2, అక్టోబర్ 2023, సోమవారం

అహింస

అక్టోబర్ నెల వచ్చిందంటే ముందుగా గాంధీ జయంతి వస్తుంది. మన ఆధునిక కాలంలో అహింసకు మారుపేరుగా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకొని ఎన్నో దేశాలలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు మన జాతిపిత మహాత్మాగాంధీ. అలాగే ఇదే నెలలో అనేకమంది లోకకంటకులైన రాక్షసులను జగన్మాత సంహరించినందుకు గుర్తుగా మనం దసరా వేడుకలను జరుపుకుంటాం.


ఇక్కడే కొందరికి సందేహం కలుగుతుంది. అసలు మనం అహింసను పాటించాలా, లేక అవసరమైనపుడు హింసామార్గాన్ని అవలంబించాలా అని. మనకు ఈ మానవజన్మ లభించడంలో ముఖ్య ఉద్దేశ్యం, ఈ మానవ జన్మకు సార్థకత మనం మోక్షాన్ని పొందటం. మోక్షాన్ని పొందాలంటే దైవీ సంపదను పెంచుకోవాలని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. ఈ దైవీ సంపద అంటే ఏమిటో 16వ అధ్యాయం మొదటి మూడు శ్లోకాలలో వివరించాడు. ఇందులో మొదటి శ్లోకం అభయం(భయం లేకపోవటం)తో మొదలైతే రెండవ శ్లోకం అహింసతో మొదలవుతుంది. అంటే జీవితంలో ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడం ఎంత అవసరమో ఆ సమస్యా పరిష్కారంలో ఎవరినీ హింసించకుండా అహింసను పాటించడం కూడా అంతే ముఖ్యం.


ఏ దేశంలో చూసినా యుద్ధంలో ధైర్యంగా పోరాడి శత్రు సైనికులను మట్టుబెట్టిన వీరునికి అనేక సత్కారాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సత్కారానికి ప్రాతిపదిక ఆ సైనికుడు తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఎంత ధైర్యంగా పోరాడాడు అనేదే కానీ ఎంతమందిని చంపాడు అనే లెక్క కాదు. అలాగే యుద్ధంలో శత్రువులను చంపి సత్కారాన్ని పొందిన ఆ సైనికుడే తన వ్యక్తిగత కక్షతో దేశంలో ఎవరినైనా చంపితే అతను శిక్షింపబడతాడు. అంటే రెండు సందర్భాలలోనూ చేసిన పని చంపడమే అయినా దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం అది సత్కారార్హమైనదా లేక శిక్షార్హమైనదా అని నిర్ణయిస్తుంది.


పైన మనం చెప్పుకున్న జగన్మాత చేసిన రాక్షస సంహారాన్ని గమనిస్తే అందులో వ్యక్తిగత కక్షగానీ, స్వార్థం కానీ లేదు. అది కేవలం లోకంలోని ఇతర జీవులను రక్షించడానికి చేసిన సంహారమే. అందులో ముఖ్య ఉద్దేశ్యం రక్షణే కానీ హింస కాదు. "శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుని యుద్ధం చేయమని ప్రోత్సహించాడు కదా, మరి మనం మన శత్రువులను సంహరిస్తే తప్పేమిటి?" అని కొందరు వాదిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే అర్జునుడు క్షత్రియుడు, పైగా సైనికుడు. అంతకుమించి అతడు యుద్ధరంగంలో నిలిచి ఉన్నవాడు. 


అందుకే పరమాత్మ యుద్ధానికి ప్రోత్సహించాడు కానీ అంతకుముందు ఆయన శాంతికి ఎంతగా ప్రయత్నించలేదు? అంతెందుకు స్వయంగా తన భార్యను అపహరించిన రావణునితో కూడా యుద్ధం చేసేముందు శ్రీరాముడు అనేకమార్లు శాంతియత్నాలు చేశాడు. పైగా గీతాచార్యుడు ఎవరి ధర్మాన్ని వారు ఆచరించాలి కానీ, ఎంత గొప్పదైనా పరుల ధర్మం జోలికి పోకూడదని హెచ్చరించాడు. అందువలను యుద్ధం చేయడం, శత్రుసంహారం చేయడం సైనికుల ధర్మమే కానీ మనబోటి వాళ్ళది కాదు. ధర్మరక్షణ కోసం తప్పనిసరి పరిస్థితిలో తమవారితోనే యుద్ధం చేసినా, ఆ తరువాత పాండవులు జీవించినంత కాలం మనశ్శాంతి లేకుండా ఆ బాధలోనే బ్రతికారు.


తమ మతానికో, జాతికో చెందిన ప్రతి వ్యక్తీ ఆయుధాలు సమకూర్చుకొని పరాయి జాతి, మతం వారితో పోరాడటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చే నాయకులు దాని వలన కలిగే దుష్ప్రభావాలను గమనించడం లేదు. ప్రతివ్యక్తికి సులభంగా ఆయుధాలు దొరికే వ్యవస్థ ఉన్న అమెరికా వంటి దేశాలలో ఆ ఆయుధాలను దుర్వినియోగ పరుస్తూ విచక్షణారహితంగా పసిపిల్లలనుండి వృద్ధులవరకు ఎందరినో కాల్చి చంపుతున్న ఘటనలు మనం తరచుగా వింటూనే ఉన్నాం కదా!


విచ్చలవిడితనానికి నెలవైన ఆటవిక వ్యవస్థను వదలి మనకంటూ ఒక సమాజాన్ని, దానికి కొన్ని కట్టుబాట్లను, వ్యవస్థను ఏర్పరచుకొన్న మానవుడు మళ్ళీ మళ్ళీ ఆ ఆటవిక న్యాయం వైపుకే మొగ్గు చూపడం ఎంతవరకూ సమంజసం? అవతలివారిని హింసించడం ఎంత తేలికో ఆ హింసకు తట్టుకొని ధైర్యంగా నిలబడి, తనకు శక్తి ఉండి కూడా ధర్మానికి కట్టుబడి అహింసతో జీవించడం అంత కష్టం. అలా జీవించారు కనుకనే పాండవులు, శ్రీరాముడు మొదలైన వారి చరిత్రలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. 


అదే అహింసా ధర్మాన్ని ఆధునిక కాలంలో కూడా ఆచరించి చూపి "అసలు ఇలాంటి ఒక వ్యక్తి రక్తమాంసాలతో ఈ భూమి మీద నడయాడాడంటే ముందు తరాలవారు నమ్మలేరు" అని ఐన్‌స్టీన్ మహాశయుడంతటి గొప్ప శాస్త్రవేత్తతో కొనియాడబడిన గాంధీ మహాత్ముని ఆదర్శంగా తీసుకొని మన జీవితాలను తీర్చిదిద్దుకుందాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి