17, జులై 2018, మంగళవారం

చార్ధామ్ యాత్రనుండి నాలుగు పాఠాలు

ఇటీవల జరిగిన చార్ధామ్ యాత్రలో శ్రీ మాతాజీ మరియు ఇతర భక్తులతో కలిసి పాల్గొనే మహద్భాగ్యాన్ని శ్రీ గురుదేవులు నాకు కూడా అనుగ్రహహించారు. ఆ యాత్రలో మేము దర్శించిన వాటిలోనుండి నేను నేర్చుకొన్న నాలుగు పాఠాలను మీ అందరితో పంచుకోవాలనుకొంటున్నాను.

ఈ యాత్రలో మేము చూసిన వాటిలో మొదటిది మెట్టు వ్యవసాయం. హిమాలయాలన్నీ పర్వతాలు కదా. మరి ఆ పర్వతాలపై కురిసిన వర్షం అంతా క్రిందికి జారిపోతుంది. ఎందుకంటే వీలున్నంత లోతుకు ప్రవహించటం నీటియొక్క సహజ లక్షణం. ఇక ఆ పర్వతాలపై వ్యవసాయం చేసి పంటలు పండించటం ఎలా? అందుకే అక్కడివారు ఆ పర్వతాలపై కొంత భాగం చదునుగా చేసి గట్టు కడతారు. అందులో కొంత నీరు నిలిచి నేలను వ్యవసాయానికి అనువుగా చేస్తుంది. ఆ గట్టు దిగువనే మరికొంత స్థలం చదునుచేసి మరియొక గట్టు కడతారు. ఇలా పర్వతం అంతా మెట్లు మెట్లుగా తయారై దానిమీద పడిన నీరంతా అక్కడే నిలిచి వ్యవసాయం సాధ్యమవుతుంది. ఈ వర్షపు నీటిలాగే మన మనస్సు కూడా ఎప్పుడూ క్రిందికే పరుగులిడుతూ ఉంటుంది. మనం ధ్యానంలో మనస్సును అత్యున్నతమైన పరమాత్మ నిర్గుణతత్వంపై నిలపడానికి ప్రయత్నిస్తాం, కానీ అది అక్కడినుండి జారిపోయి ఎక్కడెక్కడికో ప్రాపంచిక విషయాలపైకి ప్రయాణిస్తూ ఉంటుంది. పోతనగారు కూడా గంగమ్మను ఉదాహరణగా తీసుకొని విష్ణుదేవుని పాదాలనుండి స్వర్గానికి, అక్కడినుండి శంభుని శిరస్సుకు, అక్కడనుండి హిమాలయాలకు, భూమిపైకి, సముద్రంలోకి, పాతాళానికి ఇలా దిగజారిపోయిందని, భగవంతుని పాదపద్మాలను విడిచిపెట్టిన వాని మనసు గతి ఇంతేనని తెలిపారు. కానీ శ్రీగురుదేవులు పరమానుగ్రహంతో మన మనస్సు ఇలా జారిపోకుండా ఎల్లప్పుడూ పరమాత్మ మీదనే నిలిచి ఉండటం కోసం ఇలాంటి యాత్రలని, దీక్షలని, హోమాలని, పూజలని, సత్సంగాలని ఇలా అనేక గట్లు కడుతున్నారు. ఇలా మెట్టు వ్యవసాయం చేస్తూ మన హృదయక్షేత్రాలలో ఆత్మానందమనే పంటను పండిస్తున్నారు. 

ఇక మేము చూసిన రెండవ విషయం నదీ ప్రవాహం. మేము గంగోత్రి, యమునోత్రి వంటి పుణ్య నదుల జన్మస్థలాలను సందర్శించాము. అక్కడ మేము గమనించినది ఏమిటంటే నది జన్మస్థలానికి దగ్గరలో నది నిండా ప్రవాహ వేగానికి కొట్టుకువచ్చిన పెద్ద పెద్ద రాళ్లు ఉంటాయి. ఇక్కడ నది చాలా  హోరుతో ఉరకలెత్తుకుంటూ ప్రవహిస్తూ ఉంటుంది. నది ముందుకు సాగినకొద్దీ ఈ రాళ్లు ఒకదానితో ఒకటి ఢీకొని ముందు చిన్న చిన్న రాళ్లుగా ఆ తరువాత ఇసుకగా, ధూళిగా మారిపోతాయి. అప్పటికి నది కూడా చాలా ప్రశాంతంగా మారిపోయి చివరికి ఆ ఇసుకను, ధూళిని అక్కడే వదిలేసి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రమునుండి ఆవిరైన నీరే వర్షంగా పడి  నదిగా మారుతుంది కదా. మనం కూడా అలాగే మనం ఎక్కడినుండి వచ్చామో ఆ భగవంతుని చేరడానికి ఆథ్యాత్మిక సాధన మొదలుపెడతాం. మొదట్లో ఆ నదిలోని పెద్ద పెద్ద రాళ్ళలాగే మన మనస్సులో మంచి, చెడు  గుణాలు ఉంటాయి. వాటి మధ్య నిత్య సంఘర్షణ మహాభారత యుద్ధంలా నడుస్తూ ఉంటుంది. మనస్సు ఎంతో ఉద్వేగంతో ఉంటుంది. అయితే సాధన ముందుకు నడిచినకొద్దీ ఈ గుణాలు చిన్న చిన్న ఇసుకరేణువుల, ధూళికణాల  పరిమాణానికి కుంచించుకుపోతాయి. అప్పుడు మనస్సు కూడా స్థితప్రజ్ఞతను సాధించి ప్రశాంతంగా మారుతుంది. చివరికి మనం వీటన్నింటిని వదిలివేసి మన మూలస్థానాన్ని చేరుకుంటాము. 

ఈ యాత్రలో మేము గమనించిన మూడవ అంశం ఘాట్ రోడ్లు. మైదాన ప్రాంతాలలో ఉన్న రహదారులు ఎప్పుడూ ముందుకే సాగిపోతూ ఉంటాయి. ఈ దారివెంట ప్రయాణంలో మనకు ఒకసారి కనపడిన వ్యక్తులుగాని ప్రదేశాలుగాని మళ్ళీ కనపడవు. కానీ పర్వతాలపైకి వెళ్లే రహదారులు మెలికలు తిరుగుతూ వెళతాయి. ఒక మెలిక తిరిగినప్పుడల్లా మళ్ళీ మనకు క్రింద అవే ప్రదేశాలు, విశేషాలు మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. మన ప్రయాణం సాగడం లేదేమోనని మనకు సందేహం కలిగినా, ప్రతి మలుపుతో మనం ఇంకా ఇంకా పైకి చేరుకుంటూనే ఉంటాము. ప్రాపంచిక విద్య కూడా మైదానంలోని రహదారి లాంటిదే. బడిలో ఒకసారి చెప్పిన అంశం ఏదీ మళ్ళీ  చెప్పరు. అలా చెబితే వారి విద్యావిధానం సరిగా లేనట్లే. దీనిని పునరుక్తి దోషం అని కూడా అన్నారు పెద్దలు. కానీ ఆథ్యాత్మిక విద్యలో మనం విన్న విషయాన్నే మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాం. చేసిన పూజనే, యాత్రనే, దీక్షనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి "ఆ! ఎన్నిసార్లు విన్నా ఉపయోగం కలగటం లేదు" అని కూడా అనిపిస్తుంది. కానీ మనం గమనించని విషయం ఏమిటంటే ప్రతిసారి మనం ఆథ్యాత్మికంగా మరింత ఉన్నత స్థితికి ఎదుగుతున్నామని. 

ఇక చివరిగా మేము గమనించినది కొండలలో రకాలు. కొండలలో ముఖ్యంగా రెండు రకాలు మేము చూశాము. అవి మెత్తటి మట్టితో, చిన్న చిన్న రాళ్లతో తయారైన కొండలు, ఇంకా గట్టి రాతి కొండలు. మెత్తటి కొండలపై మట్టి వదులుగా ఉంటుంది. అలాగే అనేక పెద్ద పెద్ద చెట్లు పెరుగుతాయి. ఈ కొండలపై మార్గాన్ని నిర్మించడం చాలా తేలిక. కానీ ఆ మార్గం ఎల్లప్పుడూ ప్రమాదాలతో నిండి ఉంటుంది. ఏ క్షణంలోనైనా చెట్లు విరిగి పడవచ్చు, లేదా మట్టిపెళ్ళలు విరిగిపడి దారిని మూసివేయవచ్చు. ఇక రాతి కొండలపై మార్గాన్ని నిర్మించడం ఎంతో కఠినమైన శ్రమతో కూడుకొన్న విషయం. అయితే ఒక్కసారి మార్గాన్ని నిర్మించిన తరువాత దానిపై ప్రయాణం సురక్షితం. పైన చెప్పుకొన్న ఏ అవాంతరాలు ఆ మార్గంలో ఉండవు. శ్రీబాబూజీ మహారాజ్ వంటి సద్గురువులు చిన్న వయసులోనే కఠోర శ్రమకోర్చి మనకు అటువంటి సురక్షితమైన మార్గాన్ని సిద్ధం చేసి పెట్టారు. ఆ మార్గాన్ని వదలి ఎవరో సులభంగా నాలుగు పుస్తకాలు చదివి ప్రవచించే మట్టి కొండల మార్గాన్ని ఎంచుకొంటే అడుగడుగునా ప్రమాదాలే మనను పలకరిస్తాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి