15, ఏప్రిల్ 2022, శుక్రవారం

భక్తి జ్ఞాన వైరాగ్యాలు

 మోక్షం రావాలంటే జ్ఞానం కలగాల్సిందే అంటారు కొందరు. కాదు, భక్తియే మోక్షసాధనం అంటారు మరికొందరు. అసలు ఈ రెండిటికన్నా ముందు వైరాగ్యం కలగాలి కదా అంటారు ఇంకొందరు. అయితే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యులవారు వివేక చూడామణిలో "మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ" - మోక్షం సాధించడానికి కావలసిన ఉపకరణాలన్నింటిలో భక్తియే అత్యుత్తమమైనదని నొక్కి వక్కాణించారు. మామూలుగా మనం భక్తి అంటే పూజలు చేయటమో, ఉపవాసాలు ఉండటమో ఇటువంటి బయటి ఆర్భాటాలనే అనుకుంటాం కదా! అయితే ఇదే శ్లోకం రెండవ పాదంలో భక్తి అంటే ఏమిటో వారు నిర్వచిస్తున్నారు. "స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే" - నీయొక్క అసలు స్వరూపంతో నిత్యమూ అనుసంధానం కలిగి ఉండటమే భక్తి అనబడుతుంది.

అయితే నీ అసలు స్వరూపం ఏది? దానినే మనం "నేను" అంటున్నాం. ఈ నేనుకే సంస్కృతంలో "ఆత్మ" అని పేరు. అయితే ఇది మూడు రూపాలలో ఉంటుందని దక్షిణామూర్తి స్తోత్రం తెలియజేస్తోంది. "ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః" ఈశ్వరుడు, గురువు, ఆత్మ - ఈ మూడూ రూపంలో భేదమే కానీ అసలు వస్తువులో భేదం లేదనీ, ఆకాశంవలె సర్వత్రా వ్యాపించి ఉంటాయని తెలియజేస్తోంది. అంటే ఈ మూడూ మన స్వస్వరూపాలే అన్నమాట.

నిరంతరం ఈశ్వరుడితో మనస్సు అనుసంధానమై ఉండి సదా భగవధ్యానంలో ఉంటూ ఆయన సేవ తప్ప మరో విషయం మీదికి మనస్సు పోకుండా ఉంటే అదే భక్తి. అలాగే మనస్సు సదా ఆత్మతో అనుసంధానమై సర్వత్రా నిండియున్న ఆ ఆత్మనే ఎల్లప్పుడూ దర్శిస్తూ సర్వత్ర సమదృష్టి కలిగి ఉండటమే జ్ఞానం కదా! మరి గురువునే సర్వస్వంగా భావించి మానసికంగా సదా వారి సాన్నిధ్యంలోనే ఉంటూ గురుబోధను నిరంతరం మననం చేసుకుంటూ ఆచరణలో పెట్టే సాధకునికి ఇతర విషయాలపై వైరాగ్యం దానంతటదే కలుగుతుంది కదా! అంటే ఆత్మయొక్క మూడు భిన్న రూపాలలో ఒక్కొక్క దానితో అనుసంధానం వలన మనకు భక్తి జ్ఞాన వైరాగ్యాలలో ఒక్కొక్కటి సహజంగానే కలుగుతున్నాయి.

ఆత్మయొక్క మూడు రూపాలకు రూపంలో తప్ప తత్వంలో భేదం లేనట్లే, ఆ ఆత్మతో అనుసంధానానికి రూపాలైన భక్తి జ్ఞాన వైరాగ్యాలలో కూడా భేదం లేదన్నమాట. శ్రీగురుదేవులు తరచుగా "గాఢమైన విశ్వాసమే భక్తి. భక్తియొక్క పరాకాష్టయే జ్ఞానం. జ్ఞానంయొక్క పరాకాష్టయే ముముక్షుత్వం" అని బోధించేవారు. ఇక్కడ ముముక్షుత్వం అంటే మోక్షం తప్ప మరేదీ అవసరం లేదనే వైరాగ్యమే కదా!

మనం ఒక బీజం నాటితే దానికి సంబంధించిన మొక్క మొలకెత్తి, వృక్షమై అటువంటి ఫలాన్నే ఇస్తుంది. మామిడి టెంక నాటితే మామిడికాయలే కాస్తాయి. మర్రి విత్తనం నాటితే మర్రి పళ్ళే కాస్తాయి. మరి శ్రీగురుదేవులు ప్రసాదించిన ఆశ్రమ నిత్యప్రార్థనలో "దీనబంధూ! దయానిధే! మా మనస్సు అచంచల విశ్వాసముతో నిరంతరము నీయందే నిలచియుండునట్లు అనుగ్రహింపుము. మాలో భక్తి జ్ఞాన వైరాగ్య బీజములు అంకురించి, పెంపొంది, ఆత్మానంద ఫలమును ఒసగులాగున ఆశీర్వదింపుము" అనే వాక్యాన్ని చేర్చారు. ఇక్కడ కూడా మనస్సు అచంచల విశ్వాసంతో నిరంతరము భగవంతునితో అనుసంధానమై ఉండాలని, అలా ఉన్నప్పుడు మనలో భక్తి జ్ఞాన వైరాగ్య బీజాలు నాటుకొని, మొలకెత్తి ఆత్మానందమనే ఫలాన్ని ఇస్తాయని వివరిస్తున్నారు. అయితే ఈ మూడు వేరు వేరు బీజాలు అయినట్లైతే అలా మొలకెత్తిన వృక్షాలు ఒకే ఫలాన్ని ఇవ్వటం ఎలా సాధ్యం? కాబట్టి ఈ మూడు వేరువేరు కాదని, ఒకే భావనకు భిన్న అభివ్యక్త రూపాలని, వాటి పరమార్థం ఆత్మానందమేనని మనకు అర్థం అవుతోంది. 

1, ఏప్రిల్ 2022, శుక్రవారం

శుభకృత్

    ప్లవనామ సంవత్సరాన్ని దాటి శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. శుభం అంటే మంచి. శుభం అంటే మంగళకరం. శుభం అంటే అందమైనది, ప్రకాశవంతమైనది. అటువంటి శుభాలను కలిగించే సంవత్సరం అన్నమాట. నిజానికి కాలం పరమాత్మ స్వరూపమే. కాలం కలయతామహం - కదిలే వాటిలో కాలాన్ని నేను అని గీతాచార్యుడు చెప్పాడు. కనుక సంవత్సరాలన్నీ శుభప్రదమైనవే. అందుకే కొన్ని సంవత్సరాల పేర్లు ఎంత భయంకరంగా ఉన్నా వాటిముందు మనం శ్రీ అని తప్పనిసరిగా చేరుస్తాము. 

    నిరంతరం కదులుతూ ఉండేది కాలం. నీటి ప్రవాహాన్ని అయినా ఆనకట్టతో ఆపవచ్చేమో కానీ కాల ప్రవాహాన్ని ఆపలేము. ప్రవహించకుండా స్థిరంగా ఉన్న నీరు త్వరగా పాడైపోతుంది. దానిలో అనేక సూక్ష్మక్రిములు, చెత్త చెదారం చేరి కలుషితం అయిపోతుంది. అదే నిరంతరం ప్రవహించే నీటిలో చెత్త వేసినా అది స్వచ్ఛంగానే ఉంటుంది. అలాగే మన జీవితం కూడా కాలంతో పాటు నిరంతరం మార్పు చెందుతూ ఉంటేనే అది ఎప్పటికప్పుడు తాజాగా, అందంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. చలనం లేక నిలిచిపోయిన జీవితం నిస్సారంగా ఉంటుంది.

    సాధారణంగా మన తెలుగు సినిమాల చివరిలో శుభమ్ అని చూపిస్తారు. అలాగే ఇంగ్లీషు వాళ్ళు కథలు చెప్పినప్పుడు చివరిలో They lived happily ever after అని చెబుతారు. కానీ మన జీవితంలో శుభాశుభాలు, సుఖదుఃఖాలు రెండూ శాశ్వతంగా ఉండవని, ఒకటి తర్వాత ఒకటిగా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయని మనందరికీ తెలిసిందే కదా! మరి శాశ్వతమైన శుభం ఏది? ఆత్మ ప్రకాశమే శాశ్వత ప్రకాశం. ఆత్మానందమే శాశ్వతానందం. ఆత్మ సుఖమే శాశ్వత సుఖం. అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడే నిజమైన శుభం కలుగుతుంది. 

    మనలో ద్వైత భావన ఉన్నంతవరకు ఏదో కావాలనే, పొందాలనే ఆరాటం, అది దక్కలేదని ఆక్రోశం, ఉన్నదేదో పోతుందని ఆవేదన తప్పవు. అసలు నేను ఎవరో తెలుసుకుంటే ఈ కనిపించేదంతా నేనే అని కూడా తెలుసుకుంటావు. అంతా నీవే అయినప్పుడు పొందవలసినది కానీ, కోల్పోయేది కానీ ఏమీ ఉండదు. అప్పుడు ఇంక అక్కడ ఎటువంటి రాగద్వేషాలకు, సుఖదుఃఖాలకు తావు ఉండదు. అక్కడ అంతా శాంతి, ఆనందం, ప్రకాశం, శుభమే. 

    ఎందరో మహానుభావులు అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొంది వారిలోని కామక్రోధాది దుర్గుణాల స్థానంలో అహింస, సత్యం, శాంతి, దయ, ప్రేమ, ఐకమత్యం, మానవత్వం, సమతా భావన, సమానత్వం మొదలైన ఉత్కృష్ట గుణాలను అలవరచుకొని, తమ అతి సాధారణమైన నిరాడంబర జీవితంలోనే ఆయా గుణాలను తమ ప్రబోధాల ద్వారా, అంతకంటే ముఖ్యంగా ఆచరణ ద్వారా సర్వ జనావళికి పంచిపెట్టారు. అయితే వారి ఆచరణ మార్గాన్ని అనుసరించి ఆత్మజ్ఞానాన్ని పొందకుండా కేవలం వారిని అనుకరించడం ద్వారానో, లేదా వేల కోట్లు ఖర్చు పెట్టి వారి భారీ ప్రతిమలు నెలకొల్పడం ద్వారానో ఆయా సద్గుణాలను సాధించాలనుకుంటే అది అసాధ్యం.

    అయితే మహాత్ములను అనుసరించడం కంటే వారిని అనుకరించడం, లేదా అర్చించటం చాలా తేలికైన పని. నిజానికి అహింసకు ప్రతిరూపమైన బుద్ధభగవానుడు విగ్రహారాధనను ఖండించాడు. కానీ ఈరోజు ప్రపంచంలో ఏమూలకు వెళ్ళినా ఆయన భారీ విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. అయితే ఆయన బోధనలను, నిర్దేశించిన మార్గాన్ని ఎంతమంది అనుసరిస్తున్నారు? ఆచరణలో పెడుతున్నారు? అలా పెడితే ఈనాడు ఇంతటి యుద్ధాలు, మారణహోమాలు, రక్తపాతం చూడవలసిన ఖర్మ ఎందుకు పడుతుంది.

    శ్రీగురుదేవులు చాలా కాలం ఎవరినీ తమ ఫోటో తీయనిచ్చేవారు కాదు. "నీకు నా ఫోటో కావాలా? నేను కావాలా? ఫోటోనే కావాలంటే అది ఏ గోడమీదో, గూట్లోనో, పర్సులోనో మాత్రమే ఉంటుంది. అదే నన్ను నీ హృదయంలో పెట్టుకుంటే ఇక నీకు నాకు భేదం కానీ, దూరం కానీ ఎక్కడ ఉంటుంది?" అనేవారు. అలా మహాత్ములను, గురువులను నిజంగా హృదయంలో ప్రతిష్టించుకుని వారు చూపిన మార్గంలో పయనిస్తే జీవితమంతా శుభాలమయమే. ప్రతి సంవత్సరమూ శుభకృత్ సంవత్సరమే. అటువంటి నిజమైన సాధకుడు తన జీవితాన్ని పండించుకోవటమే కాక సర్వ మానవాళికి శుభకరుడై వెలుగొందుతాడు.