15, ఏప్రిల్ 2022, శుక్రవారం

భక్తి జ్ఞాన వైరాగ్యాలు

 మోక్షం రావాలంటే జ్ఞానం కలగాల్సిందే అంటారు కొందరు. కాదు, భక్తియే మోక్షసాధనం అంటారు మరికొందరు. అసలు ఈ రెండిటికన్నా ముందు వైరాగ్యం కలగాలి కదా అంటారు ఇంకొందరు. అయితే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యులవారు వివేక చూడామణిలో "మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ" - మోక్షం సాధించడానికి కావలసిన ఉపకరణాలన్నింటిలో భక్తియే అత్యుత్తమమైనదని నొక్కి వక్కాణించారు. మామూలుగా మనం భక్తి అంటే పూజలు చేయటమో, ఉపవాసాలు ఉండటమో ఇటువంటి బయటి ఆర్భాటాలనే అనుకుంటాం కదా! అయితే ఇదే శ్లోకం రెండవ పాదంలో భక్తి అంటే ఏమిటో వారు నిర్వచిస్తున్నారు. "స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే" - నీయొక్క అసలు స్వరూపంతో నిత్యమూ అనుసంధానం కలిగి ఉండటమే భక్తి అనబడుతుంది.

అయితే నీ అసలు స్వరూపం ఏది? దానినే మనం "నేను" అంటున్నాం. ఈ నేనుకే సంస్కృతంలో "ఆత్మ" అని పేరు. అయితే ఇది మూడు రూపాలలో ఉంటుందని దక్షిణామూర్తి స్తోత్రం తెలియజేస్తోంది. "ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః" ఈశ్వరుడు, గురువు, ఆత్మ - ఈ మూడూ రూపంలో భేదమే కానీ అసలు వస్తువులో భేదం లేదనీ, ఆకాశంవలె సర్వత్రా వ్యాపించి ఉంటాయని తెలియజేస్తోంది. అంటే ఈ మూడూ మన స్వస్వరూపాలే అన్నమాట.

నిరంతరం ఈశ్వరుడితో మనస్సు అనుసంధానమై ఉండి సదా భగవధ్యానంలో ఉంటూ ఆయన సేవ తప్ప మరో విషయం మీదికి మనస్సు పోకుండా ఉంటే అదే భక్తి. అలాగే మనస్సు సదా ఆత్మతో అనుసంధానమై సర్వత్రా నిండియున్న ఆ ఆత్మనే ఎల్లప్పుడూ దర్శిస్తూ సర్వత్ర సమదృష్టి కలిగి ఉండటమే జ్ఞానం కదా! మరి గురువునే సర్వస్వంగా భావించి మానసికంగా సదా వారి సాన్నిధ్యంలోనే ఉంటూ గురుబోధను నిరంతరం మననం చేసుకుంటూ ఆచరణలో పెట్టే సాధకునికి ఇతర విషయాలపై వైరాగ్యం దానంతటదే కలుగుతుంది కదా! అంటే ఆత్మయొక్క మూడు భిన్న రూపాలలో ఒక్కొక్క దానితో అనుసంధానం వలన మనకు భక్తి జ్ఞాన వైరాగ్యాలలో ఒక్కొక్కటి సహజంగానే కలుగుతున్నాయి.

ఆత్మయొక్క మూడు రూపాలకు రూపంలో తప్ప తత్వంలో భేదం లేనట్లే, ఆ ఆత్మతో అనుసంధానానికి రూపాలైన భక్తి జ్ఞాన వైరాగ్యాలలో కూడా భేదం లేదన్నమాట. శ్రీగురుదేవులు తరచుగా "గాఢమైన విశ్వాసమే భక్తి. భక్తియొక్క పరాకాష్టయే జ్ఞానం. జ్ఞానంయొక్క పరాకాష్టయే ముముక్షుత్వం" అని బోధించేవారు. ఇక్కడ ముముక్షుత్వం అంటే మోక్షం తప్ప మరేదీ అవసరం లేదనే వైరాగ్యమే కదా!

మనం ఒక బీజం నాటితే దానికి సంబంధించిన మొక్క మొలకెత్తి, వృక్షమై అటువంటి ఫలాన్నే ఇస్తుంది. మామిడి టెంక నాటితే మామిడికాయలే కాస్తాయి. మర్రి విత్తనం నాటితే మర్రి పళ్ళే కాస్తాయి. మరి శ్రీగురుదేవులు ప్రసాదించిన ఆశ్రమ నిత్యప్రార్థనలో "దీనబంధూ! దయానిధే! మా మనస్సు అచంచల విశ్వాసముతో నిరంతరము నీయందే నిలచియుండునట్లు అనుగ్రహింపుము. మాలో భక్తి జ్ఞాన వైరాగ్య బీజములు అంకురించి, పెంపొంది, ఆత్మానంద ఫలమును ఒసగులాగున ఆశీర్వదింపుము" అనే వాక్యాన్ని చేర్చారు. ఇక్కడ కూడా మనస్సు అచంచల విశ్వాసంతో నిరంతరము భగవంతునితో అనుసంధానమై ఉండాలని, అలా ఉన్నప్పుడు మనలో భక్తి జ్ఞాన వైరాగ్య బీజాలు నాటుకొని, మొలకెత్తి ఆత్మానందమనే ఫలాన్ని ఇస్తాయని వివరిస్తున్నారు. అయితే ఈ మూడు వేరు వేరు బీజాలు అయినట్లైతే అలా మొలకెత్తిన వృక్షాలు ఒకే ఫలాన్ని ఇవ్వటం ఎలా సాధ్యం? కాబట్టి ఈ మూడు వేరువేరు కాదని, ఒకే భావనకు భిన్న అభివ్యక్త రూపాలని, వాటి పరమార్థం ఆత్మానందమేనని మనకు అర్థం అవుతోంది. 

1 కామెంట్‌:

  1. రాగం అనగా ప్రపంచం పట్ల ఆసక్తి.
    అది పోయినవాడు విరాగి.
    వాడి స్వభావం వైరాగ్యం.
    వాడిదే తెలివిడి.
    దానికే జ్ఞానం అని పేరు.
    ఆ జ్ఞానం కలవాడు నిత్యం పరబ్రహ్మానుసంధానం కలవాడై ఉంటాడు.
    ఆఫపరబ్రహ్మమే తాను. తానే ఆపరబ్రహ్మముగా ఉంటాడు.
    బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి.
    భజ్ సేవాయాం అని భక్తి లక్షణం.
    ఆపరబ్రహ్మమునే సేవించటం భక్తుడి స్వభావం.
    అందుకే మోక్షసాధనసామాగ్రిలో భక్తిని గరీయసీ అని కీర్తించటం.

    రిప్లయితొలగించండి