అనన్యాశ్చిన్తయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || - భగవద్గీత 9-22
"ఎవరైతే అన్య చింతన లేకుండా నన్నే లెస్సగా ఉపాసిస్తూ నాయందే నిత్యం మనస్సును లగ్నం చేసి ఉంచుతారో వారి యోగక్షేమాన్ని నేను నా బాధ్యతగా వహిస్తాను" అని గీతాచార్యుడు అభయం ఇస్తున్నాడు. అయితే మనం సాధారణంగా తెలుగులో యోగక్షేమాలు అంటాం. యోగం అంటే కలయిక. మన దగ్గర లేనిదేదో కొత్తగా మనకు లభిస్తే దానిని యోగం అంటాం. ఉదాహరణకి ఒకడికి ధనయోగం ఉందనో రాజయోగం ఉందనో అంటే వాడి దగ్గర అప్పటివరకు లేని సంపదో, అధికారమో వాడికి అందుతుందని అర్థం. అలాగే మనకి దక్కుతుందని ఎంతగానో ఆశించినది చివరి నిముషంలో దక్కకపోతే మనకా యోగం లేదులే అని సరిపెట్టుకుంటాం.
అలాగే క్షేమం అంటే మన దగ్గర ఉన్నది మనకు దూరమైపోకుండా, ఎవరూ దోచుకోకుండా భద్రంగా మన దగ్గరే ఉండటం. ఎవరైనా దూర ప్రయాణానికి బయలుదేరుతుంటే "క్షేమంగా వెళ్ళి లాభంగా రండి" అంటాం. అంటే నీ దగ్గర ఉన్న ధనాన్ని కానీ, ఆభరణాలను కానీ, లేదా నీ కాళ్ళు చేతులు లాంటి అవయవాలను కానీ ఏమీ పోగొట్టుకోకుండా(క్షేమంగా) వెళ్ళి వీలైతే అనుకున్న పని పూర్తిచేసుకునో, లేదా ఉన్నదానికంటే మరింత సంపాదించో(లాభంగా) తిరిగి రమ్మని కోరుకుంటాం. ఇలా ఈ యోగక్షేమాలు రెండూ వేరువేరు అర్థాలు కల పదాలు.
అయితే మొన్న శ్రీ కాళీ వనాశ్రమ భాగ్యనగర శాఖలో జరిగిన సత్సంగాలలో శ్రీ మాతాజీ వారు పై గీతా శ్లోకాన్ని ప్రస్తావిస్తూ యోగక్షేమాలు రెండు కదా! మరి భగవానుడు ద్వివచన పదమైన యోగక్షేమౌ అనకుండా ఏకవచన పదమైన యోగక్షేమం అని ఎందుకు అన్నాడు? అని ప్రశ్నిస్తూ దానికి సమాధానంగా ఆయన ప్రసాదించేది క్షేమంతో కూడిన యోగం. అది ఒకటే కానీ రెండు కాదు అన్నారు. దీనిమీద కొంచెం లోతుగా విచారిస్తే మనకు విషయం అర్థం అవుతుంది.
అంతవరకు మనది కానిది కొత్తగా మనకు లభించడం యోగం అని చెప్పుకున్నాం కదా. అయితే లోకంలో కొత్తగా వచ్చేవన్నీ ఎప్పుడో ఒకప్పటికి పోతాయి అని మనం చూస్తూనే ఉంటాం. మన కళ్ళముందే ఎందరో ఉన్నట్టుండి ధనవంతులుగా మారడం, మరికొంత కాలానికి ఆ వచ్చిన ధనాన్ని నిలబెట్టుకోలేక మళ్ళీ బికారులుగా మారడం మనకు తెలుసు. అలాగే మనం చిన్నప్పుడు చదువుకున్న చదువులో ఎంతవరకు మనకు గుర్తుంది? ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకోకపోతే అది మన స్మృతిపథంనుండి దూరమైపోతుంది.
అంతెందుకు ఒకప్పుడు లేకుండా ఫలానా తేదీన పుట్టిన మనందరం మరో తేదీన లేకుండా పోతాం కదా! కాబట్టి కొత్తగా మనకు వచ్చేదేదీ శాశ్వతంగా మనతో ఉండదని అర్థం అవుతోంది. అందుకే ఈ ప్రాపంచిక విషయాలన్నింటిలో యోగక్షేమాలు రెండూ వేరు వేరే. యోగంతో వచ్చినది క్షేమంగా ఉంటుందని నమ్మకం లేదు. మరి క్షేమంతో కూడిన యోగం అంటే ఏమిటి? ఎప్పటికీ మననుంచి దూరమైపోకుండా ఉండేది ఏది? అంటే అది సనాతనంగా మనదై ఉన్న మన నిజస్థితి మాత్రమే. అది ఈ శరీరానికో మనస్సుకో పరిమితమైనది కాదు. అది సర్వవ్యాపకమైన ఆత్మతత్త్వం. అదే మన నిజతత్త్వం.
న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః ।
యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ ॥ భ. గీ. 15-6
"ఎక్కడైతే సూర్యచంద్రుల ప్రకాశం, అగ్నిదేవుని ప్రకాశం కూడా వెలవెలబోతుందో, ఏ పదాన్ని పొందిన తరువాత ఇక తిరిగి రావడం ఉండదో అదే నాయొక్క పరమపదం" అని పరమాత్మ చెబుతున్నాడు. అదే మన నిజస్థితి. మనం మన ఇల్లు దాటి బయట ఎక్కడికైనా వెళ్ళాము అంటే తిరిగి వచ్చేస్తామనే అర్థం కదా. అలాగే ఒక చోట ఏ సత్సంగానికో, పూజకో, లేక సినిమాకో ఒక వందమంది వచ్చారంటే అది అయిపోగానే అందరూ తిరిగి వాళ్ళ వాళ్ళ స్వస్థలానికి వెళ్ళిపోతారు కదా! అసలు మన సొంతం అనుకున్న ఇల్లే ఎన్నాళ్ళు మనతో ఉంటుందో తెలియదు. ఒకవేళ అది ఉన్నా అందులో మనం ఉండటానికి ఎన్నాళ్ళు ఈ దేహంలో ప్రాణం ఉంటుందో తెలియదు.
ఒక్కసారి ప్రాణం పోగానే ముందు మన దేహాన్ని ఇంటి బయట పెట్టేస్తారు. కాబట్టి సృష్టిలో మనకు కనిపించే ప్రతీదీ వచ్చిపోయేదే. మరి ఒకసారి వస్తే మళ్ళీ పోని ఆ యోగక్షేమం ఏమిటి? అదే జ్ఞానం. మనం జ్ఞాన స్వరూపులమే అయి ఉన్నాం. అయితే నిప్పుని పొగ క్రమ్మినట్లు మన జ్ఞానాన్ని అజ్ఞానమనే పొర కప్పివేస్తోంది. వయసు పెరుగుతున్నకొద్దీ మన కళ్ళకు పొరలు క్రమ్మి క్రమంగా మన చూపు మందగిస్తుంది కదా. ఒకసారి నేత్రవైద్యుడు ఆ పొరను తొలగిస్తే ఇక అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే జన్మజన్మల నుండి మన జ్ఞాననేత్రాన్ని కప్పి ఉంచిన అజ్ఞాన పొరను గురుదేవులు తొలగిస్తే ఇక మళ్ళీ ఆ పొర క్రమ్ముకోదు. ఒకసారి జ్ఞానాన్ని పొందినవాడు మళ్ళీ అజ్ఞాని కాలేడు. ఇదే నిజమైన యోగక్షేమం.
ఈ విషయాన్నే వివరిస్తూ శ్రీగురుదేవులు కొన్ని ఉదాహరణలు చెప్పేవారు. ఒకసారి తెల్లబడిన జుట్టు మళ్ళీ నల్లబడదు కదా! జుట్టులోని అసలు రంగు తెలుపే. దానిపైన నలుపు ఆవరించింది. ఒకసారి ఆ నలుపు పొర తొలగిపోతే మళ్ళీ రాదు. అలాగే ఒకసారి పండిన పండు మళ్ళీ పచ్చిగా మారలేదు. విత్తనం పచ్చిగా ఉన్నంతవరకూ దానిలో మొలకెత్తే లక్షణం ఉంటుంది. అది మళ్ళీ మళ్ళీ అనేక వృక్షాలుగా విస్తరిస్తుంది. అదే విత్తనం ఒకసారి కాలిపోతే ఇక మళ్ళీ మొలకెత్తే అవకాశమే లేదు. అలా జ్ఞానాగ్నిలో మన కర్మబీజాలు, వాసనాబీజాలు అన్నీ కాలిపోతే ఇక మళ్ళీ మనం అజ్ఞానంలో పడి తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు.
అజ్ఞానంలో ఉన్నవాడి జన్మలు వాడి ఇష్టానుసారం రావు. వాడి కర్మలను అనుభవించడానికి వీలైన శరీరమే వాడికి లభిస్తుంది. వాడు ఆ జన్మకు బద్ధుడై ఉంటాడు. అదే జ్ఞాని అయినవానికి ఈ బంధనం లేదు. జన్మ ఎత్తవలసిన అవసరం లేకపోయినా భగవదాజ్ఞను అనుసరించి లోకోపకృతికి ఒకవేళ అతను జన్మించినా అది బంధనం కాదు. పైగా ఇతరులకు కూడా మోక్షదాయకం అవుతుంది. గోతిలో పడ్డ వాడికి, వాడిని పైకి లాగటం కోసం ఆ గోతిలోనే దిగిన వానికి ఎంత తేడా ఉందో వీరిద్దరి జన్మలకు అంత తేడా ఉంది. ఒకరిది జన్మ, మరొకరిది అవతారం. అవతారం అంటే క్రిందకు దిగడం. ఇది జారి పడిపోవడం కాదు. ఇతరులను పైకి లాగడానికి తనంత తానుగా క్రిందకు దిగడం. శరీరం క్రింద ఉన్నా తాను మాత్రం ఎప్పుడూ అత్యున్నతమైన తన నిజస్థితిలోనే ఉంటాడు.
అటువంటి నిజమైన యోగక్షేమాన్ని పొందాలంటే భగవానుడు చెప్పినట్లుగా ఇతర చింతనలు మాని నిత్య భగవన్నామ స్మరణలో, ఉపాసనలో, ధ్యానంలో, విచారణలో మన మనస్సుని ఊరబెట్టాలి. ఒక్కసారి అటువంటి బ్రాహ్మీస్థితిని పొందామంటే ఇక మన మనస్సు ఎటువంటి ప్రాపంచిక వ్యామోహలకు లోనుకాదు.
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వా స్యామంతకాలేஉపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి || భ. గీ. 2-72