6, నవంబర్ 2019, బుధవారం

చిల్లుల కుండ

నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాది కరణద్వారా బహిస్పన్దతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ 
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

ఒక చీకటి గదిలో ఒక కుండ ఉన్నదనుకోండి. దానిమీద రకరకాల జంతువుల, పక్షుల ఆకారాలలో చిల్లులు చెక్కబడి ఉన్నాయి. అందులో ఒక దీపం వెలిగించబడి ఉంది. ఇప్పుడు మీరు ఆ కుండని చూస్తే మీకు వెలుగుతున్న ఏనుగు, జింక, నెమలి ఇలా రకరకాల ఆకారాలు కనిపిస్తాయి. అయితే నిజానికి వెలుగుతున్నది లోపల ఉన్న దీపమే కానీ అక్కడ ఎటువంటి వెలిగే జంతువులూ లేవు. ఒక గదిలో దీపం వెలిగిస్తే  ఆ వెలుగు గది అంతా నిండిపోతుంది తప్ప ఆ దీపపు వెలుగుకు ఏ ఆకారం ఉండదు. కానీ ఇక్కడ మనకు అదే వెలుగు రకరకాల ఆకారాలతో కనిపిస్తోంది. నిరాకారమైన వెలుగు ఇలా వివిధ ఆకారాలలో కనిపించడానికి కారణం ఏమిటి? ఆ కారణం కుండలోని చిల్లులే. నిజానికి అక్కడ ఏ చిల్లులు లేని కుండ ఉంటే అసలు వెలుగే బయటకు రాదు.

మట్టితో చేయబడి నిండుగా ఉండవలసిన కుండలో ఏనుగు ఆకారంలో ఒక భాగం తీసివేయబడింది. అలాగే వివిధ ఇతర జంతువుల ఆకారాలలో కుండ భాగాలు తీసివేయబడ్డాయి. అలా ఏమీ లేని చోట్లనుండి మనకు ఆయా ఆకారాలలో కాంతి ఉన్నట్లుగా కనిపిస్తోంది. లేనిది ఉన్నట్లుగా కనిపించడాన్నే మాయ అంటాం కదా! ఇలాగే మన శరీరంలో కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనే చిల్లులు ఉండటంతో మనలోని జ్ఞాన దీపపు ప్రకాశం ఆ యా ఇంద్రియాల ద్వారా బయటకు వెలువడుతోంది. కుండలోని చిల్లులకు స్వయం ప్రకాశం లేనట్లే ఈ ఇంద్రియాలకు కూడా స్వయం సత్తా లేదు. లోపలి జ్యోతి ఆరిపోతే ఇవి ఎందుకూ పనికిరావు.

ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే గదిలో మనకు వెలుగుతున్న జంతువులు ఉన్నాయన్న భ్రమ కలగాలంటే మనం ఆ గదిలోకి వెళ్ళేసరికే అందులో చిల్లుల కుండ, దానిలో వెలిగే జ్యోతీ రెండూ ఉండాలి. ఇదే విషయాన్ని గీతాచార్యుడు ఇలా వివరిస్తున్నాడు:

ప్రకృతిం పురుషం చైవ విధ్యనాదీ ఉభావపి| 
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్|| 

పురుషః ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్|  
కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు|| 
(భ.గీ 13-20,21)

ప్రకృతీ, పురుషుడూ ఇద్దరూ అనాదిగా ఉన్నవారే. అయితే పురుషుడికి ఏ వికారాలూ లేవుగానీ మనకు కనిపించే ఈ ఆకారవికారాలన్నీ ప్రకృతిలోని గుణాలవల్ల ఏర్పడుతున్నాయి. అంటే పైన మనం చెప్పుకున్న ఉదాహరణలో కుండ, దీపము రెండూ మొదటినుంచీ ఆ గదిలో ఉన్నాయి. దీపపు కాంతికి ఎటువంటి ఆకారవికారాలు లేవుగాని ఆ కనిపించే వివిధ జంతువుల ఆకారాలన్నీ కుండలోని చిల్లులవలన ఏర్పడుతున్నాయి. ఇంకా ఈ పురుషుడు, ప్రకృతి విడివిడిగా ఉంటే ఎటువంటి ఆకారాలు కనపడవు. దీపం కుండలోపల లేకుండా విడిగా ఉంటే మనకు ఆ వెలుగుతున్న జంతువులు కనబడవు కదా! అలాగే ఆ దీపపు కాంతి కుండలోని చిల్లులగుండా ప్రసరించకపోతే ఆ కాంతికి కూడా ఏ ఆకారమూ ఉండదు. 

అంటే కాంతికి కుండలోని చిల్లులతో ఏర్పడిన సంగం వలన అది ఆకారవికారాలను పొందినట్లుగా కనిపిస్తోందన్నమాట. అదే పైన చెప్పిన రెండో శ్లోకంలో భగవానుడు వివరిస్తున్నాడు. పురుషుడు ప్రకృతిలోనే ఉన్నాడు. అలా ఉంటూ ఆ ప్రకృతియొక్క గుణాలను తనవిగా అనుభవిస్తున్నాడు. దీనికి కారణం అతనికి మంచి చెడు జన్మలయందు ఆ యా గుణాలతో ఏర్పడిన సంగమే.

మనం కుండను బయటినుంచి చూసినంతసేపూ మనకు ఈ వెలిగే ఆకారాలు కనిపిస్తూనే ఉంటాయి. అదే మనం ఆ కుండ లోపలికి వెళ్ళి అసలు జ్యోతిని దర్శించామంటే మనకు అంతటా నిండివున్న ఆ నిరాకారమైన వెలుగే కనిపిస్తుంది కానీ ఇక అక్కడ ఎటువంటి ఆకారవికారాలకు తావుండదు. అలాగే మనం ఈ ప్రకృతిని బయటనుండి చూడటం మాని మన లోపలికి మనం ధ్యానం ద్వారా ప్రయాణించి ఆ లోపలి జ్ఞానజ్యోతిని దర్శించామంటే ఇక మనకు ఈ ప్రకృతిలోని ఆకారవికారాల స్పృహే ఉండదు. అట్టి స్థితిని సాధించేవరకు మనం మన సాధనను దక్షిణామూర్తియైన ఆ గురుమూర్తి పర్యవేక్షణలో కొనసాగించవలసిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి