18, ఫిబ్రవరి 2015, బుధవారం

తపస్సు - ప్రార్థన

సాధారణంగా మనం తపస్సు అంటే ఏ అడవికో వెళ్ళి, నిద్రాహారాలు మాని, శరీరాన్ని కృశింపచేయాలని అనుకుంటాం. కానీ భగవద్గీతలో 17వ అధ్యాయంలో మనోవాక్కాయములతో చేయగల మూడు విధాలైన తపస్సులను గీతాచార్యుడు మనకు ప్రబోధించాడు. అవేమిటో చూద్దాం.

శరీరంతో చేసే తపస్సు:
దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం |
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే || 17.14 ||

దేవతలను, ద్విజులను, గురువులను, జ్ఞానులను పూజించటం, శుచిగా, నిజాయితీగా ఉండటం, బ్రహ్మచర్యాన్ని, అహింసను పాటించటం శరీరంతో చేసే తపస్సు అవుతుంది.

 వాక్కుతో చేసే తపస్సు:
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితం చ యత్ |
స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే || 17.15 ||

ఎవరికీ ఉద్వేగం కలిగించని, రెచ్చగొట్టని వాక్కు, అలాగే సత్యంగాను, అవతలివారికి ప్రియాన్ని, హితాన్ని కలిగించేదిగా ఉండే వాక్కు, ఇంకా వేదాధ్యయనం చెయ్యటం ఇవి వాక్కుతో చేసే తపస్సుగా చెప్పబడ్డాయి.

ఇక మనస్సుతో చేసే తపస్సు:
మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః |
భావ సంశుద్ధి రిత్యేతత్తపో మానసముచ్యతే || 17.16 ||

మనస్సును ప్రసన్నంగా ఉంచుకోవటం, ఎప్పుడూ సౌమ్య స్వభావం కలిగిఉండటం, మౌనంగా(లోపల ఏ సంకల్పాలు లేకుండా) ఉండటం, ఆత్మనిగ్రహం కలిగి ఉండటం, మనస్సులో ఎల్లప్పుడూ పరిశుద్ధమైన భావనలే ఉత్పన్నమవటం ఇవి మనస్సుతో చేసే తపస్సుగా చెప్పబడ్డాయి.

ఇదే విధంగా మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారు ఈ రకమైన తపస్సులను ఆశ్రమ నిత్య ప్రార్థన రూపంలో తేట తెలుగు పదాలలో అందించారు.

వాక్కుతో చేసే తపస్సు:
సత్య సుందర స్వరూపుడవైన ఓ పరమేశ్వరా! సత్యముగను, పవిత్రముగను, మృదువుగను ఉండు వాక్కును, నిర్మలమగు అంతఃకరణమును మాకు ప్రసాదింపుము.

శరీరంతో చేసే తపస్సు:
అవ్యాజ కరుణామూర్తీ! తను మన ధనములతో సదా ఇతరులకు మంచినే చేయుటకును, ఇతరులయందు మంచినే చూచుటకును, మంచినే గ్రహించుటకును తగిన సద్బుద్ధిని మాకు దయసేయుము.

మనస్సుతో చేసే తపస్సు:
దీనబంధూ! దయానిధే! మా మనస్సు అచంచల విశ్వాసముతో నిరంతరము నీయందే నిలచియుండునట్లు అనుగ్రహింపుము. మాలో భక్తి జ్ఞాన వైరాగ్య బీజములు అంకురించి, పెంపొంది, ఆత్మానంద ఫలమును ఒసగులాగున ఆశీర్వదింపుము.

బుద్ధితో చేసే తపస్సు:
ఓ పరంజ్యోతి స్వరూపా! మార్గ దర్శకుడవై చీకటినుండి వెలుగు లోనికిని, అసత్యమునుండి సత్యవస్తువు కడకును, మృత్యువునుండి అమృతత్వమునకును మమ్ము నడిపింపుము.

ఇలా లోకంలో ప్రతి ఒక్కరూ ఆచరిస్తే ప్రపంచానికి కలిగే ఫలితం:
దేవదేవా! నీ కృపచే మానవునికీ మానవునికీ మధ్య భేదబుద్ధి నశించి, సర్వ జీవులు సమభావముతోనూ, ప్రేమ దృష్టితోనూ మెలగుదురుగాక. లోకములన్నియు శాంతి సౌఖ్యములతో వర్ధిల్లునుగాక.
(ఆధ్యాత్మికతను మించిన సోషలిజం లేదనేవారు మా గురుదేవులు)

ఇక వ్యక్తిగతంగా మనకు కలిగే ఫలితం:
ప్రభూ! అనుక్షణమును, అంత్యకాలమునను నీ స్మరణమే మా జిహ్వయందు నిలచుగాక. నీ రూపమే మా మనస్సునందు నిలచియుండుగాక. ఈ జన్మమే మా కడసారి జన్మమై నీ సాయుజ్యమును పొందించుగాక.

పాహిమాం! పాహిమాం! పాహిమాం! పాహి!!!
హరిః ఓం తత్సత్!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి