31, డిసెంబర్ 2025, బుధవారం

అనుభూతికి రాని సాన్నిధ్యం

 

    కొంతమంది శిష్యులు తాము గురుదేవులకు ఎంతో సన్నిహితులమని, నిత్యం వారి దర్శన, స్పర్శన, సంభాషణాది భాగ్యాలు పొందుతూ ఉంటామని, గర్వంతో విర్రవీగుతూ ఉంటారు. అయితే శ్రీ గురుదేవులు చెప్పినట్లు ఒక గ్లాసులో నీరు, మరొక గ్లాసులో చక్కెర వేసి ఎన్నిరోజులు ప్రక్కప్రక్కన ఉంచినా ఆ చెక్కెర మాధుర్యం ఈ నీటికి అబ్బదు కదా! అలాగే గురువుల బోధను ఆకళింపు చేసుకొని, వారు చూపిన మార్గంలో సాధన చేసి ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించకపోతే, ఎంతకాలం గురువుల అంతేవాసిగా గడిపినా మనలోని దుర్గుణాలు, బలహీనతలు పోవు కదా! పైగా గురువులంటే భవరోగ వైద్యులు. బాగా జబ్బు పడినవాడినే వైద్యుడు తన వైద్యశాలలో ఎక్కువకాలం ఉంచుకొని, అవసరమైతే ఐసీయూలో నిరంతర పర్యవేక్షణలో జాగ్రత్తగా చూసుకొంటాడు. అదే ఏదో చిన్న రోగం వచ్చినవాడిని ఐదు నిమిషాలు మాట్లాడి, మందిచ్చి ఇంటికి పంపేస్తాడు. అలాగే బాగా మురికి పట్టిన బట్టే రజకుడి చేతిలో ఎక్కువసేపు ఉండవలసి వస్తుంది.

    కేవలం భగవంతుడికి సన్నిహితంగా ఉండటమే కాక సాలోక్య, సామీప్య, సారూప్యాలు పొందిన వారు కూడా ఆత్మజ్ఞానం సాధించకపోతే తమ వెనుకటి గుణాలకు లోనై దూరమైపోయిన సంఘటన మనకు తెలుసు కదా. జయవిజయులు కేవలం వైకుంఠవాసులే కాక, స్వామి ఆంతరంగిక మందిరానికి ద్వారపాలకులుగా సామీప్యాన్ని, స్వామిలాగే నాలుగు చేతులు, వాటిలో శంఖ చక్ర గదాది ఆయుధములు కలిగి సారూప్యాన్ని పొందినా అహంకారం పోగొట్టుకోలేక శాపానికి గురి కావలసి వచ్చింది. ఆ శాపవశాత్తు వారెత్తిన మూడు జన్మలలో వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న దుష్ట గుణాలన్నీ బయటపడి, మురికి అంతా బయటకు వచ్చి, శుభ్రమైన వస్త్రంలాగా తయారైతే తప్ప తిరిగి స్వామి సన్నిధి లభించలేదు.

    మొదటి జన్మలో హిరణ్యాక్షుణ్ణి తీసుకొంటే ఆయనకు వివాహం అయినట్లు గానీ, భార్యా పిల్లలు ఉన్నట్లు గానీ ఎక్కడా వినలేదు. అయినా ఈ భూమంతా నాకే కావాలని ఆత్రం! ఏం చేసుకుంటాడు? ఎవరికి పెడతాడు? నిష్కారణమైన లోభం తప్ప! అలాగే హిరణ్యకశిపుడు నాలుగు వరాలు పొంది నలుగురు దేవతలను జయించగానే ఇక నేనే భగవంతుడిని అనేంత మదం వచ్చింది. ఈ మదం ఎంత దూరం తీసుకు వెళ్తుందంటే చివరికి తన అభిప్రాయానికి కట్టుబడని కన్న కొడుకుని కూడా చంపేటంత వివేక హీనతను కలిగిస్తుంది. ఈ జన్మలో వరాహ, నారసింహ అవతారాలు ధరించి స్వామి వారిలోని ఈ లోభాన్ని, మదాన్ని క్షాళన చేయవలసి వచ్చింది.

    అలాగే రెండవ జన్మలో రావణుడు. ఎంతమంది భార్యలు ఉన్నా తీరని కామం. ఇంకా కనబడిన స్త్రీమూర్తినల్లా అనుభవించాలనే కామం. ఎన్ని లక్షల సంవత్సరాలు జీవించినా, కుమారులు, మనుమలు పుట్టుకువచ్చినా తీరని కామం. అది చివరికి జగన్మాతను కూడా వదలలేనంత తీవ్ర స్థితికి తీసుకెళ్ళింది. అలాగే కుంభకర్ణుడికి ధర్మం తెలిసినా తన సోదరుని విడలేని మోహం. ఒక విషయం గమనిస్తే ఈ రాక్షసులందరూ ధర్మం చక్కగా తెలిసినవారే. ఏదో ఒక రూపంలో భగవంతుని ఆరాధించిన భక్తులే. కానీ వారిలో ఉన్న ఒక్కొక్క బలహీనతను అధిగమించే ఆధ్యాత్మిక శక్తి లేకపోవడంతో లోక వినాశనానికి కారణులై, చివరికి తాము కూడా అంతరించిపోయారు. వీరిద్దరిలో ఈ కామ మోహాలను క్షాళన చేసి తన వద్దకు చేర్చుకోవడానికి ఆ లక్ష్మీనారాయణులిద్దరూ మానవ రూపాలను ధరించి ఎంత కష్టపడవలసి వచ్చింది!

    ఇక మూడవ జన్మలో శిశుపాలుడికి అకారణ మాత్సర్యం. తనకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదు. తనకంటే తాను శత్రువుగా భావించేవాడు ఎక్కువ గౌరవం పొందకూడదు. అలాగే దంతవక్త్రుడిది అకారణ క్రోధం. తన మిత్రులందరినీ శ్రీకృష్ణుడు సంహరించాడనే క్రోధంలో తన శక్తి సామర్థ్యాలు ఎంతో తెలుసుకోకుండానే యుద్ధానికి బయలుదేరాడు. మిగిలిన దుర్గుణాలతో పోలిస్తే ఈ రెండు గుణాలు క్షాళన చేయడం స్వామికి సుళువుగానే సాధ్యమైంది.

    ఇలా ఒక్కొక్క గుణాన్ని పోగొట్టుకోవడానికి వారికి ఒక్కొక్క జన్మ ఎత్తి వందలు, వేలు, లక్షల సంవత్సరాలు కూడా ఆ శాపగ్రస్త జీవితాలను గడపవలసి వచ్చింది. మరి అన్ని గుణాలను మనలో ఉంచుకొని, ఏమాత్రం మారడానికి ప్రయత్నించకుండా కేవలం గురుదేవుల సాన్నిధ్యం లభించడమే మన గొప్పతనమన్నట్లుగా విర్రవీగితే ఎవరికి నష్టం? అయితే వీళ్ళవల్ల పాపం గురువులకు కూడా ప్రపంచంతో అనేక మాటలు పడవలసి వస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి వైద్యుశాలలో ఎక్కువ కాలం గడిపినా, లేక ఐసీయూలో ఉన్నా మనం వారిని చూసి జాలి పడతామే కానీ, ఈర్ష్యపడము కదా! కానీ ఇటువంటి దుర్గుణాలతో బాధపడే రోగిని సంస్కరించే నిమిత్తం భవరోగ వైద్యులయిన గురుదేవులు తమ సన్నిధిలో ఎక్కువగా ఉంచుకుంటే లోకం ఈ గుణాలను గురువులకు కూడా అంటగట్టి వారిని నిందిస్తుంది. అంతెందుకు, ఆ గురువుల శిష్యులే "ఇదేమి అన్యాయం? సత్పురుషులు దూరమైపోతున్నా లెక్కపెట్టక గురువుగారు ఈ దుర్మార్గుడిని ఇంతగా చేరదీస్తున్నారే?" అనుకుంటారు.

    అయితే దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు ధరించే భగవంతుడి అవతారానికి, అందరినీ సమానంగా సంస్కరించడానికి గురురూపంలో వచ్చే అవతారానికి చాలా తేడా ఉంటుంది. గురురూపంలో కేవలం సంస్కరణే కానీ సంహారం ఉండదు. దానికి చాలా నేర్పు, సహనం, ఓపిక అవసరం. ఒక నేరస్తుడిని విచారించి కఠినమైన శిక్ష విధించేయడం చాలా తేలిక, కానీ వానిని నిరంతర పర్యవేక్షణలో ఉంచి, పూర్తిగా సంస్కరించి, మంచివ్యక్తిగా తయారుచేసి పంపడం ఎంత కష్టం? తమ నిర్హేతుక జాయమాన కరుణా కటాక్షంతో గురుదేవులు సాధించే అతి కష్టమైన కార్యం ఇదే. "ఒక్క వ్యక్తి నేను చెప్పిన బోధను విని, సంస్కరింపబడి, నేను నిరంతరంగా పొందుతూ ఉండే బ్రహ్మానందాన్ని అందుకున్నా నా ఈ అవతారం సఫలమైనట్లే" అని శ్రీ గురుదేవులు చెప్పేవారు. 

    అయితే వారు ఒక్కరితో ఈ అవతార ప్రయోజనాన్ని వదిలిపెట్టరు. "నేను కామరపుకోట జీడిని. ఒక్కసారి పట్టుకొంటే వదిలిపెట్టను" అనేవారు కదా! అలా వారి సంసర్గంలోకి వచ్చిన జీవులందరూ సంస్కరింపబడి, ఉద్ధరింపబడే వరకు వదిలిపెట్టలేరు. అయితే మనం మాత్రం ఈ సత్యాన్ని గ్రహించి, మనవంతుగా మనలోని దోషాలను, దుర్గుణాలను గ్రహించి, అధిగమించే ప్రయత్నం చేస్తే అదే మనం గురుదేవులకు చేసే అత్యుత్తమ సేవ. అంతే కానీ కేవలం గురుదేవులకు దగ్గరగా మసలి, వారి భౌతిక వ్యవహారాలను చక్కబెట్టడం అనేది నిజమైన సేవ అనిపించుకోదు. వారు నిరంతరం ఏ బ్రహ్మమృతాన్ని అనుభవిస్తున్నారో, దానిని మన అనుభూతికి తెచ్చుకోవడమే సాన్నిధ్యానికి పరమార్థం.