గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః ।
సమర్ప్యైకం చేతస్సరసిజం ఉమానాథ భవతే
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో||
మనం ఈ మధ్యనే శ్రీ శంకర జయంతి జరుపుకున్నాం కదా. శ్రీ మాతాజీవారు తరచుగా శ్రీ శంకరాచార్య విరచితమైన శివానంద లహరిలోని ఈ శ్లోకాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. శంకరులవారు జనుల అవివేకాన్ని ప్రశ్నిస్తూ ఉమానాథుడైన పరమేశ్వరునితో ఇలా అంటున్నారు, "ఓ ఉమానాథా! జడమతులైన ఈ జనులు తమ చిత్తమనే కమలాన్ని నీకు సమర్పించి సుఖంగా కూర్చోవచ్చునని తెలియక బయటి పుష్పాలకోసం లోతైన తటాకాలలో, నిర్జనమైన ఘోరారణ్యాలలో, విశాలమైన పర్వతాలపైన వాటిని వెతుక్కుంటూ ఎంతో కష్టపడుతున్నారు. ఎంత ఆశ్చర్యం!"
అంతఃకరణ చతుష్టయంలో మనస్సు సంకల్పిస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది, అహంకారం ఆ నిర్ణయాన్ని అమలులో పెడుతుంది. అయితే చిత్తం ఈ ప్రక్రియనంతటినీ రికార్డు చేస్తుంది. ఈ రికార్డులే తరువాత జన్మజన్మలకూ వాసనలై మనవెంట పడుతున్నాయి. మన చిత్తంలోని ఈ వాసనలనుండి పుట్టేవే కామక్రోధాది గుణాలు. ఈ వాసనలు కలిగివుండటం వలననే ఇక్కడ స్వామి మనఃపుష్పం అనకుండా చిత్తాన్ని కమలంతో పోల్చారేమో. ఈ వాసనలు మూడు రకాలు - శాస్త్రవాసన, లోకవాసన, దేహవాసన. శాస్త్రాలను ఎంత లోతుగా అధ్యయనం చేసినా ఈ శాస్త్రవాసన ఇంకా పెరుగుతుందే తప్ప తరగదు. అందుకే లోతైన తటాకాలలో వెదికి ఉపయోగం లేదు. అలాగే జనసంద్రాన్ని వదలివేసి ఎంత నిర్జనారణ్యంలో ముక్కు మూసుకొని కూర్చున్నా లోకవాసన వదలటం కష్టం. అందుకే నిర్జనారణ్యాలలో వెదకి ఉపయోగం లేదని స్వామి ఇక్కడ హెచ్చరిస్తున్నారు. ఇక దేహాన్ని పోషించుకొనే క్రమంలో తన వృత్తి ధర్మాచరణలో ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించినా దేహవాసన ఇంకా పెరుగుతుందేకాని తరగదు. అందుకే విశాల శైలాలపై కూడా వెదకి ఉపయోగం లేదు అని స్వామి చెప్తున్నారు.
ఇక ఇక్కడ పరమేశ్వరుని ఉమానాథ అని సంబోధించడంలో కూడా మనకొక సూచన ఉన్నదనిపిస్తోంది. పార్వతీదేవి పరమేశ్వరుని పతిగా పొందాలనే సంకల్పంతో తన చెలికత్తెలతో కలసి స్వామి తపస్సు చేసుకొనే ప్రదేశానికి చేరి, పైన చెప్పినట్లుగానే రోజూ అనేక పుష్పాలను సేకరించి స్వామిని పూజిస్తూ సపర్యలు చేస్తూ ఎంతోకాలం గడిపింది. అయినా స్వామి మనస్సును మెప్పించలేకపోయింది. చివరికి అమ్మను స్వామితో కలిపే ప్రయత్నంలో మన్మథుడు కూడా దహనం అయిపోయిన తరువాత ఆ తల్లి ఇక బయటి ప్రయత్నాలు వదలివేసి తనలోకి తాను వెళ్ళి ఆ తపస్సుద్వారా స్వామిని పొందాలని నిర్ణయించుకుంది. అయితే ఈ తపస్సును తల్లియైన మైనాదేవి, ఇతర చెలికత్తెలు వారించటంలో భాగంగా "ఆ పని వద్దు, వద్దు" అని చెప్పడంవల్ల ఆమెకు "ఉమ" అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. అయితే ఈ వాసనాత్రయాన్ని జయించిన అమ్మ తనలో తాను లీనమై తపస్సు చేస్తూ ఉండగా ఆ స్వామి తానే స్వయంగా వచ్చి, అమ్మను పరీక్షించి మరీ తనదానిని చేసుకున్నారు.
ఇలాగే మనం కూడా మన ధర్మాన్ని ఆచరిస్తూనే, ఈ సంఘంలో ఉంటూనే చిత్తాన్ని భగవదాయత్తం చేసి మనలోపలి అసలు సత్యాన్ని కూర్చున్న చోటునే ఉండి హాయిగా గుర్తించి, అనుభవించి, ఆ శివానంద లహరిలో ఓలలాడమని జగద్గురువులైన శ్రీ శంకరాచార్య స్వామివారు మనకు ఈ రూపంగా బోధిస్తున్నారు. ఇక్కడ కమలం, వాసనలకు సంబంధించి ఇంకొక చరిత్ర కూడా ఉంది. ఇటీవలే మనం బుద్ధపూర్ణిమ కూడా జరుపుకున్నాం కదా. ఆ బుద్ధ భగవానుడు సిద్ధార్థుడిగా అవతరించే ముందు బోధిసత్వుడిగా అనేక జన్మలు ఎత్తాడనీ, ఆయా జన్మలలో సాధనకు అవసరమైన ఒక్కొక్క గొప్ప విషయాన్ని నేర్చుకున్నాడని జాతక కథలలో చెబుతారు. అటువంటి జన్మలలో ఒకసారి బోధిసత్వుడు ఒక సన్న్యాసిగా జన్మించాడు. ఆయన ఒక అడవిలో నడచి వెళుతూ ఉండగా ఒక ఆటవికుడు అక్కడి తటాకంలో దిగి హాయిగా ఈతకొడుతూ, అందులోని కమలాలని విచ్చలవిడిగా తుంపివేస్తూ ఆడుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఇది గమనించిన బోధిసత్వుడు ఆ తటాకంలోని ఒక కమలానికి ఆకర్షితుడై వంగి దాని సువాసనను ఆఘ్రాణించాడు.
ఇంతలో ఆ తటాకానికి రక్షకుడైన యక్షుడు భీకర స్వరంతో హెచ్చరించాడు, "ఓ సన్న్యాసీ! ఈ పుష్పముయొక్క సువాసనను దొంగిలించే అధికారం నీకు ఎవరిచ్చారు? ఎందుకు ఇంతటి అపరాధానికి ఒడిగట్టావు?" అని. అందుకు బోధిసత్వుడు ఆశ్చర్యంతో, "ఓ యక్షరాజా! నా కళ్ళముందే ఆ ఆటవికుడు అంతటి విధ్వంసం సృష్టించినా మాట్లాడని నీవు కేవలం పుష్పం వాసన చూసినందుకే నేనేదో పెద్ద నేరం చేసినట్లు మాట్లాడుతున్నావే? ఇదేం న్యాయం?" అని ప్రశ్నించాడు. దానికా యక్షుడు సమాధానమిస్తూ, "ఆ ఆటవికుడు అజ్ఞాని. అలా ప్రవర్తించడం అతని స్వభావం. కానీ సర్వసంగ పరిత్యాగం చేసి సన్న్యాసివైన నీవు మళ్ళీ ఒక పువ్వు వాసనకు లోబడిపోవడం ఎంతవరకు సమంజసం? అప్పటికే మురికిపట్టిన వస్త్రంమీద క్రొత్తగా ఎంత పెద్ద మరక అయినా కనిపించదు కదా? అదే స్వచ్ఛమైన తెల్లటి వస్త్రంపై ఏ చిన్న మరక పడినా స్పష్టంగా కనిపిస్తుంది. అలా ఏ చిన్న మరక లేకుండా ఉండగలిగిన నిర్మలాంతఃకరణను సాధించు" అని బోధించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి