22, మార్చి 2018, గురువారం

అగర్తల

మన దేశానికి ఈశాన్య ప్రాంతంలో త్రిపుర అనే రాష్ట్రం ఉంది. దాని రాజధాని అగర్తల.  సువాసనలు వెదజల్లే అగరు వృక్షాలు ఎక్కువగా ఉండే స్థలం కాబట్టి దానికి అగర్తల అని పేరు. అలాగే అంతా ఈశ్వరునితో నిండియున్న ఈ జగత్తులో స్థూల, సూక్ష్మ, కారణ దేహాలనే త్రిపురాలతో కూడిన ఈ రాష్ట్రం (శరీరానికి రాష్ట్రం అని కూడా పేరు)  ఏర్పడింది . దీనికి రాజధాని వాసనలతో నిండియున్న కారణ శరీరం. దీనినే వాసనా దేహం అని కూడా అంటారు. జన్మజన్మాన్తరాలనుండి అనేక వాసనలను ఇది మోసుకొస్తూ ఉంది. మానవ దేహాలన్నీ ఒకేవిధంగా పంచభూతాలతో నిర్మితమైనా, ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలకు కూడా చిన్నప్పటినుండి వారివారి స్వభావాలలో, ప్రవర్తనలో స్పష్టమైన తేడాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొందరు పైకి ఎటువంటి కారణమూ కనిపించకపోయినా శైశవదశ నుండి ఏదో ఒక రంగంలో విశేషమైన ప్రతిభ కనబరుస్తూ ఉంటారు. దీనికి కూడా కారణం పూర్వజన్మ వాసనలే. 

ఈ వాసనలు మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. వాటి గురించిన వివరణ నా ఈ పోస్టులో చూడగలరు. వీటి వలననే మనం ఎంతసేపూ నేను, నాది అనుకుంటూ మనం చూస్తున్న విషయాలో చదివిన విషయాలో పరమ సత్యాలని నమ్ముతూ, మనుషుల అంతరంగాలు తెలుసుకోకుండానే వారి వేషభాషలను బట్టి వారికి గుణాలను అంటగడుతూ ఉంటాము. ఈ వాసనలు ఎంత బలవత్తరంగా ఉంటాయనే దానికి ఒక చిన్న ఉదాహరణ - సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముని విశ్వరూపాన్ని దర్శించి లోకమంతా ఉన్నది ఆయనే అనే సత్యాన్ని కనులారా దర్శించిన సమయంలో కూడా అర్జునుడు ఇంకా తన లోకవాసనను వదులుకోలేక కర్ణుణ్ణి సూతపుత్రుడని సంబోధిస్తాడు (భగవద్గీత 11-26). అదే సమయంలో వాసనా రహితుడైన వాసుదేవుడు మాత్రం కర్ణుడనే సంబోధిస్తాడు (భగవద్గీత 11-34).  ఈ బలవత్తరమైన వాసనలే మన త్రిపురాలని మనకు ఆవరణగా అడ్డుపెట్టి ఈశ్వరుని సర్వవ్యాపకత్వాన్ని గుర్తించనీకుండా చేస్తున్నాయి. 

మరి ఈ త్రిపురాలను హరించి జగత్తంతా ఈశ్వరమయంగా దర్శించటం ఎట్లా? దానికి త్రిపురాసుర సంహార ఘట్టం లోనే మనకు ఉపాయం కనిపిస్తుంది. పరమేశ్వరుడు సూర్యచంద్రులనే చక్రాలుగా గల భూమి రథాన్ని ఎక్కి మేరు పర్వతాన్ని ధనస్సుగానూ, వాసుకిని దాని నారిగానూ, నారాయణుని అస్త్రంగానూ చేసుకొని త్రిపురాలను ఒకే సరళరేఖలో నిలబెట్టి భస్మం చేసేసాడు. అలాగే మనం కూడా సూర్యచంద్రులు కలిసే రెండు సంధ్యలలోనూ  భూమిపై స్థిరాసనంలో కూర్చొని సాధన చేయాలి. ఇక మేరుపర్వతాన్ని ధీరత్వానికి ప్రతీకగా చెబుతారు. అలాగే మనం కూడా మన సాధనలో ధీరులమై ఉండాలి. మరి వాసుకి అనే సర్పం ఈశ్వరుని కంఠాభరణం, అంటే శంకరాభరణం. ఓంకార నాదానుసంధానమౌ గానమే శంకరాభరణం అని మనం పాడుకుంటూ ఉంటాం కదా.  అంటే ధ్యానంలో ముందుగా మన మనస్సు నిర్మలమయ్యే వరకూ  దీర్ఘంగా ఓంకారాన్ని నాభినుండి పూరించాలి. ఆ ఓంకార నాదానికి జాగృతమైన కుండలినీ శక్తియే మనలోని వాసుకి. అప్పుడు దానిపై గురు లక్ష్యార్థమనే నారాయణాస్త్రాన్ని సంధించి త్రిపురాలను ఒకే వరుసలో నిలబెట్టి, అంటే త్రికరణశుద్ధిగా ధ్యానం చేస్తే అప్పుడు ఈ త్రిపురాలయందుగల వాసనలు దగ్ధమై విశ్వమంతా ఈశ్వరమయమనే జ్ఞానజ్యోతి మనలో ప్రకాశిస్తుంది. 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి