1, ఫిబ్రవరి 2023, బుధవారం

శోభకృత్

    శ్రీ కాళీ వనాశ్రమ స్వర్ణోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడిన శ్రీ శుభకృత్ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. సాధారణంగా ఉగాది అంటేనే ప్రకృతి అంతా ఉత్సాహంగా, శోభాయమానంగా ఉంటుంది. అప్పటి వరకు శిశిరంలో ఆకులు రాల్చి మోడులై పడి ఉన్న వృక్షాలన్నీ క్రొత్త చిగుర్లు వేసి, లేలేత ఆకులతో, రంగురంగుల పువ్వులతో ఎంతో ఆనందంగా తుళ్ళిపడుతూ ఉంటాయి. తమందరికి ఆధారమైన ఆ వృక్షాల ఆనందం చూసి భూమి మీద నివసించే సకల జంతుకోటికి ఆనందం, ఉత్సాహం కలుగుతాయి. ఇలా సృష్టిలోని ప్రతి జీవిని ఉత్సాహపరుస్తుంది వసంతశోభ. అది మన పెరట్లో ఉన్న ఒక్క చెట్టయినా, లేక ఎన్నో ఎకరాలలో విస్తరించిన మహోద్యాన వనమైనా ఈ వసంతం తెచ్చే ఆనందంలో ఏమైనా తేడా ఉంటుందా?

    అలాగే ఎంతోకాలం పాటు, నిజానికి ఎన్నెన్నో జన్మలుగా, ఈ సంసార చక్రంలో బంధించబడి ఆ బాధలు తట్టుకోలేక, బయటపడే దిక్కు తెలియక మోడులై జీవితాలను వెళ్ళదీస్తున్న ఆర్తులైన ఎందరో భక్తుల జీవితాలలో, వారి సామాజిక, ఆర్థిక, పారమార్థిక స్థాయిలలో భేదాలతో సంబంధం లేకుండా నేనున్నానని అభయమిచ్చి, దరిచేరే దారిచూపి వసంతశోభను నింపిన సద్గురుదేవుల మహిమను ఏమని వర్ణించగలం? అది మాటలకు అందేది కాదు. వారు భక్తులైనా, ఆర్తులైనా, జిజ్ఞాసువులైనా, అర్ధార్ధులైనా, జ్ఞానులైనా తమకు తాముగా వారి వద్దకు వెళ్ళి, వారిని అక్కున చేర్చుకొని, వారందరినీ ఒకచోట చేరదీసి ఈ కాళీ వనాశ్రమాన్ని సద్భక్తోద్యానవనంగా మార్చిన వసంతులు శ్రీగురుదేవులు. 'ఓం సద్భక్తోద్యానవన వసంతాయ నమః' అన్నది వారి సార్ధక నామధేయం.

    నిజానికి వృక్షాలు శిశిరంలో ఎంతగా బాధపడినా అవి మూగగా రోదించగలవు కానీ వసంతాన్ని వెదుక్కుంటూ వెళ్ళలేవు కదా! అలాగే మానవుడికి నడిచి వెళ్ళే శక్తి ఉన్నా తనను ఈ సంసార బాధలనుండి రక్షించే గురువును వెదుక్కుంటూ ఎక్కడికని వెడతాడు? ఫలానా వారు తనను ఉద్ధరించగల గురువులని ఎలా గుర్తు పడతాడు? అది అసాధ్యం. అందుకే ఆ మానవుడి ఆర్తి గాఢమైనపుడు ఆ గురువే అతనిని వెదుక్కుంటూ వస్తాడు. సమర్ధ సద్గురు శ్రీశ్రీశ్రీ హనుమత్ కాళీ వర ప్రసాద బాబూజీ మహరాజ్ వారిని ఆశ్రయించి తరించిన ఎందరో భక్తుల జీవితాలలో ఇది ప్రత్యక్ష నిదర్శనం.

    అప్పటికే సాధకులై కొంత ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించిన శ్రీ కందర్ప పరశురామయ్యగారు, నిండ్రకొలను డాక్టరు శ్రీ కొప్పెర్ల వెంకటరాజుగారు, శ్రీ లలితానంద సరస్వతీ స్వామినివారు, శ్రీ లంకా శేషగిరి రావుగారు మొదలైన ఉద్దండుల దగ్గరినుంచి అసలు దేవుడంటే ఎవరో, ఆయనను ఎలా కొలవాలో తెలియని, అసలు తాను సంసారమనే బంధనంలో ఉన్నానని కూడా గుర్తించలేని అతి పామరుని వరకు ప్రతి ఒక్కరికీ శ్రీ బాబు వారంతట వారిగా పరిచయమై వారి వారి జీవితాలలో పెనుమార్పును తీసుకువచ్చి, ఆధ్యాత్మిక పథంలో అగ్రగాములుగా నిలబెట్టి, అత్యున్నతమైన మోక్ష సామ్రాజ్యాన్ని వారికి అందించారు. ఇదంతా ఏదో పెద్ద శ్రమతో కూడిన బృహత్ కార్యక్రమంలాగా కాకుండా అసలు వారి జీవితాలలో వస్తున్న మార్పులు వారికే తెలియనంత సహజంగా, సరళంగా నడిపించారు.

    మోడులైన వృక్షాలు కాలగమనంలో తమలోనే అత్యంత సహజంగా మార్పును తెచ్చుకొని పుష్పించి, ఫలించినట్లుగా బద్ధుడైన మానవుడు ఎక్కడికీ వెళ్ళనవసరం లేకుండా ఉన్నచోటనే ఉండి, తనలో మార్పు తెచ్చుకొని, తన హృదయ క్షేత్రంలో భక్తి జ్ఞాన, వైరాగ్య బీజాలు నాటుకొని, అవి అంకురించి, పెంపొంది, తనకు ప్రసాదించే ఆత్మానందమనే ఫలాన్ని పొందవచ్చు. దానికి కావలసిన సాధనాలు రెండే - గురుదేవులయందు అచంచల విశ్వాసం, గురు ఆజ్ఞాపాలన. అయితే దీనికి ప్రతిగా ఆ గురుదేవులు కోరుకొనే గురుదక్షిణ ఏమిటి? ఆ ఆత్మానందాన్ని కేవలం తాను మాత్రమే అనుభవించకుండా, సంకుచిత భేదబుద్ధిని వదలి, సర్వజీవ సమభావనతో తనచుట్టూ ఉన్న సర్వ ప్రాణులకు పంచిపెట్టడమే ఈ గురు వసంతుడు కోరుకొనే ఏకైక కోరిక.

    అలా మనందరి జీవితాలలో వసంతశోభను నింపిన శ్రీగురుదేవులు చూపిన మార్గంలో నడుస్తూ, ఈ శోభకృత్ నామ సంవత్సరంలో మనందరం ఈర్ష్యా ద్వేషాలను వదలి, మానవులందరియందు, అలాగే సర్వ భూతములయందు నిష్కళంకమైన ప్రేమను పెంచుకొని, శాశ్వతానందమయమైన  ఒక క్రొత్త శకంలోకి అడుగు పెట్టాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి