22, అక్టోబర్ 2015, గురువారం

శ్రీకంఠార్ధ శరీరిణీ

జగన్మాతకు ఉన్న అనంతమైన నామాలలో 'శ్రీకంఠార్ధ శరీరిణీ' ఒకటి. శ్రీకంఠుడైన పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగమైన తల్లి. శ్రీకంఠుడు అంటే మంగళకరమైన కంఠం కలవాడు. మరి ఆయన కంఠం మంగళకరం ఎలా అయ్యింది అంటే లోకాలనన్నింటినీ త్రుటిలో భస్మీపటలం చేయగల హాలాహలాన్ని తన కంఠంలో నిలుపుకున్నాడు కాబట్టి. అయితే ఈ ఘటనలో అమ్మవారి పాత్ర విశేషమైనది.

మ్రింగెడి వాడు విభుండని
మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో

అన్నారు పోతనా మహాత్ములు. చేసేది ఎంత ప్రమాదకరమైన పనో తెలిసికూడా తన భర్తని అందుకు ప్రోత్సహించింది ఆ తల్లి. అయితే ఆయన ఒక్కడే మ్రింగాడా? అంటే లేదు, ఆయనతో సమానంగా ఆవిడా మ్రింగింది. ఎందుకంటే ఆ తల్లి శ్రీకంఠార్ధ శరీరిణీ. మరి తన మాంగల్యం మీద అంత నమ్మకం ఎందుకు? అంటే 'శివా రుద్రస్య భేషజీ' అని చెప్పారు. ఆయనకు ఏం జరిగినా తిరిగి స్వస్థత చేకూర్చగల అద్భుతమైన వైద్యురాలు ఆతల్లి.

మరి మన మాటేమిటి? అని దిగులు పడక్కర్లేదు. 'శివా విశ్వస్య భేషజీ' - మన రోగాలన్నీ కూడా నివారించే భవరోగ వైద్యురాలు ఆ తల్లే. అటువంటి చల్లని తల్లి మనందరికీ ఆయురారోగ్యాలను, తరగని సంపదయైన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు.

1, సెప్టెంబర్ 2015, మంగళవారం

ఎందరో మహాత్ములు

మనం ఏ పని చేసినా దానికి రెండు ప్రయోజనాలు ఉండాలని ఆర్ష ధర్మం నిర్ణయించింది - ఆత్మనో మోక్షార్థం జగద్హితాయచ అని. 1) మనకు మోక్షం కలగటం 2) జగత్తుకు హితం కలగటం. ఈ రెండు ప్రయోజనాలు సాధించలేని పనులన్నీ మనకు కర్మలుగా చుట్టుకుంటాయి.

చివరికి మనం తినే ఆహారం కూడా భగవంతుని నివేదన కోసం వండి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలిగానీ మన రుచులకోసం, మన ఆకలి కోసం కాదు అని "యజ్ఞ శిష్టామృత భుజః యాన్తి బ్రహ్మ సనాతనం", "భుంజతేతే త్వఘం పాపా యే పచంత్యాత్మ కారణాత్" వంటి గీతా వాక్యాల ద్వారా చెప్పబడింది. "ఒక యోగి ఆత్మకథ" అనే గ్రంథంలో శ్రీ పరమహంస యోగానంద వారు తమ తల్లిదండ్రులు కేవలం సంతానప్రాప్తి అనే ధర్మం కోసం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సంసారం చేసేవారని వ్రాసారు.

ఇటువంటి ధర్మానికి మూలస్థంభాలనదగిన ఎందరో మహాత్ములు ఏకాంతంగా సాథన చేసుకొని మోక్షాన్ని పొందుతున్నారు. అయితే అలా పొందిన వారిలో కొద్దిమంది మాత్రమే మళ్ళీ సద్గురువులుగా వచ్చి జనబాహుళ్యాన్ని సన్మార్గంలో నడిపి ఉద్ధరిస్తున్నారు. మరి అలా రాకుండా ఏకాంతంలోనే ఉండిపోయిన మహాత్ముల వలన జగద్హితం ఎలా సమకూరుతుంది? అనే ప్రశ్న సహజంగా ఉత్పన్నమవుతుంది.

దీనికి సమాధానమా అన్నట్లు మా గురుదేవులైన శ్రీబాబూజీ మహరాజ్ ఎన్నోసార్లు తమ బోధలో ఇలా చెప్పేవారు - ఎందరో మహాత్ములు హిమాలయాలలో, అడవులలో, కొండ గుహలలో తపస్సు చేసుకుంటూ ప్రతి ఉదయం తమ సాథననుండి బయటకు వచ్చి తమ తపశ్శక్తినంతా ధారపోసి "సర్వే జనాః సుఖినో భవంతు" "లోకాస్సమస్తా సుఖినో భవంతు" అని ఆశీర్వదించి తిరిగి తమ సాథనలో లీనమవుతూ ఉంటారు. వారెవరో ఈ లోకానికి పరిచయం లేకపోయినా కేవలం వారి ఆశీస్సుల వల్లనే ఈ లోకం ఇలా పచ్చగా కళకళలాడుతోంది. అందుకు మనం వారందరికీ ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి.

26, ఆగస్టు 2015, బుధవారం

వాసనలు

వేదాంత పరిభాషలో వాసనలు మూడు రకాలు. దేహ వాసన, లోక వాసన, శాస్త్ర వాసన. అసలీ వాసన అంటే ఏమిటో, అది ఎలా వస్తుందో తెలుసుకుందాం.

శరీరం ధరించిన ప్రతివాడికీ ఆ శరీరం ఉన్నంతవరకు ఏదో ఒక పని చేస్తూ ఉండక తప్పదు. కానీ గరిటతో కలపవలసిన సాంబారు చేత్తో కలిపితే ఆ చేతికి వాసన అంటుకున్నట్టు, శరీరంతో చేయవలసిన పనులకు మనస్సును జత చేస్తే మనస్సుకు ఆ వాసన అంటుకుంటుంది.

శరీరానికి ఆకలి వేసిందనుకోండి, తినగలిగిన పదార్ధం అప్పటికి ఏది దొరికితే అది లోపల వేస్తే ఆ ఆకలి తీరిపోతుంది. కానీ ఆ సమయానికి మనం ఏ శరవణ భవన్కో వెళ్ళామనుకోండి, శరీరం ఆకలి తీరటంతోపాటు అక్కడ వంటకాలు బాగుంటాయి అనే ఒక గుర్తు మనస్సులో నాటుకుపోతుంది. అదే వాసన. అయితే మీరు మనస్సు పెట్టి తినకపోతే ఈ వాసన అంటదు. నిజానికి ఆకలి వేయటం, ఆహారం తినటం, కడుపు నిండటం ఇవన్నీ కేవలం దేహానికి సంబంధించిన విషయాలు. కేవలం ఒక దేహ క్రియగా ఉండవలసినదానికి మనసు చేర్చటంతో అది వాసనగా అంటుకొని చివరికి కర్మగా మారుతుంది.

ఇక దేహ వాసన అంటే ఈ దేహం నేను అనే నిశ్చితమైన నమ్మకం. అది ఈ దేహానికి పెట్టుకున్న పేరుపై కూడా అంతే గాఢంగా ఉంటుంది. నా పేరు ప్రసాదు అనుకోండి, పిలిచేది నన్నే అని తెలిసినా ప్రసాదరావు అంటే పలకను. పేరు కేవలం దేహానిదే అయినా, అది కేవలం సౌలభ్యం కోసం పెట్టుకునన్నదే అయినా, మహాత్ముల సన్నిధిలో కూడా దాని మీద అభిమానాన్ని వదులుకోలేము.

శాస్త్ర వాసన అంటే మనం చదువుకున్న పుస్తకాలలో, విన్న విషయాలలో ఉన్న విజ్ఞానమే సర్వస్వం అని బలంగా విశ్వసించటం. పరిమితమైన మానవ జీవితకాలంలో పరిపూర్ణ విజ్ఞానాన్ని కేవలం చదువుద్వారా పొందటం ఎవరికీ సాధ్యం కాదు. కేవలం తనను తాను తెలుసుకొన్న బ్రహ్మజ్ఞానికే సర్వం తెలియబడుతుంది. కానీ మనం మనకున్న పరిమిత జ్ఞానంతోనే అనంతుడైన భగవంతుణ్ణి, అయన ప్రతిరూపాలైన అవతార పురుషుల్ని, మహాత్ముల్ని అంచనా వేయాలని చూస్తాం. మనకు తెలిసిన గుప్పెడు ధర్మ సూత్రాలతో ధర్మాధిష్టానమైన పరమాత్మనే అంచనా వేస్తూ రాముడు అలా ఎందుకు చేసాడు? కృష్ణుడు ఇలా ఎందుకు చేసాడు? అని వాదిస్తాం. అనంత విశ్వంలో అతి చిన్న భాగమైన మన సమాజపు కట్టుబాట్లతో అనంతుడైన భగవంతుణ్ణి బంధించాలని చూస్తాం. మనమీద కరుణించి ఆ భగవంతుడే ఏ కుక్క రూపంలోనో ప్రత్యక్షమైతే శాస్త్రాలలో చెప్పిన ఆకారంలో రాలేదని గుర్తించటానికి నిరాకరిస్తాం. తులసీదాసు అంతటి మహాభక్తుడికే ఈ పరిస్థితి తప్పలేదు.

ఇక లోక వాసన - ఈ లోకంలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ కొన్ని అభిప్రాయాలూ అలవాట్లూ ముందే ఏర్పరుచుకొని ప్రతిదానిని ఆ కోణంలోనే చూస్తాం. ఒక వ్యక్తి మనకు ఏదో మంచో చెడో చేస్తే, అలాంటి వేషభాషలు, ఆ కులం, ఆ మతం, ఆ జాతికి సంబంధించిన వారందరికీ, వాళ్ళెవరో మనకు తెలియకపోయినా, అవే గుణాలు అంటగడతాం. సిగరెట్టు కోసం పరాయి వాళ్ళని అగ్గిపెట్టె అడగడానికి కూడా సిగ్గుపడం కానీ ఏ ఆశ్రమనికో సత్సంగానికో వెళ్ళాలంటే నలుగురూ ఏమనుకుంటారో అని సిగ్గుపడతాం.

మన కంటికి కనపడకుండా ఎక్కడో గోడవతల ఉన్న పువ్వు వాసన కూడా మనదాకా చేరినట్లు, ఈ వాసనలు మనను జన్మజన్మలదాకా వెంటాడుతూనే ఉంటాయి. సాధనద్వారా మన మనస్సు ప్రక్షాళన చేసుకొనేదాకా ఈ వాసనలు తప్పవు.