పూర్వకాలపు కథలలో కానీ, సినిమాలలో కానీ మనం చూస్తే ప్రతి ఇంటిలో ముందుగా ఆ ఇంటి ఇల్లాలు నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి, వంట చేసి అప్పుడు భర్తను మేలుకొలపడం కనిపిస్తుంది. "తరుణి సీతమ తల్లి గృహవిధుల మునిగింది, తిరిగి శయనించేవు మర్యాద కాదయ్య, మేలుకో శ్రీరామా!" అని మనకు పాట కూడా ఉంది. అలాగే మన పురాణాలలో గమనిస్తే రాక్షసులు అందరూ కేవలం స్వార్థంతో తమకు శక్తి రావాలనో, మరణం రాకూడదనో వరాల కోసం తీవ్ర తపస్సులు చేశారు కానీ, వారి భార్యలు మాత్రం పతివ్రతలై తమ భర్త బాగు కోసం వ్రతాలు ఆచరించేవారు. వారి పాతివ్రత్య ఫలితంగా ఆ రాక్షసులు అజేయులై నిలిచేవారు. త్రిపురాసురులు, జలంధరుడు వంటి రాక్షసులను మహాదేవుడు సంహరించాలంటే విష్ణుమూర్తి వారి భార్యలను ఏమార్చవలసి వచ్చేది. అందుకు ఆయన శాపాలను కూడా పొందవలసి వచ్చింది. స్త్రీమూర్తుల నిస్వార్థ సాధన యొక్క శక్తి అంతటి గొప్పది.
పూజ, ఆరాధన, సాధన, పుష్ప, హారతి, కీర్తన, నివేదిత, సింధూర, అక్షత ఇలా పూజలకు సంబంధించిన పేర్లన్నీ ఆడ పేర్లే! వాటి ఫలితానికి సంబంధించిన తీర్థ్, ప్రసాద్ మాత్రం మగ పేర్లు. కేవలం నీళ్ళు పోయడం తప్ప ఇంకే కష్టమూ లేని అభిషేక్ మాత్రం మగవారు ఉంచుకున్నారు లెండి. ఇలా పుణ్యకర్మలన్నీ ఆడవారు చేస్తే ఫలితం మాత్రం మగవారు అనుభవిస్తున్నారు. అయితే మన శ్రీకాళీ వనాశ్రమంలోని ఆలయంలో ప్రతిరోజూ ముందుగా శ్రీ రామలింగేశ్వర స్వామివారిని మేల్కొలిపి ఆ తరువాతే జగన్మాత శ్రీ మహా కాళికా పరమేశ్వరీ దేవిని మేల్కొలపడం జరుగుతుంది. అమ్మ ఈ దృశ్యమాన జగత్తుకు ప్రతీక అయితే పరమేశ్వరుడు అందులో కూటస్థుడై జగత్తును నడిపించే చైతన్య స్వరూపుడు. ముందుగా మనలోని చైతన్యం మేల్కొంటేనే కదా ఈ శరీరం నిద్ర లేచేది.
ఈ కాలంలో చాలా కుటుంబాలలో మనుషులు తగ్గి, ఉరుకు పరుగుల జీవనం పెరిగాక స్త్రీపురుషులిద్దరూ ఒకేసారి లేచి, తయారై పరుగులు పెడుతున్నారు. మన ఆచారాల ప్రకారం పురుషుడు పూజలో, హోమాలో చేసేటప్పుడు స్త్రీ ప్రక్కన లేకపోయినా, "ధర్మపత్నీ సమేతస్య" అని సంకల్పం చెప్పుకోవడం, ఆ పుణ్యకార్యంలో భార్యకు కూడా వాటా రావడం కద్దు. కానీ స్త్రీలు చేసే వ్రతాలు, పూజలు మాత్రం చాలావరకు తమ భర్త, కుటుంబ క్షేమం కోసం, లేదా మంచి భర్త రావడం కోసమో ఉంటాయి.
బాహ్య ప్రాపంచిక ఫలాల కోసం చేసే పుణ్య కార్యాలలో ఇలా ఒకరి కర్మఫలం ఇంకొకరికి పంచడం సాధ్యం అవుతుంది కానీ ఆధ్యాత్మిక సాధనలో మాత్రం ఇలా పంచుకోవడం కుదరదు. ఎవరి సాధన వారిదే. అందులో ఎవరి పురోగతి వారిదే. "ఉద్ధరేదాత్మనాత్మానం". ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉదాహరణకి ఒక తండ్రి కష్టపడి సంపాదించి ఒక యిల్లో పొలమో కొన్నాడనుకోండి అది ఏ కష్టము లేకుండానే అతని కుమారుడికి సంక్రమిస్తుంది కదా! కానీ తండ్రికి ఆకలి వేసి కడుపునిండా భోజనం చేస్తే అది కుమారుడికి సంక్రమిస్తుందా? లేదు! ఎందుకంటే అది బయటి వస్తువు కాదు. ఆకలి తీరడం అనేది ఎవరికి వారికే సొంతమైనది.
మన చిన్నప్పుడు ఒక చాక్లెట్ వ్యాపార ప్రకటనలో పిల్లవాడు అందరినీ "మెలోడీ ఇంత చాక్లెటీ ఎలా అయ్యింది?" అని అడుగుతూ ఉంటాడు. చివరికి వేరొక పిల్లవాడు "మెలోడీ తిను, నువ్వే తెలుసుకో!" అంటాడు. అలాగే ముక్తి కూడా అనుభవైకవేద్యమే కానీ వేరొకరు చెబితేనో, చూస్తేనో, చదివితేనో తెలిసేది కాదు. ఆకలి తీరడం, జ్వరం రావడం మొదలైనవి ఎలా అయితే ఎవరికి వారే అనుభవిస్తారో, ఒకరి అనుభవం ఇంకొకరికి తెలియదో అలాగే ఆధ్యాత్మిక సాధన ద్వారా పొందే ముక్తి కూడా ఎవరికి వారు పొందవలసిందే, అనుభవించ వలసిందే.
మనం 2024 సంవత్సరానికి స్వస్తి పలికి 2025లో అడుగు పెడుతున్నాం. 2025లో అంకెలన్నీ కూడితే 9 వస్తుంది. అలాగే తొమ్మిది చిల్లుల తిత్తి అయిన ఈ మానవ దేహంలో నుండి ప్రాణవాయువులు జారిపోక ముందే మనం మేల్కొని సాధనలో పురోగతిని సాధించాలని, అటువంటి మేలుకొలుపు మనందరికీ కలిగించాలని శ్రీగురుదేవులను ప్రార్థిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి