మన భారతదేశం కర్మభూమి అని, దేవతలు సైతం మోక్షం పొందాలంటే ఇక్కడ పుట్టాలని తపిస్తూ ఉంటారని గురుదేవులు శ్రీ బాబూజీ మహరాజ్ వారు తరచుగా చెబుతూ ఉండేవారు. అలాగే భగవద్గీతలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అంతమంది మహాత్ములు ఈ పవిత్ర భూమిలో అవతరించారని, అందుకే దీనిని రత్నగర్భ అంటారని కూడా చెప్పేవారు. అలాగే అమెరికా భోగభూమి అని, అక్కడకు అందరూ భోగాలు అనుభవించడానికి వెళతారని మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం. అయితే శ్రీగురుదేవులు ఒకసారి అమెరికాలో ఉన్నప్పుడు ఇండియాలోని భక్తుడు ఫోన్ చేసి "మీరు అక్కడా, మేము అందరం ఇక్కడా ఉండిపోయామని" బాధ పడితే అప్పుడు శ్రీగురుదేవులు "అక్కడ ఇండియా ఇక్కడ అమెరికా తీసివేస్తే ఉన్నదంతా ఒక్కటే" అని బదులిచ్చారు.
నిజానికి గురుశక్తి సర్వవ్యాపకమైనది, దేశ కాలాలకు అతీతమైనది. గురుదేవులు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏ కార్యం చేయిస్తారో, ఎవరిని ఎలా రక్షిస్తారో ఎవరూ చెప్పలేరు. నేను కాలేజీలో ఉండగానే శ్రీగురు సహస్రనామావళికి అర్థాలు వ్రాయటం మొదలుపెట్టాను. కానీ అది చాలా మెల్లగా సాగేది. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళడం జరిగింది. మొదట్లో 'ఇది భోగభూమి కదా! ఇక్కడ ఎందుకు వ్రాయటం? త్వరలోనే మళ్ళీ మన పవిత్ర భారతదేశానికి వెళ్లిపోతాం కదా. అక్కడ వ్రాయవచ్చులే!' అనుకొని కొన్నాళ్ళు తాత్సారం చేశాను. అయితే ఒకసారి శ్రీమాతాజీ అమెరికా వచ్చినప్పుడు అప్పటివరకూ వ్రాసినవి చూపిస్తే 'బాగుంది, త్వరగా పూర్తి చేయ'మని ప్రోత్సహించారు. అలాగే మరి కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండమని కూడా సూచించారు. దానితో ఈ దేశకాల విషయాలు పట్టించుకోకుండా మళ్ళీ వ్రాయటం ప్రారంభించాను. చాలావరకు ఆఫీసుకి వెళ్ళివచ్చే సమయంలో బస్సులోనే వ్రాయటం జరిగింది. 'నువ్వు ఏ క్షేత్రంలో ఉన్నావన్నది ముఖ్యం కాదు, నీ హృదయ క్షేత్రంలో ఏమున్నదనేదే ముఖ్యం' అని శ్రీగురుదేవులు నిరూపించిన దివ్యలీల!
అలాగే శ్రీగురుదేవులు దేశకాలాతీతులు అనడానికి నిదర్శనంగా అమెరికాలో ఉన్నన్నాళ్ళూ మాకు ఎప్పుడు ఏ చిన్న కష్టం వచ్చినా, మనసుకు అశాంతి కలిగినా వెంటనే శ్రీమాతాజీ వారినుండి వీడియో కాల్ వచ్చేది. అమ్మను దర్శించుకొని, సంభాషించగానే మనశ్శాంతి, బాధానివారణ జరిగిపోయేవి. ఒకసారి మా ఇంటిముందు నుంచి కారు తీస్తూ ఉండగా వేరే కారు నడుపుతున్న యువతి వేగంగా కారు వెనుకకు నడిపి నా కారును గుద్దింది. తప్పు ఆమెదే అయినా, తొందరగా రిపేరు అవ్వాలని, ఇన్స్యూరెన్సు కంపెనీ వారి సలహాపై వెయ్యి డాలర్లు నా జేబులోనుండి కట్టి రిపేరు చేయించుకున్నాను. అయితే నెలలు గడుస్తున్నా మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి ఇవ్వడంపై ఇన్స్యూరెన్సు కంపెనీ నుండి ఎటువంటి సమాచారం లేదు. ఒకరోజు ఆఫీసులో ఖాళీ దొరికినప్పుడు ఇన్స్యూరెన్సు వారికి ఫోను చేస్తే అవతలి పార్టీ వాళ్ళ ఇన్స్యూరెన్సు కంపెనీ వాళ్ళు సరిగా స్పందించడం లేదనీ, తాము కోర్టుకు వెళ్ళి తేల్చుకుంటామని, తమకు ఎప్పుడు డబ్బులు వస్తే అప్పుడే నాకు ఇస్తామనీ, పూర్తిగా వస్తాయని నమ్మకం లేదనీ చెప్పారు.
వెయ్యి డాలర్లు అంటే చిన్న మొత్తం కాదు. శ్రీగురుదేవుల పాదుకల వద్ద నమస్కరించి వేడుకుందామంటే నేను ఆఫీసులో ఉన్నాను. అందుకని మనస్సులోనే శ్రీగురుదేవులను ప్రార్థించుకున్నాను. సరిగ్గా అరగంటలో ఇన్స్యూరెన్సు కంపెనీ నుండి ఫోను చేసి, తమకు రావలసిన మొత్తం వచ్చేసిందని, ఇప్పుడే మీకు వెయ్యి డాలర్ల చెక్కు పంపిస్తున్నామని చెప్పారు. గురుశక్తి యొక్క సర్వ వ్యాపకత్వానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మనం కేవలం భోగభూమిగా భావించే అమెరికాలో ఉన్న 11-12 సంవత్సరాలలో వారివద్ద ఎన్నో మంచి విషయాలు, అలవాట్లు నేర్చుకోవటం జరిగింది. ముఖ్యంగా జాతి, నీతి, కుల, మత భేదాలు పాటించకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవించడం అందరూ నేర్చుకోదగిన మంచి లక్షణం.
మేము మొదటి ఆరు నెలలు ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు (1975-1993 మధ్య కాలంలో) ఎవరైనా బొట్టు పెట్టుకున్న వ్యక్తి కనిపిస్తే వారిమీద దాడులు జరిగేవి. అలాంటిది మేము ఉన్నన్నాళ్ళూ ప్రతిరోజూ బొట్టు పెట్టుకునే బయట తిరగటం, ఆఫీసుకు వెళ్ళటం చేసేవాడిని. మొదట్లో మొహమాటానికి చాలా చిన్న బొట్టు పెట్టుకునేవాడిని. ఒకసారి శ్రీమాతాజీవారు అమెరికా వచ్చినప్పుడు నేను ఆఫీసుకి బయలుదేరుతూ ఉంటే, "ఒరే! నువ్వు బొట్టు పెట్టుకోలేదు నాన్నా!" అన్నారు. "నేను పెట్టుకున్నానమ్మా" అన్నా కూడా మళ్ళీ మళ్ళీ "లేదు నాన్నా! నువ్వు పెట్టుకోలేదు" అన్నారు. విషయం అర్థమై అప్పటినుండి తగినంత పెద్ద బొట్టు పెట్టుకోవటం అలవాటు చేసుకున్నాను.
ఇక అమెరికా వాసులనుండి నేర్చుకోవలసిన రెండవ గొప్ప విషయం 'ఇది పెద్ద పని, ఇది చిన్న పని' అనే భేదాలు లేకుండా ప్రతి పని గౌరవప్రదమైనదిగానే చూడటం. ఈ రెండు మంచి గుణాలు మనమందరం అలవాటు చేసుకోగలిగితే అటు సోషలిష్టులయినా, ఇటు ఆధ్యాత్మిక వాదులైనా ప్రవచించే సమ సమాజ స్థాపన జరుగుతుంది. అప్పుడు అది కర్మభూమి అయినా భోగభూమి అయినా దానిని మనం యోగభూమిగానే పరిగణించగలుగుతాం.
సమత్వం యోగ ఉచ్యతే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి