23, ఆగస్టు 2019, శుక్రవారం

నిజమైన వైష్ణవుడు

మనం ఇన్నాళ్లూ 'మా దేవుని నమ్మకపోతే నరకానికి పోతావ్' అనే వాళ్ళను చూసాం. ఇప్పుడు క్రొత్తగా 'మా దేవుడికి జై కొట్టకపోతే నీకు ఇక్కడే నరకం చూపిస్తాం' అనేవాళ్ళు కూడా తయారవుతున్నారు. 'ప్రక్క దేశాన్ని తిట్టకపోతే నీకు దేశభక్తి లేదు, ప్రక్క మతాన్ని తిట్టకపోతే నీకు దైవభక్తి లేదు' అనే విపరీతవాదం పెరిగిపోతున్న ఈ రోజుల్లో అసలైన భక్తుడెవరో తెలుపుతూ పరమభక్తుడైన శ్రీ నర్సీ మెహతా వారు వ్రాసిన 'వైష్ణవ జన్ తో తేనే కహియెజ్' అనే గేయం అర్థం తెలుసుకొని ఆచరణలో పెట్టుకోవటం ఎంతైనా ఆవశ్యకం. శ్రీ నర్సీ మెహతా వారిని గురుదేవులు శ్రీ బాబూజీ మహారాజ్ 'నరసింహ మేధ' అని పిలిచేవారు. అది వారికి చక్కగా సరిపోయే పేరు. అపారమైన కారుణ్యానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ నారసింహ మూర్తి. ఇప్పుడు పరమ శత్రువైనా ఒకప్పటి తన ద్వారపాలకుడైన హిరణ్యకశిపుని తిరిగి తన దగ్గరకు చేర్చుకోవాలనే కరుణ, తన పుత్రుడైన బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని నిలబెట్టాలనే కరుణ, తన పరమ భక్తుడైన ప్రహ్లాదుని మాట నిలబెట్టాలనే కరుణ ఇలా పూర్తి కరుణతో నిలువెల్లా నిండిన స్వామి, లోకాలన్నింటిని నిరంతరం నడిపిస్తూ ఉండే స్వామి ఏ కదలికా లేకుండా నిశ్చలంగా హిరణ్యకశిపుని మందిరమంతా నిండి నిలిచి ఉన్నాడు. అందుకే అన్నమయ్య 'చలనవిధి నిపుణ నిశ్చల నారసింహా' అంటాడు.

అటువంటి కరుణే నిండిన నర్సీమెహతా నిజమైన భక్తుని లక్షణాలు తెలుపుతూ వ్రాసిన ఆ గుజరాతీ గేయం అర్థం ఏమిటో చూద్దాం. ఇతరుల బాధను, కష్టాన్ని తన బాధగా, కష్టంగా అనుభూతి చెందగలిగినవాడే నిజమైన వైష్ణవుడు. కేవలం వారి బాధలు తనవిగా అనుభూతి చెందటమే కాక ఆ బాధా నివారణకు తనవంతు సహాయం చేసి కూడా ఎన్నడూ 'నేను చేశాను' అనే అహంకారాన్ని అతడు మనసులో రానివ్వడు. అతడు సమస్త జగత్తునూ విష్ణు స్వరూపంగానే భావించి గౌరవిస్తాడు. ఎన్నడూ ఎవరినీ కించపరచడు, దుర్భాషలాడడు. మనస్సు, వాక్కు, కర్మ ఈ మూడింటినీ సదా పరిశుద్ధంగా ఉంచుకుంటాడు. అటువంటి భక్తుని కన్న తల్లి ధన్యురాలు. ఒక్క తల్లేమిటి, అటువంటి భక్తుని వంశంలో అటు ఏడు తరాలు , ఇటు ఏడు తరాలు కూడా తరిస్తాయి. 

అతడు అందరినీ సమదృష్టితో చూస్తాడు. దేనినీ ఆశించడు. అన్య స్త్రీలందరినీ తన తల్లులుగా భావిస్తాడు. వారి నాలుక ఎన్నడూ అసత్యం పలుకదు. చేతులెన్నడూ పరుల విత్తాన్ని తాకవు. వారికి ప్రపంచంలోని ఏ వస్తువుతోనూ సంగం ఉండదు. సదా నిస్సంగులై ఉంటారు. వారికి ఉన్న అనురక్తి కేవలం రామనామం మీదే. సర్వ పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు ఆ సత్పురుషునిలోనే సదా విరాజిల్లుతూ ఉంటాయి. లోభం, కపటం అంటే ఏమిటో వారికి తెలియదు. కామక్రోధాలు వారి దరికి కూడా చేరలేవు. నర్సీ అంటున్నారు - తమ వంశాన్నంతటిని తరింపచేయగల అట్టి మహాత్ముని దర్శిస్తే నా జన్మ ధన్యమైనదిగా భావిస్తాను - అని. శ్రీ గురుదేవులు కూడా ఇలాగే 'అట్టి మహాత్ముడు కనిపిస్తే వారి పాదధూళి నా శిరస్సున ధరిస్తాను' అనేవారు. 

భక్తుని గురించి భక్తుడే వివరించిన ఈ పై లక్షణాలన్నీ భక్తుని గురించి భగవంతుడు వివరించిన భక్తియోగంలోని లక్షణాలతో సరిగ్గా సరిపోలుతున్నాయి. అవేమిటో ఒక్కసారి చూద్దాం. 'అద్వేష్టా సర్వభూతానాం'తో మొదలుపెట్టి పరమాత్మ తన భక్తునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో, ఎటువంటివాడు తనకు ప్రియుడో వివరిస్తున్నాడు. మొట్టమొదటి లక్షణం సృష్టిలో దేనినీ, ఎవరినీ  ద్వేషించకుండా ఉండటం. అలాగే అందరిపట్ల మిత్రభావం, కరుణ కలిగివుండటం. అహంకార మమకారాలు లేకపోవటం, సుఖదుఃఖాలను సమదృష్టితో స్వీకరిస్తూ ఓర్పు కలిగి ఉండటం. ఎల్లప్పుడూ లభించినదానితో తృప్తిగా ఉండటం, యోగియై ఉండటం, ఆత్మనిగ్రహం, దృఢనిశ్చయం కలిగివుండటం. తన మనోబుద్ధులను నాకే అర్పించి ఉండటం, లోకానికి తాను భయపడకుండా, లోకాన్ని తాను భయపెట్టకుండా ఉండటం, సంతోషం, విషాదం, భయం, ఉద్వేగం మొదలైన మానసిక లక్షణాలకు అతీతంగా ఉండగలగడం. దేనినీ ఆశించకుండా, శుచియై, చేసే ప్రతిపనిలో సమర్థుడై ఉండటం, ఎటువంటి చింతలు లేకుండా ఉదాసీనంగా ఉండటం.

తన స్వలాభంకోసం ఏ పనులూ చేయనివాడు, అతిగా సంతోషంగాని, బాధకాని, కోరికగాని, ద్వేషంగాని లేనివాడు, శుభాశుభములను శత్రుమిత్రులను, మానావమానములను, శీతోష్ణములను, సుఖదుఃఖములను సమదృష్టితో చూస్తూ దేనితోనూ సంగం ఏర్పరుచుకొననివాడు, నిందాస్తుతులను సమంగా స్వీకరిస్తూ, ఏకొంచెం దొరికినా దానితోనే సంతుష్టుడై, దేహం ఎక్కడ సంచరిస్తున్నా మనస్సు మాత్రం సదా పరమాత్మయందే నిలిపి ఉంచేవాడే నిజమైన భక్తుడని, అట్టివాడే తనకు ప్రియుడని పరమాత్మ మనకు గీతలో బోధించాడు. అటువంటి లక్షణాలు అలవరచుకోవటం మానేసి తుఛ్చమైన ప్రాపంచిక విభేదాలను సహించలేక వాటికోసం కొట్టుకు చావటం ఏమి వివేకం?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి