25, సెప్టెంబర్ 2022, ఆదివారం

అపూర్వం - అద్వితీయం

    పురాణ కాలంలో వశిష్టాది మహర్షులు బ్రహ్మజ్ఞానులైనప్పటికీ, సంసారులై బహు సంతానంతోనే ఆశ్రమవాసం చేసేవారు. అంతే కాదు, వారి ఆశ్రమాలలో అనేక పశుపక్ష్యాదులు కూడా ఆశ్రయం పొందేవి. అయితే ఈ కలియుగంలో ఎప్పుడు మొదలైందో కానీ ఆధ్యాత్మిక సాధన చేయాలన్నా, గురువులను ఆశ్రయించాలన్నా సంసారాన్ని వదిలేసి సన్యాసులు కావాలని ఒక అపోహ బయలుదేరింది. ఈ అపోహను పటాపంచలు చేస్తూ, గృహస్తాశ్రమమే ఆధ్యాత్మిక సాధనకు అత్యంత సురక్షితమైనదని బోధించడమే కాక, ఆచరణలో నిరూపించడానికి సమర్థ సద్గురు శ్రీ శ్రీ శ్రీ హనుమత్ కాళీ వరప్రసాద బాబూజీ మహరాజ్ వారు "శ్రీ కాళీ గార్డెన్స్" అనే ఆశ్రమాన్ని 1972 మే 31వ తేదీన స్థాపించి ఇక్కడ ఎందరో గృహస్థులతో వారి వారి ప్రాపంచిక ధర్మాలను ఒకప్రక్క నిర్వహింపజేస్తూనే, ఆధ్యాత్మిక మార్గంలో పురోగతిని అందిస్తూ మోక్షపథగాములను చేసి, ముక్తిని ప్రసాదించారు, ఇప్పటికీ ఎప్పటికీ ప్రసాదిస్తూనే ఉన్నారు. "కేవలం నీ ఆధ్యాత్మిక జీవితంతోనే నాకు సంబంధం కానీ ప్రాపంచిక జీవితంతో నాకు సంబంధం లేదు" అని శ్రీగురుదేవులు ఏ శిష్యునితోనూ ఎన్నడూ అనలేదు. వారి దృష్టిలో ప్రపంచం ఆధ్యాత్మికానికి భిన్నం కాదు. ఉన్నదంతా ఆత్మయే అయినప్పుడు దానికి భిన్నంగా ఏముంటుంది? అందుకే వారు తమ వద్దకు ఎవరు ఎటువంటి సమస్యలతో వచ్చినా, వారి సమస్యలకు పరిష్కారం చూపుతూ, మెల్లగా వారి మనస్సును భగవంతునివైపు మళ్ళిస్తూ, వారికి ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రసాదించారు.

    అలాగే పూర్వకాలంలో గార్గి, మైత్రేయి వంటి ఎందరో విదుషీమణులు వేద శాస్త్రాలను అభ్యసించడమే కాక అందులో అపార పాండిత్యాన్ని గడించి వినుతికెక్కారు. అయితే మధ్యలో ఎప్పుడో స్త్రీలకు వేదాలు నేర్పరాదని, వారు దేవాలయాలలో పూజాదికాలకు పనికిరారని ఒక అపోహ బయలుదేరింది. అలాగే కేవలం బ్రాహ్మణులు మాత్రమే అర్చకులుగా ఉండాలనే నియమం కూడా వచ్చింది. అయితే ఇటువంటి అపోహలను తొలగిస్తూ శ్రీగురుదేవులు ఆశ్రమంలో స్త్రీలకు కూడా సకల విద్యలు నేర్పే ఏర్పాటు చేసి, ఇక్కడి అన్ని ఆలయాలలోనూ స్త్రీలనే(అది కూడా కులంతో సంబంధం లేకుండా) ప్రధాన అర్చకులుగా, సహాయకులుగా నియమించి ఒక క్రొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అది ఇప్పటికీ, ఎప్పటికీ అలాగే కొనసాగుతుంది.

    సన్యాసాశ్రమాలకు ఏ పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టినా, ఆశ్రమం వెలుపలి గృహస్తులపై ఆధారపడవలసిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అలా కాక అందరూ గృహస్తులే ఆశ్రమవాసం చేస్తూ ఉండటంతో ఈ ఆశ్రమం స్వయం సమృద్ధిని సాధించి ఎంతటి బృహత్తర కార్యక్రమాన్ని అయినా అలవోకగా నిర్వహించగల సామర్థ్యాన్ని సంతరించుకొంది. అంతేకాక, కేవలం ఇక్కడి గృహస్తుల అవసరాలకే కాక ఈ చుట్టుప్రక్కల గ్రామాలలోని ప్రజలందరికీ ఉపయోగపడేలా అత్యంత తక్కువ ఖర్చుతో, అర్హులైనవారికి ఉచితంగానే విద్యను, వైద్యాన్ని అందించడానికి గురుకులాన్ని, వైద్యశాలను ఏర్పాటు చేశారు శ్రీగురుదేవులు. ప్రతి సంవత్సరం కులమతాలకతీతంగా ఎన్నో వేలమంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. శ్రీగురుదేవుల బోధామృతం, అలాగే ఈ ఆశ్రమంలో విలసిల్లే వినూత్న భావజాలం దేశం నలుమూలలా వ్యాప్తిచెంది సమాజంలో మార్పు రావడంకోసం "సమర్ధసద్గురు" ఆధ్యాత్మిక మాసపత్రిక కూడా విశేష కృషి సలుపుతోంది. అలాగే గోమాతల సంరక్షణార్థమై విశాలమైన గోశాల, అతిథుల కోసం అన్నదానం, జీవన మలిసంధ్యలో సత్తువ క్షీణించి స్వయంగా పనులు చేసుకోలేక, ఆధ్యాత్మిక జిజ్ఞాసతో ఆశ్రమ నివాసం కోరుకునే వృద్ధులకు ఆశ్రిత ఆశ్రయం నిర్వహించబడుతున్నాయి.

    ఇక ప్రశాంతతకు నిలయమైన ఈ ఆశ్రమాన్ని మొదటిసారి సందర్శించిన చాలామంది అనే మాట ఇది మరో తిరుమలలాగా ఉందని. నిజమే. శ్రీగురుదేవులు వేంకటేశ్వర స్వామిని "మా బ్రదర్" అనేవారు. తిరుమలలాగానే ఈ ఆశ్రమం కూడా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, వార్షికోత్సవాలతో నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఎల్లప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. అయితే తిరుమలలో స్వామివారిని తనివితీరా దర్శించుకోవాలన్నా, విశేషంగా సేవించుకోవాలన్నా అంత సులభంగా అందరికీ ఆ అవకాశం లభ్యం కాదు. అందుకే "అహం దూరదస్తే పదాంభోజ యుగ్మ ప్రణామేచ్చయాగత్య సేవాం కరోమి! సకృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ||" - "స్వామీ! వేంకటేశా! నేను ఎంతో దూరంనుంచి ఎన్నో ప్రయాసలకోర్చి నీ పాదారవిందాలకు ప్రణామం చేయాలనే కోరికతో వచ్చాను. ఈ చిన్న సేవకే నీవు సంతోషించి నీకు నిత్యసేవ చేసుకున్న ఫలితాన్ని నాకు అనుగ్రహించు" అని వేడుకొని అక్కడితో సంతృప్తి పడవలసి వస్తుంది. కానీ ఆశ్రమంలో ఎవరి ఆవేదనననుసరించి వారు ఎంతసేపైనా సాక్షాత్తు భగవదవతారస్వరూపులైన శ్రీగురుదేవుల దర్శన, స్పర్శన, వందన, సంభాషణాది భాగ్యాలను పొంది తమ శక్తికొలది ఆశ్రమసేవ చేసుకొనే అవకాశం అందరికీ లభిస్తుంది. అంతేకాదు, తిరుపతి వేంకటేశ్వర స్వామికి ఏదైనా మ్రొక్కుకుని, అక్కడికి వెళ్ళే అవకాశం లేనివారు కూడా ఈ ఆశ్రమంలో ఆ మ్రొక్కును తీర్చుకుని, సంతృప్తిని చెందిన సందర్భాలు అనేకం.

    ఇక కాశీ క్షేత్రాన్ని మోక్షధామమని, ఎవరైనా అక్కడ మరణిస్తే, కనీసం బయట మరణించినవారికి అక్కడ అంతిమ సంస్కారం జరిపితే, లేదా వారి అస్థికలైనా అక్కడి గంగలో నిమజ్జనం చేస్తే ఆ మరణించిన జీవునికి మోక్షం కలుగుతుందని హిందువులందరి విశ్వాసం. అలాగే కాశీలోని శ్మశానాలలో పరమేశ్వరుడు సంచరిస్తూ ఉంటాడని, చితికి నిప్పంటించి, అయినవారందరూ వదలి వెళ్లిపోతే, విలపిస్తున్న ఆ జీవుడికి 'నేనున్నాన'ని ధైర్యం చెప్పి, నారాయణ మంత్రాన్ని ఉపదేశించి తరింపజేస్తాడని కూడా చెబుతారు. అలాగే శ్రీగురుదేవులు కూడా ఈ కాళీవనాశ్రమాన్ని నమ్ముకొని ఇక్కడ జీవనం సాగించిన మానవులకే కాక, పశుపక్ష్యాది సమస్త జీవరాశికి ముక్తిని ప్రసాదిస్తానని అభయం ఇచ్చారు. అందుకే ఇక్కడి భక్తులందరూ ఈ మోక్షధామంలోనే ప్రాణాలు విడవాలని బలంగా కోరుకుంటారు. ఒకవేళ విధివశాత్తు బయట ప్రాణాలు విడిచినా, వారి కుటుంబసభ్యులు వారి భౌతికదేహాన్ని ఇక్కడికే తరలించి అంత్యక్రియలను ఇక్కడనే నిర్వహిస్తారు. అంతేకాక, ఇక్కడి రుద్రభూమిలో అంత్యక్రియలకు సహకరించే సేవకులకు పరమేశ్వర దర్శనం ఎన్నోసార్లు జరిగిన నిదర్శనాలు ఉన్నాయి.

    ఎందరో మహర్షులు పూర్వకాలంలో తపస్సులు, యజ్ఞయాగాదులు నిర్వహించిన పవిత్ర క్షేత్రమైన ఈ కాళీవనాశ్రమం ఆధునిక కాలంలో శ్రీగురుదేవుల పవిత్ర పాదస్పర్శతో అణువణువూ పునీతమై, పుట్టినది మొదలు శ్రీగురుసాయుజ్య ముక్తిని పొందేవరకు మానవుని సరైన మార్గంలో నడిపిస్తూ, అడుగడుగునా ఆదుకొంటూ, కులమతాలు, ఆర్థిక వ్యత్యాసాలతో సంబంధం లేకుండా అందరూ ఒక్క కుటుంబంవలె మెలిగే ఆశ్రమవాసులతో విరాజిల్లుతూ ఆచంద్రతారార్కం ఇలాగే వర్ధిల్లుతూ ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీకాళీవనాశ్రమ స్వర్ణోత్సవాలు 11 నవంబర్ 2022 నుండి 21 నవంబర్ 2022 వరకు అత్యంత వైభవంగా జరుగబోతున్నాయి. ఈ ఉత్సవాలకు భగవద్భక్తి, ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగినవారందరూ ఆహ్వానితులే.
మరిన్ని వివరాలకు ఈ క్రింది లింకును వీక్షించండి:
తెలుగు:
English:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి