16, జులై 2019, మంగళవారం

చంద్రగ్రహణం

సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డంగా వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని మనందరికీ తెలిసినదే కదా! అయితే మన వేదాంత పరిభాషలో సూర్యుడు బుద్ధికి అధిపతి. అందుకే 'ధియోయోనః ప్రచోదయాత్' అని మనం రోజూ ఆయనను ప్రార్థిస్తున్నాం. ఇక చంద్రుడు మనసుకు అధిపతి. అలాగే మన దేహం పంచభూతాలతో తయారయినా అందులో సింహభాగం పృథివీభూతానిదే. కొంచెం తాత్విక దృష్టితో ఆలోచిస్తే ఆత్మశక్తి వలన మన బుద్ధి ప్రకాశిస్తోంది. ఆ బుద్ధి ప్రకాశాన్ని ప్రతిఫలిస్తూ మనస్సు ప్రకాశించినంత కాలం మనలోని  జ్ఞానజ్యోతి మసకబారకుండా మనం వెన్నెలలోనే ఉంటాం. ఎప్పుడైతే బుద్ధికి, మనసుకు మధ్యలో దేహం అడ్డుగా వచ్చి ఈ దేహమే నేననే భావన మనసుకు గట్టిగా పట్టుతుందో అప్పుడే మనలో గ్రహణం అనే చీకటి ప్రారంభం అవుతుంది. మన సాధన అంతా ఈ దేహభావనను అడ్డు తొలగించుకొని మనస్సును బుద్ధికి, ఆ బుద్ధిని ఆత్మకు అధీనపరచి బ్రహ్మానందామృతం అనే వెన్నెలలో ఓలలాడాలనే.

ఇంద్రియాణి పరాణ్యాహుః ఇన్ద్రియేభ్యహః పరం మనః| 
మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః|| (భ.గీ. 3-42)

'ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాలకంటే మనస్సు గొప్పది. మనస్సుకంటే బుద్ధి గొప్పది. ఆ బుద్ధికంటే గొప్పదై వీటన్నింటిని నడిపించేదే ఆత్మ' అని భగవానుడు స్వయంగా సెలవిచ్చారు కదా. అంటే సూర్యుని ప్రకాశాన్ని ప్రతిఫలించి చంద్రుడు ప్రకాశించినా ఆ సూర్యునికి కూడా ప్రకాశాన్ని ఇచ్చేది భగవంతుడే అయినట్లు (యదాదిత్య గతం తేజం జగద్భాసయతేఽఖిలం యశ్చన్ద్రమపి యశ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం - భ.గీ. 15-12) బుద్ధిని అనుసరించి మనస్సు, దానిని అనుసరించి ఇంద్రియాలు ప్రకాశిస్తున్నా, ఆ బుద్ధికి కూడా ప్రకాశాన్ని ఇచ్చేది ఆత్మవస్తువు అన్నమాట.

మనకు సాధారణంగా భగవద్గీతలోని శ్లోకాలనే ఉదహరించి ఉత్తరాయణంలో మరణించినవారు మోక్షాన్ని పొందుతారని, అదే దక్షిణాయణంలో మరణించినవారు తిరిగి జన్మిస్తారని చెబుతూ ఉంటారు. అయితే భగవానుడు ఏమి చెప్పాడో చూద్దాం. మానవునికి పునరావృత్తిని నివారించే మార్గమొకటి, పునరావృత్తిని కలిగించే మార్గమొకటి ఉన్నాయి. మొదటి మార్గానికి లక్షణం ఏమిటంటే 'అగ్నిర్జ్యోతిరహశ్శుక్లః షణ్మాసా ఉత్తరాయణం'. ఇందులో అగ్ని, జ్యోతి, పగలు ఈ మూడూ కూడా కాంతివంతమైనవి. ఇక శుక్లపక్షం, ఉత్తరాయణం చీకటినుండి వెలుగులోకి చేసే ప్రయాణానికి సూచనలు. శుక్లపక్షం మొదటిలో చంద్రుడు అసలు కనబడక పూర్తి చీకటిగా ఉంటుంది. అక్కడినుండి మెల్లమెల్లగా చంద్రబింబమూ, దాని కాంతి కూడా వృద్ధి పొందుతూ చివరికి పూర్ణిమ వస్తుంది. అలాగే ఉత్తరాయణం మొదటిలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటాయి. ఈ ఆరుమాసాలు గడిచేకొద్దీ పగలు పెరుగుతూ, రాత్రి తగ్గుతూ ఉంటుంది. అంటే జ్ఞానియై పూర్తిగా వెలుగులో ఉన్నవాడు, లేదా చీకటి నుండి వెలుగులోనికి, అంటే అజ్ఞానమునుండి జ్ఞానానికి ప్రయాణం చేస్తున్నవాడు పునరావృత్తి రాహిత్యాన్ని కలిగించే మార్గంలో ఉన్నాడన్నమాట.

ఇక రెండవ మార్గానికి లక్షణం ఏమిటంటే 'ధూమోరాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయణం'. ధూమం అంటే పొగ. ఇది వెలుగును కప్పివేస్తుంది. అలాగే రాత్రి కూడా చీకటికి సంకేతం. ఇక కృష్ణపక్షము, దక్షిణాయణం వెలుగునుండి చీకటిలోనికి ప్రయాణాన్ని సూచిస్తున్నాయి. అంటే పూర్తిగా చీకటిలో, లేదా అజ్ఞానంలో ఉన్నవాడు, అలాగే వెలుగునుండి చీకటిలోకి అంటే జ్ఞానమునుండి అజ్ఞానానికి ప్రయాణిస్తున్నవాడు పునరావృత్తిభరితమైన మార్గంలో ప్రయాణిస్తున్నాడన్నమాట. అయితే మనలో చాలామంది ప్రయాణం ఒక సరళరేఖలో ఉండదు. నాలుగడుగులు ముందుకి, రెండడుగులు వెనక్కి, మళ్ళీ రెండడుగులు ముందుకి, మూడడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు మనం వెలుగువైపు ఎంత ముందుకు వెళుతున్నాం అని సరిచూసుకుంటూ వీలైనంతగా వెనకడుగు వేయకుండా ఉంటే అదే పదివేలు. 

అలాగే ఒక మార్గంలో సైకిల్ త్రొక్కుతున్నవాడు మధ్యలో కొంత బద్ధకించి త్రొక్కడం ఆపివేసినా  సైకిల్  దానంతటదే కొంత ముందుకు పోవడం మనందరికీ అనుభవంలో ఉన్నదే. అదే తాను వెళ్ళవలసిన మార్గానికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంటే మాత్రం ఎంతో శ్రమపడి మరీ తన ప్రయాణాన్ని ఆపి, దిశను మార్చుకొని ముందుకు సాగవలసి ఉంటుంది. అందువలన ఎప్పటికప్పుడు మనం వెళ్ళేది వెలుగు వైపుకా, లేక చీకటి వైపుకా? అని మనను మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగాలి. అలా మన దిశను మార్చి వెలుగు వైపుకు నడిపించటానికే గురువులు మనను గ్రహణసమయంలో తప్పనిసరిగా ధ్యానం చెయ్యమని చెబుతారు. అంటే ఎప్పుడెప్పుడైతే మన మనస్సు బుద్ధిని అనుసరించకుండా దేహానికి లొంగిపోతూ ఉంటుందో అప్పుడప్పుడు మనం ధ్యానం చెయ్యాలన్నమాట. ఈ మాటను మాటిమాటికి గుర్తు చేయడానికే మన హిందూ సంప్రదాయంలో ఉత్తరాయణంలో కన్నా దక్షిణాయణంలోనే చాలా ఎక్కువ పండుగలు ఉంటాయి. అంతేగాని ఆ జ్ఞానాన్ని సంపాదించకుండా దేహాన్ని ఉత్తరాయణంలో విడిచిపెట్టినా, లేక దక్షిణాయణంలో విడిచిపెట్టినా పెద్ద తేడా ఏమీ ఉండదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి