3, ఏప్రిల్ 2019, బుధవారం

భ్రాంతి

ఒకసారి ఇద్దరు మిత్రులు సినిమాకు వెళ్లారు. సినిమాలో హీరో గుఱ్ఱం మీద వెళ్తున్నాడు. మొదటి మిత్రుడు, "ఇప్పుడు ఆ హీరో గుఱ్ఱం మీదనుంచి పడిపోతాడు. కావాలంటే వంద రూపాయలు పందెం" అన్నాడు. ఆ హీరో పడిపోడని రెండవ మిత్రుడూ పందెం కాసాడు. మరికొద్ది నిముషాలలో ఆ హీరో పడిపోవడం, రెండవ మిత్రుడు మొదటివానికి వంద రూపాయలు ఇవ్వడం జరిగిపోయాయి. అయితే ఆ మొదటి మిత్రుడు, "నేను ఈ డబ్బులు తీసుకోలేను. నేను నిన్ను మోసం చేశాను. నేను ఈ సినిమా ఇదివరకే చూసేసాను" అన్నాడు. అప్పుడా రెండవ మిత్రుడు, "నేను కూడా ఈ సినిమా ఇదివరకే చూసాను. అయినా ఆ హీరోకి ఏమాత్రం బుద్ధి ఉన్నా ఒకసారి గుఱ్ఱం మీదనుంచి పడ్డవాడు రెండవసారి జాగ్రత్తగా ఉంటాడులే అనుకొని నీతో పందెం కాసాను. కానీ ఆ బుద్ధిలేని హీరో మళ్ళీ అలాగే పడిపోయాడు" అన్నాడు.

ఇది వింటే ఆ రెండవవాడి అమాయకత్వాన్ని చూసి మనం నవ్వుకుంటాం. కానీ ప్రతిరోజూ మనం చేస్తున్నది కూడా అదే. మన జీవితంలో ప్రతిరోజూ ఇలాంటి భ్రమలకు, భ్రాంతులకు లోనవుతున్నాం. ఎలాగో చూద్దాం. మనకు ప్రధానంగా ఆరుగురు శత్రువులని పెద్దలు చెబుతారు కదా! అవే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి మన ప్రబల శత్రువులని చిన్నప్పటినుండి వింటూనే ఉన్నాం. అలాగే వీటి దాహం తీరనిదని, ఎంత సమర్పించుకున్నా ఇంకా ఇంకా అగ్నిలా ప్రజ్వరిల్లుతూనే ఉంటాయని సాక్షాత్తు భగవానుడే గీతలో చెప్పాడు కదా! అయినా మనం ప్రతిసారీ 'ఈ ఒక్కసారికి వాటి మాట విని వాటి ఆకలి తీరిస్తే మళ్ళీ  మన జోలికి రావులే' అనుకుంటూ మళ్ళీ మళ్ళీ వాటికి లొంగిపోతూనే ఉంటున్నాం.

ఒకరికి విపరీతమైన షుగర్ వ్యాధి ఉంటుంది. కానీ తీపి అంటే ఎంతో ఇష్టం. 'ఈ ఒక్కసారికి తినేస్తే ఆ కోరిక తీరిపోతుందిలే. ఆ తరువాత ఇంకెప్పుడూ తినద్దు' అనుకుంటూ తినేస్తాడు. అయితే ఆ కోరిక అక్కడితో ఆగుతుందా? మళ్ళీ మళ్ళీ తీపివైపుకు లాగుతూనే ఉంటుంది, వీడు మళ్ళీ మళ్ళీ దానికి లొంగుతునే ఉంటాడు. చివరికి వాడి ప్రాణం మీదకు తెచ్చుకుంటాడు. అలాగే ఒకడికి విపరీతమైన కోపం ఉందనుకోండి. అది తప్పు అని వాడి బుద్ధి మాటిమాటికి హెచ్చరిస్తూనే ఉంటుంది. అయినాసరే 'ఈ ఒక్కసారికి నా పిల్లవాడిమీద కోపం చూపిస్తే తరువాత వాడే నా మాట వింటాడులే' అనుకుంటూ ఉంటాడు. ఆ పిల్లవాడు మాట వినేదెప్పుడు? వీడి క్రోధం అణిగేదెప్పుడు? రెండూ కల్లలే. చివరికి ఆ పట్టరాని క్రోధంలోనే ఏదో జరగరాని అనర్థం జరుగుతుంది.

అలాగే లోభగుణం ఎక్కువగా ఉన్నవాడు ఎవరికైనా ధన సహాయం చేయవలసి వస్తే 'ఈ ఒక్కసారికి దాచుకుందాంలే. వచ్చేసారి నుంచి నా శక్తికొలది తప్పకుండా దానం చేస్తాను' అని ప్రతిసారి అనుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటాడు. అలాగే మన కళ్ళముందే మనం మోహం పెంచుకున్న ఎందరో బంధువులు, స్నేహితులు వెళ్లిపోతున్నా మళ్ళీ మళ్ళీ 'ఈ ఒక్కసారికే' అనుకుంటూ క్రొత్త వారి(టి)పై మోహం పెంచుకుంటూనే ఉంటాం. ఇక ఎన్నిసార్లు 'నీ సత్తా ఇంతేరా!' అని భగవంతుడు మొట్టికాయలు వేస్తున్నా 'అమ్మో! వచ్చేసారి జాగ్రత్తగా ఉండాలి' అనుకుంటూనే ఉంటాం, అయినా మళ్ళీ మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు 'నా అంతవాడు లేడు' అనుకుంటూ మదాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాం. ఇలాగే ఎప్పటికప్పుడు 'ఇది తప్పు. భగవంతుడు నాకు ఇవ్వాల్సింది బాగానే ఇచ్చాడు' అనుకుంటూనే మళ్ళీ ఈర్ష్య, అసూయ, అసహనం, ఓర్వలేనితనం రూపాల్లో మాటిమాటికి మాత్సర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాం.

అయితే పైన చెప్పుకున్న కథలో మొదటివాడు ఎందుకు భ్రాంతిలో పడలేదు? రెండవవాడు ఎందుకు పడ్డాడు? అని విచారిస్తే మొదటివాడు 'ఇది సినిమా. ఎన్నిసార్లు చూసినా ఇందులో మార్పేమీ ఉండదు. అది ఎప్పటికీ నిజం కాబోదు' అనే జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఇక రెండవవాడు సత్యానికి, కల్పనకి భేదం తెలుసుకోలేక ఆ కల్పనే నిజమని భ్రమించి ఎప్పటికైనా అది మంచిగా మారకపోతుందా అనుకుంటూ అందులో లీనమై మళ్ళీ మళ్ళీ ఆత్రంగా చూస్తూనే ఉన్నాడు. ఇదే మనకీ, జ్ఞానులైన మహాత్ములకు ఉన్న తేడా. మనం ఈ చూసే ప్రపంచమంతా సత్యమేననే భ్రమలో పడి 'ఇందులో రమించడం మన ఆథ్యాత్మిక ఉన్నతికి అవరోధం' అని మన బుద్ధి మాటిమాటికి హెచ్చరిస్తూనే ఉన్నా 'ఎప్పటికైనా ఇందులోనే మనకు కావలసింది దొరక్కపోతుందా' అని మళ్ళీ మళ్ళీ లేనిచోటే మన ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాం.

మనం సినిమాకి వెళ్ళినప్పుడు అందులోని నవరసాలను మన జీవితంలోనే జరుగుతున్నట్లుగా తాదాత్మ్యం చెంది అనుభవిస్తూనే ఉంటాం కానీ అంతర్లీనంగా 'ఇది కేవలం సినిమా మాత్రమే. నిజం కాదు.' అనే జ్ఞానం మనకు సదా ఉంటుంది. అందుకే సినిమాలో బాంబు పేలితే మనం అక్కడినుంచి లేచి పారిపోము, హత్య జరిగితే పోలీసులకి ఫోన్ చెయ్యము. మహాత్ములకి నిజ జీవితంలో కూడా నిరంతరం ఈ జ్ఞానం ఆరూఢమై ఉంటుంది. అందుకే వారు మనందరి భిన్నత్వాన్ని గుర్తిస్తూ, ఎవరికి తగ్గ రీతిలో వారితో మాట్లాడుతూ, వారి వారి సమస్యలను, సంతోషాలను అన్నింటినీ వింటూ, పరిష్కారాలు సూచిస్తూ ఉన్నా, వారిలో అంతర్లీనంగా 'ఇదంతా ఒక సినిమాలాంటిదే. నిజం కాదు. ఉన్నది భగవంతుడు ఒక్కడే. నేను, నా ఎదురుగా ఉన్నవాడూ, వాడికి సమస్యను సృష్టించిన వాడూ అందరూ ఆ భగవంతుని రూపాలే' అనే జ్ఞానం సదా నిలిచి ఉంటుంది. మనం కూడా అటువంటి జ్ఞానాన్ని పొందేవరకు ఈ భ్రాంతులు తప్పవు.

4, మార్చి 2019, సోమవారం

అభ్యాసం

మనం ఈ ప్రపంచంలో ఏది నేర్చుకోవాలన్నా అభ్యాసం తప్పనిసరి. పుట్టిన పిల్లవాడు తల్లి దగ్గర పాలు త్రాగడం దగ్గరనుండి ముసలివాడైనాక మనవలతో ఆడుకోవడం వరకు ప్రతిరోజూ ఎన్నో విద్యలను అభ్యసిస్తూనే ఉంటాడు. అలాగే నీవెవరో, నీ అసలు స్వరూపం ఏమిటో, ఈ కనిపించే జగత్తు అంతా ఏమిటో తెలిపే ఆథ్యాత్మిక విద్యకు కూడా అభ్యాసం అవసరమే. ఈ అభ్యాసానికి మనకు గురువులు రెండు ఉపకరణాలను ఇచ్చారు. అవే శ్రవణం, మననం. బ్యాంకు లాకరుకు రెండు తాళాలు ఉన్నట్లుగా మన బుద్ధికి కూడా ఈ రెండూ తాళాలే. ఒకే తాళంచెవిని ఇటు త్రిప్పితే తాళం పడుతుంది, అటు త్రిప్పితే తాళం తెరుచుకుంటుంది. అలాగే ఈ శ్రవణ మననాలనే తాళం చెవులను ప్రపంచం వైపుకు త్రిప్పితే బంధానికి దారితీస్తాయి, గురుబోధ వైపుకు త్రిప్పితే మోక్షానికి దారి తీస్తాయి. తాళం పడితే అజ్ఞానం, తెరుచుకుంటే అదే జ్ఞానం.

మనందరం స్వతహాగా పరమాత్మ స్వరూపులమే అయినా ఆ జ్ఞానం మరుగున పడిపోయి "నేను ఫలానా, వీరు నా బంధువులు, ఇది నా కులం, గోత్రం, దేశం, ప్రాంతం" అనే బంధనాలు మనకు మనమే తగిలించుకుని సతమతమౌతున్నాం. మదాలసలాంటి తల్లి మనందరికీ దొరికి ఉంటే, పుట్టిన క్షణంనుండి "నువ్వు ఈ దేహానివి కావు. దీనికి కలిగే హాని వృద్దులు, సుఖదుఃఖాలు నీవి కావు. ఈ దేహానికి పేరు కోటేశ్వర రావు అయినా నీకు ఒరిగేదేమి లేదు, భిక్షపతి అయినా నీకు పోయేదేమీ లేదు. ఈ కనిపించేదంతా నశించిపోయేదే. నీవు శాశ్వతుడవు" అని నూరిపోసేది. కానీ మన తల్లిదండ్రులు మనం పుట్టిన క్షణంనుండి "నేను అమ్మను, నేను నాన్నను, ఇది నీపేరు, మేమంతా నీ బంధువులం, వారు పరాయివారు. ఇది నీ ఇల్లు, అది పరాయిది. ఇది నీ  బొమ్మ, ఎవరికీ ఇవ్వకు. నువ్వు బాగా చదివి మా పేర్లు నిలబెట్టాలి. బాగా సంపాదించాలి, కూడబెట్టాలి." ఇలాంటివే నూరిపోస్తున్నారు. 

నిజానికి చిన్నారి పాపలకు ఈ తరతమ భేదాలు ఏవీ తెలియవు. వారు ఎవరిని చూసినా నవ్వుతారు, చేతిలో ఉన్నది ఎవరడిగినా ఇచ్చేస్తారు. ఒక రుచికరమైన తినుబండారం ఇస్తే ఎలా తింటారో, అలాగే తాము విసర్జించిన మలాన్ని కూడా తీసి నోట్లో పెట్టుకుంటారు. కానీ పెద్దలు చేసే ఈ నిరంతర బోధవలన వారికి అదే శ్రవణ మననాలు కలిగి ప్రాపంచిక బంధాలలో ఇరుక్కుపోతున్నారు. అటువంటి మానవులు తమ నిజ తత్త్వాన్ని తెలుసుకోవటానికై సద్గురువులను ఆశ్రయించినప్పుడు ఆ గురుబోధ శ్రవణం ద్వారా అసలు తత్త్వం అర్థం అవుతుంది. అయితే నిరంతర మననం, అభ్యాసం లేనప్పుడు అది నిలబడదు.

ఒక ఉదాహరణ చూద్దాం. ఒక పిల్లవాడికి చిన్నప్పటినుండి 'రెండు రెళ్ళు ఆరు' అని నేర్పించామనుకోండి, వాడికి అదే శ్రవణం, మననం వలన ఆ తప్పు లెక్కే వాడి మనస్సులో స్థిరంగా నాటుకుపోతుంది. అలాంటి పిల్లవాడు బడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉపాధ్యాయుడు ముందుగా 'రెండు రెళ్ళు నాలుగు' అని చెప్పినా వీడు నమ్మడు. అప్పుడు ఆయన ఒక నాలుగు పెన్సిళ్ళనో, రూపాయి బిళ్ళలనో తీసుకొని ప్రాక్టికల్గా నిరూపిస్తారు. ఈ పిల్లవాడు ముందు ఆశ్చర్యానికి గురైనా తరువాత మెల్లగా అర్థం చేసుకుంటాడు. అయితే అంతకుముందు నరనరానా జీర్ణించుకుపోయిన తప్పుడు లెక్క అంత తేలికగా పోదు. హఠాత్తుగా ఎవరైనా 'రెండు రెళ్ళు ఎంత?' అనగానే ఠక్కున 'ఆరు' అంటాడు. అందుకే ఆ ఉపాధ్యాయుడు వీడికి అర్థం అయిన తరువాత కూడా అనేకసార్లు 'రెండు రెళ్ళు నాలుగు' అని నెమరువేయిస్తూ ఉంటాడు. అయితే పిల్లవాడు ఇంటికి రాగానే మళ్ళీ తల్లి 'రెండు రెళ్ళు ఆరు' అని చెబుతూ ఉందనుకోండి, ఇక వీడికి అసలైన లెక్క రావడానికి ఎంత కష్టం?

అలాగే మనం నిత్యం ఈ ప్రపంచంలో చూసేదంతా సత్యం అనే అందరి ద్వారా వింటున్నాం, దానినే మననం చేస్తున్నాం. ఎప్పుడో ఒకసారి గురువుల ద్వారా "ఇదంతా మిధ్య, నీ అసలు తత్త్వం వేరు" అని విన్నా అది పురాణ వైరాగ్యం లాగా అక్కడినుంచి లేచి ఇవతలకు రాగానే మళ్ళీ మరపునకు వచ్చేస్తోంది. ఎందుకంటే మన శ్రవణ మననాలనే తాళంచెవులు నిరంతరం ప్రపంచం వైపుకే త్రిప్పబడుతున్నాయి, బంధాన్ని కలిగిస్తున్నాయి. మనం పుట్టినప్పటినుండే కాక ఇంతకు ముందు ఎన్నో జన్మలనుండి కూడా ఇదే అభ్యాసం చేస్తూ వస్తున్నాం. ప్రపంచం వైపుకు తిరిగిన ఈ శ్రవణ మననాలు చివరికి అధ్యాస, లేదా భ్రాంతికి దారి తీస్తున్నాయి. ఈ భ్రాంతి తొలగి మనలో జ్ఞానకాంతి ప్రకాశించాలంటే ఇంతకంటే మరెన్నో రెట్లు ఎక్కువగా గురుబోధని శ్రవణం, మననం చేయాలి. అప్పుడు అది నిదిధ్యాసకు, లేదా ఆత్మానందానుభూతికి దారితీస్తుంది.

అంతటి తీవ్రమైన అభ్యాసం లేకపోతే 'రెండు రెళ్ళు నాలుగు' అని ప్రత్యక్షంగా నిరూపణ అయినా మళ్ళీ ఆ పిల్లవాడు హఠాత్తుగా అడిగితే ఏమరుపాటుగా 'ఆరు' అని చెప్పినట్లే, మనకు ఒకవేళ భగవద్దర్శనం కలిగినా కూడా మళ్ళీ మాయ ఆవరించి ఈ జగత్తే సత్యమనే భ్రమలో పడిపోతాం. ఎంతమంది రాక్షసులకు తపస్సుల వలన భగవద్దర్శనం కాలేదు? వారందరూ ఆ క్షణం గడవగానే తిరిగి మాయలో పడిపోలేదా? Practice doesn't make you perfect. Practice just makes it permanent. So, beware of what you practice and make sure you always practice the perfect thing. "అభ్యాసం మనలను పరిపూర్ణులుగా చేస్తుంది" అనే ఒక భ్రమ ప్రచారంలో ఉంది. కానీ పైన చెప్పుకున్నట్టు మనం తప్పు విషయాన్ని అభ్యాసం చేస్తే ఆ తప్పే మన మనస్సులో శాశ్వతంగా నాటుకుపోతుంది. ఎప్పటికీ పరిపూర్ణులం కాలేము. అభ్యాసం కేవలం మన మనస్సును అభ్యసించే విషయం మీద స్థిరంగా నిలుపుతుంది. కాబట్టి పరిపూర్ణుడు కావాలంటే పరిపూర్ణమైన విషయాన్నే అభ్యాసం చేయాలి.

మన మనస్సుకు పట్టిన అజ్ఞానానికి కారణమైన వాసనలను, కర్మలను గురుబోధా శ్రవణ మననాలు దగ్ధం చేసివేస్తాయి. శ్రవణం వలన భూతకాలంలోని కర్మలు, వాసనలు రహితం అవుతాయి. నిరంతర మననం వలన వర్తమాన కాలంలోని కర్మలు, వాసనలు రహితం అవుతాయి. ఇక అలా నిదిధ్యాసను పొందినవాడికి ఇక భవిష్యత్తులో కర్మలు, వాసనలు అంటుకొనే  ప్రశ్నే లేదు. అయితే నిజమైన శ్రద్ధ, వైరాగ్యం కలిగి శ్రవణం చేయాలి. అలా శ్రవణం చేసిన పరీక్షిత్తు మోక్షాన్ని పొందినట్లే మనమూ పొందగలం.

3, ఫిబ్రవరి 2019, ఆదివారం

పరిపూర్ణ జ్ఞానం

గురుదేవులు శ్రీ బాబూజీ మహారాజ్ వారు పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీకగా చంద్రుణ్ణి చెప్పేవారు. "ఎలాగైతే పౌర్ణమికి ఒకరోజు కలిపినా, తీసివేసినా అది పౌర్ణమి అనిపించుకోదో అలాగే పరిపూర్ణమైన జ్ఞానానికి ఇక కలపడానికి కానీ తీసివేయటానికి కానీ ఏమీ ఉండదు" అని. అలాగే మనం "సర్వ విజ్ఞాన తేజమును చంద్రకళగ శిరమున గల మహేశ్వరివి నీవే" అని అమ్మవారి స్తోత్రంలో చదువుకుంటాం కదా. ఇంకా శ్రీ గురుదేవులు "ఎప్పటికీ ఈ నామాన్ని రూపాన్ని మాత్రమే ప్రేమిస్తూ ఇంతవరకే గురుదేవులు అనుకుంటే లాభంలేదు. కనిపించేవన్నీ ఎప్పటికైనా నశించిపోయేవే. ఈ నామరూపాలను దాటి సర్వే సర్వత్రా నిండి నిబిడీకృతమైన గురుదేవుల నిర్గుణ సౌందర్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే మీ ఆనందం శాశ్వతమౌతుంది" అని కూడా చెప్పేవారు. 

మనం ఈ రెండింటినీ కొద్దిగా సమన్వయం చేసి చూద్దాం. చంద్రుడనగానే మనకు పరమేశ్వరుడు గుర్తుకు వస్తాడు. ఆయన చంద్రమౌళి కదా. అయితే ఆయనను కేవలం కైలాసవాసిగానో, పార్వతీపతిగానో ఒక రూపానికి, నామానికి, ప్రాంతానికి మాత్రమే పరిమితమైనవాడిగా చూసినప్పుడు మనకు ఆయన శిరస్సుపై చవితి చంద్రుడు మాత్రమే కనిపిస్తాడు. అంటే అది పరిపూర్ణమైన జ్ఞానం కాదనడానికి ప్రతీక అన్నమాట. మరి పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీక అయిన పూర్ణచంద్రుడు ఎక్కడ ఉంటాడో చూద్దాం. "ఆపాతాళ నభ స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్ జ్యోతిస్పాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేన్దు వాంతామృతైః" పాతాళం నుండి ఆకాశం వరకు ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ నిండిపోయి శుద్ధ స్ఫటిక జ్యోతిర్లింగంగా పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నప్పుడు ఆయన శిరస్సుపై బ్రహ్మామృత వెన్నెలలు కురిపిస్తూ పూర్ణ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అని ఈ పై శ్లోకభాగం చెబుతోంది.

అయితే అలా బ్రహ్మాండ వ్యాప్త దేహుడై పరమేశ్వరుడు ఉన్నప్పుడు ఇక ఆయనకు శిరస్సు ఎక్కడ? ఆ శిరస్సుపై ప్రకాశించడానికి చంద్రునికి చోటెక్కడ? అసలిదంతా చూసి వర్ణించే మనమెక్కడ? లోతుగా ఆలోచిస్తే ఆ చంద్రుడు, ఈ వర్ణించేవాడూ ఇద్దరూ ఆ పరమేశ్వరుని విశ్వరూపంలోనే ఉన్నారు కానీ వేరుగా లేరు. అంటే జ్ఞానం అనబడే తెలుసుకోవడం, జ్ఞాత అనబడే తెలుకునేవాడూ జ్ఞేయమనబడే తెలుసుకునే వస్తువైన పరమేశ్వరునిలోనే లీనమైపోయారన్నమాట. అక్కడ ఉన్నదంతా పరమేశ్వరుడే కానీ వేరే వస్తువేదీ లేదు. అదే పరిపూర్ణ జ్ఞానం. 

శ్రీ గురుదేవులు ఇంకా "భక్తియొక్క పరాకాష్టయే జ్ఞానం" అని చెప్పేవారు. మరి మనం ప్రపంచంలోని భక్తుల పేర్లను స్మరించుకుంటే అందులో మొట్టమొదటగా వచ్చే పేరు ప్రహ్లాదునిది. ఆయన బయటికి ఎంతటి పరమ భక్తుడో లోపల అంతటి జ్ఞాని. గురుదేవుడైన నారదునినుండి నారాయణ మంత్రం పొందినా ఆయన ఏనాడూ ఆ నారాయణుని రూపాన్ని భౌతికంగా చూడలేదని చెప్పవచ్చు. నారదుని ఆశ్రమంలో నారాయణుని ప్రతిమ ఉన్నదనుకున్నా ప్రహ్లాదునికి ఊహ తెలిసేలోగానే తండ్రి వచ్చి ఇంటికి తీసుకువెళ్లిపోవడం జరిగింది. ఇక నారాయణునికి బద్ధశత్రువైన ఆ రాక్షసుని గృహంలోగాని, రాక్షస గురువుల ఆశ్రమంలోగాని నారాయణుని ప్రతిమ ఉండే అవకాశమే లేదు కదా! మరి ప్రహ్లాదుడు ఆరాధించినది సర్వవ్యాపకమైన ఆ నారాయణుని నిర్గుణతత్వాన్నే కదా. అందుకే "ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు" అని నిర్భయంగా చెప్పగలిగాడు. అది అనుభవ జ్ఞానమే గానీ వాచాజ్ఞానం కాదు. 

అయితే "సగుణం కంటే నిర్గుణం గొప్పదంటావా?" అని మీకిక్కడ సందేహం రావచ్చు. ఇక్కడ మన చర్చ సగుణ నిర్గుణాల గొప్పతనాన్ని గురించి కాదు. కేవలం సగుణంలోనే ఆగిపోకుండా పరమాత్ముని నిర్గుణ సౌందర్యాన్ని కూడా దర్శించగలగాలి, అప్పుడే జ్ఞానం పరిపూర్ణమౌతుంది అని. తన ఉపాసనా కాలమంతా నారాయణుని నిర్గుణంగా దర్శించాడు కాబట్టే ఆయన సరిక్రొత్తదైన నరసింహాకృతిలో వచ్చినా ప్రహ్లాదుడు వెంటనే గుర్తించగలిగాడు. అదే కేవలం సగుణారాధన మాత్రమే చేసిన ఎందరో భక్తులు, దేవతలు సైతం పరమాత్ముడు వేరే రూపంలో దర్శనమిస్తే గుర్తించలేని సందర్భాలు మన పురాణాలలో అనేకం కనిపిస్తాయి. అయితే భావంలో ఎప్పుడూ అద్వైత దృష్టి కలిగి ఉండాలి కానీ అది క్రియలో పనికిరాదని కూడా పెద్దలు చెబుతారు. "అద్వైతం త్రిషులోకేషు, నాద్వైతం గురుసన్నిధౌ" - మూడు లోకాలలో ఎక్కడైనా అద్వైత భావన కలిగి ఉండు కానీ గురు సన్నిధిలో మాత్రం దాస్యభావనతోనే ఉండాలి. 

ఒకసారి కొందరు పండితుల మధ్యలో "సగుణం గొప్పదా? నిర్గుణం గొప్పదా?" అనే ఎడతెగని చర్చ జరుగుతున్నప్పుడు శ్రీగురుదేవులు అక్కడకు వెళ్లడం తటస్థించింది. తమ సమస్యను తీర్చమని వారు శ్రీగురుదేవులను ప్రార్ధించగా వారు "అసలు సమస్యంతా మీరు సగుణనిర్గుణాలను వేరు వేరుగా చూడటంలోనే ఉంది. ఈ రెండూ పరమాత్మయొక్క రెండు రకాల విభూతులే కానీ పరస్పరం విభిన్నమైనవి కావు. సగుణ రూపంలో పరమాత్ముని ఆరాధించకపోతే భక్తి కలుగదు. అలాగే ఆయన నిర్గుణ సౌందర్యాన్ని సర్వేసర్వత్రా దర్శించలేకపోతే జ్ఞానం పరిపూర్ణం కాదు. సగుణ నిర్గుణాలు రెండూ నాణానికి రెండు పార్శ్వాల వంటివి. రెండూ ఉంటేనే ఆ నాణానికి విలువ" అని వారి సందేహాన్ని నిర్మూలించడం జరిగింది.