11, జులై 2019, గురువారం

మార్పు

మనం ప్రతిరోజూ వింటూ ఉంటాం - లోకం అంతా మారిపోయింది. మా రోజుల్లోనే చాలా బాగుండేది. ఇప్పటివాళ్ళు అప్పటిలా దుస్తులు వేసుకోవట్లేదు, అప్పటి భాష మాట్లాడట్లేదు, అప్పటి తిండి తినట్లేదు, అప్పటిలా ఇంటిపట్టున ఉండట్లేదు, ఇలా రకరకాలుగా పాత కాలమంతా స్వర్ణయుగమని ఇప్పటివాళ్ళకి పోయేకాలమని అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం ఇంకొకటి కూడా అప్పుడప్పుడూ వింటూ ఉంటాం - Change is the only constant thing in this world అని. అంటే ఈ ప్రపంచంలో మార్పు ఒక్కటే శాశ్వతమైనది అన్నమాట.

నిజానికి ఏ మార్పు లేకుండా ఉండేది సకల చరాచర సృష్టిలో కూటస్థ చైతన్య పరబ్రహ్మ రూపంలో ఉండే ఆ పరమాత్మ వస్తువు ఒక్కటే. ప్రపంచం అంతా నిత్యం మారిపోతూ ఉండేదే. యద్దృశ్యం తన్నశ్యం. ఏది కనబడుతుందో అది మాయమైపోతుంది. ఒకప్పుడు పెద్ద కుటుంబంలో అందరూ ఒకే ఇంట్లో జీవిస్తూ కనబడేవారు. అది మాయమై చిన్న కుటుంబాలు వచ్చాయి. కొన్నాళ్ళకు ఇవి కూడా మాయమైపోతాయి. ఒకప్పుడు ఎవరి ఊరిలో వారు ఉంటూ ఏ శుభకార్యాలకో, అశుభ కార్యాలకో ఒకసారి ప్రయాణాలు చేసేవారు. ఇప్పుడు అడుగు బయటపెడితే ఎక్కడ చూసినా ప్రయాణాలు చేసే జనమే విపరీతంగా కనిపిస్తున్నారు. కొన్నాళ్ళకి ఇది కూడా మారిపోతుంది, ఇంకొకటి వస్తుంది. ఒకప్పుడు ఉత్తరాలు వ్రాసుకొనేవారు. ఇప్పుడు SMSలు, WhatsApp messageలు వచ్చాయి. మరికొంత కాలానికి ఇది మారిపోయి ఇంకొకటి వస్తుంది. ఒకప్పుడు ఇంట్లో ఆడవాళ్లు అందరూ కలిసి ఇంటిపని, వంటపని చేసుకొనేవారు. ఇప్పుడు అందరూ తలకొక గదిలో కూర్చొని వారివారికి ఇష్టమైన సీరియళ్లు చూస్తున్నారు.

ఇలా ఒకటి మారి ఇంకొకటి రావడం లోకరీతి. చివరికి ఇందాక చెప్పుకున్న మార్పులేని పరబ్రహ్మమే అవతారం ధరించి వచ్చినప్పుడు ఆయన శరీరంలోనూ మార్పులొస్తున్నాయి, చివరికి కనిపించకుండా కూడా పోతోంది. అంతెందుకు? రామావతార సమయానికి, కృష్ణావతార సమయానికి వ్యవహార శైలిలో ఎంత మార్పు వచ్చింది? ఈ మార్పును స్వాగతిస్తూనే ఇలా నిత్యమూ మారిపోతూ ఉండే ప్రపంచం వెనుక మారకుండా ఉండి సమస్తాన్ని నడిపించే శక్తి ఒకటి ఉన్నదని గుర్తించడమే మనం చేయవలసింది. అప్పుడే మనం ఈ మార్పులను హుందాగా స్వీకరిస్తూ, వాటివలన ఉద్వేగానికి గురికాకుండా స్థితప్రజ్ఞతను చూపగలుగుతాం.

అసలు ఈ ప్రపంచంలోని నిరంతరం మారిపోయే స్వభావాన్ని అంగీకరించలేక పోతున్నామంటే సాధన చతుష్టయ సంపత్తిలో మొట్టమొదటిదైన నిత్యానిత్య వస్తు వివేకం మనకింకా అలవడలేదన్నమాట. ఈ ప్రపంచంలో మనం చూసే ఏ ఒక్కటీ నిత్యం కాదు, ప్రతిదీ మారిపోయేదే అని, పరమాత్మ ఒక్కడే మార్పులేని నిత్య సత్య స్వరూపుడని ముందుగా మనం రూఢిగా తెలుసుకుంటేనే ఇహలోకంలో, పరలోకంలో కనిపించే సుఖభోగాలన్నింటిపైనా వైరాగ్యం - ఇహాఽముత్రార్థ ఫలభోగ విరాగం - అనే రెండో సాధన సంపత్తి మనకు అలవడుతుంది. కాబట్టి కొత్తొక వింత పాతొక రోత అనడం ఎంత తప్పో, పాత అంతా మంచి, కొత్త అంతా చెడు అనుకోవడం కూడా అంటే తప్పు. మార్పులను హుందాగా స్వీకరిస్తూ, ప్రతిదానిలో మంచిని గ్రహిస్తూ, ఆచరిస్తూ, చెడును వదిలేస్తూ ముందుకు సాగినప్పుడే మన సాధన కూడా ముందుకు సాగుతుంది. మార్పును స్వీకరించలేనప్పుడు ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా కూడా బావిలో కప్పల్లాగా ఎక్కడి వాళ్ళం అక్కడే ఉండిపోతాం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి