28, డిసెంబర్ 2024, శనివారం

భీమవరం

    భీమ అంటే భయంకరమైన అనే అర్థమే కాకుండా ఈ జగత్తుకంతటికీ జననీ జనకులైన పార్వతీ పరమేశ్వరులిద్దరికీ భీమ నామధేయం వర్తిస్తుంది. ఆ పరమేశ్వరుడే భీమవరంలో శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ సోమేశ్వర స్వామివార్లుగా వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. అలా పంచారామ క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న భీమవరంలో జగన్మాత శ్రీ మావుళ్ళమ్మగా వెలసి పూజలందుకుంటోంది. మనస్సుకు అధిపతియైన చంద్రునిచే ప్రతిష్టింపబడిన శ్రీ సోమేశ్వర స్వామి పౌర్ణమినాడు నిండు వెన్నెలలు కురుస్తూ ధవళవర్ణంలో ప్రకాశిస్తూ, ఒక్కొక్క రోజు గడుస్తున్నకొద్దీ మెల్లగా కాంతి తగ్గించుకొని అమావాస్యనాటికి నల్లగా మారిపోతారు. మళ్ళీ ఒక్కొక్కరోజూ కాంతిని పెంచుకొంటూ పౌర్ణమి నాటికి పూర్తి తెల్లదనాన్ని సంతరించుకుంటారు. ఇలా భగవద్గీతలో స్వామి చెప్పిన శుక్ల కృష్ణ గతులను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ పునరావృత్తి రహిత స్థితిని పొందాలంటే శుక్లమార్గమైన ఆధ్యాత్మిక పథంలో ప్రయాణించాలని మనకు సూచిస్తూ ఉంటారు.

    అలాగే మావుళ్ళమ్మ తల్లి సన్నిధిలో సాధన చేసి శ్రీ చల్లా కృష్ణమూర్తి గారు, శ్రీ తనికెళ్ళ చలపతిరావు గారు వంటి సాధకులు ఎన్నెన్నో దివ్యానుభూతులను పొందారు. తనను పొందాలని ఎన్నో కోట్ల సంవత్సరాలనుండి ఎందరో సాధకులు తలక్రిందులుగా తపస్సులు చేస్తుంటే 'నేనూ మీలో ఒకడినేరా!' అన్నట్లుగా ఆ జగత్పిత భీమవరం సమీపంలోని యనమదుర్రు గ్రామంలో శీర్షాసనంలో పద్మాసనం వేసుకొని వెలిశారు. ఆయనకు తోడుగా లోకాలనేలే జగన్మాత పచ్చి బాలింతరాలుగా కుమారస్వామిని ఒడిలో ఉంచుకొని తన జ్ఞాన క్షీరాలను ప్రసాదిస్తూ వెలసింది. ఇటువంటి పవిత్ర భూమిలో ఉన్న ఎందరో సాధకులను, జిజ్ఞాసులను, ఆర్తులను ఉద్ధరించి భీమ భవార్ణవం (భయంకరమైన సంసార సాగరం) దాటించి తరింపజేయడానికి ఆ జగజ్జననీ జనకులిద్దరూ ఒకే రూపాన్ని ధరించి మానవాకృతిలో 'సమర్థ సద్గురు శ్రీ శ్రీ శ్రీ హనుమత్కాళీ వర ప్రసాద బాబూజీ మహరాజ్'గా ఈ ప్రాంతంలో కొన్ని దశాబ్దాలపాటు సంచరించి ఈ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా మార్చారు.

    సర్వాధిష్టాన చైతన్య స్వరూపులైన శ్రీగురుదేవులు ఎవరెవరి ఆధ్యాత్మిక స్థాయికి తగ్గట్లుగా వారికి మార్గాన్ని ఉపదేశించి వారి వారి సాధనలో తోడునీడగా ఉంటూ తరింపజేశారు. శ్రీ కందర్ప పరశురామయ్య గారు (యనమదుర్రు),  శ్రీ లలితానంద సరస్వతీ స్వామిని వారు, శ్రీ కొప్పెర్ల వెంకటరాజు గారు (పెదనిండ్రకొలను), శ్రీమతి యర్రాప్రగడ శేష(గిర)మ్మగారు (భీమవరం తాతయ్యగారి పెద్ద కుమార్తె) వంటి సిద్ధ పురుషులతో తత్వ విచారణ చేసేవారు. శ్రీ విఠాల కామయ్య శాస్త్రిగారు (కోరుకొల్లు), శ్రీ చల్లా కృష్ణమూర్తి గారు, శ్రీ కలిదిండి నరసింహ రాజుగారు (దిరుసుమర్రు), శ్రీ తనికెళ్ళ చలపతి రావుగారు వంటి సాధకులకు వారు స్మరించినప్పుడల్లా దర్శనమిచ్చి మార్గదర్శనం చేసేవారు. ఏ ఆధ్యాత్మిక గంధమూ లేని భీమవరం తాతయ్య (శ్రీ పాలూరి శ్రీరామమూర్తి)గారి వంటి వారిని నిరంతరం నవ్విస్తూ, చక్కిలిగింతలు పెడుతూనే పరమమైన బ్రహ్మానందాన్ని అనుభవంలోకి తెచ్చేవారు. ఏ మంత్రాలు రాని పాలూరి సీతమ్మగారికి 'పాటల పూజ'తోనే దివ్యానుభవాలను ఎన్నెన్నో ప్రసాదించారు.

    తమను అవమానించాలని చూసిన ఎందరో ధూర్తులకు కళ్ళు తెరిపించి సన్మార్గంలో పెట్టారు. చివరికి ఈ ఊరిలోని రిక్షావారితో కూడా పావలా నుండి పదిపైసల వరకు బేరాలాడుతూ ఆ వంకతో వారితో ఎంతో దూరం కలిసి నడుస్తూ భగవత్సన్నిధిలో కలిగే ఆనందాన్ని వారికి తెలియకుండానే వారితో అనుభవింపజేశారు. నిత్యం తమ దర్శనార్థమై వచ్చే ఎందరో భక్తుల రకరకాల సంసార విషయిక ఆర్తులను తీర్చి వారికి ఉపశాంతి, మార్గదర్శనం చేశారు. బృందావనంలో శ్రీకృష్ణుడు చూపించిన దివ్య లీలలన్నీ ఇక్కడ చూపించారు. ఇలా భీమవరం ప్రాంతంలోని ఎందరో భక్తుల ఎన్నెన్నో జన్మలనుండి కించిత్ కించిత్‌గా పోగుపడి రాశీభూతమైన పుణ్యఫలాన్ని ఈ జన్మలో అనుభవంలోనికి తీసుకొని రావడానికై తమకు తాముగా ఆ పరబ్రహ్మమే ఆకారం దాల్చి తరలి వచ్చిన గొప్ప వరం శ్రీగురుదేవులు.

    అట్టి దయామయులైన శ్రీగురుదేవులు గుంటూరు జిల్లా నంబూరు సమీపంలో శ్రీ కాళీ వనాశ్రమాన్ని స్థాపించిన తరువాత కూడా ఈ భీమవరం ప్రాంతం పైనున్న వారి దివ్య వాత్సల్యాన్ని ప్రకటిస్తూ తమకు తాముగా శ్రీ భీమవరం తాతయ్యగారి కుటుంబం నుండి 'ఉండి' రోడ్డులోని కొంత స్థలాన్ని అడిగి తీసుకొని అక్కడ మరొక ఆశ్రమాన్ని స్థాపించాలని సంకల్పించారు. సత్య సంకల్పులైన శ్రీవారి దివ్య సంకల్పం ఇన్నాళ్ళకు ఫలించి భవ్యమైన బృందావనంగా శ్రీగురుదేవుల, దివ్యమంగళ మూర్తితో, అలాగే శ్రీకాళీ వనాశ్రమంలో వెలసిన ఇతర దేవతల ఉపాలయాలతో, అన్నదాన, వసతి భవనాలతో సర్వాంగ సుందరంగా రూపు దిద్దుకుంటోంది.

    2025 మార్చి 12వ తేదీన ఆశ్రమ ప్రవేశము, అనంతరం హోమాలు, అధివాసాలు, సామూహిక పూజలు, పారాయణలు, సత్సంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటూ 17వ తేదీన శ్రీగురుదేవుల, ఇతర దేవతామూర్తుల ప్రతిష్టా మహోత్సవం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఆస్తిక మహాశయులందరూ విచ్చేసి, పాల్గొని, ఆ మహదానందంలో భాగస్వాములై తరించాలని, భీమవరానికి లభించిన ఇట్టి మహత్తర వరాన్ని సద్వినియోగ పరచుకోవాలని అందరికీ ఇదే ఆహ్వానం.

15, డిసెంబర్ 2024, ఆదివారం

మేలుకొలుపు

 

    పూర్వకాలపు కథలలో కానీ, సినిమాలలో కానీ మనం చూస్తే ప్రతి ఇంటిలో ముందుగా ఆ ఇంటి ఇల్లాలు నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి, వంట చేసి అప్పుడు భర్తను మేలుకొలపడం కనిపిస్తుంది. "తరుణి సీతమ తల్లి గృహవిధుల మునిగింది, తిరిగి శయనించేవు మర్యాద కాదయ్య, మేలుకో శ్రీరామా!" అని మనకు పాట కూడా ఉంది. అలాగే మన పురాణాలలో గమనిస్తే రాక్షసులు అందరూ కేవలం స్వార్థంతో తమకు శక్తి రావాలనో, మరణం రాకూడదనో వరాల కోసం తీవ్ర తపస్సులు చేశారు కానీ, వారి భార్యలు మాత్రం పతివ్రతలై తమ భర్త బాగు కోసం వ్రతాలు ఆచరించేవారు. వారి పాతివ్రత్య ఫలితంగా ఆ రాక్షసులు అజేయులై నిలిచేవారు. త్రిపురాసురులు, జలంధరుడు వంటి రాక్షసులను మహాదేవుడు సంహరించాలంటే విష్ణుమూర్తి వారి భార్యలను ఏమార్చవలసి వచ్చేది. అందుకు ఆయన శాపాలను కూడా పొందవలసి వచ్చింది. స్త్రీమూర్తుల నిస్వార్థ సాధన యొక్క శక్తి అంతటి గొప్పది.

    పూజ, ఆరాధన, సాధన, పుష్ప, హారతి, కీర్తన, నివేదిత, సింధూర, అక్షత ఇలా పూజలకు సంబంధించిన పేర్లన్నీ ఆడ పేర్లే! వాటి ఫలితానికి సంబంధించిన తీర్థ్, ప్రసాద్ మాత్రం మగ పేర్లు. కేవలం నీళ్ళు పోయడం తప్ప ఇంకే కష్టమూ లేని అభిషేక్ మాత్రం మగవారు ఉంచుకున్నారు లెండి. ఇలా పుణ్యకర్మలన్నీ ఆడవారు చేస్తే ఫలితం మాత్రం మగవారు అనుభవిస్తున్నారు. అయితే మన శ్రీకాళీ వనాశ్రమంలోని ఆలయంలో ప్రతిరోజూ ముందుగా శ్రీ రామలింగేశ్వర స్వామివారిని మేల్కొలిపి ఆ తరువాతే జగన్మాత శ్రీ మహా కాళికా పరమేశ్వరీ దేవిని మేల్కొలపడం జరుగుతుంది. అమ్మ ఈ దృశ్యమాన జగత్తుకు ప్రతీక అయితే పరమేశ్వరుడు అందులో కూటస్థుడై జగత్తును నడిపించే చైతన్య స్వరూపుడు. ముందుగా మనలోని చైతన్యం మేల్కొంటేనే కదా ఈ శరీరం నిద్ర లేచేది.

    ఈ కాలంలో చాలా కుటుంబాలలో మనుషులు తగ్గి, ఉరుకు పరుగుల జీవనం పెరిగాక స్త్రీపురుషులిద్దరూ ఒకేసారి లేచి, తయారై పరుగులు పెడుతున్నారు. మన ఆచారాల ప్రకారం పురుషుడు పూజలో, హోమాలో చేసేటప్పుడు స్త్రీ ప్రక్కన లేకపోయినా, "ధర్మపత్నీ సమేతస్య" అని సంకల్పం చెప్పుకోవడం, ఆ పుణ్యకార్యంలో భార్యకు కూడా వాటా రావడం కద్దు. కానీ స్త్రీలు చేసే వ్రతాలు, పూజలు మాత్రం చాలావరకు తమ భర్త, కుటుంబ క్షేమం కోసం, లేదా మంచి భర్త రావడం కోసమో ఉంటాయి.

    బాహ్య ప్రాపంచిక ఫలాల కోసం చేసే పుణ్య కార్యాలలో ఇలా ఒకరి కర్మఫలం ఇంకొకరికి పంచడం సాధ్యం అవుతుంది కానీ ఆధ్యాత్మిక సాధనలో మాత్రం ఇలా పంచుకోవడం కుదరదు. ఎవరి సాధన వారిదే. అందులో ఎవరి పురోగతి వారిదే. "ఉద్ధరేదాత్మనాత్మానం". ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉదాహరణకి ఒక తండ్రి కష్టపడి సంపాదించి ఒక యిల్లో పొలమో కొన్నాడనుకోండి అది ఏ కష్టము లేకుండానే అతని కుమారుడికి సంక్రమిస్తుంది కదా! కానీ తండ్రికి ఆకలి వేసి కడుపునిండా భోజనం చేస్తే అది కుమారుడికి సంక్రమిస్తుందా? లేదు! ఎందుకంటే అది బయటి వస్తువు కాదు. ఆకలి తీరడం అనేది ఎవరికి వారికే సొంతమైనది.

    మన చిన్నప్పుడు ఒక చాక్లెట్ వ్యాపార ప్రకటనలో పిల్లవాడు అందరినీ "మెలోడీ ఇంత చాక్లెటీ ఎలా అయ్యింది?" అని అడుగుతూ ఉంటాడు. చివరికి వేరొక పిల్లవాడు "మెలోడీ తిను, నువ్వే తెలుసుకో!" అంటాడు. అలాగే ముక్తి కూడా అనుభవైకవేద్యమే కానీ వేరొకరు చెబితేనో, చూస్తేనో, చదివితేనో తెలిసేది కాదు. ఆకలి తీరడం, జ్వరం రావడం మొదలైనవి ఎలా అయితే ఎవరికి వారే అనుభవిస్తారో, ఒకరి అనుభవం ఇంకొకరికి తెలియదో అలాగే ఆధ్యాత్మిక సాధన ద్వారా పొందే  ముక్తి కూడా ఎవరికి వారు పొందవలసిందే, అనుభవించ వలసిందే.

    మనం 2024 సంవత్సరానికి స్వస్తి పలికి 2025లో అడుగు పెడుతున్నాం. 2025లో అంకెలన్నీ కూడితే 9 వస్తుంది. అలాగే తొమ్మిది చిల్లుల తిత్తి అయిన ఈ మానవ దేహంలో నుండి ప్రాణవాయువులు జారిపోక ముందే మనం మేల్కొని సాధనలో పురోగతిని సాధించాలని, అటువంటి మేలుకొలుపు మనందరికీ కలిగించాలని శ్రీగురుదేవులను ప్రార్థిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!

15, నవంబర్ 2024, శుక్రవారం

కార్తీక పూర్ణిమ



    కార్తీక మాసం అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమని మనందరికీ తెలిసిందే. ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులలో అమ్మను ఆరాధించుకొని, కార్తీక మాసంలో మన తండ్రియైన పరమేశ్వరుని ఆరాధించుకుంటాం. పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉండే మాసం కాబట్టి ఇది కార్తీక మాసం అయ్యింది. నాలుగు గురుపూర్ణిమలలో ఆషాఢ పూర్ణిమ ఆశను, కార్తీక పూర్ణిమ కామాన్ని, మాఘ పూర్ణిమ మాయను తొలగిస్తాయని, వైశాఖ పూర్ణిమ వైరాగ్యాన్ని ప్రసాదిస్తుందని పెద్దలు చెబుతారు.


    కృత్తిక అంటే వాహనం. ఈ శరీరమే మనకు వాహనం. ఎంతవరకు ఈ శరీరాన్ని వాహనంగా గుర్తించక ఇదే నేనని భావిస్తూ ఉంటామో అంతవరకు మన చుట్టూ కనిపించేవన్నీ మనకు భిన్నంగా ఉన్నట్లే తోస్తుంది, వాటిమీద కామక్రోధాలు కలుగుతూనే ఉంటాయి. శరీరాలను దాటి సర్వవ్యాపకమైన ఆత్మను గుర్తించి అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే ఈ కామాన్ని పోగొట్టుకోగలం. వ్యష్టి భావన ఉన్నంతవరకు కలవడం, విడిపోవడం ఉంటాయి. సమష్టి భావన ఎప్పుడైతే బలపడుతుందో అప్పుడు ఉన్నదంతా ఒక్కటే.

    అలా ఒక్కటే అయిన పార్వతీ పరమేశ్వరులను దేహభావనతో విడివిడిగా చూసి, వారిని కలపాలనే ఉద్దేశ్యంతో వెళ్ళిన మన్మధుడు త్రినేత్రుని మూడవ కంటినుండి ఉత్పన్నమైన మహాగ్ని జ్వాలలలో భస్మం అయిపోయాడు. మళ్ళీ అమ్మ అనుగ్రహంతో విదేహుడిగా జీవితుడయ్యాడు. మనలో కూడా ఈ మూడవ నేత్రం అనబడే జ్ఞాననేత్రం ఎప్పుడైతే తెరచుకుంటుందో అప్పుడు ఆ జ్ఞానాగ్నిలో మనలోని సంకల్పాలు, కర్మలు, కామవాసనలు అన్నీ దగ్ధం అయిపోతాయి. అటువంటి స్థితిని పొందిన మహాత్మునిలో ఏదైనా కోరిక కలిగినా అది తనకోసం కాక లోకకళ్యాణ కారకమే అయి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి భస్మమైన తరువాత ఇక మన్మధుడికి దేహం లేనట్లే ఆ మహాత్ముల సంకల్పాలు తమ ఒక్క దేహానికి పరిమితం కాకుండా సర్వ జగత్తుకు చెందినవై ఉంటాయి.

    కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణంలో నుండి పరమేశ్వరునితో పాటు ఊరేగింపుగా భక్తులందరూ వెళతారు. అలా వెళ్ళినవారికి యమలోకం చూడవలసిన అవసరం ఉండదని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి మనలోని కామాన్ని దగ్ధం చేసివేస్తే ఆ జ్వాలలను దాటి మనం పరమేశ్వరునితో కలిసి ప్రయాణిస్తూ ఉంటాం కదా! ఆ ప్రయాణం ఎలా ఉంటుందంటే - స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం, గజాంతక, అంధకాంతకం, తమ్ అంతకాంతకం భజే - అని శివ తాండవ స్తోత్రం చూపిస్తోంది.

    ముందుగా స్మరాంతకం అంటే మన్మధుని, లేక కామాన్ని నశింపచేసినవాడు - ఇది మనం పైన వివరించుకున్నాం కదా. ఇక పురాంతకం అంటే త్రిపురాసుర సంహారి. ఎప్పుడైతే మనలో కామం పోతుందో అప్పుడు ఈ స్థూల సూక్ష్మ కారణ దేహాలనబడే త్రిపురాలు నశించిపోతాయి. అంటే పైకి చూడటానికి దేహం కనబడుతున్నా దానితో మనకి సంగం నశిస్తుంది. ఇక భవాంతకం అంటే ఈ దేహాలతో ఎప్పుడు సంగం పోతుందో అప్పుడింక మనని జననమరణ విషవలయమైన ఈ సంసారం బంధించలేదు.

    మఖాంతకం అంటే దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసినవాడు. యజ్ఞం కర్మతో కూడుకున్నది. మనం చేసే కర్మలన్నీ భగవదర్పణంగా చేయకుండా కర్తృత్వ భావనతో చేస్తూ భగవంతుని ఎప్పుడైతే ప్రక్కన పెడతామో అప్పుడు మనకు ఆ కర్మల ద్వారా శోకం, మరొక జన్మం తప్పదు. ఇటువంటి కామ్య కర్మలను తొలగిస్తాడు పరమేశ్వరుడు. కానీ అటువంటి స్థితిని పొందిన మహాత్ముడు కర్మహీనుడు అవడు. మనం మామూలుగా మనకు ఏ ప్రయోజనమూ లేకపోతే అటువంటి కర్మలను 'ఏం చేస్తాం లే' అని బద్ధకిస్తాము. కానీ జ్ఞానాగ్నిలో కర్మలను దగ్ధం చేసుకొన్న మహాత్ముడు తనకు ఏ ప్రయోజనమూ లేకపోయినా ఎటువంటి బద్ధకమూ లేకుండా లోకోపకృతికి కర్మలు చేస్తూనే ఉంటాడు. ఈ బద్ధకము, లేక తమోగుణమే గజం. ఇప్పుడది నాశనం అయిపోయింది. అదే గజాంతకం అంటే.

    అంధకాంతకం - పరమేశ్వరుడు అంధకాసురుడనే రాక్షసుని సంహరించాడు. ఈ అంధకాసురుడు ఎక్కడినుంచి వచ్చాడు? ఆయనలోనుండే వచ్చాడు. అలా మనలో నుండే ఉద్భవించి మన నిజ స్వరూపాన్ని మరుగు పరిచే అజ్ఞానమనే అంధకారాన్ని హరిస్తాడు పరమేశ్వరుడు. ఇలా హరుని ద్వారా అన్ని ప్రతిబంధకాలను హరింపజేసుకున్న మనకు జనన మరణాలు లేని మోక్షస్థితి లభిస్తుంది. అప్పుడిక యమలోకాన్ని చూడవలసిన అవసరం మనకేమి ఉంటుంది. అందుకే అంతకాంతకం.

    అటువంటి పరమేశ్వరుడు సాక్షాత్ గురురూపాన్ని ధరించి వచ్చి, మనకు తోడు నీడగా మనతో నడయాడి, సదా మనలోనే ప్రకాశిస్తున్న తమ స్వస్వరూపాన్ని మనకు దర్శింపజేస్తున్న ఈ కార్తీకపౌర్ణమి మన జీవితాలలో సదా వెన్నెలలు నింపుతూనే ఉంటుంది.

9, నవంబర్ 2024, శనివారం

వర్తమానం

 

    శ్రీకృష్ణ పరమాత్మ, సత్యభామ నరకాసురునితో యుద్ధం చేస్తున్న ఈ చిత్రాన్ని మనం గమనిస్తే ఇక్కడ సత్యభామ నరకాసురునిపై మూడు బాణాలను ప్రయోగిస్తోంది. అందులో మొదటి బాణం నరకాసురుని దేహంలోనికి ప్రవేశించి అతనిని గాయపరచింది. రెండవ బాణం మార్గమధ్యంలో గాలిలో ఉంది. ఇక మూడవ బాణం అమ్మ చేతిలో వింటిపై సంధించి ఉంది. మొదటి బాణం అప్పటికే తన పని తాను చేసేసింది కనుక ఇక దానిని ఎవరూ మార్చలేరు. ఇది జరిగిపోయిన భూతకాలానికి ప్రతీక. 

ఇక రెండవ బాణం అప్పటికే ప్రయోగించబడి లక్ష్యం వైపుగా దూసుకుపోతోంది. ఒకవేళ అది మంత్రపూరితమైన అస్త్రమైతే దానిని లక్ష్యం చేరేలోగా ఉపసంహరించడానికి అవకాశం ఉంటుంది. లేదా దైవవశం చేత ఏ బలమైన గాలో మరేదైనా వస్తువో తాకి దారి మళ్ళడానికి అవకాశం ఉంటుందే తప్ప మరొక విధంగా దానిని దారి మళ్ళించడం మానవమాత్రులకు సాధ్యం కాదు కదా. ఇది అప్పటికే పూర్వ నిర్ధారితమైన భవిష్యత్ కాలానికి ప్రతీక. భవిష్యత్తును మార్చడం ఏ మహాత్ములకో సాధ్యం, లేదా భగవత్సంకల్పం చేత మారాలి తప్ప మనం మాత్రం మార్చలేము కదా!

    ఇక మూడవ బాణం ఇంకా సత్యభామ చేతిలోనే ఉన్నది కాబట్టి దానిని ఎప్పుడు ఎవరిపై ఎంత బలంగా ప్రయోగించాలో నిర్ణయం పూర్తిగా ఆవిడ ఆధీనంలోనే ఉంది. ఇది వర్తమాన కాలానికి ప్రతీక. మనం మన వర్తమాన కాలాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. దానిని సద్వినియోగ పరచుకున్నా, దుర్వినియోగ పరచుకున్నా అది మన బాధ్యతే. అయితే మన ఆలోచనలు మాత్రం నిరంతరం ఈ వర్తమానాన్ని వదిలిపెట్టి భూత భవిష్యత్ కాలాల్లో తిరుగుతూ ఉంటాయి. మనం బాహ్యంగా ఏ పని చేస్తున్నా మనస్సు మాత్రం నిన్నటి జ్ఞాపకాలలో, రేపటి వ్యాపకాలలో సంచరిస్తూ ఉంటుంది.

    ఎప్పుడో చేసిన, లేదా చేద్దామనుకొని చేయలేకపోయిన విషయాలను గుర్తుచేస్తూ అపరాధ భావనను కలిగిస్తూ ఉంటుంది. భూతకాలాన్ని మనం మార్చలేం కదా! దానిని గురించి ఎంత చింతించినా ఏమి ప్రయోజనం? దీనినే "గతజల సేతు బంధనం" అంటారు. నది మీద ఆనకట్ట కడితే అది భవిష్యత్తులో వచ్చే జల ప్రవాహాన్ని ఆపి మనకు ఎటు కావాలో అటు మళ్ళించుకొనే అవకాశాన్ని, లేదా మరొక రకంగా వినియోగించుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది కానీ అప్పటికే వెళ్ళిపోయిన నీటిని వెనక్కు తేలేదు కదా! జరిగిపోయిన దానిని అక్కడే వదిలేసి దానినుండి గ్రహించిన పాఠాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని ఆచరణలో పెట్టుకోవడం నేర్చుకోవాలి.

    అలాగే వర్తమానంలో చేస్తున్న పనిమీద ధ్యాస విడిచిపెట్టి భవిష్యత్తు గురించి ఊహలు అల్లుకుంటూ గాలిలో మేడలు కడుతూ  కూర్చుంటే ఉపయోగం లేదు కదా. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థి తాను చదువుతున్న పాఠంపై శ్రద్ధ పెట్టి చదివితే పరీక్ష బాగా వ్రాసి ఉత్తీర్ణుడవుతాడు. అతని భవిష్యత్తు దానంతటదే చక్కబడుతుంది.  అలా కాకుండా పుస్తకం ముందు పెట్టుకుని కళ్ళు అక్షరాలను చదువుతున్నా మనస్సు మాత్రం ఈ పరీక్షలో మంచి మార్కులు వస్తే ఆ తరువాత తనకు రాబోయే మంచి ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, పెద్ద ఇల్లు, కారు ఇలాంటివన్నీ ఊహించుకుంటూ గాలిలో మేడలు కడుతూ ఉంటే వర్తమానం వృధాగా గడిచిపోతుంది. పరీక్ష తప్పుతాడు. తాను కట్టిన గాలిమేడలన్నీ కుప్పకూలిపోయి భవిష్యత్తు అంధకారమవుతుంది. 

    ఇంకొంతమంది జాతకంలో ఉందనో, లేదా ఎవరైనా పెద్దలు చెప్పారనో భవిష్యత్తులో తమకు రాబోయే మంచిచెడుల గురించి అతిగా ఆలోచిస్తూ వర్తమానాన్ని జారవిడుచుకుంటారు. మబ్బుల్లో నీళ్ళను చూసి తన కాళ్ళ దగ్గర ఉన్న కుండను కాలదన్నుకుంటే ఆ మబ్బులు కురిసేదెన్నడు? తన దాహం తీరేదెన్నడు? "భవిష్యత్తులో నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు" అని ఎవరైనా మహాత్ములు నిన్ను దీవించారనుకో, నువ్వు వర్తమానంలో దానికి తగ్గ కృషి చేసి, పట్టుదలతో ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ వెళితేనే కదా నీవు ఆ ఉన్నత స్థానాన్ని చేరుకొనేది? అలా కాకుండా "నాకు మహాత్ముల ఆశీస్సులు ఉన్నాయి. ఇక నేనేమీ చేయనక్కరలేదు" అని ముసుగుతన్ని పడుకుంటే గొప్పవాడివి ఎలా అవుతావు?

     ఇక చిత్రంలో ఈ మూడింటికీ సాక్షిగా, కర్త అయిన సత్యభామకు, ఆమె చేసే కర్మకు తాను విలక్షణంగా, చిద్విలాసుడై ప్రకాశిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. భూతకాలంలో నరకాసురుడు ఆ సత్యభామ అసలు స్వరూపమైన భూదేవి పుత్రుడనీ, ఇప్పుడు తాను చేస్తున్న పనికి భవిష్యత్తులో సత్యభామ చింతిస్తుందనీ కూడా ఆయనకు తెలుసు. అయినా జరిగేదానిని సాక్షిమాత్రుడై వీక్షిస్తున్నాడు.

    త్రికాలజ్ఞులైన మహాత్ముల స్థితి అలాగే ఉంటుంది. జరిగినది, జరుగబోయేది స్పష్టంగా తమకు దృగ్గోచరం అవుతున్నా ఏమాత్రం వికారాన్ని చెందక శ్రద్ధగా వర్తమాన విధులను ఆచరిస్తూ ఉంటారు. అటువంటి స్థితిని అందుకోవడానికి మన వంతు కృషి మనం చెయ్యాలి. ప్రాపంచిక విషయాలలోనైనా, ఆధ్యాత్మిక విషయాలలోనైనా ప్రతి క్షణం చేసే పనిపై శ్రద్ధపెట్టి వర్తమానంలో జీవిస్తూ, మనస్సును భూత భవిష్యత్ కాలాలలో తిరగకుండా అదుపులో పెట్టుకోగలిగితే  భవిష్యత్తు బంగారమవుతుంది. "ఈ క్షణమే నీదనుకో! మరుక్షణమే లేదనుకో! అవాంతరాలను సవాలు చేసి అవకాశాలుగా మార్చుకో" అని మహాత్ములు మనకు బోధిస్తున్నారు.

15, ఆగస్టు 2024, గురువారం

శ్రీపాద విచలిత క్షీరాంబు రాశి

    సప్తపది సినిమాలో ముగురమ్మలను కీర్తిస్తూ వేటూరి వారు వ్రాసిన అఖిలాండేశ్వరి పాటలో లక్ష్మీదేవిని వర్ణిస్తూ శ్రీపాద విచలిత క్షీరాంబు రాశి అంటారు. అమ్మ పాదం తాకితే అంత ప్రశాంతంగా ఉండే క్షీరసాగరం అంతా అల్లకల్లోలమై ఉప్పొంగిపోతుందిట. అంతటి శక్తి స్వరూపిణి అమ్మ. ఎంతటి మహాశక్తి తనకున్నా తన భర్త అయిన శ్రీహరి హృదయంలో ఒదిగిపోయి నిరంతరం ఆయన పాదసేవ చేస్తూ ఉంటుంది. అందుకే అమ్మ శ్రీహరి ప్రణయాంబు రాశి. 

    జగన్మాత ప్రకృతి స్వరూపిణి కదా. ప్రకృతిలోని పంచ మహాభూతలలో ఏ ఒక్కటి తన పరిధిని దాటినా జరిగే విపత్కర పరిణామాలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం కదా! భూకంపాలు, వరదలు, సౌర తుఫానులు ఇలా ప్రకృతిలో ఏ చిన్న మార్పు సంభవించినా అది లక్షలాది మానవుల, ఇతర జీవరాశుల వినాశానికి దారి తీస్తుంది. పైకి ఎంతో శాంతంగా కనిపించినా ప్రకృతి నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. అందుకే అమ్మ నామాలలో చంచల, చపల వంటి నామాలు ఉంటాయి. అయితే స్థితి కారకుడైన శ్రీహరి తన అవ్యాజమైన ప్రేమతో అనంతశక్తి సంపన్నురాలైన ప్రకృతిమాతను అదుపులో పెడుతూ మహాప్రళయం రాకుండా కాపాడుతూ ఉంటాడు. అందుకే అమ్మ ఇక్కడ శ్రీహరి ప్రణయాంబు రాశి.

    మరో కోణంలో ఆలోచిస్తే లక్ష్మీదేవి క్షీరసముద్రరాజ తనయ. సాధారణంగా మన ఇళ్ళలో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అంటారు. అటువంటి ముద్దులొలికే పసిపాప కొంచెం పెద్దదై, తండ్రి ఆ పాపను తన రెండు చేతులతో ఎత్తుకొంటే, తన లేలేత పాదాలతో ఆ తండ్రి గుండెలపై బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటే ఆ తండ్రి హృదయం ఎంతగా పులకించి పొంగిపోతుంది? అటువంటిది మరి సాక్షాత్తూ మహాలక్ష్మీ దేవియే తన కుమార్తెయై, తన ఇంటనే కాపురం పెట్టి తన గుండెలపై మృదువుగా అడుగులు వేస్తూ ఉంటే ఆ తండ్రి హృదయం ఎంతగా ఉప్పొంగిపోతుంది? అందుకే ఆ తల్లి శ్రీపాద విచలిత క్షీరాంబు రాశి.

    పేదరికంలోనో, దిగువ మధ్యతరగతిలోనో జీవనం గడిపే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఒకే చోట కలిసిమెలిసి నివసిస్తూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వారిల్లు క్షీరసాగరం లాగే ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారి అనుకోకుండా వారింట్లో సలలితముగ నారికేళ సలిలము భంగి సిరి ప్రవేశించిందంటే ఇక ఎక్కడలేని గొడవలు మొదలవుతాయి. ఆ సంసారం అల్లకల్లోలం అయిపోతుంది. అప్పటిదాకా కలసిమెలసి ఉన్నవారు వేరుకాపురాలు పెడతారు. ఉన్న కాస్త పదార్థాన్ని పంచుకు తిన్నవారు ఇప్పుడు సంపదలో వాటాలకు కొట్టుకు చస్తారు. అందుకే సిరి శ్రీపాద విచలిత క్షీరాంబు రాశి. The gods must be crazy అనే ఆంగ్ల చిత్రంలో నాగరిక వాసన అంటని ఒక అమాయకపు తెగ అడవులలో నివసిస్తూ ఉంటుంది. అందరూ కలసి ఆహారాన్ని సంపాదించుకుంటూ, దొరికిన దానిని పంచుకొని తింటూ ఉంటారు. ఒకనాడు పైనుంచి విమానంలో వెళ్తున్న వ్యక్తి ఒక గాజు సీసాను వీరు నివసించే ప్రదేశంలో పడవేస్తాడు. అది మనకు దేవుడే ఇచ్చాడని నమ్మిన ఆ తెగ ప్రజలు, దానిని అనేక రకాలుగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఆ అపురూపమైన వస్తువు నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకుంటూ ఉంటారు. ప్రశాంతమైన తమ జీవనంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఈ కానుక మాకొద్దు అని నిర్ణయించుకొని అందులో ఒకడు భూమి చివరి అంచుకు చేరుకొని దీనిని మళ్ళీ ఆ దేవుళ్ళకే తిరిగి ఇచ్చేద్దామని బయలుదేరుతాడు. హృదయంలో శ్రీహరిని నింపుకోకుండా కేవలం లక్ష్మీ అనుగ్రహాన్ని మాత్రమే పొందితే జీవితం ఇలాగే అల్లకల్లోలమైపోతుంది. శ్రీహరి ప్రణయాంబు రాశి గానే అమ్మను గ్రహిస్తే వారిద్దరూ కొలువైన మన హృదయం పాలసముద్రంలాగే స్వచ్ఛంగా ఉండి జీవితం ప్రశాంతంగా గడుస్తుంది.

    మానవుడు పుట్టినపుడు అతని మనస్సు క్షీరసాగరంలా స్వచ్చంగానే ఉంటుంది. నిరంతరం తనలో తాను రమిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. అయితే అటువంటి శిశువుకు మెల్లగా తల్లిదండ్రులూ బంధువులూ ఒక పేరును ఆపాదించి, ఒక్కొక్క వస్తువునూ బొమ్మనూ 'ఇది నీది, ఇది నీది' అని ప్రేరేపిస్తూ ఉంటారు. ముందు పెద్దగా పట్టించుకోడు. తన చేతిలో ఉన్నదేదైనా ఎవరడిగినా ఇచ్చేస్తూ ఉంటాడు. అయితే మెల్లమెల్లగా ఈ వస్తువులతో సాన్నిహిత్యం పెరిగినకొద్దీ జగన్మాత మహామాయా స్వరూపిణియై ఆ పసివానిలో ఆ వస్తువులపట్ల సంగాన్ని పెంపొందిస్తుంది. అప్పుడు ఇక అహంకార మమకారాలు, రాగద్వేషాలు, ఈర్ష్యాసూయలు ప్రవేశించి ప్రశాంతమైన ఆ మానవుని మనస్సుని అల్లకల్లోలం చేస్తాయి. శ్రీపాద విచలిత క్షీరాంబు రాశి. అయితే బయటి విషయాలు తనను ఎంతగా ప్రభావితం చేయాలని చూసినా, తల్లి గర్భంలో తాను నిరంతరం అనుసంధానమై ఉన్న శ్రీహరిని మరువక చిత్తంలో నిలుపుకొంటే అప్పుడు శ్రీహరి ప్రణయాంబు రాశి అయిన అమ్మ అత్యంత పతిభక్తి కలది కాబట్టి ఆ మనస్సును విచలితం కాకుండా కాపాడి, పారమార్థికానికీ వ్యావహారికానికీ మధ్య ఊగిసలాడుతూ డోలాయమానమైన మనస్సుకు స్థిరత్వాన్ని ప్రసాదించి, ఆధ్యాత్మిక సాధనను వృద్ధి పరచి శ్రీపీఠమైన సహస్రారాన్ని చేరుకొనేలా సహకరిస్తుంది. అందుకే ఇక్కడ అమ్మ శ్రీపీఠ సంవర్ధని, డోలాసుర మర్ధిని.

జగన్మాత లక్ష్మీదేవిని మనం కేవలం వరాలిచ్చే వరలక్ష్మిగానో, ధనాన్ని ఇచ్చే ధనలక్ష్మిగానో చూడకూడదు. ఆ తల్లి మనకు ఆధ్యాత్మిక సాధనకు కావలసిన తెలివిని ఇచ్చే విద్యాలక్ష్మి. సాధనలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకులను దాటి ముందుకు వెళ్ళే ధైర్యాన్నిచ్చే ధైర్యలక్ష్మి. అంతశ్శత్రు సంహారం చేసే వీర్యలక్ష్మి. మన భక్తికి ఫలంగా జ్ఞానపుత్రుని ప్రసాదించే సంతానలక్ష్మి. సాధనలో విజయాన్ని చేకూర్చే విజయలక్ష్మి. మనకు ఆహారాన్ని అందించే ధాన్యలక్ష్మి. చివరికి మనను ఇహంలోనే పరమపదానికి చేర్చే మోక్షలక్ష్మి. అటువంటి అమ్మను మనసారా ధ్యానిస్తూ నిరంతరం లక్ష్మీనారాయణులను మన హృదయంలో నిలుపుకొంటే ఇక మనకు ఇహపరాలలో ఏ లోటూ ఉండదు.

5, ఆగస్టు 2024, సోమవారం

ముక్తి

    వైష్ణవ సంప్రదాయంలో ముక్తిని నాలుగు అంచెలుగా వర్ణించారు. ఈ భూలోకంలో జీవించినన్నాళ్ళు శ్రీమహావిష్ణువుపై అనన్య భక్తిని కలిగి ఉండి, మరణించిన తరువాత వైకుంఠాన్ని చేరడం ఇందులో మొదటి మెట్టయిన సాలోక్య ముక్తి. అంటే స్వామి ఉన్న లోకంలోనే మనమూ నివసించడం. ఇక దాని పైమెట్టు సామీప్యం - అంటే ఆ లోకంలో ఎక్కడో దూరంగా ఉండటం కాకుండా స్వామివారికి అతి దగ్గరలో ఆంతరంగిక సేవకునిగా మెలగడం. ఇక అలా సేవించుకున్న ఫలితంగా వచ్చేది సారూప్యం. మనకు జయవిజయులను చూపిస్తూ ఉంటారు కదా! వారు కూడా విష్ణుమూర్తిలాగానే నాలుగు చేతులు కలిగి, శంఖ చక్ర గదా పద్మాలను ధరించి ఉంటారు. అలా స్వామివారి రూపాన్ని పొందడం సారూప్య ముక్తి. ఇక చివరిమెట్టు సాయుజ్యం - అంటే ఆ పరమాత్మునిలో ఐక్యం అయిపోవడం. 

    ఈ నాలుగింటిపై కొంచెం లోతుగా విచారణ చేద్దాం. ఎందుకంటే అద్వైత సిద్ధాంతంలో ముక్తి అనేది చనిపోయాక పొందేది కాదు. బ్రతికి ఉండగానే నీ అసలు స్వరూపాన్ని గుర్తించి ఈ శరీరంతోనే జీవన్ముక్త స్థితిని అనుభవించాలి. ఇక పైన చెప్పుకున్న నాలుగు అంచెల ముక్తిని గూర్చి విచారిస్తే - ముందుగా సాలోక్యం అంటే పరమాత్మ ఉన్న లోకంలో మనం నివసించడం అని చెప్పుకున్నాం కదా. కానీ ఆయన ఉన్న లోకం ఏది? విష్ణువు అంటేనే సర్వవ్యాపకుడు అని అర్థం కదా! మరి ఆయన లేని స్థానం కానీ, లోకం కానీ ఈ సృష్టిలో ఎక్కడైనా ఉందా? అంతేకాక గీతలో స్వామే స్వయంగా చెప్పినట్లు ధర్మ సంస్థాపన కోసం ఆయన మాటిమాటికీ అనేక మహాత్ముల, గురువుల, అవతారపురుషుల రూపాలలో మన మధ్యన సంచరిస్తూనే ఉన్నాడు కదా! అయితే ఈ విషయాన్ని గుర్తించి సదా అనుభవంలోకి తెచ్చుకోవడమే సాలోక్యం. అంటే మన జీవితంలో ప్రతి క్షణం పరమాత్మ ఉన్న లోకంలోనే, పుణ్యక్షేత్రంలోనే, వైకుంఠంలోనే మనం జీవిస్తున్నామనే ఎఱుక కలిగి ఉంటే మనం ఇక పాపాలు చేయలేము కదా! మనలోని మానసిక బలహీనతల వలనే మనం పాపాలు చేస్తాం. కుంఠితం అంటే బలహీనమైనది. కుంఠితం కానిది వైకుంఠం. ఇలా నిరంతరం స్వామి ఉనికిని గుర్తిస్తూ మన మనస్సు ఎప్పుడైతే తన బలహీనతలను అధిగమిస్తుందో అప్పుడు ఆ మనస్సే వైకుంఠం అవుతుంది.

    ఇక దీని పైమెట్టు సామీప్యం. కేవలం ఆ స్వామి ఈ లోకంలో ఎక్కడో ఉన్నాడని మాత్రమే కాకుండా నిరంతరంగా ఆయన సన్నిధిని మనం అనుభవంలోనికి తెచ్చుకోవాలి. ఆయన ఎప్పుడూ మన ప్రక్కనే, మనతోనే, మనలోనే ఉంటాడు. ఈశ్వరస్సర్వ భూతానాం హృద్దేశే అర్జున తిష్టతి.  ఆయన లేనిదే మనం లేము. ఈ నిరంతర సామీప్యాన్ని మనం అనుభవంలోనికి తెచ్చుకుంటే ఇక ఈ లోకంలోని ఈ కష్టాలు, బాధలు, సుఖదుఃఖాలు మనలను బంధించలేవు. నిరంతరం తన తల్లిదండ్రుల దగ్గర నివసించే పిల్లవానికి దేనిమీద చింత ఉంటుంది? అంతా వారే చూసుకుంటారనే నిశ్చింతతోనే హాయిగా బ్రతికేస్తాడు కదా! అదే సామీప్య ముక్తి.

    మరి సారూప్యం అంటే పైన చెప్పుకున్నట్టు ఆ స్వామి యొక్క రూపాన్ని మనం కూడా ధరించాలని, కొందరు అచ్చంగా విష్ణుమూర్తి, శివుడు, లేదా తన గురుదేవులు ధరించే విధంగానే నుదుటిపై నామాన్ని ధరించడం, వారిలాగానే పీతాంబరాన్నో, జింక చర్మంనో ధరించడం, వారి హావభావాలను అనుకరించడం చేస్తూ ఉంటారు. ఎంత సాధన చేసి అచ్చుగుద్దినట్లు అనుకరించినా అది అనుకరణే అనిపించుకుంటుంది కానీ వీరు వారవ్వరు కదా! పరమాత్మతో సారూప్యాన్ని పొందడం అంటే ఆయనలో ఉన్న సద్గుణాలను మనం అలవరచుకోవడం. ఆయనలో లేని దుర్గుణాలను మనలోనుండి తొలగించుకోవడం. అంతేకాదు ఈ సర్వ సృష్టిని విష్ణుమయంగా దర్శించే దృష్టిని అలవరచుకోవడం. చూడక మానవు చూచెడి కన్నులు ఏడనేడైన ఇతరములు, ఈడ నన్నింట నీ రూపము గన ఈడు లేని తెలివీయగదే అని ప్రార్థించాడు అన్నమయ్య. అటువంటి పరమాత్మ దృష్టిని అలవరచుకోవడం సారూప్యం.

    ఇక తన చుట్టూ ఉన్న సృష్టి అంతటిలో పరమాత్మనే దర్శిస్తూ ఉంటే తాను మాత్రం ఆ పరమాత్మకు భిన్నంగా ఉంటాడా? ఈ కనిపించే దేహం తాను కానని, ఈ దేహాలన్నింటినీ నడిపించే పరమాత్మ తానే అనే సత్యాన్ని గ్రహిస్తాడు, అనుభవిస్తాడు. అదే సాయుజ్య ముక్తి. కేవలం తాను తప్ప మరియొకటి లేదనే ఎఱుకయే కైవల్యం. అటువంటి ముక్తిని పొందినవాడికి ఇక దేనిమీదా మొహం కానీ, రాగద్వేషాలు కానీ కలుగవు. ప్రారబ్ధం ఉన్నంతవరకు ఈ దేహం నిలిచి ఉంటుంది. అయితే ఈ దేహంతో చేసే కర్మలు ఏవీ తనకు అంటవు. ఎందుకంటే వాటి వెనుక తనకు ఏదో కావాలనే కోరిక కానీ, తాను చేస్తున్నాననే అహంకార భావన కానీ ఉండదు. అవన్నీ లోకకళ్యాణం కోసం చేసే లీలలే అవుతాయి కానీ, తనను బంధించే కర్మలు కావు. ఎప్పుడైతే ఆ ప్రారబ్ధం తీరి ఈ దేహం పడిపోతుందో, అప్పుడు తాను స్వస్వరూప లయం పొందుతాడు. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంత కాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి||

9, జులై 2024, మంగళవారం

నిరీక్షణా మాధుర్యం

    భగవంతుని దర్శించుకోవాలనే ఆర్తితో మనం ఎన్నో పుణ్య క్షేత్రాలకు, ప్రసిద్ధ దేవాలయాలకు వెళతాం. తీరా అక్కడికి వెళ్ళిన తరువాత దర్శనానికి పెద్ద లైను ఉంటుంది. తిరుమల లాంటి చోట్ల అయితే కొన్ని గంటలో, ఒక్కొక్కసారి రోజు పైనే పట్టవచ్చు. ఇంతా కష్టపడి ఆలయం లోనికి ప్రవేశించాక గట్టిగా కొన్ని క్షణాలు కూడా ఆ దివ్యమంగళ మూర్తిని దర్శించుకోనివ్వరు. పదండి, పదండి అని త్రోసివేస్తారు. ఇంకా కొందరు ఉంటారు. అందరూ ఒక వరుసలో వెళ్తుంటే వీరు వరుస తప్పి ప్రక్కకు జరిగి, ఆ దేవతామూర్తికి అడ్డంగా నిలబడి పరమ భక్తితో ఎంతోసేపు నమస్కరిస్తూ, స్తోత్రాలు చదువుతూ నిలబడిపోతారు. ఇక వెనుకవాళ్ళు వీళ్ళ వీపులనో, కొప్పులనో దర్శించుకొని పోవలసిందే కానీ, వీళ్ళు మాత్రం అక్కడినుండి కదలరు. కనీసం, మనతోపాటు వరుసలో ఉన్న వారందరూ భక్తులే కదా, మనకు ఆ పరమాత్మను దర్శించుకొనే హక్కు ఎంత ఉందో వారికి కూడా అంతే ఉంది కదా అనే ఆలోచనే వీరికి రాదు.

    ఇంకొంతమంది వరుసలో నిలుచున్నంత సేపూ వారు భగవంతుని తలచుకోకపోగా ప్రక్కవారిని అనేక ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటారు. "మీ పిల్లలు ఏమి చేస్తున్నారు? ఆహా, కాలేజీకి బస్సు వస్తుందా, మీరే దింపాలా? మీ అబ్బాయికి ఇంకా ఎందుకు పెళ్ళి కాలేదు?" ఇలా ఎందుకూ పనికిరాని ప్రశ్నలతో వారి మనశ్శాంతిని చెడగొడుతూ ఉంటారు. పోనీ ఆ ప్రశ్నల వలన వీరికి కానీ, వారికి కానీ ఏమన్నా ఉపయోగం ఉందా? అంటే ఏమీ ఉండదు. నిజంగా అవతలి వారికి ఏమన్నా సహాయం అవసరమైన సందర్భంలో వీరు కనీసం ముఖం కూడా చూపించారు. మరి ఎందుకు ఈ వృథా కంఠక్షోభ? నిజానికి భగవద్దర్శనం అనేది చాలా కొద్ది క్షణాలే లభిస్తుంది. మన పురాణేతిహాసాలలో ఎందరో భక్తులు, రాజులు, రాక్షసులు అనేక వందల, వేల సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు ఇలా ప్రత్యక్షమై, వరమిచ్చి, అలా మాయమైపోతాడు. కానీ అసలైన భగవద్దర్శన మాధుర్యం ఆయన దర్శనం కోసం నిరీక్షించడంలోనే ఉంది. 

    శబరి తల్లి రామునికోసం ఎన్నో సంవత్సరాలు నిరీక్షించింది. రాముడు వచ్చినప్పుడే ఆయనకు సేవలు చేద్దాంలే అనుకొని తన సమయాన్నంతా ఇతరులతో పోచికోలు కబుర్లు చెప్పడానికి ఉపయోగించలేదు. ప్రతిరోజూ ఈ రోజే రాముడు వస్తాడనే విశ్వాసంతో నిరంతర రామ స్మరణతోనే తన కుటీరాన్ని, అక్కడికి చేరే మార్గాన్ని అంతా చక్కగా అలికి, ముగ్గులు పెట్టి, పూరేకులతో అలంకరించి, రామునికోసం నీటిని, మధుర ఫలాలను సేకరించి సిద్ధంగా ఉండేది. ఇలా నిరంతర రామ నిరీక్షణా మాధుర్యాన్ని ఒక తపస్సుగా అనుభవించింది కనుకనే నిజంగా ఆ రాముడు వచ్చి తనవద్ద కొద్ది క్షణాలే గడిపినా వెంటనే తన ఆత్మ రామునిలో లీనమై, దేహం కూడా నదీరూపాన్ని ధరించి శాశ్వతత్వాన్ని పొందింది. అలా మాధుర్యాన్ని అనుభవించకుండా కేవలం దర్శనం కోసమే తపస్సు చేసి, తీరా భగవంతుడు ప్రత్యక్షం అయ్యాక తమకు ఎందుకూ పనికిరాని, లోకాలకు హానికారకమైన వరాలను అడిగి ఎందరు రాక్షసులు నాశనం అయిపోలేదు?

    కాబట్టి ఎంతసేపు దర్శనం అయ్యింది? మనం వెళ్ళిన రోజున ఆ దేవతామూర్తికి ఎన్ని అలంకారాలు చేశారు, ఇలాంటివి ముఖ్యం కాదు. మనం ఇంటిదగ్గర బయలుదేరిన దగ్గరినుంచి, లేదా అసలు మనకు పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనే సంకల్పం కలిగిన క్షణంనుంచి మనం ఎంతసేపు ఆ పరమాత్మను తలుస్తూ, ఆ స్మరణలో గడిపాము? అనే దానిపైనే ఆ దర్శనంలో మనం అందుకొనే మాధుర్యం ఆధారపడి ఉంటుంది. నిజానికి అలా నిరంతర భగవన్నామ స్మరణ జరగాలనే దేవాలయాలలో ఎవరో భక్తులు సంకీర్తన చేస్తూ ఉండటమో, ఆ సౌలభ్యం లేని చోట్ల ఏ సిడిలోనో భజనలు వినిపించడమో చేస్తూ ఉంటారు. మనం దర్శనానికి వరుసలో నిలబడినప్పుడు ప్రక్కవారితో లోకాభిరామాయణం మాట్లాడటం మానుకొని ఆ సంకీర్తన మనం చేయలేకపోయినా, కనీసం వినే ప్రయత్నం చేస్తే, అందులో ఏదో ఒక కీర్తన తప్పక మన హృదయానికి తాకుతుంది. అలా తాకిన కీర్తన మనం దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినా, ఆ రోజంతా ఏ పని చేస్తున్నా మన మనస్సులో తిరుగుతూనే ఉంటుంది. ఇంతకన్నా ధ్యానం ఏముంటుంది?

    అలా నిరంతర భగవన్నామ స్మరణ కన్నా గొప్ప సాధన మరొకటి లేదు. మెల్లమెల్లగా మనస్సు ఆ రుచికి అలవాటు పడితే, బయటి విషయాలపై ఆసక్తి తగ్గి, ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా మనస్సు భగవంతుని వైపే లాగుతూ ఉంటుంది. అట్టి సాధనకు ఫలితంగా కేవలం గర్భాలయంలో మూలవిరాట్టులో మాత్రమే భగవంతుని దర్శించే స్థితినుండి, మన చుట్టూ ఉండే సర్వ ప్రకృతిలో, సమస్త మానవాళిలో ఆ పరమాత్మనే దర్శించే స్థితికి చేరుకుంటాం. మానవ జన్మ ఎత్తినందుకు అదే సార్థకత.

8, జూన్ 2024, శనివారం

దానం

    దానానికి యజ్ఞము, తపస్సులతో సమానమైన స్థానాన్ని ఇచ్చింది భగవద్గీత. బ్రహ్మచర్యాది నాలుగు ఆశ్రమాలలో నీవు ఏ ఆశ్రమంలో ఉన్నా యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడూ మాత్రం మానడానికి వీల్లేదు అంటారు గీతాచార్యులు. మనుష్యులను పావనమొనర్చే శక్తి ఈ మూడింటికి ఉన్నదని కూడా చెప్పారు. అలాగే త్రిగుణాత్మకమైన మనస్సుతో కూడిన మానవుడు ఏ గుణం ప్రధానంగా ఉన్నప్పుడు ఎటువంటి రీతిలో దానం చేస్తాడో కూడా చెప్పారు.

    అయితే అసలు దానం ఎలా ఇవ్వాలి? దాత మనస్థితి ఏవిధంగా ఉండాలి అని తైత్తిరీయ ఉపనిషత్తు నిర్వచిస్తోంది. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయం, శ్రియా దేయం, హ్రియా దేయం, భియా దేయం, సంవిదా దేయం.

    శ్రద్ధయా దేయం - దానం ఇచ్చేవాడు శ్రద్ధగా ఇవ్వాలి. ఒక దానం అనే కాదు, ఏ పని చేసినా శ్రద్ధాభక్తులతో చేయమని మన ధర్మం బోధిస్తోంది. సాత్విక గుణం ప్రధానంగా కలిగినవాడు దేశ కాల పాత్రతలను ఎఱిగి, తనకు ఏమాత్రం తిరిగి ఉపకారం చేయలేని వ్యక్తులకు, దానాన్ని తన కర్తవ్యంగా భావించి చేస్తాడు అని భగవద్గీత బోధిస్తోంది. అదే తామసిక గుణ ప్రధానుడు అసలు ఎందుకు చేస్తున్నాడో, ఎలా చేయాలో తెలియకుండా, దేశం, కాలం, పాత్రతలను చూడకుండా దానం చేస్తాడని చెబుతోంది. ఇక్కడే మనకి చేసేవారిలో శ్రద్ధ ఉందో, లోపించిందో అర్థం అయిపోతుంది.

    అశ్రద్ధయా దేయం - శ్రద్ధగా దానమివ్వాలని చెప్పిన మరుక్షణంలోనే ఉపనిషత్తు అశ్రద్ధగా దానమివ్వాలని చెబుతోంది. ఇది కొంచెం వింతగానే తోస్తుంది. అయితే ఇందులో అంతరార్థం ఏమిటంటే, ఒక్కసారి నువ్వు ఏదైనా వస్తువు దానమిచ్చావు అంటే, ఇక ఆ వస్తువుపై నీ మనసులో ఎటువంటి మమకారం ఉండకూడదు. ఎవరైనా మనకు చేసిన మేలును జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. అదే మనం ఇతరులకు చేసిన మేలును వెంటనే మర్చిపోవాలి. ఉదాహరణకు మీ వీధి చివరన ఉన్న పేదవాడికి మీ బట్టలు ఇచ్చారనుకోండి. ఆ తరువాత అతను ఆ బట్టలు వేసుకొని కనిపించినప్పుడల్లా 'ఇవి నేనిచ్చిన బట్టలే కదా!' అనే భావన మీ మనసులో రాకూడదు. ఒక అన్నదాన సత్రానికి భూరి విరాళమిచ్చి ఆ మర్నాటినుండి మీ ఇంట్లో వంట మానేసి అందరూ అక్కడే తింటుంటే అది దానం ఎలా అవుతుంది? అలాగే ఒక గుడికో, బడికో స్థలమో, ధనమో దానమిచ్చి అక్కడ అంతా నా ఆధీనంలోనే ఉండాలి, నేను చెప్పినట్టే అన్నీ జరగాలి అని పట్టుబట్టేవాడు దాత ఎలా అవుతాడు? 

    అందుకనే దానమిచ్చిన ఆ క్షణంలోనే ఆ ద్రవ్యం మీద మనకు అశ్రద్ధ ఏర్పడాలి. దానితో ఎటువంటి సంగం పెట్టుకోకూడదు. ఒక్క కన్యాదానంలో తప్ప మిగిలిన అన్ని దానాలలో 'ఇదం న మమ' అని చెప్పిస్తారు. అంటే ఒకసారి దానమిచ్చిన వస్తువుతో ఇక నీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. అయితే కుమార్తెను మాత్రం దానమిచ్చినా ఆమె ప్రేమానురాగాలపై మనకు హక్కు ఉంటుంది. ఆమెకు ఏ కష్టమొచ్చినా కలుగజేసుకొనే హక్కు ఉంటుంది. అయితే హక్కు ఉంది కదా అని ఏ తల్లిదండ్రులూ తమ కూతురి సంసారంలో నిరంతరం కలుగజేసుకోవాలని, ఆమెపై ఆధారపడాలని కోరుకోరు కదా! మరి హక్కు ఉన్న దానం విషయంలోనే ఇంత విరాగం ఉన్నప్పుడు, 'ఇది ఇంక నాది కాదు' అని చెప్పి దానమిచ్చిన వస్తువుపై శ్రద్ధాసక్తులు పెంచుకోవడం ధర్మం కాదు కదా! 

    ఎందరో అధర్మపరులైన రాజులను సంహరించి తాను పొందిన రాజ్యమంతా కశ్యప మహర్షికి దానమిచ్చేశానని, కనుక అత్యవసరమైనప్పుడే ఈ నేలపైకి వస్తానని, వచ్చినా చీకటి పడిన తరువాత తాను ఇక్కడ ఒక్కక్షణం కూడా ఉండలేనని పరశురాముడు శ్రీరామునికి చెప్పడం మనం రామాయణంలో చూస్తాం. తనదైన వస్తువుని దానమిస్తేనే దానిమీద హక్కును వెంటనే పోగొట్టుకోవాలని మన ఆర్షధర్మం బోధిస్తూ ఉంటే అసలు తమది కాని ప్రజల సొమ్మును వారికే పంచిపెట్టి, దానిమీద తమ పేరు, బొమ్మ ముద్రించుకొనే వారి గురించి మాట్లాడుకోవటానికి ఏముంటుంది. అసలు ఇలాంటి వ్యక్తులు ఉంటారని గీతాచార్యులు కూడా ఊహించి ఉండరు. అందుకే సత్వరజస్తమో గుణ దాతల నిర్వచనంలో కూడా ఎక్కడా ఇటువంటి వారి ప్రస్తావన తేలేదు.

    శ్రియా దేయం - నీ స్తోమతకు తగిన రీతిలో నువ్వు దానం చెయ్యాలి. వెనకటికి ఒకడు తనకున్న సెంటు భూమిలో తోటకూర పండించి ఆ దారిన వచ్చేపోయేవారికి ఆ తోటకూర పంచిపెట్టేవాడు. అలా తనకున్న దానిలో అధికభాగం దానమిచ్చిన పుణ్యవశాన మరుజన్మలో అతడు రాజుగా పుట్టాడు. అయితే పూర్వజన్మ స్మృతి కూడా కొంత కలిగింది. 'ఆ జన్మలో కొద్దిగా తోటకూర దానమిచ్చి ఈ జన్మలో రాజునయ్యాను కదా! ఇప్పుడు చాలా తోటకూర దానమిస్తే ఇంకెంత గొప్ప జన్మ వస్తోందో!' అనుకొని ఎకరాల కొద్దీ తోటకూర పండించి దానమివ్వడం మొదలుపెట్టాడు. రాజుగారు తోటకూర దానమివ్వడమేమిటని లోకమంతా విచిత్రంగా చెప్పుకోవడం మొదలు పెట్టింది. ఒకనాడు ఒక మహాత్ములు అటుగా వెళ్తూ ఆ రాజును చూసి 'అంతకు ఇంతయ్యింది కానీ ఇక ఇంతకు ఇంతే!' అన్నారు. ఆ రాజుకు విషయం అర్థం కాక వివరించమని ఆ మహాత్ముని ప్రార్థించాడు. 'ఆ జన్మలో నువ్వు ఒక చిన్న రైతువి. నీ స్తోమతను బట్టి తోటకూర దానమిచ్చావు. ఆ పుణ్యవశాన రాజువయ్యావు. ఇప్పుడు రాజుగా మణిమాణిక్యాలు, రత్నరాశులు, అగ్రహారాలు దానమివ్వవలసిన స్థితిలో ఉన్న నువ్వు నీ స్తోమతను మరచిపోయి ఇంకా తోటకూరే దానమిస్తే అది నీకు ఎటువంటి ఉన్నతిని కలుగజేయదు' అని వివరించారు ఆ మహాత్ములు.

    హ్రియా దేయం - సిగ్గుతో దానమివ్వాలి. 'అయ్యో! ఇంతకు మించి ఇవ్వలేక పోతున్నానే' అని సిగ్గుపడుతూ దానమివ్వాలి తప్పితే 'నేను కాబట్టి ఇంత గొప్ప గొప్ప దానాలు చేస్తున్నాను. అందరూ నన్ను గౌరవించాలి' అనే డంబంతో, అహంకారంతో దానమివ్వకూడదు. పూర్వం సంత్ రహీమ్ అని గొప్ప భక్తుడు, కవి ఉండేవారు. ఆయన రోజంతా తన ఇంటి బయట కూర్చొని ఎంతో మందికి తనకున్న కొద్దిపాటి సంపదనంతా దానమిస్తూ ఉండేవారు. అయితే అలా దానమిచ్చేటప్పుడు తల వంచుకొని సిగ్గుపడుతూ దానమిచ్చేవారు. ఒకసారి ఈ విషయం తులసీదాసు వారికి తెలిసి 'చేసేది మంచి పని అయినప్పుడు తల ఎత్తుకొని చేయక అలా తల దించుకొని ఎందుకు దానమిస్తున్నారు?' అని ఒక చీటీపై వ్రాసి పంపించారు. అప్పుడు రహీమ్ సమాధానమిస్తూ 'ఇచ్చేవాడు వేరే ఉన్నాడు. ఆయన నా ఈ చేతులతో ఇప్పించడానికై అహోరాత్రాలూ నాకు సంపదనిస్తున్నాడు. ఈ జనులే తెలియక నేనిస్తున్నానని భ్రమ పడుతున్నారు. అందుకే తల దించుకొని ఇస్తున్నాను' అని వినయంగా వ్రాశారు.

    భియా దేయం - భయపడుతూ దానమివ్వాలి. 'భయమెందుకు?' అంటే 'మనకున్నది అయిపోతుందేమో' అని కాదు. 'నేను సరిగ్గానే దానమిస్తున్నానా? దేశకాలాలకు తగినట్లుగా, సరైన పాత్రత కలిగిన వారికే ఇస్తున్నానా? శ్రద్ధగా ఇస్తున్నానా? ఇచ్చిన దానిమీద వెంటనే విరాగాన్ని పొందుతున్నానా? నా స్తోమతకు తగినంతగా ఇస్తున్నానా? నాలో గర్వం కలగడం లేదు కదా?' ఇలా అనుక్షణం తనను తాను పరిశీలించుకుంటూ, భయభక్తులతో దానం చెయ్యాలి. శ్రద్ధ, భయభక్తులు లోపించిన ఏ కార్యమైనా అహంకారానికి, ఆ వ్యక్తి పతనానికి దారితీస్తుంది.

     సంవిదా దేయం - సంవిత్ అంటే జ్ఞానం. దానమిచ్చే పద్ధతినెఱిగి ఇవ్వాలి. అలాగే సంవిదా అంటే ఒప్పందం. అంటే ఒకసారి ఇస్తానని మాట ఇచ్చిన తరువాత తనకు ఎంత కష్టమొచ్చినా వెనుదిరగకూడదు. శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు, సక్తుప్రస్థుడు, హరిశ్చంద్రుడు ఇటువంటి దాతలందరూ తమకు ఎంతటి కష్టం కలిగినా వెనుదిరుగక దానమిచ్చినవారే. అటువంటివారు మనకు ఆదర్శం కావాలి.

7, మే 2024, మంగళవారం

హస్తవాసి

    అశ్వినీ కుమార్ మంచి హస్తవాసి ఉన్న వైద్యునిగా పేరు తెచ్చుకున్నాడు. 30 ఏళ్ళ తన వైద్యవృత్తిలో అనేక వేలమందికి వైద్యం చేసి ఎన్నో జబ్బులను నయం చేశాడు. పెద్ద పెద్ద స్పెషలిస్టులు సైతం నయం చేయలేని రోగాలు ఆయన చెయ్యి పడితే చాలు నయమైపోతాయని ప్రతీతి. కుమార్ ఎంత గొప్ప వైద్యుడో అంతకు మించిన శివభక్తుడు. ప్రతిరోజూ బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి, తలారా స్నానం చేసి, మహన్యాసం, నమక చమకాలతో రుద్రాభిషేకం చేస్తే కానీ బయటకు వెళ్ళేవాడు కాదు.


    ఆయన హస్తవాసి గురించి ఆయన సమక్షంలోనే ఊరి వారందరూ గొప్పగా చెప్పుకుంటుంటే, ముందు కొన్నాళ్ళు పట్టించుకోలేదు కానీ ఆ తరువాత మెల్లగా తన గురించి తాను గర్వపడటంతో మొదలై, అది చివరికి అహంకారానికి దారితీసింది. 'ఈ ప్రాంతంలోనే నా అంత గొప్ప వైద్యుడు లేడ'ని పొంగిపోసాగాడు. అయితే ఈ మధ్యన ఎందుకో అతని వైద్యం సరిగా పనిచేయటం మానేసిందని, హస్తవాసి తగ్గిందని ఊరిలో వారు మెల్లగా చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. అందుకు తగినట్లుగానే ఒకరిద్దరు రోగులు ఎన్నిసార్లు ఆయన దగ్గర మందులు పుచ్చుకొన్నా తమ రోగం తగ్గడంలేదని ఆయన దగ్గరకు రావడం తగ్గించుకున్నారు.

    ఇలా ఉండగా ఒకరోజు ఆ ప్రాంతపు ఎంఎల్ఏ ఏడుకొండలు గారికి అంతుబట్టని రోగం దాపురించింది. ఎన్ని ఊర్లు తిరిగినా, ఎంతమంది వైద్యులకు చూపించినా ఉపయోగం లేకపోయింది. ఎవరి ద్వారానో అశ్వినీ కుమార్ గారి హస్తవాసి గురించి విన్న ఏడుకొండలు ఆయన దగ్గరకు వచ్చి 'ఇక మీరే దిక్క'ని మొరబెట్టుకున్నాడు. ఇన్నాళ్ళూ సామాన్య జనులకు ఎందరికో రోగనివారణ చేసిన అశ్వినీ కుమార్ ఈ రోజు ఒక పెద్దమనిషి తన దగ్గరకు వచ్చి శరణు కోరడాన్ని ఒక సవాలుగా తీసుకున్నాడు. ఎలాగైనా ఇతని రోగం తగ్గించాలని తనకు తెలిసిన మందులన్నీ వాడాడు.

    రాత్రి ప్రొద్దు పోయేదాకా ఎన్నెన్నో పుస్తకాలు తిరగేసి, వాటిలో చెప్పిన మందులను తయారుచేసి ఇచ్చేవాడు. ఇంత చేసినా ఏడుకొండలు పరిస్థితిలో ఎటువంటి మార్పు కనబడలేదు. పైగా రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఎంత ఆలోచించినా తన వైద్యంలో ఏమి లోపం ఉందో, ఇంకేమి చేస్తే ఎంఎల్ఏ జబ్బు నయం అవుతుందో అతనికి అర్థం కాలేదు. ఒకరోజు ప్రాతఃకాలంలో తన ఇంటి అరుగుమీద దిగాలుగా కూర్చున్న అశ్వినీ కుమార్ అటుగా వెళ్తున్న ఒక సాధువును చూశాడు. ఎందుకో తనకే తెలియకుండా తనకి ఆ సాధువుపై గౌరవభావం కలిగింది. తనను ఈ పరిస్థితి నుంచి ఈ సాధువే గట్టెక్కించగలడనే చిన్న ఆశ కలిగింది.

    వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సాధువు కాళ్ళపై పడ్డాడు. ఆ సాధువు అశ్వినీ కుమార్‌ను లేవదీసి, "ఏం నాయనా! ఎందుకంత దిగాలుగా ఉన్నావు?" అని అడిగాడు. "స్వామీ! నేను ఎంతో గొప్ప హస్తవాసిగల వైద్యునిగా పేరు తెచ్చుకున్నాను. కానీ ముప్పై ఏళ్ళుగా తిరుగులేకుండా పనిచేసిన నా మందులు ఈ మధ్యన సరిగ్గా పనిచేయడం లేదు. ఇప్పుడైతే ఎక్కడెక్కడి వైద్యమూ పనిచేయక నేనే దిక్కని వచ్చిన ఎంఎల్ఏగారి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. నేను ఎంతగా ప్రయత్నించినా ఉపయోగం కనబడటం లేదు. మీరే నాకు దారి చూపించాలి" అని వేడుకున్నాడు.

    దానికా సాధువు చిరునవ్వు నవ్వుకొని "చూడు నాయనా! ఒక్కొక్కప్పుడు మనిషి ఎంతగా ప్రయత్నించినా విధి అనుకూలించకపోతే ఆ కార్యం నెరవేరదు. అయితే ఆ విధిని కూడా పురుషప్రయత్నంతో అధిగమించవచ్చు. కానీ ఆ ప్రయత్నం అహంకారాన్ని, స్వార్థాన్ని విడిచి, భగవదనుగ్రహాన్ని కోరుతూ, ఆయనపై భారం వేసి చెయ్యాలి. అప్పుడది తప్పక ఫలిస్తుంది. ఇన్నాళ్ళూ నువ్వు నయం చేసిన రోగాలన్నీ నీ ప్రతిభ అని అహంకరించావు. ఇప్పుడు ఈ ఎంఎల్ఏ రోగాన్ని నయం చేసి మంచిపేరు తెచ్చుకోవాలనే స్వార్థంతో ప్రయత్నిస్తున్నావు. నీ హస్తవాసికి అసలు కారణం నువ్వు రోజూ చేసే శివపూజ.

    'అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః| అయం మే విశ్వ భేషజోయం శివాభిమర్శనః|| - పరమేశ్వరుని తాకిన ఈ నా చెయ్యే భగవంతుడు. ఇది అత్యంత ప్రకాశవంతమైనది. శివుని తాకడం చేత ఈ నా చెయ్యి విశ్వానికంతటికీ వైద్యం చేయగల సామర్థ్యాన్ని పొందింది' అని నువ్వు రోజూ చదివే రుద్ర నమకం చెబుతోంది కదా! అలా ఎందరో మహాత్ములు, ఏ వైద్యమూ నేర్చుకోకపోయినా, తమ పూజాఫలంగా ఎందరికో రోగ నివారణ చేసే శక్తిని పొందారు కదా! ఆ విషయాన్ని గ్రహించక అహంకరించడం వలననే ఈరోజు నీకీ దుస్థితి సంభవించింది. ఇకనైనా అహంకారాన్ని విడిచిపెట్టి ఆ పరమేశ్వరుని భక్తితో పూజించి, 'అంతా నీ దయే స్వామీ, నాదేమీ లేదు. నీ బిడ్డను ఎలా రక్షించుకుంటావో నీ ఇష్టం. నా ఈ చేతితో ఏమి చేయించుకున్నా అది నీ శక్తే' అని ప్రార్థించి అప్పుడు మందు ఇవ్వు. తప్పక నయమవుతుంది" అని దీవించి ముందుకు సాగిపోయాడు.

    అశ్వినీ కుమార్ ఆ సాధువును తన కళ్ళు తెరిపించడానికి వచ్చిన పరమేశ్వరునిగానే భావించి భక్తితో శివుని పూజించి ఆ ఎంఎల్ఏ జబ్బుని నయం చేయడమే కాక, మళ్ళీ పూర్వం లాగానే తన హస్తవాసిని తిరిగి పొంది, నిరహంకారియై, నిస్వార్థంగా, నిష్కామ కర్మగా తన వృత్తి ధర్మాన్ని ఆచరించి మోక్షాన్ని పొందాడు.

8, ఏప్రిల్ 2024, సోమవారం

క్రోధి


 క్రోధి అంటే క్రోధము కలవాడు. మనందరమూ క్రోధులమే కదా! అసలు క్రోధం ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే, మనం కావాలని కోరుకున్నది ఏదో దక్కకపోతే వస్తుంది, ఎదుటివారు మనం కోరుకున్న విధంగా ప్రవర్తించకపోతే వస్తుంది. అంటే కోరికకి, కోపానికి చాలా దగ్గర సంబంధం ఉంది. నిజానికి గీతాచార్యుడు ఈ రెండూ ఒకటే అని చెబుతాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విధ్యేన మిహ వైరిణం - ఇదే కామం, ఇదే క్రోధం. ఇది రజోగుణం నుండి ఉద్భవిస్తుంది. దీని ఆకలి ఎప్పటికీ తీరదు. ఇది నీతో మహాపాపాలు చేయిస్తుంది. కాబట్టి దీనిని శత్రువుగా తెలుసుకో - అని శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు.


ఇంకొక విషయం మనం గమనిస్తే మనకు బయటివారు, ఎవరో అపరిచితుల కంటే మనకు బాగా దగ్గరైన వారు, మన కుటుంబ సభ్యులపైనే ఎక్కువగా కోపాన్ని చూపిస్తాం. పక్కింటి పిల్లవాడికి సున్నా మార్కులు వచ్చినా మనకేమీ పట్టదు. అదే మన పిల్లవాడికి కొద్దిగా మార్కులు తగ్గినా మనకి పట్టరాని కోపం వస్తుంది. అలాగే ఉద్యోగం విషయంలో, ప్రవర్తన విషయంలో, ఆరోగ్యం విషయంలో ఇలా ప్రతి దానిలోనూ మనవారు ఉన్నతస్థాయిలో ఉండాలని మనం కోరుకుంటాం. ఆ కోరిక తీరనప్పుడు అది కోపంగా పరిణమిస్తుంది.

ఎవరిపైనైనా క్రోధం తెచ్చుకోవడం అంటే వారు చేసిన తప్పుకి మనకి మనం శిక్ష వేసుకోవడమే. ఎందుకంటే క్రోధం, మనని లోలోపలనుండి తినేస్తుంది. దానివలన గుండెల్లో మంట, రక్తపోటు, గుండెజబ్బులు, మానసిక రోగాలు ఇలా అనేకం వస్తాయి తప్ప ఏమీ ఉపయోగం లేదు. అల్పుల కోపం రాతిమీద చెక్కిన గీతలాగా కలకాలం నిలిచి ఉండి పగలాగా మారుతుంది. అదే మహాత్ముల కోపం నీటిమీద గీతలాగా క్షణంలో మాయమవుతుంది. పైగా ఎవరిమీద కోపం తెచ్చుకున్నారో అది వారికి మంచినే చేస్తుంది. ఇలా మహాత్ముల కోపానికి, శాపానికి గురై ఆ కారణంగా శ్రీమన్నారాయణుని దర్శనం, స్పర్శనం పొంది తరించినవారు అనేకులు రామాయణ భాగవతాలలో మనకు కనిపిస్తారు.

అరిషడ్వర్గంలోని మిగిలిన నాలుగు దుర్గుణాలు, ఈ కామక్రోధాల వలన జనించేవే. అయితే గుణం అంటే త్రాడు అనే అర్థం కూడా ఉంది. మన చుట్టూ త్రాడును ఒక దిశలో త్రిప్పితే మనం దానిలో బంధించబడతాం. ఇప్పుడు అదే త్రాడును వ్యతిరేక దిశలో త్రిప్పితే ఆ బంధనం విడిపోతుంది కదా! అలాగే మన మనస్సు ప్రపంచం మీదికి పోయినప్పుడు ఇవే గుణాలు మనను బంధిస్తాయి. అదే మనస్సు భగవంతుని వైపు తిరిగినప్పుడు ఆ గుణాలే మన ముక్తికి కారణమవుతాయి. విషయ కామాన్ని మోక్షకామంగా మార్చుకోగలిగితే అప్పుడు క్రోధం మన ముక్తికి అడ్డు వచ్చే వాసనల మీదకి, వ్యసనాల మీదకి మళ్ళుతుంది. అప్పుడు అది మనకు సాధనకు ఉపయోగపడే మంగళప్రదమైన శ్రీక్రోధం అవుతుంది. అదే మనకు ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరం తెలియజేస్తోంది.

అలా క్రోధాన్ని తన అదుపులో పెట్టుకొని ఎవరిపై ఎప్పుడు ఎంత కోపం చూపించాలో తెలిసిన, ఆచరణలో పెట్టిన నేర్పరి కాబట్టే శ్రీరాముడు పురుషోత్తముడు అయ్యాడు. ఇంద్రియాలను కానీ, గుణాలను కానీ బలవంతంగా అణచిపెడితే అవి ఒకానొక బలహీన క్షణంలో అంతకంటే మరిన్ని రెట్లు బలంగా ఎదురుతిరిగి మనను దెబ్బకొడతాయి. అందుకే వాటిని అణచిపెట్టడం కాకుండా ఎప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మితంగా వాడుకుంటూ ఉండాలి. భగవద్గీతలో కూడా స్వామి ఇంద్రియ నిగ్రహం కంటే ఇంద్రియ సంయమనాన్నే అలవరచుకోమని బోధిస్తాడు.

కామ క్రోధాది గుణాలు చిన్న చిన్న త్రాళ్ళు అయితే వాటికి మూలమైన సత్వరజస్తమో గుణాలు పెద్ద త్రాళ్ళు. అయితే పైన చెప్పుకున్నట్లు వీటిని అదుపులో ఉంచుకొని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటే అవి కూడా సాధనకు ఉపయోగపడతాయి. తమోగుణమే లేకపోతే నిద్ర రాక శరీరానికి అలసట తీరదు. మరి రజోగుణం లేకపోతే ఆ నిద్ర నుండి మెలకువ రాదు, మనం సాధన చేసుకోవాలి, మోక్షాన్ని పొందాలి అనే పట్టుదల రాదు. అలాగే సత్వగుణం సాధనకు ఎంతగానో అవసరమని మనందరికీ తెలిసినదే కదా! అయితే ఈ మూడు గుణాలను వేటి స్థాయిలో వాటిని ఉంచగలిగినప్పుడే అవి మనకు ఉపయోగపడతాయి.

మనస్సు ఈ మూడు గుణాల పెనవేతతో ఏర్పడినది. మూడు పేటల గొలుసు మన మెడలో వేసుకున్నామనుకోండి, అవి మూడు ఒకదానితో ఒకటి అల్లుకొనిపోయి ఏది పైనో ఏది క్రిందో తెలియకుండా పోతాయి. అదే భగవద్గీతలో కృష్ణపరమాత్మ - రజస్తమశ్చాభిభూయః సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తధా - ఒకసారి రజో తమో గుణాలను అణచివేసి సత్వగుణం పైచేయి సాధిస్తుంది. మరొకసారి సత్వ రజో గుణాలపై తమోగుణము, ఇంకొకసారి సత్వ తమో గుణాలపై రజోగుణము పైచేయి సాధిస్తాయి అని చెబుతున్నాడు. ఇలా ముప్పేట గొలుసులాగా ఈ మూడు గుణాలు ఒకదానికొకటి అల్లుకుపోయి మన జీవిత గమనాన్ని వక్రగతులు పట్టిస్తూ ఉంటాయి.

అలా కాకుండా తమోగుణాన్ని క్రింది స్థాయిలో, రజోగుణాన్ని మధ్య స్థాయిలో, సత్వగుణాన్ని పై స్థాయిలో నిలిపి ఉంచితే మన సాధన ఒక సక్రమమైన మార్గంలో ముందుకు సాగి మోక్షాన్ని పొందుతాము. మనస్సనే త్రిగుణాల గొలుసులోని ఈ మూడు వరసలని అలా వాటి వాటి స్థానాలలో పట్టి ఉంచాలంటే ఇక్కడ పొందుపరచిన చిత్రంలోని శ్రీ బాబూజీ మహరాజ్ వారి కంఠసీమను అలంకరించిన గొలుసులో వలె నాలుగు అడ్డ పట్టీలు కావాలి. అవే సత్యం, శాంతి, దయ, ప్రేమ. ఎప్పుడైతే మనం ఈ నాలుగు సాధనా పరికరాలను సమకూర్చుకొని వాటితో మూడు గుణాలను సరైన స్థాయిలో నిలుపుకోగలుగుతామో అప్పుడు మన సాధన తప్పక ఫలించి ముక్తిని పొందుతాము.

ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మనందరికీ అటువంటి సాధన సంపత్తిని, సంయమనాన్ని ప్రసాదించాలని శ్రీగురుదేవులను ప్రార్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అలా కాకుండా తమోగుణాన్ని క్రింది స్థాయిలో, రజోగుణాన్ని మధ్య స్థాయిలో, సత్వగుణాన్ని పై స్థాయిలో నిలిపి ఉంచితే మన సాధన ఒక సక్రమమైన మార్గంలో ముందుకు సాగి మోక్షాన్ని పొందుతాము. మనస్సనే త్రిగుణాల గొలుసులోని ఈ మూడు వరసలని అలా వాటి వాటి స్థానాలలో పట్టి ఉంచాలంటే ఇక్కడ పొందుపరచిన చిత్రంలోని శ్రీ బాబూజీ మహరాజ్ వారి కంఠసీమను అలంకరించిన గొలుసులో వలె నాలుగు అడ్డ పట్టీలు కావాలి. అవే సత్యం, శాంతి, దయ, ప్రేమ. ఎప్పుడైతే మనం ఈ నాలుగు సాధనా పరికరాలను సమకూర్చుకొని వాటితో మూడు గుణాలను సరైన స్థాయిలో నిలుపుకోగలుగుతామో అప్పుడు మన సాధన తప్పక ఫలించి ముక్తిని పొందుతాము.

ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మనందరికీ అటువంటి సాధన సంపత్తిని, సంయమనాన్ని ప్రసాదించాలని శ్రీగురుదేవులను ప్రార్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

3, ఏప్రిల్ 2024, బుధవారం

భవరోగ వైద్యం

    గురుదేవులు అంటే భవరోగ వైద్యులు అని మనందరికీ తెలిసిందే కదా! భవం అంటే పుట్టుక. అంటే ఈ సంసారచక్రంలో మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఉండటమే భవరోగం. ఈ రోగానికి మూలకారణం అజ్ఞానం. అలాగే కామక్రోధాది ఆరు దుర్గుణాలు, అహంకార మమకారాలు ఈ రోగ లక్షణాలు. శారీరక రోగం వచ్చినవాడు తాను మాత్రమే బాధపడితే, ఈ భవరోగం వలన దుర్గుణాలు ప్రేరేపించినవాడు తన చుట్టూ ఉన్నవారందరినీ బాధపెడతాడు.

 సాధారణంగా రోగం వచ్చినవాడు తనకు తెలిసిన మందులు వాడటమో, లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పినవో, ఎక్కడైనా చదివినవో మందులు వాడటమో చేస్తాడు. అప్పటికీ రోగం తగ్గకపోతే వైద్యుని దగ్గరకు వెళతాడు. ఆ రోగం తీవ్రత తక్కువగా ఉండి, రోగి తాను చెప్పిన పథ్యాన్ని పాటిస్తూ మందులు సరిగా వేసుకుంటాడని నమ్మకం కలిగితే వైద్యుడు అతనికి మందులిచ్చి, తగిన జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపేస్తాడు. అదే రోగం కొంచెం ఎక్కువగా ఉండో, లేక రోగి సరిగ్గా సూచనలు పాటించడనే అనుమానం కలిగితేనో అతనిని వైద్యశాలలోనే ఒక గదిలో ఉంచి తామే పర్యవేక్షిస్తూ రోగం తగ్గేంతవరకు వైద్యం చేస్తారు. ఇంకా రోగం బాగా ముదిరిపోయి నిరంతర పర్యవేక్షణ అవసరమైన రోగినయితే ఐసియూలో పెట్టి వైద్యం చెయ్యవలసి వస్తుంది. ఇలా రోగ తీవ్రతను బట్టి, రోగి మానసిక పరిపక్వతను బట్టి వైద్యం చేసే విధానం మారుతుంది కానీ ఆ వైద్యునికి ఏ ఒక్క రోగి పట్ల ప్రత్యేక అభిమానం కానీ, మరొక రోగి పట్ల ద్వేషం కానీ ఉండవు.

    అలాగే మరి భవరోగ వైద్యులయిన గురుదేవులను ఆశ్రయించిన శిష్యులలో కుడా రోగ తీవ్రత, మానసిక పరిపక్వత, రోగం తగ్గించుకోవాలనే పట్టుదల వివిధ స్థాయిలలో ఉంటుంది. అసలు చాలామందికి తమకు ఒక రోగం ఉన్నదనే తెలియకపోవచ్చు. కానీ గురువుకు శిష్యునికి ఉండే సంబంధం ఎన్నో జన్మలనుంచి పెనవేసుకొని ఉంటుంది. శిష్యునికి తెలిసినా, తెలియకపోయినా, సాధన సరిగా చేసినా, చేయకపోయినా గురువు మాత్రం శిష్యుని విడిచిపెట్టడు. అయితే తన భవరోగాన్ని గుర్తించి, గురు ముఖస్తుగా వచ్చిన ఏ చిన్న వాక్యాన్ని అయినా గురు ఆజ్ఞగా భావించి, శిరసావహించి చక్కగా సాధన చేసుకొనే ఉత్తమ శిష్యుడు గురువుకు భౌతికంగా ఎంతో దూరంలో ఉన్నా తరిస్తాడు. 

    కానీ కామక్రోధాది గుణాలు తరచుగా విజృంభిస్తూ, గురుసన్నిధి ఒక్క క్షణం దూరమైనా మళ్ళీ మాయలో పడిపోయి తాను దిగజారిపోతూ, ఇతరులకు కూడా కష్టాన్ని కలిగించే స్థితిలో ఉన్న శిష్యుని మరి గురువు నిరంతరం తన సన్నిధిలో ఉంచుకొని పర్యవేక్షించవలసిందే కదా. అయితే మానసిక పరిపక్వత లేని ఆ శిష్యుడు తనను గురువు నిరంతరం సన్నిధిలో ఉంచుకోవడాన్ని తన గొప్పగా భావించి, అహంకారాన్ని పెంచుకొని, ఇతర శిష్యుల మీద పెత్తనం చలాయించాలని చూసే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే గురుదేవులు మాత్రం ఆ శిష్యుని ఎలాగైనా ఉద్ధరించి తరింపజేయాలనే చూస్తారు. 'తనకు అత్యంత సమీపంలో ఉంటేనే ఇంతగా మాయకు వశుడైపోతున్నాడే, ఇక తనకు దూరమైతే ఇంకెంత దిగజారుతాడో' అని బాధ పడతారు.

    అయితే ఈ విషయాన్ని గుర్తించని ఇతర శిష్యులు గురువును అపార్థం చేసుకుంటారు. ఆ శిష్యుడు ఎన్ని దుష్కార్యాలు చేస్తున్నా గురువు అతనిని దండించడం లేదని అలుకబూనుతారు. భవరోగ వైద్యులయిన గురుదేవుల వద్ద శిక్షణే కానీ శిక్ష ఉండదు. పద్మం వికసించినప్పుడు తుమ్మెద ఎంతో దూరంనుంచి వచ్చి ఆ మకరందాన్ని గ్రోలి ఆ మాధుర్యాన్ని చక్కగా ఆస్వాదించి ఎగిరిపోతుంది. అదే పద్మం మొదలులో నివశించే కప్పకి ఆ మకరందంలోని మాధుర్యం తెలియకపోగా, తాను బురదలో పొర్లుతూ ఆ బురదనే పద్మానికి పూయాలని చూస్తుంది. అయితే అది పద్మానికి అంటుకోదు కదా! కానీ ఈ తుమ్మెద ఆ కప్పమీద కోపం తెచ్చుకొని దానికి ఆశ్రయం ఇచ్చినందుకు పద్మం వద్దకు రాకుండా దూరమైపోతే ఎవరికి నష్టం?

    అలాగే గురుదేవులు ఎందుకు ఒక శిష్యుని తమకు దగ్గరగా ఉంచుకుంటున్నారో తెలుసుకోకుండా, ఆ శిష్యుని వలన తనకు ఏదో బాధ కలిగిందని, ఆ శిష్యుని గురువులు తప్పక దండించి తీరాలని బలంగా విశ్వసించి, అది జరగనందుకు తాను గురువుకు దూరమైపోతే నష్టం ఎవరికి? అలా కాక, తనకు కలిగిన కష్టాన్ని గురుదేవుల సమక్షంలో విన్నవించుకొని, ఆ శిష్యునిపై తీసుకోవలసిన చర్యను గురుదేవులకే వదిలిపెట్టి, నిర్వికారంగా తన వంతు సేవ తాను చేసుకుంటే తనకే మంచిది. ఏ శిష్యులకు ఎలా శిక్షణ ఇవ్వాలో గురుదేవులకు మించి ఎవరికి తెలుస్తుంది?

  ఒకసారి శ్రీ బాబూజీ మహరాజ్ వారు శిష్యులందరికీ ప్రసాదం పెట్టిన తరువాత వారందరూ అక్కడే ఉన్న వాష్‌బేసిన్‌లో చేతులు కడుక్కుంటున్నారు. శ్రీ లలితానంద సరస్వతీ స్వామిని వారి వంతు వచ్చేసరికి శ్రీ బాబూజీ మహరాజ్ వారు తీవ్ర స్వరంలో "ఈ వాష్‌బేసిన్‌ నాకోసం కానీ అందరూ ఉపయోగించడానికి కాదు. బయటకు వెళ్ళి అక్కడ ఉన్న వాష్‌బేసిన్‌లో చేతులు కడుక్కో" అని హెచ్చరించారు. అక్కడున్న శిష్యులు అందరూ విస్తుపోయారు. ఆమె బయటకు వెళ్ళగానే శ్రీ గురుదేవులు "చూశారా? ఆమె ముఖంలో కానీ, మనస్సులో కానీ ఇంతమంది ముందు నన్ను అవమానిస్తున్నారు అని గానీ, లేదా వారందరికీ లేని అభ్యంతరం నా విషయంలోనే ఎందుకు అనే భావం కానీ ఏ మాత్రం కలుగలేదు. ఆమె అంతటి స్థితప్రజ్ఞ స్థితిని సాధించారు. కనుకనే నేను అలా అనగలిగాను. అదే మీలో ఎవరినైనా నేను అలా అంటే మీరు మళ్ళీ రెండవరోజు నా దగ్గరికి వస్తారా? శిష్యుని మానసిక పరిపక్వతను బట్టే గురుదేవుల ప్రవర్తన ఉంటుంది" అని వివరించారు.

    కాబట్టి ఏ శిష్యునికి ఎలాంటి శిక్షణను ఇవ్వాలో, ఎవరి తప్పులను ఎలా సరిదిద్దాలో గురుదేవులకే వదిలిపెట్టి సర్వ సమర్పణ భావంతో వారిని సేవించుకొనడమే శిష్యుని కర్తవ్యం. ఏ రోగికి ఎలాంటి వైద్యం చేయాలో వైద్యునికి ఇంకొక రోగి చెప్పలేడు కదా!

11, ఫిబ్రవరి 2024, ఆదివారం

అనాయాస మరణం

 అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం

దేహాన్తే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే||

    ప్రతి మానవుడు తప్పకుండా కోరుకోవలసిన కోరిక ఇది. బ్రతికినన్నాళ్ళు ఎవరి మీదా ఆధారపడకుండా బ్రతకడం, మరణ సమయంలో ఎక్కువగా కష్టపడకుండా సునాయాసంగా మరణించడం, ఆ తరువాత పరమేశ్వరునిలో సాయుజ్యం చెందడం, ఇంతకన్నా కోరుకోదగినది ఏమి ఉంటుంది?

            జన్మకు వచ్చిన ప్రతి జీవికి ఆరు అవస్థలు ఉంటాయి. వీటినే షడ్భావ వికారాలు అంటారు. అవి - అస్తి, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షీయతే, నశ్యతే. ముందుగా తల్లి గర్భంలో ఉండటం - అస్తి. ఆ తరువాత జన్మించడం - జాయతే. ఇక అలా జన్మించిన వ్యక్తి ముందు పెరుగుతాడు(వర్ధతే), ఆ తరువాత మధ్య వయస్సులో శరీరం అనేక మార్పులు చెందుతుంది(పరిణమతే). ఆ వయసు దాటిన తరువాత మెల్లగా శరీరంలోని పటుత్వం, అలాగే చూపు, వినికిడి, నడక ఇలా ఒక్కొక్క అవయవం క్షీణించడం మొదలుపెడుతుంది(అపక్షీయతే). చివరికి ఈ శరీరం పడిపోతుంది(నశ్యతే).

        పుట్టడం, పెరగడం, మార్పు చెందడం ఎంత సహజమో మరణించడం కూడా అంతే సహజమని మనందరికీ తెలిసినదే కదా! అయితే గర్భిణీ అయిన ప్రతి స్త్రీ తనకు సహజ ప్రసవం జరగాలని కోరుకుంటుంది కదా. కొంతకాలం క్రితం వరకు డబ్బులకోసం అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేసిన డాక్టర్లు కూడా ఇప్పుడు సహజ ప్రసవమే తల్లికి, బిడ్డకు మంచిదని, తల్లిపాలే బిడ్డకు అత్యుత్తమమని, అలాగే మనందరం సహజంగా పండిన ఆహారాన్నే తీసుకోవాలని ఇలా చెబుతున్నారు కదా.

        ఇలా పుట్టుకనుంచి జీవితంలో ప్రతి విషయంలో సహజత్వాన్ని ఎలా కోరుకుంటున్నామో మరణం విషయంలో కూడా అలాగే సహజ మరణాన్ని కోరుకోవాలి. వెనకటి కంటే వైద్య సదుపాయాలు బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో మృత్యువు అంచులలో ఉన్నవారిని, ఇంకా మరణించిన వారిని కూడా ఏదో ఒక పద్ధతిలో బ్రతికించాలని, వారి ఆయుష్షును పొడిగించాలనే ఆరాటం ఎక్కువ అయిపోయింది. ఇంకా జీవితం సరిగ్గా అనుభవించని యువకులు, లేదా బాధ్యతలు తీరని మధ్య వయస్కుల విషయంలో అనుకోని ఆపద, లేదా వ్యాధి ఎదురై మరణించే పరిస్థితి వచ్చినపుడు ఇలా ఆరాట పడటాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.

        కానీ నిండు జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించిన పెద్దవారు తాము కట్టకొన్న ఇంటిలో తన వాళ్ళందరూ చుట్టూ ఉండగా, ఆనందంగా, సహజంగా దేహాన్ని వదిలిపెట్టాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా! ఇక దేహాన్ని వదలివేయడం తథ్యం అన్న పరిస్థితులలో కూడా వారిని ఐసియూలో పెట్టి వంటినిండా సూదులు, గొట్టాలు గుచ్చి చుట్టూ తనవాళ్ళు అంటూ ఎవరూ కనబడని నిస్సహాయ స్థితిలో మరణించేలా చేయడం ఎంతవరకు సమంజసం? మనం ప్రేమించేవాళ్ళు ఎల్లకాలం మనతోనే ఉండాలని ప్రతివారు కోరుకుంటారు. అయితే దానికి కూడా పరిమితులు ఉంటాయి కదా. వయసుకు వచ్చిన పిల్లలు మనను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవడం ఎంత సహజమో, వయసు అయిపోయిన పెద్దవారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం కూడా అంతే సహజం. 

        అయితే ఎవరైనా పెద్దవారు ఇంట్లో సహజంగా మరణించారంటే ఈ చుట్టూ ఉన్న సమాజం చూస్తూ ఊరుకోదు. ఒక్కొక్కరూ పలకరింపుగా వచ్చి ఆ పిల్లలను "అయ్యో పెద్ద డాక్టరుకి చూపించక పోయారా?" "ఎకో టెస్టు చేయించాల్సింది." "లేదు, ట్రెడ్మిల్ టెస్టు చేస్తే కానీ ఇలాంటివి బయటపడవు" అని ఇలా సలహాలు ఇస్తున్నట్లుగా సూటిపోటి మాటలతో తామేదో లోటు చేశామనే అపరాధ భావనను ఆ పిల్లలలో కలిగిస్తారు. ఈ పోరు తట్టుకోలేక, ఇటువంటి పరిస్థితిని చూసినవారు రేపు తమ ఇంటిలో పెద్దవారిని ఏ చిన్న రోగం వచ్చినా నానా రకాల వైద్యాలు చేయించి చివరికి ఏ ఐసీయూలోనో మరణించే పరిస్థితిని కల్పిస్తారు.

    మరణం ఏ విధంగా సంభవిస్తుంది అనేది మన చేతిలో లేదు. ఈ శరీరం ప్రారబ్ధం అనుభవించడానికి వచ్చినది. అది తీరగానే పడిపోతుంది. కొంతమందికి ముందుగానే ఆ ప్రారబ్ధం తీరిపోయి ఏ నిద్రలోనో అనాయాస మరణం సంభవించవచ్చు. మరికొంత మందికి చివరివరకూ తీరక విపరీతమైన మరణవేదన అనుభవించవలసి రావచ్చు. ఏదైనా ఈశ్వర సంకల్పమే. అయితే పైన చెప్పుకున్నట్లు ఆ మరణం సహజంగా తన ఇంటిలో తన వారి మధ్య జరగాలని ప్రతి వ్యక్తి కోరుకోవడంలో తప్పు లేదు కదా! 

         అయితే తాను మరణించిన తరువాత తన పిల్లలు ఇలా సూటిపోటి మాటలకు గురై ఏదో లోటు చేశామనే అపరాధ భావనకు లోను కాకుండా తాను తృప్తిగానే జీవితాన్ని ముగించానని వారు కూడా సంతోషపడేలా చేయడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. నిజంగా మరణ సమయం ఆసన్నమయినపుడు తాను తెలివిలో ఉంటాడో, అపస్మారక స్థితిలో ఉంటాడో తెలియదు కదా. అందువలన వారు ఎటువంటి మరణాన్ని కోరుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకొని, తన సంతానానికి, స్నేహితులకి ఒకటికి రెండు మూడుసార్లు తెలియజెబితే, తాను ఏ స్థితిలో ఉన్నా తృప్తిగా తన ఇంటిలోనే, తనవారి మధ్యలో సహజంగా శరీరాన్ని వదిలి శివ సాయుజ్యాన్ని పొందుతాడు.