31, డిసెంబర్ 2019, మంగళవారం

పతిత పావనుడు


మనం తిరుపతి వెళితే ఎక్కడ చూసినా 'ధర్మో రక్షతి రక్షితః' అనే వాక్యం కనిపిస్తూ ఉంటుంది. ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మబద్ధంగా జీవించినవారిని ఆ ధర్మమే రక్షిస్తుంది అని దీని భావం కదా. కొంతమంది దీనినే కొద్దిగా మార్చి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంలో 'వృక్షో రక్షతి రక్షితః' అని కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ ధర్మానికి వృక్షానికి మధ్య ఒక వ్యత్యాసం ఉంది. ధర్మం తనను ఆచరించినవాడిని, రక్షించినవాడిని మాత్రమే రక్షిస్తుందేమో కానీ వృక్షం తనకు రోజూ నీరుపోసి పోషించినవాడినే కాక తనను హింసించి నరికివేయాలని వచ్చినవాడిని కూడా ఆదరించి చల్లని నీడను, ఫలపుష్పాదులను అందిస్తుంది. అది తన వద్దకు వచ్చిన వారిపట్ల ఎటువంటి భేదభావాన్ని చూపించదు.

భగవంతుడు కూడా ఈ వృక్షంలాంటి వాడే. ఆయన పతితపావనుడు. చక్కగా తన ధర్మాన్ని ఆచరిస్తూ, లోకోపకారిగా ధార్మిక జీవనం గడిపేవాడిని ఎలా చేరదీసి ఉద్ధరిస్తాడో, ధర్మాధర్మ విచక్షణ లేక తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ పతితుడైపోయిన వాడిని కూడా అంతకంటే ఎక్కువ ప్రేమతో చేరదీసి ఉద్ధరిస్తాడు. నిజానికి ధర్మపరుడికంటే పతితుడే ఆయనయొక్క ప్రేమకు, సహచర్యానికి ఎక్కువగా నోచుకుంటాడేమో. తల్లికి తన పిల్లలందరిపైనా ఒకే రకమైన ప్రేమ ఉన్నా కూడా చక్కగా వృద్ధిలోకి వచ్చిన పిల్లవాడికంటే ఎందుకూ పనికిరాని పిల్లవాడి పట్ల  ఇంకా ఎక్కువ బాధ్యత, ఆసక్తి చూపిస్తుంది కదా!

సంపూర్ణంగా ఆరోగ్యంతో ఉన్నవాడు తన దగ్గరకు వస్తే వైద్యుడు ఊరికే రెండు నిముషాలు చూసి పంపించేస్తాడు. రోగి ఎంత ఎక్కువ అనారోగ్యంతో బాధపడే వాడైతే  వైద్యుడు ఆ రోగితో అంత ఎక్కువ సమయం గడుపుతాడు కదా. అలాగే ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో బాగా చదువుతూ, చెప్పినవన్నీ చక్కగా అర్థం చేసుకుంటూ మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థిని చూసి సంతోషిస్తాడే కానీ రోజులో తన సమయాన్ని ఎక్కువగా ఎవరికి కేటాయిస్తాడు? మందబుద్ధియైన విద్యార్ధికే కదా. రజకుడు శుభ్రంగా ఉన్న వస్త్రాన్ని ఊరికే పిండి ఆరేస్తాడు, కానీ బాగా మురికిపట్టి ఉన్న వస్త్రాన్ని ఎంతోసేపు కష్టపడి ఉతుకుతాడు కదా. భగవంతుడి ముఖ్య కర్తవ్యం కూడా అదే. భక్తుడు, జ్ఞాని అయినవాడు ఎలాగైనా తన దగ్గరకే చేరుతాడు. కానీ తనను తెలుసుకోలేక, అసలు గుర్తించక అధోగతి పాలయ్యే వాడికోసమే ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తాడు. 

అప్పటికే తనకు పెద్ద రోగం ఉందని పరీక్షల ద్వారా నిర్ధారించుకొని స్పెషలిష్టు డాక్టర్ దగ్గరకు వెళ్లిన రోగి ఆయన ఇచ్చిన మందులు చక్కగా వాడి, చెప్పిన పథ్యం పాటించి క్రమశిక్షణతో తన రోగాన్ని నయం చేసుకుంటాడు. కానీ తనకొక రోగం ఉందనే విషయం కూడా తెలియకుండా తన ఇంటిలో తాను స్వేఛ్చగా బ్రతికేస్తున్నవాడిపై ప్రేమతో ఆ ఇంటి ఫ్యామిలీ డాక్టర్ మాటిమాటికీ ఇంటికి వస్తూ, అతనికి పథ్యం చెబుతూ, తగిన మందులిస్తూ, అతను రోగం విషయం తెలియక తన వైద్యాన్ని శ్రద్ధతో పాటించకపోయినా, తన మాట వినకపోయినా ఏమాత్రం విసుగు లేకుండా అతనికి పూర్తి స్వస్థత చేకూరే వరకు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు.

సరిగ్గా అటువంటి ప్రేమమూర్తే భగవంతుడు. తమకు భవమనే రోగం ఉన్నదని తెలుసుకోలేక, అసలు భగవంతుని గుర్తించక, ఒకవేళ గుర్తించినా శాస్త్ర, లోక వాసనలతో కొన్ని కొన్ని మూఢాచారాలకు అలవాటుపడి, వాటిని పాటించడమే భగవంతుని ఆరాధనగా పొరబడుతూ, కులమత దురహంకారాలతో సాటి మానవులలోని భగవంతుని చూడలేక, వారిపట్ల దారుణమైన వివక్షను చూపుతూ, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగలేక పతితులైపోతున్న మానవాళిని ఉద్ధరించడానికి మాటిమాటికి ఎందరో గురువుల, మహాత్ముల రూపంలో అవతరిస్తూ, ఆ పతితుల మధ్యలోనే నివసిస్తూ, వారి ఇండ్లలో తిరుగుతూ, తింటూ, వారిలో ఒకరిగా ఉంటూ మెల్లమెల్లగా వారిలో పరివర్తన కలిగించి నిజమైన ఆధ్యాత్మిక మనోవికాసాన్ని కలిగించి వారిని ఉద్ధరించడానికే తన అవతార కాలాన్నంతా ధారపోసే పతితపావనుడు భగవంతుడు. ఇందుకు ఉదాహరణలు సమర్థ సద్గురు శ్రీశ్రీశ్రీ హనుమత్ కాళీ వర ప్రసాద బాబూజీ మహారాజ్ వారి దివ్య చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తాయి. మన జీవిత సర్వస్వాన్ని వారి పాదాలచెంత ధారపోసినా వారి రుణంలో లక్షోవంతు కూడా తీర్చుకోవటం అసాధ్యం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి