నరేష్: సంక్రాంతి శుభాకాంక్షలు అన్నా!
సురేష్: నీకు కూడా నరేష్! అసలు ప్రతినెలా సంక్రాంతి వస్తుంది తెలుసా? ఇవాళ వచ్చింది, మనం ప్రముఖంగా జరుపుకునేది మకర సంక్రాంతి.
న: అసలు సంక్రాంతి అంటే ఏంటన్నా?
సు: సూర్యుడు కానీ, నవగ్రహాలలో మరేదైనా గ్రహం కానీ ఒక రాశి నుండి మరొక రాశికి మారడాన్ని సంక్రాంతి అని, క్రాంతి అని, కార్తె అని అంటారు. ఇందులో సూర్యుడు మనకు అతి ముఖ్యుడు కదా! ఆయన మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అందుకే మనం ఈ మకర సంక్రాంతిని పెద్ద పండుగ అని గొప్ప ఉత్సవంగా జరుపుకుంటాం. అసలు మన పురాణాలలో మకరం ఎక్కడ కనిపిస్తుంది చెప్పు నరేష్.
న: నాకు గుర్తుంది అన్నా! గజేంద్ర మోక్షంలో ఏనుగును పట్టుకొన్నది మొసలే కదా.
సు: అవును. నిజానికి మనం గజేంద్ర మోక్షం అంటాం కానీ, విష్ణుమూర్తి గజేంద్రునికి కేవలం మొసలి బారినుండి విముక్తి కలిగించాడు కానీ, ఆ మొసలికి మాత్రం ఆయన చేతిలో, సుదర్శన చక్రంతో మరణించడంతో ఏకంగా ఈ సంసారం నుండే మోక్షం లభించింది కదా!
న: అవును, ఆలోచిస్తుంటే నాకు ఒకటి అనిపిస్తోంది. విష్ణుమూర్తికి ఏనుగు కన్నా మొసలి అంటేనే పక్షపాతం అని. ఎంతైనా ఏనుగు జరాయుజం(తల్లి గర్భంలో ఉండి, మావి నుండి పుట్టినది), మొసలి అండజం(గుడ్డు నుండి పుట్టినది) కదా!
సు: అయితే!?
న: అదే అన్నా! ఆయన అండజ(గరుడ) వాహనుడు, అండజ(ఆదిశేష) శయనుడు కదా! పైగా మకరకుండలధారి కూడానూ!
సు: అదేం లేదు. ఆయనకు సర్వ జీవులు సమానమే. సమోహం సర్వ భూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః - నేను సర్వ భూతములయందు సమదృష్టి కలిగి ఉంటాను. నేను ద్వేషించే వారుకాని, ప్రేమించే వారుకాని ప్రత్యేకంగా ఎవరూ లేరు, అని భగవద్గీతలో ఆ స్వామే చెప్పారు కదా!
న: అవుననుకో కానీ మళ్ళీ ఆయనే భక్తియోగంలో యో మద్భక్త స్స మే ప్రియః అని రెండుసార్లు, ఇంకా స చ మే ప్రియః, భక్తిమాన్యః స మే ప్రియః, భక్తిమాన్మే ప్రియో నరః, భక్తాస్తేఽతీవ మే ప్రియాః అని నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు అని ఇన్నిసార్లు చెప్పాడు కదా!
సు: అదే ఇక్కడ కిటుకు. గాలి మన చుట్టూ అంతటా వ్యాపించి ఉన్నా ఫ్యాను కిందనే మనకు బాగా అనుభవంలోకి వచ్చినట్లు, పరమాత్మ అంతటా సమానంగానే ప్రకాశిస్తున్నా భక్తానాం హృదయాంబోజే విశేషేణ ప్రకాశతే - భక్తుల హృదయ కమలాలలో విశేషంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనను పట్టుకోవాలంటే ముందు భాగవతులను పట్టుకోవాలి. అక్కడ ఆ మొసలి చేసినది అదే. అందుకే దానికి మోక్షం లభించింది.
న: అదేంటి అది భాగవతుడిని హింసించింది కదా?
సు: ఒక్కసారి ఆలోచించు. నారాయణమూర్తి వచ్చేముందు ఆ మొసలి, ఏనుగు వెయ్యి సంవత్సరాలు పోరాడాయి. ఏనుగుకు అయితే అది జీవన్మరణ సమస్య కాబట్టి విడవకుండా పోరాడింది. మరి మొసలికి ఏమవసరం? ఈ ఏనుగు కాకపోతే ఇంకో పీనుగు, తన కడుపు నింపుకోవడానికి ఏదో ఒక జంతువు దొరక్కపోదు. ఈ ఏనుగుకు ఉన్నట్లుగానే ఆ మొసలికి కూడా భార్య, పిల్లలు ఉండి ఉంటారు కదా! వాళ్ళందరూ ఈ వెయ్యి సంవత్సరాలో ఎన్నోసార్లు వచ్చి "ఎందుకండీ మీకు ఇంత మొండిపట్టు? నిద్రాహారాలు మాని ఇన్నేళ్ళనుంచి ఆ ఏనుగు పాదాన్ని పట్టుకొని ఉండకపోతే వదిలేసి ఇంకొక వేట ఏదైనా చూసుకోవచ్చు కదా!" అని ఎన్నిసార్లు నచ్చచెప్పి ఉంటారు? అయినా ఆ మొసలి తన పట్టుదలను వదిలిపెట్టలేదు. "బలమైన పట్టుదలే వైరాగ్యం" అని శ్రీ బాబూజీ మహరాజ్ వారు ఎన్నోసార్లు చెప్పారు కదా! భక్తి, జ్ఞానము కలగాలంటే ముందు మనకు ఈ వైరాగ్యం ఉండాలి. మనందరినీ అటువంటి మొసలిపట్టు లాంటి అంతటి బలమైన వైరాగ్యాన్ని పెంపొందించుకోమని ఈ మకర సంక్రాంతి సూచిస్తోంది.
న: నిజమే అన్నా! మరి విష్ణుమూర్తి మకర కుండలాలు ధరించడంలో రహస్యం ఏమిటో కాస్త చెప్పరాదూ.
సు: విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం. అది మకర రాశిలో ఉంటుంది కాబట్టి ఆ రెండింటినీ గుర్తుచేస్తూ ఆయన శ్రవణేంద్రియాలకు మకర కుండలాలు ధరిస్తాడని పైపై అర్థం చెబుతారు. కానీ, సన్న్యస్య శ్రవణం కుర్యాత్ అని ఋషి వాక్యం. శ్రవణం చేసేటప్పుడు ఇతర విషయాలన్నింటినీ సన్యసించి శ్రవణం చెయ్యాలి. అటువంటి వైరాగ్యంతో, పట్టుదలతో శ్రవణం చేసినప్పుడే అది మళ్ళీ మననానికి వచ్చి నిదిధ్యాసకు నిన్ను తీసుకెళ్తుంది కానీ సత్సంగంలో కూర్చున్నంత సేపు వచ్చిపోయే వాళ్ళను చూస్తూ, గోళ్ళు కొరుక్కుంటూ, మరేదో చేస్తూ వింటే అది నీ చెవికెక్కదు, మనసుకు అసలే పట్టదు. ఈ విషయాన్ని మనకు తెలియజెప్పడానికే నారాయణుడు తన చెవులకు మకర కుండలాలను ధరిస్తాడు.
న: ధన్యవాదాలు అన్నా! భక్తి జ్ఞానాలు కలగాలన్నా, విన్న ఆధ్యాత్మిక విషయాలు వంటబట్టాలన్నా మకరం లాంటి పట్టుదల, వైరాగ్యం ఎంత అవసరమో చక్కగా వివరించావు. నీకు మీ కుటుంబ సభ్యులకు మరొక్కసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు! ఈ సందర్భంగా ఇటువంటి వైరాగ్యాన్ని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిద్దాం.