట్టుకొని ఆస్వాదిస్తూ ఉంటాడని కూడా చెబుతారు. కాబట్టి నిజంగా భగవంతుని మెప్పించేది భక్తి, అనుభవ జ్ఞానాలే కానీ పాండిత్యమూ, శాస్త్రజ్ఞానమూ కాదు.