28, డిసెంబర్ 2024, శనివారం

భీమవరం

    భీమ అంటే భయంకరమైన అనే అర్థమే కాకుండా ఈ జగత్తుకంతటికీ జననీ జనకులైన పార్వతీ పరమేశ్వరులిద్దరికీ భీమ నామధేయం వర్తిస్తుంది. ఆ పరమేశ్వరుడే భీమవరంలో శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ సోమేశ్వర స్వామివార్లుగా వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. అలా పంచారామ క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న భీమవరంలో జగన్మాత శ్రీ మావుళ్ళమ్మగా వెలసి పూజలందుకుంటోంది. మనస్సుకు అధిపతియైన చంద్రునిచే ప్రతిష్టింపబడిన శ్రీ సోమేశ్వర స్వామి పౌర్ణమినాడు నిండు వెన్నెలలు కురుస్తూ ధవళవర్ణంలో ప్రకాశిస్తూ, ఒక్కొక్క రోజు గడుస్తున్నకొద్దీ మెల్లగా కాంతి తగ్గించుకొని అమావాస్యనాటికి నల్లగా మారిపోతారు. మళ్ళీ ఒక్కొక్కరోజూ కాంతిని పెంచుకొంటూ పౌర్ణమి నాటికి పూర్తి తెల్లదనాన్ని సంతరించుకుంటారు. ఇలా భగవద్గీతలో స్వామి చెప్పిన శుక్ల కృష్ణ గతులను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ పునరావృత్తి రహిత స్థితిని పొందాలంటే శుక్లమార్గమైన ఆధ్యాత్మిక పథంలో ప్రయాణించాలని మనకు సూచిస్తూ ఉంటారు.

    అలాగే మావుళ్ళమ్మ తల్లి సన్నిధిలో సాధన చేసి శ్రీ చల్లా కృష్ణమూర్తి గారు, శ్రీ తనికెళ్ళ చలపతిరావు గారు వంటి సాధకులు ఎన్నెన్నో దివ్యానుభూతులను పొందారు. తనను పొందాలని ఎన్నో కోట్ల సంవత్సరాలనుండి ఎందరో సాధకులు తలక్రిందులుగా తపస్సులు చేస్తుంటే 'నేనూ మీలో ఒకడినేరా!' అన్నట్లుగా ఆ జగత్పిత భీమవరం సమీపంలోని యనమదుర్రు గ్రామంలో శీర్షాసనంలో పద్మాసనం వేసుకొని వెలిశారు. ఆయనకు తోడుగా లోకాలనేలే జగన్మాత పచ్చి బాలింతరాలుగా కుమారస్వామిని ఒడిలో ఉంచుకొని తన జ్ఞాన క్షీరాలను ప్రసాదిస్తూ వెలసింది. ఇటువంటి పవిత్ర భూమిలో ఉన్న ఎందరో సాధకులను, జిజ్ఞాసులను, ఆర్తులను ఉద్ధరించి భీమ భవార్ణవం (భయంకరమైన సంసార సాగరం) దాటించి తరింపజేయడానికి ఆ జగజ్జననీ జనకులిద్దరూ ఒకే రూపాన్ని ధరించి మానవాకృతిలో 'సమర్థ సద్గురు శ్రీ శ్రీ శ్రీ హనుమత్కాళీ వర ప్రసాద బాబూజీ మహరాజ్'గా ఈ ప్రాంతంలో కొన్ని దశాబ్దాలపాటు సంచరించి ఈ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా మార్చారు.

    సర్వాధిష్టాన చైతన్య స్వరూపులైన శ్రీగురుదేవులు ఎవరెవరి ఆధ్యాత్మిక స్థాయికి తగ్గట్లుగా వారికి మార్గాన్ని ఉపదేశించి వారి వారి సాధనలో తోడునీడగా ఉంటూ తరింపజేశారు. శ్రీ కందర్ప పరశురామయ్య గారు (యనమదుర్రు),  శ్రీ లలితానంద సరస్వతీ స్వామిని వారు, శ్రీ కొప్పెర్ల వెంకటరాజు గారు (పెదనిండ్రకొలను), శ్రీమతి యర్రాప్రగడ శేష(గిర)మ్మగారు (భీమవరం తాతయ్యగారి పెద్ద కుమార్తె) వంటి సిద్ధ పురుషులతో తత్వ విచారణ చేసేవారు. శ్రీ విఠాల కామయ్య శాస్త్రిగారు (కోరుకొల్లు), శ్రీ చల్లా కృష్ణమూర్తి గారు, శ్రీ కలిదిండి నరసింహ రాజుగారు (దిరుసుమర్రు), శ్రీ తనికెళ్ళ చలపతి రావుగారు వంటి సాధకులకు వారు స్మరించినప్పుడల్లా దర్శనమిచ్చి మార్గదర్శనం చేసేవారు. ఏ ఆధ్యాత్మిక గంధమూ లేని భీమవరం తాతయ్య (శ్రీ పాలూరి శ్రీరామమూర్తి)గారి వంటి వారిని నిరంతరం నవ్విస్తూ, చక్కిలిగింతలు పెడుతూనే పరమమైన బ్రహ్మానందాన్ని అనుభవంలోకి తెచ్చేవారు. ఏ మంత్రాలు రాని పాలూరి సీతమ్మగారికి 'పాటల పూజ'తోనే దివ్యానుభవాలను ఎన్నెన్నో ప్రసాదించారు.

    తమను అవమానించాలని చూసిన ఎందరో ధూర్తులకు కళ్ళు తెరిపించి సన్మార్గంలో పెట్టారు. చివరికి ఈ ఊరిలోని రిక్షావారితో కూడా పావలా నుండి పదిపైసల వరకు బేరాలాడుతూ ఆ వంకతో వారితో ఎంతో దూరం కలిసి నడుస్తూ భగవత్సన్నిధిలో కలిగే ఆనందాన్ని వారికి తెలియకుండానే వారితో అనుభవింపజేశారు. నిత్యం తమ దర్శనార్థమై వచ్చే ఎందరో భక్తుల రకరకాల సంసార విషయిక ఆర్తులను తీర్చి వారికి ఉపశాంతి, మార్గదర్శనం చేశారు. బృందావనంలో శ్రీకృష్ణుడు చూపించిన దివ్య లీలలన్నీ ఇక్కడ చూపించారు. ఇలా భీమవరం ప్రాంతంలోని ఎందరో భక్తుల ఎన్నెన్నో జన్మలనుండి కించిత్ కించిత్‌గా పోగుపడి రాశీభూతమైన పుణ్యఫలాన్ని ఈ జన్మలో అనుభవంలోనికి తీసుకొని రావడానికై తమకు తాముగా ఆ పరబ్రహ్మమే ఆకారం దాల్చి తరలి వచ్చిన గొప్ప వరం శ్రీగురుదేవులు.

    అట్టి దయామయులైన శ్రీగురుదేవులు గుంటూరు జిల్లా నంబూరు సమీపంలో శ్రీ కాళీ వనాశ్రమాన్ని స్థాపించిన తరువాత కూడా ఈ భీమవరం ప్రాంతం పైనున్న వారి దివ్య వాత్సల్యాన్ని ప్రకటిస్తూ తమకు తాముగా శ్రీ భీమవరం తాతయ్యగారి కుటుంబం నుండి 'ఉండి' రోడ్డులోని కొంత స్థలాన్ని అడిగి తీసుకొని అక్కడ మరొక ఆశ్రమాన్ని స్థాపించాలని సంకల్పించారు. సత్య సంకల్పులైన శ్రీవారి దివ్య సంకల్పం ఇన్నాళ్ళకు ఫలించి భవ్యమైన బృందావనంగా శ్రీగురుదేవుల, దివ్యమంగళ మూర్తితో, అలాగే శ్రీకాళీ వనాశ్రమంలో వెలసిన ఇతర దేవతల ఉపాలయాలతో, అన్నదాన, వసతి భవనాలతో సర్వాంగ సుందరంగా రూపు దిద్దుకుంటోంది.

    2025 మార్చి 12వ తేదీన ఆశ్రమ ప్రవేశము, అనంతరం హోమాలు, అధివాసాలు, సామూహిక పూజలు, పారాయణలు, సత్సంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటూ 17వ తేదీన శ్రీగురుదేవుల, ఇతర దేవతామూర్తుల ప్రతిష్టా మహోత్సవం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఆస్తిక మహాశయులందరూ విచ్చేసి, పాల్గొని, ఆ మహదానందంలో భాగస్వాములై తరించాలని, భీమవరానికి లభించిన ఇట్టి మహత్తర వరాన్ని సద్వినియోగ పరచుకోవాలని అందరికీ ఇదే ఆహ్వానం.

15, డిసెంబర్ 2024, ఆదివారం

మేలుకొలుపు

 

    పూర్వకాలపు కథలలో కానీ, సినిమాలలో కానీ మనం చూస్తే ప్రతి ఇంటిలో ముందుగా ఆ ఇంటి ఇల్లాలు నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి, వంట చేసి అప్పుడు భర్తను మేలుకొలపడం కనిపిస్తుంది. "తరుణి సీతమ తల్లి గృహవిధుల మునిగింది, తిరిగి శయనించేవు మర్యాద కాదయ్య, మేలుకో శ్రీరామా!" అని మనకు పాట కూడా ఉంది. అలాగే మన పురాణాలలో గమనిస్తే రాక్షసులు అందరూ కేవలం స్వార్థంతో తమకు శక్తి రావాలనో, మరణం రాకూడదనో వరాల కోసం తీవ్ర తపస్సులు చేశారు కానీ, వారి భార్యలు మాత్రం పతివ్రతలై తమ భర్త బాగు కోసం వ్రతాలు ఆచరించేవారు. వారి పాతివ్రత్య ఫలితంగా ఆ రాక్షసులు అజేయులై నిలిచేవారు. త్రిపురాసురులు, జలంధరుడు వంటి రాక్షసులను మహాదేవుడు సంహరించాలంటే విష్ణుమూర్తి వారి భార్యలను ఏమార్చవలసి వచ్చేది. అందుకు ఆయన శాపాలను కూడా పొందవలసి వచ్చింది. స్త్రీమూర్తుల నిస్వార్థ సాధన యొక్క శక్తి అంతటి గొప్పది.

    పూజ, ఆరాధన, సాధన, పుష్ప, హారతి, కీర్తన, నివేదిత, సింధూర, అక్షత ఇలా పూజలకు సంబంధించిన పేర్లన్నీ ఆడ పేర్లే! వాటి ఫలితానికి సంబంధించిన తీర్థ్, ప్రసాద్ మాత్రం మగ పేర్లు. కేవలం నీళ్ళు పోయడం తప్ప ఇంకే కష్టమూ లేని అభిషేక్ మాత్రం మగవారు ఉంచుకున్నారు లెండి. ఇలా పుణ్యకర్మలన్నీ ఆడవారు చేస్తే ఫలితం మాత్రం మగవారు అనుభవిస్తున్నారు. అయితే మన శ్రీకాళీ వనాశ్రమంలోని ఆలయంలో ప్రతిరోజూ ముందుగా శ్రీ రామలింగేశ్వర స్వామివారిని మేల్కొలిపి ఆ తరువాతే జగన్మాత శ్రీ మహా కాళికా పరమేశ్వరీ దేవిని మేల్కొలపడం జరుగుతుంది. అమ్మ ఈ దృశ్యమాన జగత్తుకు ప్రతీక అయితే పరమేశ్వరుడు అందులో కూటస్థుడై జగత్తును నడిపించే చైతన్య స్వరూపుడు. ముందుగా మనలోని చైతన్యం మేల్కొంటేనే కదా ఈ శరీరం నిద్ర లేచేది.

    ఈ కాలంలో చాలా కుటుంబాలలో మనుషులు తగ్గి, ఉరుకు పరుగుల జీవనం పెరిగాక స్త్రీపురుషులిద్దరూ ఒకేసారి లేచి, తయారై పరుగులు పెడుతున్నారు. మన ఆచారాల ప్రకారం పురుషుడు పూజలో, హోమాలో చేసేటప్పుడు స్త్రీ ప్రక్కన లేకపోయినా, "ధర్మపత్నీ సమేతస్య" అని సంకల్పం చెప్పుకోవడం, ఆ పుణ్యకార్యంలో భార్యకు కూడా వాటా రావడం కద్దు. కానీ స్త్రీలు చేసే వ్రతాలు, పూజలు మాత్రం చాలావరకు తమ భర్త, కుటుంబ క్షేమం కోసం, లేదా మంచి భర్త రావడం కోసమో ఉంటాయి.

    బాహ్య ప్రాపంచిక ఫలాల కోసం చేసే పుణ్య కార్యాలలో ఇలా ఒకరి కర్మఫలం ఇంకొకరికి పంచడం సాధ్యం అవుతుంది కానీ ఆధ్యాత్మిక సాధనలో మాత్రం ఇలా పంచుకోవడం కుదరదు. ఎవరి సాధన వారిదే. అందులో ఎవరి పురోగతి వారిదే. "ఉద్ధరేదాత్మనాత్మానం". ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉదాహరణకి ఒక తండ్రి కష్టపడి సంపాదించి ఒక యిల్లో పొలమో కొన్నాడనుకోండి అది ఏ కష్టము లేకుండానే అతని కుమారుడికి సంక్రమిస్తుంది కదా! కానీ తండ్రికి ఆకలి వేసి కడుపునిండా భోజనం చేస్తే అది కుమారుడికి సంక్రమిస్తుందా? లేదు! ఎందుకంటే అది బయటి వస్తువు కాదు. ఆకలి తీరడం అనేది ఎవరికి వారికే సొంతమైనది.

    మన చిన్నప్పుడు ఒక చాక్లెట్ వ్యాపార ప్రకటనలో పిల్లవాడు అందరినీ "మెలోడీ ఇంత చాక్లెటీ ఎలా అయ్యింది?" అని అడుగుతూ ఉంటాడు. చివరికి వేరొక పిల్లవాడు "మెలోడీ తిను, నువ్వే తెలుసుకో!" అంటాడు. అలాగే ముక్తి కూడా అనుభవైకవేద్యమే కానీ వేరొకరు చెబితేనో, చూస్తేనో, చదివితేనో తెలిసేది కాదు. ఆకలి తీరడం, జ్వరం రావడం మొదలైనవి ఎలా అయితే ఎవరికి వారే అనుభవిస్తారో, ఒకరి అనుభవం ఇంకొకరికి తెలియదో అలాగే ఆధ్యాత్మిక సాధన ద్వారా పొందే  ముక్తి కూడా ఎవరికి వారు పొందవలసిందే, అనుభవించ వలసిందే.

    మనం 2024 సంవత్సరానికి స్వస్తి పలికి 2025లో అడుగు పెడుతున్నాం. 2025లో అంకెలన్నీ కూడితే 9 వస్తుంది. అలాగే తొమ్మిది చిల్లుల తిత్తి అయిన ఈ మానవ దేహంలో నుండి ప్రాణవాయువులు జారిపోక ముందే మనం మేల్కొని సాధనలో పురోగతిని సాధించాలని, అటువంటి మేలుకొలుపు మనందరికీ కలిగించాలని శ్రీగురుదేవులను ప్రార్థిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!