15, ఆగస్టు 2024, గురువారం

శ్రీపాద విచలిత క్షీరాంబు రాశి

    సప్తపది సినిమాలో ముగురమ్మలను కీర్తిస్తూ వేటూరి వారు వ్రాసిన అఖిలాండేశ్వరి పాటలో లక్ష్మీదేవిని వర్ణిస్తూ శ్రీపాద విచలిత క్షీరాంబు రాశి అంటారు. అమ్మ పాదం తాకితే అంత ప్రశాంతంగా ఉండే క్షీరసాగరం అంతా అల్లకల్లోలమై ఉప్పొంగిపోతుందిట. అంతటి శక్తి స్వరూపిణి అమ్మ. ఎంతటి మహాశక్తి తనకున్నా తన భర్త అయిన శ్రీహరి హృదయంలో ఒదిగిపోయి నిరంతరం ఆయన పాదసేవ చేస్తూ ఉంటుంది. అందుకే అమ్మ శ్రీహరి ప్రణయాంబు రాశి. 

    జగన్మాత ప్రకృతి స్వరూపిణి కదా. ప్రకృతిలోని పంచ మహాభూతలలో ఏ ఒక్కటి తన పరిధిని దాటినా జరిగే విపత్కర పరిణామాలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం కదా! భూకంపాలు, వరదలు, సౌర తుఫానులు ఇలా ప్రకృతిలో ఏ చిన్న మార్పు సంభవించినా అది లక్షలాది మానవుల, ఇతర జీవరాశుల వినాశానికి దారి తీస్తుంది. పైకి ఎంతో శాంతంగా కనిపించినా ప్రకృతి నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. అందుకే అమ్మ నామాలలో చంచల, చపల వంటి నామాలు ఉంటాయి. అయితే స్థితి కారకుడైన శ్రీహరి తన అవ్యాజమైన ప్రేమతో అనంతశక్తి సంపన్నురాలైన ప్రకృతిమాతను అదుపులో పెడుతూ మహాప్రళయం రాకుండా కాపాడుతూ ఉంటాడు. అందుకే అమ్మ ఇక్కడ శ్రీహరి ప్రణయాంబు రాశి.

    మరో కోణంలో ఆలోచిస్తే లక్ష్మీదేవి క్షీరసముద్రరాజ తనయ. సాధారణంగా మన ఇళ్ళలో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అంటారు. అటువంటి ముద్దులొలికే పసిపాప కొంచెం పెద్దదై, తండ్రి ఆ పాపను తన రెండు చేతులతో ఎత్తుకొంటే, తన లేలేత పాదాలతో ఆ తండ్రి గుండెలపై బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటే ఆ తండ్రి హృదయం ఎంతగా పులకించి పొంగిపోతుంది? అటువంటిది మరి సాక్షాత్తూ మహాలక్ష్మీ దేవియే తన కుమార్తెయై, తన ఇంటనే కాపురం పెట్టి తన గుండెలపై మృదువుగా అడుగులు వేస్తూ ఉంటే ఆ తండ్రి హృదయం ఎంతగా ఉప్పొంగిపోతుంది? అందుకే ఆ తల్లి శ్రీపాద విచలిత క్షీరాంబు రాశి.

    పేదరికంలోనో, దిగువ మధ్యతరగతిలోనో జీవనం గడిపే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఒకే చోట కలిసిమెలిసి నివసిస్తూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వారిల్లు క్షీరసాగరం లాగే ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారి అనుకోకుండా వారింట్లో సలలితముగ నారికేళ సలిలము భంగి సిరి ప్రవేశించిందంటే ఇక ఎక్కడలేని గొడవలు మొదలవుతాయి. ఆ సంసారం అల్లకల్లోలం అయిపోతుంది. అప్పటిదాకా కలసిమెలసి ఉన్నవారు వేరుకాపురాలు పెడతారు. ఉన్న కాస్త పదార్థాన్ని పంచుకు తిన్నవారు ఇప్పుడు సంపదలో వాటాలకు కొట్టుకు చస్తారు. అందుకే సిరి శ్రీపాద విచలిత క్షీరాంబు రాశి. The gods must be crazy అనే ఆంగ్ల చిత్రంలో నాగరిక వాసన అంటని ఒక అమాయకపు తెగ అడవులలో నివసిస్తూ ఉంటుంది. అందరూ కలసి ఆహారాన్ని సంపాదించుకుంటూ, దొరికిన దానిని పంచుకొని తింటూ ఉంటారు. ఒకనాడు పైనుంచి విమానంలో వెళ్తున్న వ్యక్తి ఒక గాజు సీసాను వీరు నివసించే ప్రదేశంలో పడవేస్తాడు. అది మనకు దేవుడే ఇచ్చాడని నమ్మిన ఆ తెగ ప్రజలు, దానిని అనేక రకాలుగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఆ అపురూపమైన వస్తువు నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకుంటూ ఉంటారు. ప్రశాంతమైన తమ జీవనంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఈ కానుక మాకొద్దు అని నిర్ణయించుకొని అందులో ఒకడు భూమి చివరి అంచుకు చేరుకొని దీనిని మళ్ళీ ఆ దేవుళ్ళకే తిరిగి ఇచ్చేద్దామని బయలుదేరుతాడు. హృదయంలో శ్రీహరిని నింపుకోకుండా కేవలం లక్ష్మీ అనుగ్రహాన్ని మాత్రమే పొందితే జీవితం ఇలాగే అల్లకల్లోలమైపోతుంది. శ్రీహరి ప్రణయాంబు రాశి గానే అమ్మను గ్రహిస్తే వారిద్దరూ కొలువైన మన హృదయం పాలసముద్రంలాగే స్వచ్ఛంగా ఉండి జీవితం ప్రశాంతంగా గడుస్తుంది.

    మానవుడు పుట్టినపుడు అతని మనస్సు క్షీరసాగరంలా స్వచ్చంగానే ఉంటుంది. నిరంతరం తనలో తాను రమిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. అయితే అటువంటి శిశువుకు మెల్లగా తల్లిదండ్రులూ బంధువులూ ఒక పేరును ఆపాదించి, ఒక్కొక్క వస్తువునూ బొమ్మనూ 'ఇది నీది, ఇది నీది' అని ప్రేరేపిస్తూ ఉంటారు. ముందు పెద్దగా పట్టించుకోడు. తన చేతిలో ఉన్నదేదైనా ఎవరడిగినా ఇచ్చేస్తూ ఉంటాడు. అయితే మెల్లమెల్లగా ఈ వస్తువులతో సాన్నిహిత్యం పెరిగినకొద్దీ జగన్మాత మహామాయా స్వరూపిణియై ఆ పసివానిలో ఆ వస్తువులపట్ల సంగాన్ని పెంపొందిస్తుంది. అప్పుడు ఇక అహంకార మమకారాలు, రాగద్వేషాలు, ఈర్ష్యాసూయలు ప్రవేశించి ప్రశాంతమైన ఆ మానవుని మనస్సుని అల్లకల్లోలం చేస్తాయి. శ్రీపాద విచలిత క్షీరాంబు రాశి. అయితే బయటి విషయాలు తనను ఎంతగా ప్రభావితం చేయాలని చూసినా, తల్లి గర్భంలో తాను నిరంతరం అనుసంధానమై ఉన్న శ్రీహరిని మరువక చిత్తంలో నిలుపుకొంటే అప్పుడు శ్రీహరి ప్రణయాంబు రాశి అయిన అమ్మ అత్యంత పతిభక్తి కలది కాబట్టి ఆ మనస్సును విచలితం కాకుండా కాపాడి, పారమార్థికానికీ వ్యావహారికానికీ మధ్య ఊగిసలాడుతూ డోలాయమానమైన మనస్సుకు స్థిరత్వాన్ని ప్రసాదించి, ఆధ్యాత్మిక సాధనను వృద్ధి పరచి శ్రీపీఠమైన సహస్రారాన్ని చేరుకొనేలా సహకరిస్తుంది. అందుకే ఇక్కడ అమ్మ శ్రీపీఠ సంవర్ధని, డోలాసుర మర్ధిని.

జగన్మాత లక్ష్మీదేవిని మనం కేవలం వరాలిచ్చే వరలక్ష్మిగానో, ధనాన్ని ఇచ్చే ధనలక్ష్మిగానో చూడకూడదు. ఆ తల్లి మనకు ఆధ్యాత్మిక సాధనకు కావలసిన తెలివిని ఇచ్చే విద్యాలక్ష్మి. సాధనలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకులను దాటి ముందుకు వెళ్ళే ధైర్యాన్నిచ్చే ధైర్యలక్ష్మి. అంతశ్శత్రు సంహారం చేసే వీర్యలక్ష్మి. మన భక్తికి ఫలంగా జ్ఞానపుత్రుని ప్రసాదించే సంతానలక్ష్మి. సాధనలో విజయాన్ని చేకూర్చే విజయలక్ష్మి. మనకు ఆహారాన్ని అందించే ధాన్యలక్ష్మి. చివరికి మనను ఇహంలోనే పరమపదానికి చేర్చే మోక్షలక్ష్మి. అటువంటి అమ్మను మనసారా ధ్యానిస్తూ నిరంతరం లక్ష్మీనారాయణులను మన హృదయంలో నిలుపుకొంటే ఇక మనకు ఇహపరాలలో ఏ లోటూ ఉండదు.

5, ఆగస్టు 2024, సోమవారం

ముక్తి

    వైష్ణవ సంప్రదాయంలో ముక్తిని నాలుగు అంచెలుగా వర్ణించారు. ఈ భూలోకంలో జీవించినన్నాళ్ళు శ్రీమహావిష్ణువుపై అనన్య భక్తిని కలిగి ఉండి, మరణించిన తరువాత వైకుంఠాన్ని చేరడం ఇందులో మొదటి మెట్టయిన సాలోక్య ముక్తి. అంటే స్వామి ఉన్న లోకంలోనే మనమూ నివసించడం. ఇక దాని పైమెట్టు సామీప్యం - అంటే ఆ లోకంలో ఎక్కడో దూరంగా ఉండటం కాకుండా స్వామివారికి అతి దగ్గరలో ఆంతరంగిక సేవకునిగా మెలగడం. ఇక అలా సేవించుకున్న ఫలితంగా వచ్చేది సారూప్యం. మనకు జయవిజయులను చూపిస్తూ ఉంటారు కదా! వారు కూడా విష్ణుమూర్తిలాగానే నాలుగు చేతులు కలిగి, శంఖ చక్ర గదా పద్మాలను ధరించి ఉంటారు. అలా స్వామివారి రూపాన్ని పొందడం సారూప్య ముక్తి. ఇక చివరిమెట్టు సాయుజ్యం - అంటే ఆ పరమాత్మునిలో ఐక్యం అయిపోవడం. 

    ఈ నాలుగింటిపై కొంచెం లోతుగా విచారణ చేద్దాం. ఎందుకంటే అద్వైత సిద్ధాంతంలో ముక్తి అనేది చనిపోయాక పొందేది కాదు. బ్రతికి ఉండగానే నీ అసలు స్వరూపాన్ని గుర్తించి ఈ శరీరంతోనే జీవన్ముక్త స్థితిని అనుభవించాలి. ఇక పైన చెప్పుకున్న నాలుగు అంచెల ముక్తిని గూర్చి విచారిస్తే - ముందుగా సాలోక్యం అంటే పరమాత్మ ఉన్న లోకంలో మనం నివసించడం అని చెప్పుకున్నాం కదా. కానీ ఆయన ఉన్న లోకం ఏది? విష్ణువు అంటేనే సర్వవ్యాపకుడు అని అర్థం కదా! మరి ఆయన లేని స్థానం కానీ, లోకం కానీ ఈ సృష్టిలో ఎక్కడైనా ఉందా? అంతేకాక గీతలో స్వామే స్వయంగా చెప్పినట్లు ధర్మ సంస్థాపన కోసం ఆయన మాటిమాటికీ అనేక మహాత్ముల, గురువుల, అవతారపురుషుల రూపాలలో మన మధ్యన సంచరిస్తూనే ఉన్నాడు కదా! అయితే ఈ విషయాన్ని గుర్తించి సదా అనుభవంలోకి తెచ్చుకోవడమే సాలోక్యం. అంటే మన జీవితంలో ప్రతి క్షణం పరమాత్మ ఉన్న లోకంలోనే, పుణ్యక్షేత్రంలోనే, వైకుంఠంలోనే మనం జీవిస్తున్నామనే ఎఱుక కలిగి ఉంటే మనం ఇక పాపాలు చేయలేము కదా! మనలోని మానసిక బలహీనతల వలనే మనం పాపాలు చేస్తాం. కుంఠితం అంటే బలహీనమైనది. కుంఠితం కానిది వైకుంఠం. ఇలా నిరంతరం స్వామి ఉనికిని గుర్తిస్తూ మన మనస్సు ఎప్పుడైతే తన బలహీనతలను అధిగమిస్తుందో అప్పుడు ఆ మనస్సే వైకుంఠం అవుతుంది.

    ఇక దీని పైమెట్టు సామీప్యం. కేవలం ఆ స్వామి ఈ లోకంలో ఎక్కడో ఉన్నాడని మాత్రమే కాకుండా నిరంతరంగా ఆయన సన్నిధిని మనం అనుభవంలోనికి తెచ్చుకోవాలి. ఆయన ఎప్పుడూ మన ప్రక్కనే, మనతోనే, మనలోనే ఉంటాడు. ఈశ్వరస్సర్వ భూతానాం హృద్దేశే అర్జున తిష్టతి.  ఆయన లేనిదే మనం లేము. ఈ నిరంతర సామీప్యాన్ని మనం అనుభవంలోనికి తెచ్చుకుంటే ఇక ఈ లోకంలోని ఈ కష్టాలు, బాధలు, సుఖదుఃఖాలు మనలను బంధించలేవు. నిరంతరం తన తల్లిదండ్రుల దగ్గర నివసించే పిల్లవానికి దేనిమీద చింత ఉంటుంది? అంతా వారే చూసుకుంటారనే నిశ్చింతతోనే హాయిగా బ్రతికేస్తాడు కదా! అదే సామీప్య ముక్తి.

    మరి సారూప్యం అంటే పైన చెప్పుకున్నట్టు ఆ స్వామి యొక్క రూపాన్ని మనం కూడా ధరించాలని, కొందరు అచ్చంగా విష్ణుమూర్తి, శివుడు, లేదా తన గురుదేవులు ధరించే విధంగానే నుదుటిపై నామాన్ని ధరించడం, వారిలాగానే పీతాంబరాన్నో, జింక చర్మంనో ధరించడం, వారి హావభావాలను అనుకరించడం చేస్తూ ఉంటారు. ఎంత సాధన చేసి అచ్చుగుద్దినట్లు అనుకరించినా అది అనుకరణే అనిపించుకుంటుంది కానీ వీరు వారవ్వరు కదా! పరమాత్మతో సారూప్యాన్ని పొందడం అంటే ఆయనలో ఉన్న సద్గుణాలను మనం అలవరచుకోవడం. ఆయనలో లేని దుర్గుణాలను మనలోనుండి తొలగించుకోవడం. అంతేకాదు ఈ సర్వ సృష్టిని విష్ణుమయంగా దర్శించే దృష్టిని అలవరచుకోవడం. చూడక మానవు చూచెడి కన్నులు ఏడనేడైన ఇతరములు, ఈడ నన్నింట నీ రూపము గన ఈడు లేని తెలివీయగదే అని ప్రార్థించాడు అన్నమయ్య. అటువంటి పరమాత్మ దృష్టిని అలవరచుకోవడం సారూప్యం.

    ఇక తన చుట్టూ ఉన్న సృష్టి అంతటిలో పరమాత్మనే దర్శిస్తూ ఉంటే తాను మాత్రం ఆ పరమాత్మకు భిన్నంగా ఉంటాడా? ఈ కనిపించే దేహం తాను కానని, ఈ దేహాలన్నింటినీ నడిపించే పరమాత్మ తానే అనే సత్యాన్ని గ్రహిస్తాడు, అనుభవిస్తాడు. అదే సాయుజ్య ముక్తి. కేవలం తాను తప్ప మరియొకటి లేదనే ఎఱుకయే కైవల్యం. అటువంటి ముక్తిని పొందినవాడికి ఇక దేనిమీదా మొహం కానీ, రాగద్వేషాలు కానీ కలుగవు. ప్రారబ్ధం ఉన్నంతవరకు ఈ దేహం నిలిచి ఉంటుంది. అయితే ఈ దేహంతో చేసే కర్మలు ఏవీ తనకు అంటవు. ఎందుకంటే వాటి వెనుక తనకు ఏదో కావాలనే కోరిక కానీ, తాను చేస్తున్నాననే అహంకార భావన కానీ ఉండదు. అవన్నీ లోకకళ్యాణం కోసం చేసే లీలలే అవుతాయి కానీ, తనను బంధించే కర్మలు కావు. ఎప్పుడైతే ఆ ప్రారబ్ధం తీరి ఈ దేహం పడిపోతుందో, అప్పుడు తాను స్వస్వరూప లయం పొందుతాడు. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంత కాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి||