3, ఫిబ్రవరి 2019, ఆదివారం

పరిపూర్ణ జ్ఞానం

గురుదేవులు శ్రీ బాబూజీ మహారాజ్ వారు పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీకగా చంద్రుణ్ణి చెప్పేవారు. "ఎలాగైతే పౌర్ణమికి ఒకరోజు కలిపినా, తీసివేసినా అది పౌర్ణమి అనిపించుకోదో అలాగే పరిపూర్ణమైన జ్ఞానానికి ఇక కలపడానికి కానీ తీసివేయటానికి కానీ ఏమీ ఉండదు" అని. అలాగే మనం "సర్వ విజ్ఞాన తేజమును చంద్రకళగ శిరమున గల మహేశ్వరివి నీవే" అని అమ్మవారి స్తోత్రంలో చదువుకుంటాం కదా. ఇంకా శ్రీ గురుదేవులు "ఎప్పటికీ ఈ నామాన్ని రూపాన్ని మాత్రమే ప్రేమిస్తూ ఇంతవరకే గురుదేవులు అనుకుంటే లాభంలేదు. కనిపించేవన్నీ ఎప్పటికైనా నశించిపోయేవే. ఈ నామరూపాలను దాటి సర్వే సర్వత్రా నిండి నిబిడీకృతమైన గురుదేవుల నిర్గుణ సౌందర్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే మీ ఆనందం శాశ్వతమౌతుంది" అని కూడా చెప్పేవారు. 

మనం ఈ రెండింటినీ కొద్దిగా సమన్వయం చేసి చూద్దాం. చంద్రుడనగానే మనకు పరమేశ్వరుడు గుర్తుకు వస్తాడు. ఆయన చంద్రమౌళి కదా. అయితే ఆయనను కేవలం కైలాసవాసిగానో, పార్వతీపతిగానో ఒక రూపానికి, నామానికి, ప్రాంతానికి మాత్రమే పరిమితమైనవాడిగా చూసినప్పుడు మనకు ఆయన శిరస్సుపై చవితి చంద్రుడు మాత్రమే కనిపిస్తాడు. అంటే అది పరిపూర్ణమైన జ్ఞానం కాదనడానికి ప్రతీక అన్నమాట. మరి పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీక అయిన పూర్ణచంద్రుడు ఎక్కడ ఉంటాడో చూద్దాం. "ఆపాతాళ నభ స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్ జ్యోతిస్పాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేన్దు వాంతామృతైః" పాతాళం నుండి ఆకాశం వరకు ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ నిండిపోయి శుద్ధ స్ఫటిక జ్యోతిర్లింగంగా పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నప్పుడు ఆయన శిరస్సుపై బ్రహ్మామృత వెన్నెలలు కురిపిస్తూ పూర్ణ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అని ఈ పై శ్లోకభాగం చెబుతోంది.

అయితే అలా బ్రహ్మాండ వ్యాప్త దేహుడై పరమేశ్వరుడు ఉన్నప్పుడు ఇక ఆయనకు శిరస్సు ఎక్కడ? ఆ శిరస్సుపై ప్రకాశించడానికి చంద్రునికి చోటెక్కడ? అసలిదంతా చూసి వర్ణించే మనమెక్కడ? లోతుగా ఆలోచిస్తే ఆ చంద్రుడు, ఈ వర్ణించేవాడూ ఇద్దరూ ఆ పరమేశ్వరుని విశ్వరూపంలోనే ఉన్నారు కానీ వేరుగా లేరు. అంటే జ్ఞానం అనబడే తెలుసుకోవడం, జ్ఞాత అనబడే తెలుకునేవాడూ జ్ఞేయమనబడే తెలుసుకునే వస్తువైన పరమేశ్వరునిలోనే లీనమైపోయారన్నమాట. అక్కడ ఉన్నదంతా పరమేశ్వరుడే కానీ వేరే వస్తువేదీ లేదు. అదే పరిపూర్ణ జ్ఞానం. 

శ్రీ గురుదేవులు ఇంకా "భక్తియొక్క పరాకాష్టయే జ్ఞానం" అని చెప్పేవారు. మరి మనం ప్రపంచంలోని భక్తుల పేర్లను స్మరించుకుంటే అందులో మొట్టమొదటగా వచ్చే పేరు ప్రహ్లాదునిది. ఆయన బయటికి ఎంతటి పరమ భక్తుడో లోపల అంతటి జ్ఞాని. గురుదేవుడైన నారదునినుండి నారాయణ మంత్రం పొందినా ఆయన ఏనాడూ ఆ నారాయణుని రూపాన్ని భౌతికంగా చూడలేదని చెప్పవచ్చు. నారదుని ఆశ్రమంలో నారాయణుని ప్రతిమ ఉన్నదనుకున్నా ప్రహ్లాదునికి ఊహ తెలిసేలోగానే తండ్రి వచ్చి ఇంటికి తీసుకువెళ్లిపోవడం జరిగింది. ఇక నారాయణునికి బద్ధశత్రువైన ఆ రాక్షసుని గృహంలోగాని, రాక్షస గురువుల ఆశ్రమంలోగాని నారాయణుని ప్రతిమ ఉండే అవకాశమే లేదు కదా! మరి ప్రహ్లాదుడు ఆరాధించినది సర్వవ్యాపకమైన ఆ నారాయణుని నిర్గుణతత్వాన్నే కదా. అందుకే "ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు" అని నిర్భయంగా చెప్పగలిగాడు. అది అనుభవ జ్ఞానమే గానీ వాచాజ్ఞానం కాదు. 

అయితే "సగుణం కంటే నిర్గుణం గొప్పదంటావా?" అని మీకిక్కడ సందేహం రావచ్చు. ఇక్కడ మన చర్చ సగుణ నిర్గుణాల గొప్పతనాన్ని గురించి కాదు. కేవలం సగుణంలోనే ఆగిపోకుండా పరమాత్ముని నిర్గుణ సౌందర్యాన్ని కూడా దర్శించగలగాలి, అప్పుడే జ్ఞానం పరిపూర్ణమౌతుంది అని. తన ఉపాసనా కాలమంతా నారాయణుని నిర్గుణంగా దర్శించాడు కాబట్టే ఆయన సరిక్రొత్తదైన నరసింహాకృతిలో వచ్చినా ప్రహ్లాదుడు వెంటనే గుర్తించగలిగాడు. అదే కేవలం సగుణారాధన మాత్రమే చేసిన ఎందరో భక్తులు, దేవతలు సైతం పరమాత్ముడు వేరే రూపంలో దర్శనమిస్తే గుర్తించలేని సందర్భాలు మన పురాణాలలో అనేకం కనిపిస్తాయి. అయితే భావంలో ఎప్పుడూ అద్వైత దృష్టి కలిగి ఉండాలి కానీ అది క్రియలో పనికిరాదని కూడా పెద్దలు చెబుతారు. "అద్వైతం త్రిషులోకేషు, నాద్వైతం గురుసన్నిధౌ" - మూడు లోకాలలో ఎక్కడైనా అద్వైత భావన కలిగి ఉండు కానీ గురు సన్నిధిలో మాత్రం దాస్యభావనతోనే ఉండాలి. 

ఒకసారి కొందరు పండితుల మధ్యలో "సగుణం గొప్పదా? నిర్గుణం గొప్పదా?" అనే ఎడతెగని చర్చ జరుగుతున్నప్పుడు శ్రీగురుదేవులు అక్కడకు వెళ్లడం తటస్థించింది. తమ సమస్యను తీర్చమని వారు శ్రీగురుదేవులను ప్రార్ధించగా వారు "అసలు సమస్యంతా మీరు సగుణనిర్గుణాలను వేరు వేరుగా చూడటంలోనే ఉంది. ఈ రెండూ పరమాత్మయొక్క రెండు రకాల విభూతులే కానీ పరస్పరం విభిన్నమైనవి కావు. సగుణ రూపంలో పరమాత్ముని ఆరాధించకపోతే భక్తి కలుగదు. అలాగే ఆయన నిర్గుణ సౌందర్యాన్ని సర్వేసర్వత్రా దర్శించలేకపోతే జ్ఞానం పరిపూర్ణం కాదు. సగుణ నిర్గుణాలు రెండూ నాణానికి రెండు పార్శ్వాల వంటివి. రెండూ ఉంటేనే ఆ నాణానికి విలువ" అని వారి సందేహాన్ని నిర్మూలించడం జరిగింది. 

3 కామెంట్‌లు:

  1. ఏమో బ్రదర్. చాగంటి, సామవేదం, గరికపాటి... అంతా కలిసి ఏవేవో చిలవలు పలవలుగా వర్ణించి బుర్రను అయోమయం చేసి వదిలిపెట్టారు. ఈ ప్రవచనాలు పక్కన బెడితే.. అసలు ఈ దిక్కుమాలిన ప్రపంచాన్ని ఎందుకు సృష్తి చేశాడు. మళ్ళీ జగం మిథ్య గజం మిథ్య అనొద్దు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమాధానం చివర మీరే చెప్పారు గా,,,,పరమేశ్వరుని స్వప్నంలో మనమున్నాం అనుకోండి అంతే

      తొలగించండి