11, జనవరి 2022, మంగళవారం

రహస్యం

మన భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ వాటిలో చెప్పబడిన విషయం చాలా రహస్యం అని చెప్తూ ఉంటాయి. భగవద్గీతలో కూడా స్వామి 'ఇతి గుహ్యతమం శాస్త్రం' అని, 'రహస్యం హ్యేతదుత్తమం' అని ఇలా చాలా చోట్ల  చెప్తారు. అలాగే 'త్రిపురా రహస్యం', 'లలితా సహస్రనామ రహస్య స్తోత్రం' ఇలా అన్నీ రహస్యమనే చెప్పబడ్డాయి. అయితే ఇలా రహస్యం అని చెప్పడం, ఏదో ఇవన్నీ పండితుల కోసమేనని, సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండకుండా చేయాలని కాదు. ఈ గ్రంథాలలో చర్చించిన విషయం చాలా లోతైనది. అందులో ప్రవేశం లేనివారు, సరైన మానసిక పరిపక్వత చెందనివారు దానిని తప్పుగా అర్థం చేసుకొనే అవకాశం ఉంది. 

తామసికమైన బుద్ధి అన్నింటికి విపరీతార్థాలు తీసి అధర్మాన్నే ధర్మంగా అర్థం చేసుకుంటుందని గీతాచార్యుడు వివరించాడు. అంతెందుకు, మన పురాణాలలోని ప్రముఖ రాక్షసులు అందరూ ధర్మ శాస్త్రాలను కూలంకషంగా అభ్యసించిన వారే. కానీ అందులోని ధర్మసూత్రాలనే తమ అధర్మ ప్రవర్తనకు అనుకూలంగా నిర్వచించుకొని తమ తప్పులను సమర్థించుకోవటం మనం రావణుని విషయంలో, దుర్యోధనుని విషయంలో కూడా చూస్తాం. అందుకే నిర్మలాంతఃకరణ లేనివారికి ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించకూడదు అని మన పెద్దలు దానిని రహస్యంగా నిర్వచించారు.

సంసార బంధాలలో చిక్కుకొని బయట పడలేక అలమటించే శిష్యుని చేరదీసిన గురువులు 'నువ్వు ఈ కనిపించే దేహానివి కాదురా! సర్వ జీవకోటిలో కూటస్థ చైతన్య పరబ్రహ్మగా ప్రకాశించేది నువ్వేరా!' అని చెబితే ఆ శిష్యుడు సాత్విక ప్రధానుడైతే శోకమోహాలను జయించి తన నిజస్థితిని అనుభవపూర్వకంగా గుర్తించే ప్రయత్నం చేస్తాడు. అదే రాక్షసులవంటి రాజసిక, తామసిక గుణ ప్రధానుడైతే నేనే ఈ లోకాలకన్నింటికీ ప్రభువునని విఱ్ఱవీగుతాడు. 

నా చిన్నప్పుడు ఎప్పుడైనా గుంటూరు రైలులో వెళితే సరిగ్గా గుంటూరు స్టేషన్ వచ్చే ముందు మూడు వంతెనలు ఉండేవి. ఆ వంతెనల పైనుండి రైలు వెళుతుంటే క్రింద రోడ్డుమీద వెళ్ళే సైకిళ్ళు, రిక్షాలు లాంటి వాహనాలన్నీ ఆ వంతెనకు అల్లంత దూరంలో ఆగిపోయి రైలు వెళ్ళేదాకా ఎదురుచూస్తూ ఉండేవి. చిన్న వయసులో ఉన్న నేను 'ఆహా! ఈ చిన్న చిన్న వాహనాలన్నింటికీ తమకన్నా పెద్ద వాహనమైన రైలు అంటే ఎంత గౌరవమో కదా! శ్రీగురుదేవులు పూజకో, సత్సంగానికో వస్తూవుంటే మనందరం గౌరవసూచకంగా దారికి ఇరువైపులా దూరంగా నిలబడినట్లు రైలు వస్తూవుంటే ఈ వాహనాలన్నీ దూరంగా నిలబడుతున్నాయి' అనుకునేవాడిని. అయితే అసలు విషయం తరువాత తెలిసింది. ఆ వంతెనలకు క్రింద స్లాబ్ లేదు. అందుకని ఆ రైలులో వెళ్ళేవారు వదిలే మలమూత్రాలు అన్నీ తమ నెత్తిన ఎక్కడ పడతాయో అని ఆ వాహనదారులందరూ దూరంగా నిలబడేవారు. అలాగే హిరణ్యకశిపుడి లాంటి రాక్షసుడితో పెట్టుకుంటే తమ నెత్తిమీదకి ఏ పెంట తెచ్చిపెడతాడో అని, దుష్టుడికి దణ్ణం పెట్టైనా దూరంగా ఉండాలని ప్రజలందరూ తనకు నమస్కరించి దూరం జరుగుతుంటే ఆ హిరణ్యకశిపుడు 'ఆహా! నేనే వీరందరికీ దేవుణ్ణి కదా! అహం బ్రహ్మాస్మి!' అనుకోవడం మొదలుపెట్టాడు.

ఇక ఆధ్యాత్మిక దృష్టి లేనివారితో ఆ విషయాలు చర్చించటం వలన ఇంకొక నష్టం కూడా ఉంది. ఆంధ్రప్రభలో పనిచేసిన శ్రీచిరంజీవిగారు, ఇండియన్ ఎక్సప్రెస్ లో పనిచేసిన శ్రీసంపత్ గారు ఒకసారి ఏదో సమావేశంలో ప్రముఖ నాస్తికుడైన డాక్టర్ సమరంగారిని కలవటం జరిగింది. అప్పుడు వారి మధ్య దేవుని ఉనికిపై కొంత వాదన జరిగింది. ఆ తరువాత వారిద్దరూ ఆశ్రమానికి వచ్చి శ్రీగురుదేవులను దర్శించుకొన్నప్పుడు వారు 'ఏమిటి, మొన్నేదో చర్చ జరిగినట్లుంది?' అని ప్రశ్నించారు. అప్పుడు వారిద్దరూ 'అవును బాబూ! దేవుడు ఉన్నాడని మేమూ, లేడని డాక్టర్ సమరంగారూ చాలాసేపు వాదించుకున్నాం' అన్నారు. అందుకు శ్రీగురుదేవులు 'ఇలాంటి అనవసరపు వాదనలు ఇంకెప్పుడూ పెట్టుకోకండి. మీరింకా సాధన దశలో ఉన్నారు కదా! ఇటువంటి స్థితిలో ఒక్క విషపు చుక్క కడివెడు పాలను నాశనం చేసినట్లు, అటువంటివారి మాటలలోని ఒక్క విషబీజం మీ మనసులో నాటుకుందంటే మీ సాధన అంతా వృథా అయిపోతుంది' అని హెచ్చరించారు.

ఇంకొందరు అనేక గ్రంధాలు చదివి వాచాజ్ఞానంతో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ఇలాంటి ఒక వ్యక్తి శ్రీగురుదేవుల దర్శనార్థం వచ్చాడు. శ్రీగురుదేవులు మర్యాదపూర్వకంగా 'అయ్యా! తమ పేరు?' అనగానే అతగాడు 'అహం బ్రహ్మాస్మి!' అన్నాడు. శ్రీగురుదేవులు 'ఓహో! మీరు బ్రహ్మమని మీ నిజతత్వం తెలుసుకొన్నారన్నమాట. సంతోషం. మరి మీరు బ్రహ్మమైతే వీళ్ళంతా ఎవరు?' అని ప్రశ్నించారు. అతను నీళ్ళు నమిలాడు. శ్రీగురుదేవులు వివరిస్తూ 'నేను బ్రహ్మను అని తెసులుకొన్నవాని ప్రవర్తన ఇలా ఉండదు. బ్రహ్మమంటే అది కేవలం ఒక వ్యక్తికో, ప్రదేశానికో, కాలానికో పరిమితమైనది కాదు. అది దేశకాలాలకు, రూపనామాలకు అతీతమై సర్వేసర్వత్రా నిండి నిబిడీకృతమైన చైతన్యం. అదే తానని తెలుసుకొన్నవాడు సర్వత్రా తననే దర్శిస్తాడు. అటువంటి వానికి తాను వేరు, ఎదుటి వ్యక్తి వేరు అనే భావనే ఉండదు. అహం బ్రహ్మాస్మి అనేది అనుభవించవలసిందే కానీ నోటితో చెప్పే వాక్యం కాదు.  ఏ వేదాంతమైతే అహం బ్రహ్మాస్మి అని బోధిస్తోందో అదే వేదాంతం సర్వం ఖల్విదం బ్రహ్మ అని, ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన అని కూడా చెబుతోంది' అని బోధించి అతని అహాన్ని త్రుంచివేశారు.

ఆధ్యాత్మిక విషయాలను తోటి సాధకులతో కొంతవరకు చర్చించవచ్చు కానీ, మనకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో కనిపించిన ప్రతివారినీ భక్తులుగా, సాధకులుగా మార్చివేద్దామనుకోవడం అజ్ఞానమే. అలాగే లోకంలో కొందరు మూర్ఖులు కూడా ఉంటారు. ఏనుగును లేత తామర తూడులోని దారాలతో బంధించాలనుకోవడం ఎంత అవివేకమో, మరొక వజ్రంతోనే కోయగలిగిన వజ్రాన్ని కోమలమైన దిరిసినపువ్వు రేకుతో కొయ్యలనుకోవడం ఎంత అవివేకమో, ఉప్పునీటి సముద్రాన్ని ఒక తేనెచుక్కతో తియ్యగా మార్చివేయాలనుకోవటం ఎంత అవివేకమో మూర్ఖుణ్ణి అమృతబిందువులవంటి సూక్తులతో మార్చాలనుకోవటం అంతటి అవివేకమని భర్తృహరి సుభాషితం చెబుతోంది. అయితే ఎంతటి మూర్ఖుల చిత్తాన్నైనా హరించి క్షణంలో పరమ భక్తులుగా మార్చివేయగల సామర్ధ్యం ఒక్క సమర్థ సద్గురుదేవులకే ఉంటుంది.

లౌకిక విద్యలోనే ఎన్నో శాఖలు, మరెన్నో స్థాయిలు ఉంటాయి కదా! మరి ఈ విద్య నేర్చుకోవటానికే మనకు ఉపాధ్యాయులు అవసరం. మళ్ళీ ఆ ఉపాధ్యాయులు ఎవరెవరి స్థాయిని బట్టి వారికి విద్య బోధిస్తారు. అంతేకానీ నేనే పుస్తకం చదివి అంతా నేర్చేసుకుంటాను అంటే అలా నేర్చుకొన్న విద్యకు సమాజంలో ఎంతవరకు విలువ ఉంటుందో మనకు తెలిసిందే. మరి ఆధ్యాత్మిక విద్యను కేవలం గ్రంథాలు చదివి అర్థం చేసుకొందామనో, తోటి సాధకులతో చర్చించి అవగాహనకు వద్దామనో అనుకోవటం అవివేకమే అవుతుంది. అందుకే నిగూఢమైన, అతి రహస్యమైన ఆధ్యాత్మిక విద్యను గురువులనుండి మాత్రమే పొందగలం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి