28, ఏప్రిల్ 2023, శుక్రవారం

మమకారం

పూర్వం ఒక అడవిలో ఒక కోతి నివసించేది. దానికి లేకలేక ఒక పిల్ల పుట్టింది. దానితో ఆ పిల్లని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకొనేది. ఒక్క క్షణం కూడా ఆ పిల్లని వదిలిపెట్టి ఉండేది కాదు. తను నిద్రలోనో, లేదా ఏదో వ్యాపకంలోనో ఉండగా ఏ చిన్న శబ్దమయినా 'అమ్మో! నా పిల్లకి ఏదో ఆపద కలిగింద'ని ఉలిక్కిపడుతూ ఉండేది.

పిల్ల పెరిగి పెద్దదవుతూ ఉంటే తననెక్కడ వదిలేసి వెళ్లిపోతుందో అని ఆ తల్లి బెంగపెట్టుకునేది. దానితో ఆ పిల్ల ఎంత అల్లరి చేసినా, చుట్టుప్రక్కల జంతువులతో తనకు ఎన్ని తలనొప్పులు తెచ్చిపెట్టినా ఏమీ అనేది కాదు. వాటి సంఘంలోని కోతులన్నీ మొదట్లో 'ఏదో చిన్న పిల్లలే' అని సహించినా తరువాత తల్లిని హెచ్చరించేవి. అయినా సరే ఆ తల్లి 'ఊర్లో అందరి కళ్ళూ నా పిల్లమీదే. దానికి దిష్టి పెడుతున్నారు. అది ఆనందంగా ఉంటే చూసి ఓర్చుకోలేక పోతున్నారు' అనుకొనేదే కానీ తన తప్పు తెలుసుకోలేకపోయింది.

తను ఎంత అల్లరి చేసినా తల్లి ముద్దు చేయడం, అలాగే తనని ఎప్పుడూ వదిలిపెట్టకుండా ఉండటంతో ఆ కోతిపిల్లకి సంఘంలో ఎలా బ్రతకాలో, మంచిచెడులు ఎలా గుర్తించాలో, ఎక్కడ ఎలా మెలగాలో తెలియకుండా పోయింది. ఒకనాడు ఆ అడవిలో కొంతభాగాన్ని నరికివేసి అక్కడ పెద్ద ఫాక్టరీ కట్టాలని కొంతమంది మనుషులు వచ్చారు. వారిని చూడగానే భయంతో జంతువులన్నీ పారిపోయాయి.

వారు పగలు కొంత పనిచేసి, మధ్యాహ్నం భోజనానికి వెళ్ళారు. సరిగ్గా అప్పుడు ఈ కోతిపిల్ల అటుగా వెళుతూ వారి పనిముట్లను చూసింది. అటు వెళ్ళవద్దని మిగిలిన కోతులన్నీ అరుస్తున్నా వినకుండా వెళ్ళి అక్కడ ఉన్న రంపంతో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఈ అరుపులకు ఉలిక్కిపడి తన పిల్లకు ఏమైందోనని తల్లి పరుగు పరుగున వచ్చింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. రంపం మీదినుంచి అటుఇటు గంతులు వేస్తున్న కోతిపిల్ల పట్టుదప్పి రంపం మీద పడి ఒక కాలు తెగిపోయింది.

తన కళ్ళముందే అవిటిదయిపోయిన పిల్లను చూసుకొని ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. అటుగా వెళుతున్న ఒక పులి ఈ దృశ్యాన్ని చూసి ఏమయిందని ఆరా తీసింది. విషయం తెలుసుకున్న పులి ఆ కోతిని ఓదారుస్తూ 'చూడు మిత్రమా! మనందరం ప్రకృతి సహజంగా పిల్లల్ని కంటాము. వారి ఆలనా పాలనా చూసుకోవటం, వారిని ప్రేమగా పెంచడం మన బాధ్యత. అదే సమయంలో వారిని క్రమశిక్షణతో కూడా పెంచాలి. ఏది మంచో ఏది చెడో వారంతట వారు తెలుసుకొనేలా తీర్చిదిద్దాలి. వారికి అవసరానికి కావలసినవి సమకూరుస్తూ వారు తెలివిగా తమ కాళ్ళమీద తాము నిలబడగలిగేలా పెంచడం ప్రేమ అనిపించుకుంటుంది. అలా కాకుండా వారిని వదలలేక నిరంతరం వెంట ఉంటూ, అన్నీ నువ్వే చేస్తూ, వారికి స్వేచ్ఛను, స్వతంత్రంగా బ్రతికే తెలివిని ఇవ్వలేక పోవడం, వారు లేకుండా నేను జీవించలేను అనుకోవడం, నువ్వు లేకుండా వారు జీవించలేని స్థితి కల్పించడం మమకారం అవుతుంది. ప్రేమ స్వేచ్ఛకు, ఉన్నతికి దారితీస్తే మమకారం బంధానికి పతనానికి దారితీస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఒక కాలు పోయినా భగవంతుని దయవలన నీ బిడ్డ బ్రతికే ఉంది. కనుక నీ మమకారాన్ని విడిచిపెట్టి, ప్రేమతో దానికి కావలసిన సహకారాన్ని అందిస్తూ మంచిచెడుల విచక్షణ కలిగేలా పెంచు' అని బోధించింది.

నాయిల్లు నాయాస్తి నాభార్యయందువు
నా పిల్లలో యంచు మురిసిపోదువు
నాది నాదన్న వాడు బంధాల పాలౌను
కాళీ ప్రసాదు మాట కాంతిబాట|| 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి