నిరాకారుడైన పరబ్రహ్మ సృష్టి చేయాలని సంకల్పించాడు. అప్పుడు ఆయనలోనుండి ఓంకార నాదం ఉద్భవించింది. ఆ నాదమే ఘనీభవించి బిందువుగా రూపాంతరం చెందింది. ఆ బిందువు మూడుగా విభజించబడి అ, ఉ, మ అనే అక్షరాలుగా ఆవిర్భవించింది. వీటినే సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులని, లేదా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులైన లక్ష్మీ, సరస్వతి, పార్వతి మాతలుగా కూడా అభివర్ణిస్తారు. వీరినుండి అనేక కళలతో విలసిల్లే ఈ సకల చరాచర సృష్టి అంతా ఆవిర్భవించింది.
అయితే ఒక కుమ్మరి కుండను తయారు చేయాలంటే మట్టి కావాలి. అలాగే ఒక కంసాలి నగలు చేయాలంటే బంగారం కావాలి. ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వాలంటే తండ్రినుండి బీజం కావాలి. ఇలా మనకు కనబడే ఏ వస్తువును తయారు చేయాలన్నా ఆ తయారుచేసే వ్యక్తికి ఒక ముడిపదార్థం అవసరం అవుతోంది కదా! మరి తాను తప్ప మరో వస్తువే లేని దశలో పరమాత్మ ఈ సృష్టిని ఏ ముడిపదార్థంతో తయారు చేశాడు? అనే ప్రశ్న సహజంగా వస్తుంది.
దీనికి పెద్దలు ఊర్ణనాభి అని పిలువబడే సాలీడుని ఉదాహరణగా చూపిస్తారు. సాలీడు ఎలాగైతే తనలోనుండే దారాన్ని తీసి దానితో గూడు అల్లుతుందో అలాగే పరమాత్మ తనలోనుండే సృష్టిని నిర్మించాడు అని చెబుతారు. అంటే సృష్టిలోని అణువణువూ పరమాత్మ తత్వంతోనే నిండి ఉన్నదన్నమాట! అయితే సాలెపురుగు ఒకసారి తనలోనుండి దారాన్ని బయటకు తీసాక ఇక తాను వేరు, ఆ దారం వేరు. కానీ పరమాత్మ మాత్రం తనలోనుండి వచ్చిన సృష్టి అంతటా తానే నిండి ఉంటాడు. ఇక్కడ వేరు చేయడానికి వీలులేదు.
సైన్సు ప్రకారం శక్తిని కానీ పదార్థాన్ని కానీ సృష్టించడానికి కానీ, నాశనం చేయడానికి కానీ సాధ్యం కాదు. వాటిని కేవలం ఒక రూపం నుండి మరొక రూపానికి పరిణామం మాత్రమే చెందించగలం. అంటే సృష్టి ఎక్కడినుంచో క్రొత్తగా రాలేదన్నమాట. అనంతశక్తి స్వరూపుడైన పరమాత్మ శక్తిలోని కొంత భాగమే పదార్థ రూపంగా పరిణామం చెంది సృష్టిగా భాసిస్తోంది. అయితే అనంతంలోనుంచి ఎంత తీసివేసినా అది అనంతంగానే మిగులుతుంది కానీ దానికి కొరత రాదు. అలాగే తీసివేయబడిన భాగం కూడా అనంతమే అవుతుంది. ఇదే మనకు "పూర్ణమదః పూర్ణమిదం .." అనే శ్లోకం తెలియజేస్తోంది.
శాస్త్రజ్ఞులు కూడా ఈ సృష్టి ప్రారంభాన్ని వివరిస్తూ ముందు ఒక చిన్న బిందువు ఉన్నదని, అది మహావిస్ఫోటనం చెంది నక్షత్ర మండలాలుగా, గ్రహాలుగా, జీవరాశిగా (వివిధ కళలుగా) ఏర్పడిందని చెబుతారు. అలాగే చివరికి మళ్ళీ ఈ సృష్టి అంతా ఆ బిందువులోనే లయమైపోతుందని కూడా చెబుతారు. అయితే ఇక్కడ నాదం ఎక్కడ ఉన్నదని మనకు సందేహం రావచ్చు. ఏ పదార్థము లేని శూన్యం అంతా ఓంకార నాదమే నిండి ఉంటుంది. మీరు ఒక ఖాళీ శంఖాన్నిగానీ, గ్లాసునుగానీ, మరేదైనా ఖాళీ వస్తువును చెవిదగ్గర పెట్టుకుంటే ఓంకారనాదం వినిపిస్తుంది. అసలు ప్రతి జీవి సృష్టి నాదంతోనే ప్రారంభమవుతుందని వివరిస్తూ సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు "జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం" అన్నారు.
ఇక పైన చెప్పుకున్నట్లు ఈ నాదబిందుకళలనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని కూడా చెబుతారు. శ్రీగురుదేవులు ఒక ఉదాహరణ చెప్పేవారు. ముందుగా ఒక ఇంజనీరు ఒక పెద్ద డామ్ కట్టాలని సంకల్పిస్తాడు. ఇదే ఇచ్ఛాశక్తి. అప్పుడు అతను తన జ్ఞానశక్తిని ఉపయోగించి ఆ డ్యామును ఒక ప్లాన్ రూపంలో కాగితం మీదకు తెస్తాడు. ఇక దానికి క్రియాశక్తి తోడైతే అది నిజమైన పెద్ద డ్యాము ఆకారాన్ని పొందుతుంది.
అయితే యద్దృశ్యం తన్నశ్యం అని చెబుతారు. అంటే మన కళ్ళకు కనబడే, జ్ఞానేంద్రియాలతో గ్రహింపబడేదంతా చివరికి నశించిపోవలసిందే. అలాగే మన ఇంద్రియాలకు గోచరమయ్యే ఈ నాదబిందుకళలు ఎప్పటికైనా నశించిపోయేవే. నిరాకారుడైన పరబ్రహ్మ ఇవి ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా ప్రకాశించే సచ్చిదానంద స్వరూపుడు. అందుకే ఆయన నాదబిందు కళాతీతుడు.
ఓం నాదబిందు కళాతీతాయ నమః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి