2, ఏప్రిల్ 2023, ఆదివారం

మ్రొక్కు

     కృష్ణమూర్తి ఒక ప్రభుత్వ శాఖలో ఉన్నతస్థాయి ఉద్యోగి. తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో బాగానే సంపాదించాడు. ఆయన ఒక్కగానొక్క కుమార్తె పెళ్ళికి ఎదిగివచ్చింది. తనకున్న పరిచయాలు ఉపయోగించి మంచి స్థాయిలోని సంబంధం కుదుర్చుకున్నాడు. అనేకమంది మంత్రులను, ఇతర ఉన్నతోద్యోగులను, రాజకీయ నాయకులను వివాహానికి ఆహ్వానించాడు. ముహూర్తం దగ్గర పడుతున్నకొద్దీ పెళ్ళి ఎలా చేస్తానో, అంతమంది అతిథులకు మర్యాదలు సరిగ్గా చేయగలనో లేదో అనే ఆందోళన పెరిగిపోతోంది.

    కృష్ణమూర్తి ఆందోళన గమనించిన భార్య సుమతి, "ఏమండీ! మన కులదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామికి మ్రొక్కుకోండి. ఆ స్వామి దయవలన అంతా సవ్యంగా జరుగుతుంది. కంగారు పడకండి" అని సలహా ఇచ్చింది. కృష్ణమూర్తి అలాగే అని తమ ఊరిలోని వేంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళి, "స్వామీ! నీ దయవల్ల నా ఒక్కగానొక్క కూతురు వివాహం ఏ లోటూ లేకుండా సవ్యంగా జరిపించావంటే నీ కొండకు వచ్చి తలనీలాలు సమర్పించుకుంటాను. అలాగే నీకు కోటి రూపాయలు విరాళంగా కూడా సమర్పిస్తాను తండ్రీ!" అని మ్రొక్కుకున్నాడు.

    అనుకున్నట్టుగానే కూతురి పెళ్ళి ఏ లోటూ లేకుండా చక్కగా జరిగిపోయింది. వచ్చిన అతిథులందరూ కృష్ణమూర్తి చేసిన మర్యాదలకు ఎంతగానో మెచ్చుకొని, ఆయనను పొగిడి వెళ్ళారు. ఆ తరువాత కొన్నాళ్ళు ఆఫీసులో కూడా ఆ పెళ్ళిపైనే చర్చలు. ఇవన్నీ చూసి కృష్ణమూర్తి మనస్సు ఆనందంతో పొంగిపోయింది. ఇంతలో భార్య సుమతి తాను తీర్చవలసిన మ్రొక్కును గుర్తు చేసింది.

    వెంటనే కృష్ణమూర్తి రైలు టిక్కెట్లు, తిరుమలలో కాటేజీ, దర్శనం, కళ్యాణం తదితర టిక్కెట్లన్నీ సిద్ధం చేసుకొని కుటుంబ సమేతంగా బయలుదేరాడు. అతడు ఉన్నతోద్యోగి కావడంతో అన్నీ సులభంగా సమకూరాయి. కాటేజీలో దిగగానే క్షురకుణ్ణి పిలిపించుకొని, తలనీలాలు తీయించి, స్నానం చేసి, కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకొని కళ్యాణోత్సవంలో కూడా పాలు పంచుకున్నాడు. తాను మ్రొక్కుకున్నట్టుగానే కోటి రూపాయల చెక్కును విరాళంగా అక్కడి అధికారులకు అందజేశాడు.

    ఆనందంగా తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ తన ఉద్యోగానికి వెళ్ళటం ప్రారంభించాడు. అయితే కృష్ణమూర్తి తల వెనుకభాగంలో వంకర తిరిగి చూడటానికి విచిత్రంగా ఉంటుంది. ఇన్నాళ్ళూ వత్తయిన జుట్టు ఉండటంతో అది ఎవరూ గమనించలేదు. ఇప్పుడు నున్నటి గుండులో అది స్పష్టంగా కనిపిస్తోంది. అతను పెద్ద ఆఫీసరు కావడంతో నేరుగా ఎవ్వరూ అనకపోయినా అతనితో మాట్లాడి, బయటకు వెళ్ళాక ముసిముసిగా నవ్వుకోవడం కృష్ణమూర్తి గమనించాడు.

    ఇక ఇలా లాభం లేదని టోపీ పెట్టుకొని ఆఫీసుకు వెళ్ళడం మొదలుపెట్టాడు. అయితే రోజులో ఎక్కువ భాగం తన పై ఆఫీసర్లతో మీటింగులు ఉండటంతో టోపీ తియ్యక తప్పడంలేదు. మెల్లమెల్లగా కృష్ణమూర్తిలో ఆత్మన్యూనతా భావం, అసహనం పెరిగిపోతున్నాయి. ఇంట్లోనూ, బయటా అందరిమీదా విసుక్కోవటం మొదలుపెట్టాడు. అసలే ఒక్కగానొక్క కూతురు అత్తవారింటికి వెళ్ళిపోయి పగలంతా ఒంటరితనాన్ని అనుభవిస్తున్న సుమతికి భర్తలో క్రొత్తగా మొదలైన  ఈ అసహనాన్ని భరించడం మరింత కష్టమైపోయింది.

    ఒకసారి కృష్ణమూర్తిని చూడటానికి అతని బాల్యస్నేహితుడు పరాంకుశం ఎంతో దూరంనుంచి వచ్చి కొన్నాళ్ళు వాళ్ళింట్లోనే ఉన్నాడు. సుమతిలోని నైరాశ్యాన్ని గమనించిన పరాంకుశం విషయమేమిటని ఆరా తీశాడు. ఆ సాయంత్రం ఇంటి బయట పెరట్లో విశ్రాంతిగా కూర్చొని టీ తాగుతున్న సమయంలో మెల్లగా కృష్ణమూర్తిని కదిపాడు - "ఒరేయ్ కృష్ణా! నీకేమైంది ఈ మధ్యన? నీ గారాల కూతురు దూరమైందని విచారంగా ఉన్నావా? ఎందుకు అందరిమీదా అలా అసహనాన్ని ప్రదర్శిస్తున్నావ్?" అని అడిగాడు.

    అన్నాళ్ళుగా తానొక్కడే మనస్సులో దాచుకొని కుమిలిపోతున్న విషయాన్ని ప్రాణస్నేహితుని ముందు కక్కేసాడు కృష్ణమూర్తి. పరాంకుశం పెద్దగా నవ్వుతూ, "చూడు కృష్ణా! ఆమాత్రం చిన్న అవమానాన్ని తట్టుకోలేనివాడివి తలనీలాలు ఇస్తానని ఎందుకు మ్రొక్కుకున్నావు? అయినా ఆ వేంకటేశ్వర స్వామికి నువ్విచ్చే జుట్టుతో ఏం పని? ఆ మాటకొస్తే నువ్విచ్చే డబ్బులతో మాత్రం ఆయనకు ఏం పని? ఏడేడు పధ్నాలుగు లోకాలను ఏలేవాడికి ఇదొక లెక్కా? అయినా జుట్టో, డబ్బులో ఇస్తే మళ్ళీ తిరిగి వస్తాయని వాటిని మ్రొక్కుతారు కానీ మళ్ళీ తిరిగిరాని చెవులో, ముక్కులో కోసిస్తామని ఎవరైనా మ్రొక్కుతారా? మరి మళ్ళీ తిరిగి తెచ్చుకొనేవి ఇచ్చి మాత్రం ఏమిటి ఉపయోగం? అలా అని మన ఆచారాలని నేను తప్పు పట్టడంలేదు. అసలు ఇలా తలనీలాలు దేవునికి సమర్పించాలని మన పెద్దలు ఎందుకు పెట్టారో తెలుసా? అలాగైనా మనిషి తన అహంకారాన్ని, ఈ దేహమే తాననే భావనని వదులుకొని, అంతా ఆ ఈశ్వర ప్రసాదంగా, ఈశ్వరమయంగా దర్శించడం అలవాటు చేసుకొంటాడని. ఆ పరమాత్మకు సమర్పించవలసినవి నీలోని దుర్గుణాలు, వాసనలు, అహంకార మమకారాలు. ఒకసారి సమర్పించాక మళ్ళీ వాటిజోలికి పోకూడదు. అదే మ్రొక్కుకు సార్థకత. అలా సమర్పించిన నాడు నిన్ను గురించి ఎవరు ఏమనుకొన్నా, ఎలా నవ్వుకున్నా నువ్వు దానిని అవమానంగా భావించవు" అని చెప్పి తన స్నేహితుని సమాధానపరిచాడు.

నెత్తిన జుట్టు గొరుగంగనేటికి
ముక్కుచెవులు గొరుగగలవె
గొరుగదగినవి గుణములు గదా
కాళీ ప్రసాదు మాట కాంతిబాట||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి