మన భారతీయ సంప్రదాయంలో గురువును త్రిమూర్త్యాత్మక స్వరూపుడిగానే కాక సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడిగా భావించి పూజిస్తారు. కేవలం భావించడమే కాదు, సత్యగురువు నిజంగా పరబ్రహ్మ స్వరూపుడే. అయితే నేటి సమాజంలో రకరకాల వ్యక్తులను గురు శబ్దంతో సంబోధించడం అలవాటుగా మారింది. టీచర్స్ డేని ఒకప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం అనేవారు. ఇప్పుడు ఎక్కువగా గురుపూజోత్సవం అంటున్నారు. అలాగే ప్రవచనాలు చెప్పేవారిని, జాతకాలు, పంచాంగాలు చెప్పేవారిని, పురోహితులను ఇలా ఒకరేమిటి కాస్త శాస్త్రజ్ఞానం ఉన్నట్లు కనబడిన ప్రతివారిని గురువులుగా సంబోధిస్తున్నారు. ఇంకొంతమందికి తమ స్నేహితులను, ఇంకా అపరిచితులను కూడా గురూ అని పిలవటం ఒక అలవాటు. అయితే గురుశబ్దం చాలా లోతైనది. మానవుని హృదయాంతరాళంలో కరడుగట్టిన అజ్ఞానాంధకారాన్ని తన జ్ఞానభాస్కర కిరణ ప్రసారంతో రూపుమాపి మానవుని మాధవునిగా పరివర్తనం చెందించే సమర్ధత ఒక్క గురువుకే సొంతం.
పాఠశాలలో అధ్యయనం చేసేవాడు విద్యార్థి. అతనితో పాటుగా కలిసి చదువుకొనేవారు సహాధ్యాయులు. అలాగే వీరి అధ్యయనానికి ఉపకరిస్తూ, వారికి నేర్పే క్రమంలో ప్రతిరోజూ తాము కూడా క్రొత్త క్రొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండేవారు ఉపాధ్యాయులు. ఒక ఉపాధ్యాయుడికి తన పాఠ్య విషయంలోనే పట్టు ఉంటుంది. అది కూడా వందశాతం కాదు. తాను అంతవరకు చదవని విషయంమీద ఏ విద్యార్థో ప్రశ్నిస్తే, మర్నాడు తెలుసుకొని వచ్చి సమాధానం చెప్పవలసిందే. కానీ గురువు సర్వజ్ఞుడు. ఈ అనంత విశ్వంలో భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో ఆయనకు తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు. పైకి కనబడే విషయాలే కాక ప్రతి జీవి మనస్సు పొరలలో కప్పబడి ఉన్న సంకల్పాలు, వాసనలు అన్నీ వారికి ఎఱుకే. కొందరు ఉపాధ్యాయుల మధ్య పోటీ ఉంటుంది. ఒకరు చెప్పిన దాన్ని మరొకరు అంగీకరించడానికి అహంకారం అడ్డు వస్తుంది. కానీ నిజమైన గురువులు అలా కాదు. వారి దృష్టిలో అసలు ఈ భేదాలే ఉండవు. ఉన్నదంతా తమ స్వరూపమే.
గురువు ముందుగా తాను భవబంధాల నుండి ముక్తుడై ఉండాలి. అయితే అది మాత్రమే సరిపోదు. తనను ఆశ్రయించిన వారిని ప్రేమతో చేరదీసి, తాను పొందుతున్న బ్రహ్మానందాన్ని వారికి కొద్దికొద్దిగా రుచి చూపిస్తూ, ఎప్పటికప్పుడు వారికి సాధనలో మార్గదర్శనం చేస్తూ, సాధనలో ఎదురయ్యే ఆటంకాలను, వెనక్కిలాగే నీచ భావాలను కనిపెట్టి కాచుకుంటూ, వారి ప్రతి సందేహాన్ని తీరుస్తూ సాధన పూర్తి చేయించి ముక్తిఫలాన్ని అందించగలిగిన సమర్థుడై ఉండాలి. కొంతమంది "విజ్ఞానం అంతా వేదాలలో, ఉపనిషత్తులలో నిక్షిప్తమై ఉంది కదా! అవి చదువుకుంటే సరిపోదా? ఇంకా గురువు ఎందుకు?" అని వాదిస్తారు. "గురువు లేని విద్య గుడ్డి విద్య" అన్నారు పెద్దలు. ఉదాహరణకి ఒక పెద్దమనిషి ఎక్కడో పురాణంలో "పరీక్షిత్తు మహారాజు నిమ్మకాయ వాసన చూస్తుంటే అందులోనుండి తక్షకుడు వచ్చి కాటువేయగా మరణించాడు" అని విని ఇక ప్రపంచంలో ఎవరూ నిమ్మకాయలు వాసన చూడకూడదని శాసిస్తాడు. "ఇదేమి చాదస్తం నాయనా?" అంటే "పురాణాలను చూసి ఏమీ నేర్చుకోరా? అంటే పురాణాలన్నీ వ్యర్థమేనా?" అని మొండిగా వాదిస్తాడు. పరీక్షిత్తు చరిత్ర నుంచి నేర్చుకోవలసింది ఇలాంటి మూఢనమ్మకాలనా? తనకు మరణం అసన్నమైనదని తెలియగానే ఒంటిస్తంభం మేడెక్కి తలుపులన్నీ మూసుకున్న పరీక్షిత్తు శుకబ్రహ్మ ముఖతః భాగవత ప్రవచాన్ని శ్రద్ధగా శ్రవణం చేసి, ఎప్పటికైనా మృత్యువు తప్పదనే సత్యాన్ని గ్రహించి మృత్యువును తానే ఆనందంగా స్వాగతించి భగవదనుభూతిలోనే దేహాన్ని విడిచిపెట్టి ముక్తిధామాన్ని చేరుకున్నాడు. కానీ గురువును ఆశ్రయించనివాడు, ఆశ్రయించినా శ్రద్ధగా గురుబోధను శ్రవణం చేసి, ఆకళింపు చేసుకొని అనుభవంలోకి తెచ్చుకోలేని వాడు ఇలాగే ప్రతిదానిలోనుండి తప్పుడు అర్థాలు తీస్తూ మూఢ నమ్మకాలు పెంచుకుంటూ ఏం చేస్తే ఏం నష్టం కలుగుతుందో అని అనుక్షణం భయంతో చస్తూ బ్రతుకుతాడు.
గురుదేవులు శ్రీ బాబూజీ మహరాజ్ వారు ఎందరినో ఇటువంటి మూఢనమ్మకాలు, అనవసరపు ఆచారాలు, జాతకాలు వాస్తు మొదలైన నమ్మకాల నుండి బయట పడవేసి సరైన ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటో నేర్పించి తరింపజేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు వారి సంతానం అవే నమ్మకాలను కొనసాగిస్తే ఇక ఉపయోగం ఏముంటుంది? కొందరు తెలివిగా "బాబుగారు ఆరోజు గ్రహణం సమయంలో భోజనాలు పెట్టించారు, లేదా వాస్తుకు విరుద్ధంగా ఇల్లు కట్టించారు, ముహూర్తం చూడకుండా పెళ్ళో గృహాప్రవేశమో చేయించారు, నక్షత్రం చూడకుండా పేరు పెట్టారు అంటే అది ఆ సందర్భానికే, ఆయా వ్యక్తులకే పరిమితమైనది. అందులో ఏ దోషం ఉన్నా బాబుగారు చూసుకున్నారు. కానీ ఇప్పుడు మనం అలా ఎలా చేయగలుగుతాం?" అని వాదిస్తారు. గురుదేవులను ఒక రూపానికి, సమయానికి పరిమితం చేసి మాట్లాడే ఇటువంటి వారు గురుతత్వాన్ని ఏమి అర్థం చేసుకున్నట్లు? ఆకాశంలాగే బాబుకు కూడా దేశకాలాలు లేవని ఆయనే స్వయంగా చెప్పినా మనం ఎంతవరకు గ్రహించగలుగుతున్నాం? గురుబోధ అంటే కేవలం వేదికమీద సింహాసనాశీనులై వెలువరించేదే కాదు. గురుదేవులు ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో వాక్కుద్వారా కానీ, సంజ్ఞలద్వారా కానీ, దృష్టిద్వారా కానీ ఏ సూచన ఇచ్చినా అదంతా గురుబోధే. మనం నిత్యం ఆచరణలో పెట్టుకోవలసిందే.
మనుష్యులలో అనేక రకాలు ఉన్నట్లుగానే శిష్యులలో కూడా అనేక మనస్తత్వాల వాళ్ళు, సాధనలో వివిధ స్థాయిలలో ఉన్నవారు ఉంటారు. కేవలం 70% పైన మార్కులు వచ్చిన వారిని మాత్రమే చేర్చుకొని, వారిని బాగా రుబ్బి, 95% మార్కులతో పాస్ చేయించి అది తమ సమర్థతగా ఈనాడు కొన్ని పాఠశాలలు, కళాశాలలు ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ సమర్థ సద్గురువులు అప్పటికే ఎంతో పుస్తక జ్ఞానాన్ని సముపార్జించి చాలావరకు సాధన పూర్తిచేసిన వారినుంచి, అసలు భగవంతుడు ఉన్నాడనే ఊహే లేక, అక్షరజ్ఞానం కానీ, సాధన అంటే ఏమిటో అవగాహన కూడా లేనివారి వరకు అన్ని స్థాయిల వారిని అన్ని మనస్తత్వాల వారిని తామే స్వయంగా వారివద్దకు తరలివచ్చి, శిష్యులుగా స్వీకరించి, ఎవరి మనోవికాస స్థాయిని బట్టి వారి వారికి అర్థమయ్యేలా బోధ చేసి, తమ దృక్కుతోనో, వాక్కుతోనో, స్పర్శతోనో, లేక కేవల సంకల్పంతోనో తమ శక్తిని వారియందు ప్రవేశపెట్టి, వారు తేలికగా చేయగలిగిన సాధన మార్గంలోనే వారిని ముందుకు నడిపించి, వారికి కలిగే ఆటంకాలను ముందుగానే గ్రహించి వారికి తెలియకుండానే తొలగిస్తూ, ఒకవేళ వారి సాధన పూర్తి కాకుండా అంత్యకాలం సమీపించిన సందర్భాలలో అవసరమైతే వారి జీవితకాలాన్ని కూడా పొడిగిస్తూ, సాధన పూర్తిచేయించి ఈ జన్మలోనే తమలో లీనం చేసుకుంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి